మేఘసందేశం
మేఘసందేశం
ఓయవాయ్ ఓయ్! ఎక్కడికి పయానం?ఓమాటు ఆ..గు!నీతో మాటాడే పనుంది!?చాలా కోపంగా ,మేఘాన్ని ఆపేడు సూరయ్య.
రెండు ఊర్ల అవతలకి నా ఈ ప్రయాణం...వానయ్య అక్కడ కురిసి రమ్మన్నాడు..సమయానికి వెళ్ళకుంటే ఇక్కడే నీరయిపోతాను.
అయితే అవ్వు,నాకేంటి అంట!?ముందు నా అప్పు మొత్తం కక్కు ఇక్కడ..
నేను నీ దగ్గర అప్పు చేసానా!?ఎప్పుడు నాయనా!?
ఓ వారం కితమే!?అబ్బా భలేటోడివే!?పనికట్టుకు ఆరోజంతా మా ఊళ్ళోనే ఉన్నాడు మీ దోస్తు సూర్యంబాబు..దొరికినకాడికి దోసుకుపోయేడు..ఆనక రెండ్రోలు మొఖం సాటేసేడు..మరి సరేలే!తిన్నది మొత్తం ఇచ్చేసేడు అనుకుంటే,మళ్ళీ నిన్ను ఇక్కడినుంచి ఎక్కడికి పంపుతున్నాడు..మా ఊరంటే ఏలాకొలమా ఏటి!?
నువ్వు వర్షంకోసం ఆర్థిస్తున్నావని అర్థమౌతుంది.కానీ సృష్టి తాపాన్ని నేనే చల్లబరచాలి.అందుకు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి..నీకోసం ఇక్కడే ఉండాలి అంటే ఎలా!?
నాకోసం అంటే,నువ్వు నీ జతగాడు నా అప్పు తీర్సత్తే ఎల్లిపోవచ్చు..నా సొమ్ము తీసుకుని ఎక్కడో పనికి పోతానంటే నాకు కుదర్డు మరి!?
ఎందుకు అనవసరంగా మమ్మల్ని ఆడిపోసుకుంటావ్!?రెండ్రోజుల మీ మెరక,పల్లం రెండుపొలాల్ని బాగా తడిపేను..పల్లం అని నీరు నిలువ ఉండేంత కురవలేదు..అంత జాగ్రత్తగా నా పని చేస్తుకుంటూ పోతుంటే,మధ్యలో ఆపేవు..
ఆపాపోతే మళ్ళీ దొరుకుతావూ!?నీటిబుడగలా టప్పన పేలిపోతావు,లేదంటే ఐసు ముక్కలా తీరుబడిగా కరుగుతావు..ఏమైనా నాకు మళ్ళీ ఈ రూపంతో దొరకవు..దా!నా అప్పు తీర్చి ఇక్కణ్ణుంచి కదులు..నాకు సేనుకు పోయి టయిం అవుతుంది..
నువ్వేనా సమయాన్ని పాలించేది..మాకు అవసరం లేదా!?చెప్పాలంటే నీకన్నా మాకు సమయపాలన చాలా అవసరం..మీకు ఆలస్యం అయితే ఉద్యోగాలు పోతాయి.మాకు ఆలస్యం అంటే గౌరవం పోతుంది..ఉద్యోగం పోతే పని చేసుకు బ్రతకచ్చు..గౌరవం ఎంత ప్రయత్నించినా తిరిగిరాదు సుమీ!
నాకయ్యన్నీ తెలవ్!?నా అప్పు తీర్చినాకే ఇక్కణ్ణుంచి కదులు అబ్బీ!
మరీ మూర్ఖుడా,ఊరంటే ప్రాణమా!?నాకో విషయం ఇప్పటికీ అంతు తేలడం లేదు!నేను నీకు అప్పు ఎలా ఉన్నాను!?
అద్గది అలా రా దారికి!మొన్న మాయావిడి తాటిగారెలు ఏత్తాకి శుభ్రన్గా పిండి కలువుకుని,ఎదురింటిది వడియాలు పెడతాకి పిలిత్తే వదిలేసి పోయింది..వొచ్చేసారికి దాంలో నీరంతా పీల్చేస్తావూ!?
ఎండి గిట్టకరుసుకుపోయింది గార్లి పిండి..
పోనీలే అనుకుంటే,రోజూ ఒకటే విందయిపోయింది నీకు,మా పారునుయ్యిలో నీళ్లు సగానికి పైగా మంగళం ఏహెత్తన్నావ్..మా ఇంటిది కళ్లాపికి ఎంత సెరడిపోతందీ తెలుహా నీకు!?మా సిన్నిగాడి బట్టలు తొందరగా ఆరేట్టెత్తావని ఊరుకుంటన్నాను కానీ,లేపోతే మా పక్కింటి కుంటిసత్తియ్య రెండో మనవరాలినిచ్చి నీ పెళ్లి చేహెద్దూను..మా ఇంటికాడే ఇన్ని నీళ్లు దొంగతనం అంటే,ఊరిమొత్తాన్ని లుంగ సుట్టినట్టే కదా!నువ్వట్టికెల్లీయన్నీ మా ఊరు నీళ్లు,ఇంకొకడికి ఎందుకిత్తావ్!?మమ్మల్ని అడక్కుండా ఓలక్కడ ఎలా ఓలాబొత్తావ్!?నీరసం వచ్చింది సూరయ్యకి
దేవుడు కదా!బిడ్డ నీరసపడేసరికి కరిగిపోయి,కొన్ని నీటి తుంపరలు ఝడి విదిల్చేడు..
ఆబగా తాగిన సూరయ్య,నా నీళ్లు అని రబ్బరు బంతిలా లేచి కూర్చున్నాడు..
ఇప్పుడు నీకు చల్లిన నీళ్లు,మీ పక్కింటి కాంతయ్య గాడివి,ముందు నీ అప్పు చెల్లించిరా!తరువాతే నేను...
