STORYMIRROR

Pavani Lekkala

Classics Inspirational Children

4  

Pavani Lekkala

Classics Inspirational Children

అందరూ చూసే రోజు ఒకేలా ఉండదు

అందరూ చూసే రోజు ఒకేలా ఉండదు

8 mins
312

 

"అమ్మా, ఆ టీవీ రిమోట్ ఇక్కడివ్వు!" అంటూ నా చేతిలోంచి లాగేసుకుంది నా కూతురు లతా, సోఫాలో కూర్చుంటూ.

"నేను సీరియల్ చూస్తున్నానుగా, అలా లాగేసుకుంటావేంటీ?" అని నేను అసహనంగా అడిగాను.

"అబ్బా అమ్మా! ఇప్పటివరకు నువ్వే చూసావుగా. ఇంకో గంట సేపు నాకు ఇవ్వు!" అంటూ చిలిపిగా మొహం పెట్టి నవ్వుతూ అడిగింది.

"అదేంటి కొత్తగా? ఎప్పుడు లేనిది నువ్ టీవీ చూస్తున్నావ్. ఎప్పుడు ఆ ఫోన్‌లోనే ఉంటావ్ గా. ఇప్పుడేమైంది?" అని ఆశ్చర్యంగా అడిగాను.

"అబ్బా అమ్మా, ఈ రోజు ఒక మంచి ప్రోగ్రాం వస్తోది. కాఫీ పెట్టిస్తావా? అలాగే బిస్కెట్లు కూడా ఇవ్వు," అని ముద్దుగా అడిగింది నా ఇరవై ఏళ్ళ కూతురు. 

హుమ్మ్ సరిపోయింది, నువ్వు నీ రాణి వాసం! అంటూ కిచెన్‌ లోకి వెళ్తున్నాను. "థాంక్స్ అమ్మా," అంటూ వెనుక నుండి లతా అంది, సోఫాలో కూర్చొని.

నేను వెళ్లి టీ కప్స్ ఉన్న ప్లేట్‌ను సోఫా ముందు ఉన్న టేబుల్‌పై పెడుతూ, "కాఫీ తీస్కో," అన్నాను నా కాఫీ కప్ అందుకుంటూ. లతేమో ఉలుకు పలుకు లేకుండా వేడి గ ఉన్న కాఫీని అందుకుని మళ్ళీ ప్రోగ్రామ్‌లో నిమగ్నం అయ్యింది.

"అసలు ఏం ప్రోగ్రామ్ చూస్తుంది?" అని నేను చూడటం మొదలు పెట్టాను. అదొక రచయిత ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. ఓ ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న రచయితని యాంకర్ వివిధ రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. "ఎలా ఈ కథ రాయాలి అనిపించింది? మీ ప్రేరణ ఏంటి? మీ మొదటి రచన చాలా ప్రాచుర్యం పొందింది కదా! ఇందుకు కారణం ఏంటి?"

నాకూతురు ఇలాంటి చక్కని ప్రోగ్రామ్ చూస్తోంది అని తెలిసి కాస్త ఆశ్చర్యం పడ్డాను. కాని ఇంటర్వ్యూ ప్రోగ్రామ్‌ లోని రచయిత చిన్న వయసైనా చాలా చక్కగా యాంకర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. "లతా, ఎవరి ఆ రచయిత?" అని అడిగాను. "అబ్బా అమ్మా! ఉండు, ప్రోగ్రామ్ అయ్యాక చెప్తాను," అని టీవీ చూస్తూనే చెప్పింది. "ఏంటే! ఇప్పుడే చెప్తే నీ సొమ్మేమైన అరిగిపోతుందా?" అని చిరాకుగా అడిగాను.

"హు హు, అమ్మా, అతని పేరు రాఘవ. తెలుగు రచయిత. పోయిన సంవత్సరం 'తడబాటు' అనే ఒక పుస్తకం రాశారు. అది చాలా పాపులర్ అయ్యింది. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో బుక్ రిలీజ్ ఉంది అని అనౌన్స్ చేసారు. అందుకే ఈ ఇంటర్వ్యూ!" అని ఒక్క ఊపుతో గుక్క తిప్పుకోకుండా చెప్పింది.

"హో! అవునా?" అని నేనూ నివ్వెరపోయి లతను చూసాను. కాని ఈ యువకుడిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. "ఏమిటమ్మా, నీ డౌట్ సరిగా వినిపించలేదు. మళ్ళీ చెప్పు," అంది. "హా! ఏమి లేదు లే, నువ్వే టీవీ చూడు," అన్నాను. "హా సరే!" అంటూ తన పనిలో తాను నిమగ్నం అయ్యింది.

నేను కూడా ఆ ప్రోగ్రామ్‌ని ఆసక్తిగా చూడటం మొదలు పెట్టాను. హోస్ట్ ప్రశ్నలు అడుగుతుండగా, అతని చిన్న వయసైనా ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెప్తున్నాడని నేను గమనించాను. హోస్ట్ యొక్క ప్రశ్నలకు తడుముకోకుండా, రచయిత తన అనుభవాలను చక్కగా వివరిస్తూ ఆ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

"మీరు  విడుదల చేయబోయే బుక్ గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు గాని, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విశేషాలు గాని మాతో షేర్ చేసుకోగలరా?" అని హోస్ట్ అడిగాడు.

ఈ కొత్త ప్రశ్న రాగానే నా దృష్టి పూర్తిగా ఆ రచయిత వైపు మళ్ళింది. అతను ఏమి చెప్పబోతున్నాడోనని ఉత్సుకత పెరిగింది.

"ఈ ప్రశ్న అడిగినందుకు చాలా థాంక్స్. నేను ఈ బుక్ రాయడానికి ప్రేరణ, నా చిన్నతనంలో జరిగిన సంఘటన. అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో, జీవితాన్ని ఎలా చూడాలో? ఎందుకు అలా చూడాలో? నేర్పారు. నాకు ఈ విషయం నేర్పిన ఒక టీచర్ కి ఇది ఒక మామూలు విషయం లేదా బాధ్యత అయ్యి ఉండవచ్చు, కానీ నాకు మాత్రం అది జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఆ టీచర్ చెప్పిన మాటలు నా ఎదుగుదలపై గాఢంగా ప్రభావం చూపాయి, నాకొక కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి. అదే ఆలోచనలకు రూపమిచ్చిన నా పుస్తకం 'అందరు చూసే రోజు ఒకేలా ఉండదు'. మీ అందరితో పంచుకోవడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను," అంటూ తన సమాధానాన్ని ముగించాడు.

అంతే, ఆ ఒక్క సమాధానంతో, నా ఆలోచన 13 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనల మీదకు మళ్ళాయి. "ఎక్కడో చూసినట్టు ఉంది" అన్న నా అయోమయానికి, కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం నా కళ్ళ ముందే మెదలాడింది.


***13 సంవత్సరాల క్రితం***

13 సంవత్సరాల క్రితం నేను తెలుగు టీచర్‌ గా నా సర్వీస్‌ను వేములవాడ హైస్కూల్‌లో ప్రారంభించాను. జాయిన్ అయ్యి అప్పటికే మూడు ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలతో మంచి అనుబంధం నెలకొల్పాను. నా స్నేహశీలత, పాఠాలు అర్థమయ్యేలా చెప్పటం వల్ల స్కూల్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాను. అయితే, ఆ ప్రేమ అంతా నమ్మశక్యంగా ఉండదని నా జీవితంలో తొలిసారి గట్టిగా తెలిసింది.

ఇప్పటి లాగే ఆ రోజు కూడా నేను స్కూల్‌కి వెళ్ళాను. ఆరోజు నా జీవితంలో మర్చిపోలేనిదిగా మారబోతుందనే విషయం నాకు అర్థం కాలేదు. స్టాఫ్ రూం‌లో ఏంటో చాలా హడావిడి కనిపించింది. నేను లోపలికి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రేయర్ టైమ్ అవ్వడంతో అందరం ప్రేయర్‌కి వెళ్ళాం. ప్రేయర్ ముగిసిన తర్వాత మళ్ళీ స్టాఫ్ రూం‌లోకి వెళ్ళగానే అందరూ కంగారుగా ఉన్నారని గమనించాను. వెంటనే నా తోటి టీచర్‌ను అడిగాను, "ఇంత హడావిడి ఎందుకు?" అని. ఆమె కాస్త ఇబ్బంది పడుతూ, "ఏమో తెలియదు," అని అంది.

అంతలో స్కూల్‌కి పై అధికారులు వచ్చారు. మా స్కూల్ ప్రిన్సిపాల్ వారిని తీసుకొని తన ఆఫీస్ రూం‌లోకి వెళ్లాడు. వాతావరణం చూస్తుంటే ఏదో పెద్ద విషయం జరుగుతోందని అర్థమైంది. ప్రిన్సిపాల్ ఆఫీస్‌లో అధికారులతో మాట్లాడుతున్నాడు, దానికి గంట సమయం అయ్యింది. అప్పటికి పీరియడ్‌కి బెల్ మోగింది, నా క్లాస్ ఉన్నందున క్లాస్‌కి వెళ్లాను.

క్లాస్‌లోకి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ "గుడ్ మార్నింగ్" చెప్పారు. నేను వారిని తిరిగి విష్ చేసి, పాఠం చెప్పడం మొదలుపెట్టాను. కానీ క్లాస్ వెనుక వైపు చూస్తే, రాఘవను అతని ఫ్రెండ్ వంశి సముదాయిస్తూ కనిపించాడు. రాఘవలో ఏదో భారం ఉన్నట్టుగా కనిపించింది.

ఇంకాసేపు పాఠం చెప్పి వంశిని పిలిచాను. "ఇలా రా," అని చెప్పగానే వంశి వినయంగా, "చెప్పండి టీచర్," అని వచ్చాడు. "రాఘవ ఎందుకు ఆలా ఉన్నాడు?" అని అడిగాను.

వంశి నెమ్మదిగా చెప్పాడు, "టీచర్, మొన్న జరిగిన కథల పోటీలో రాఘవ వారం రోజులు ప్రిపేర్ అయ్యాడు. కానీ సీనియర్ గెలిచాడు. రాఘవని పట్టించుకోకుండా ఏడిపించాడు. అందుకే అతడు చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు," అని.

వంశి చెప్పిన వెంటనే రాఘవ రాసిన కథ గుర్తొచ్చింది. ఆ పోటీలో స్కూల్ స్టాఫ్ విజేతలను నిర్ణయించారు. నాకు కూడా రాఘవ రాసిన కథ చాలా బాగా అనిపించింది. అది నాకు మాత్రమే కాదు, స్కూల్ టీచర్స్‌ కి కూడా నచ్చింది. కానీ విజేతగా నిలిచింది 9వ తరగతి చదువుతున్న మధు.

ఇద్దరి కథలు బాగున్నప్పటికీ, నాకు మాత్రం రాఘవ కథ గొప్పగా అనిపించింది. కానీ, టీచర్‌ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే—మధు ఈ ఊరి సర్పంచ్ కొడుకు. అందుకే రాఘవ ఓడిపోయాడు అని నేను వెంటనే అర్థం చేసుకున్నాను.

"ఇది బయట చెప్పుకోలేని బాధ. ఇది చూడటానికి చిన్న గెలుపు-ఓటమి విషయమే అయినా, ఈ సర్పంచ్ మాత్రం తనే గొప్ప అని భావించే రకం. తనకు అవసరం అంటే బెదిరించడం కూడా వెన్నతో పెట్టిన విద్యలా చేస్తాడు. అందువల్లే స్కూల్ స్టాఫ్ గొడవలు ఏమీ లేకుండా మధుని విజేతగా ప్రకటించారు. కానీ, ఇలాంటి సంఘటనల వల్ల చిన్న పిల్లల మనసులు విరిగిపోవడం చాలా బాధగా ఉంది."

ఇదంతా నా మనసులో అనుకుంటూ, "సరే, నువ్ వెళ్ళు," అని వంశిని పంపించాను. రాఘవను బ్రేక్ టైంలో పిలిచి, అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.

పీరియడ్ అయిందని సూచిస్తూ బెల్ మోగింది. నేను ప్రిన్సిపాల్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ ఉన్న వాతావరణం చాలా ఉద్రిక్తంగా అనిపించింది. కొందరు ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్, మరియు టీచర్లు సీరియస్ డిస్కషన్‌లో ఉన్నారు. "ఏం జరుగుతుందో?" అని అడిగినా ఎవరూ ఏమీ చెప్పలేదు.

"ఇప్పుడు ప్రశ్నలు అడగడం ఉపయోగం ఉండదనుకుంటున్నాను," అనుకుని రాఘవతో మాట్లాడటానికి స్కూల్ గ్రౌండ్‌కి వెళ్ళాను. నేను మెట్లపై ఎక్కుతుండగా, కిటికీ పక్క నుంచి ఓ చర్చ విన్నాను. చూసి రాఘవ, వంశి ఇద్దరూ కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.


నేను మెట్లపై ఎక్కేటప్పుడు పక్కగా ఉన్న కిటికీ నుండి ఏవో మాటలు సన్నగా వినిపించాయి. అటువైపు చూసాను. ఎవరా అని చూస్తే, రాఘవ, వంశి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

"ఏమైంది రాఘవ? ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు?" వంశి అడిగాడు, తన స్వరంలో నిగ్రహంతో కూడిన ఆతురత స్పష్టంగా కనిపించింది.

"వాదేదో అంటే మనం పట్టించుకోవాలనుకుంటూ వదిలేయ్ రా," అని అతను స్నేహంతో చెప్పి, రాఘవ దృష్టిని ఆ విషయం నుండి మళ్లించే ప్రయత్నం చేశాడు. కాసేపు ఆలోచించి, వేరే విషయం మొదలు పెట్టడానికి ప్రయత్నించినట్లు కనిపించాడు.

"ఇది చెప్పు," వంశి కొనసాగించాడు. "నిన్న నువ్వు కూడా పక్క ఊరిలో జరిగే జాతరకు వస్తాను అన్నావుగా, కదా? ఏమైందిరా? రాలేదు. నీ కోసం అక్కడ చాలాసేపు ఎదురు చూసాను," అంటూ వంశి తిట్టినట్టుగా కానీ ఆప్యాయంగా చెప్పాడు. మాట్లాడుతూనే తన జేబులోంచి ఏదో చిన్న మూత తీసి, రాఘవ పక్కగా ఉంచాడు.

కానీ, రాఘవ మాత్రం దానిపై ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతని నోరు మూసుకుపోయి, దృష్టి ఒక్కచోట నిలిచిపోయినట్లుగా కనిపించింది.

"అరే! ఏమయిందిరా?" అని వంశి మళ్ళీ నిలదీశాడు. రాఘవ తల తిప్పి, వంశి వైపు చూసాడు. అతని కళ్ళలో చెమ్మ కనిపించింది.

"నిన్న నేను కూడా జాతరకు వెళ్దాం అని అమ్మను అడిగాను రా. అమ్మ కూడా, 'సాయంత్రం నువ్వు బడి అయిపోయాక, నువ్వు పాలకేంద్రం దగ్గర పని ముగించుకుని రా, ఇద్దరం కలసి వెళ్దాం,' అని చెప్పింది. కానీ, నేను ఇంటికి వచ్చేసరికి... నాన్న తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు. చుట్టూ కాంతమ్మ పిన్ని, శేఖర్ మామయ్యలు ఎంత చెప్పినా వినలేదు. అమ్మని కొట్టి, డబ్బులు అన్నీ లాగేసుకుని వెళ్లిపోయాడుచూపిస్తున్నాడు రా.అని ఎంతో బాధగా చెప్పాడు రాఘవ, నిరాశతో చేతులు కిందకి వదిలేసి.

వంశి ఆ మాటలు విని ఒక్క క్షణం కూడా మాట్లాడలేకపోయాడు. ఆ నిశ్శబ్దం, ఆ క్షణం, వంశి మాత్రమే కాదు, నన్ను కూడా కదిలించింది.

"అరే, నువ్వేం బాధపడకు రాఘవా. మనిద్దరం బాగా చదివి, పెద్దవాళ్లం అయ్యాక మీ నాన్నని నిలదీసి, మీ అమ్మని బాగా చూసుకునేలా చేస్తాం," అంటూ వంశి సర్దిచెప్పాడు.

తన మాటలతో రాఘవను ఓదార్చడానికి, "ఇదిగో చూడు, నీకు ఇష్టం అని నేను ఈ చక్కర బెండ్లు కొనుక్కొచ్చాను. నిన్న జాతర అంత ఏమి బాలేదు లే. ఇంకా పైన నేను వెళ్ళాను, నాకు నచ్చలేదు," అని చెప్పి, రాఘవ చేతికి చక్కర బెండ్లు అందించాడు.

రాఘవ తన స్నేహితుని చిన్న చిన్న ఓదార్పు మాటలకి కళ్ళు తుడుచుకుంటూ, వంశి భుజం మీద చెయ్యి వేసి, "చాలా బాగుంది రా ఈ చెక్కర బెండు," అని ఒక చిన్న చిరునవ్వుతో అన్నాడు.

వంశి, రాఘవ చేతిలో చక్కర బెండ్లు పెడుతూ, నవ్వుతూ, అతనికి చిన్న చిన్న మాటలతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరి సంభాషణ విన్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకే రోజు అయినా, రెండు ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నా గుండెను పిండేసింది. రాఘవ తన కళ్ళు తుడుచుకుని, వంశి భుజం మీద తన చెయ్యి వేసిన ఆ దృశ్యం చూసి, నా మనసు కదిలిపోయింది.

"వంశిలాంటి స్నేహితుడు రాఘవకు ఒక చిన్న వెలుగులాంటి ఆశ చూపిస్తున్నాడు కానీ రాఘవ వెతికే విశ్రాంతి, నిజమైన ఆనందం ఇంకా ఎంత దూరంలో ఉందో అనిపిస్తోంది, వంశి ఇచ్చే స్నేహం రాఘవకు ఆశను ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది, కానీ రాఘవ యొక్క బాధతో పోరాడటానికి ఆ స్నేహం సరిపోదేమో అనే అనుమానం కలిగింది.

ఒక టీచర్‌ గా, నేను రాఘవకు ధైర్యాన్ని ఇవ్వాలని సంకల్పించాను. రాఘవను తర్వాత క్లాస్ నుండి పిలిచి, స్కూల్ గ్రౌండ్‌లోని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఉన్న బెంచ్ పైన, నేను రాఘవను నా పక్కన కూర్చోమని చెప్పాను.

తను చాలా వినయంగా, "అసలు ఏమి జరిగిందీ, టీచర్?" అని అడిగాడు. తను ఏమి జరగనట్టు మాట్లాడుతుంటే, తన చిన్న వయస్సు మీద ఎంతో బాధల బరువు మోస్తున్నట్టు అనిపించింది. నా మనసులో ధైర్యం చెప్పుకుంటూ, కథల పోటీ గురించి మాట్లాడి, అతనికి కాస్త ధైర్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

"రాఘవా, నువ్వు కథల పోటీలో రాసిన కథ నాకు చాలా బాగా నచ్చింది," అని నేను మొదలుపెట్టాను. అది విన్న రాఘవ మొదట ఉత్సాహంగా, "థ్యాంక్యూ టీచర్," అని చెప్పాడు. కానీ కొద్ది సేపటికే, అతని ముఖంలో నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది.

ఆ క్షణం, అతను మాటలు చెప్పకపోయినా, అతని భావాలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి. "చూడు రాఘవ, నువ్వు పోటీలో ఓడిపోవడం, లేదా జీవితంలో ఏదైనా కోల్పోవడం అంటే ప్రపంచం అంత ముగిసినట్టు కాదు. ఏ రోజు ఒకేలా ఉండదు. ఈ రోజు ఇలాగే ఉండకపోవచ్చు. రేపు కూడా ఇలానే ఉండదేమో. కాని నువ్వు అక్కడే ఆగిపోతే, రేపటి రోజును మార్చుకునే అవకాశం కోల్పోయినట్టే. ఆందుకే, నీ ప్రయత్నం ఆపకూడదు. గుర్తు పెట్టుకో, అందరూ చూసే రోజు ఒకేలా ఉండదు."

నేను ఈ మాటలు చెపుతుంటే, రాఘవ ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. నా మాటలు అతనికి ధైర్యం ఇస్తున్నాయనే ఆశ నాకు కలిగింది. ఇంతలో, స్కూల్ పీఓన్ వచ్చి, "ప్రిన్సిపాల్ గారు తక్షణం రమ్మన్నారు," అని చెప్పి వెళ్లిపోయాడు.


నేను రాఘవ వైపు చూసి, "నేను కొద్దిసేపటిలో తిరిగి వస్తాను. మనం ఇంకాస్త మాట్లాడుకుందాం," అని ధైర్యంగా చెప్పాను. రాఘవ తలెత్తి, నిశ్శబ్దంగా తలూపాడు.

ప్రిన్సిపాల్ ఆఫీస్‌కి వెళ్లగానే, అక్కడున్న వాతావరణం చాలా ఉద్రిక్తంగా కనిపించింది. కొందరు ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్, మరియు ఇద్దరు ఇతర టీచర్లు తీవ్రంగా చర్చలు జరుపుకుంటున్నారు. నన్ను చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక అధికారి తీవ్రమైన స్వరంతో, "మీరు స్కూల్ ఫండ్స్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు," అని నేరుగా చెప్పారు.

నా గుండె కుదిపేసిన ఆ మాటలు నాకు అవాక్కయ్యేలా చేశాయి. "ఇది నిజం కాదు! నేను ఎప్పుడు ఏ మాత్రం తప్పు చేయలేదు!" అని నేను వెంటనే సమాధానం ఇచ్చాను. కానీ వారు కనీసం నా మాటలమీద నమ్మకం ఉంచడంలేదు. అంతకుముందు స్కూల్ రికార్డుల్లో జరిగిన కొన్ని పొరపాట్లను నాపై నెట్టేసేందుకు ప్రయత్నించినట్టు స్పష్టమైంది.

అవి విన్నప్పటికీ, నా భద్రత కోసం, నా పేరు మీద తక్షణమే అనుచితమైన నిర్ణయం తీసుకున్నారు. "మీ ట్రాన్స్‌ఫర్‌ను వెంటనే అమలు చేస్తున్నాం," అని వారు తీర్మానించారు.

ఈ విషయం నన్ను ఎంతగానో బాధించింది. పైగా, స్కూల్ మేనేజ్‌మెంట్ నాపై తప్పు ఆరోపణలు చేయడం నాకు మరింత గాయాన్ని కలిగించింది. ఆ వారం మొత్తం, పై అధికారుల ఆదేశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, గేట్ల దగ్గర గంటల పాటు వేచి ఉండటం—నా జీవితంలో ఎన్నడూ అనుభవించనంత అలసటను తెచ్చింది. నా బలహీనత నా కళ్లల్లో ప్రతిఫలించగా, మనసులో కఠినమైన ప్రశ్నలు నిలిచాయి.

చివరికి, నన్ను వేరే స్కూల్‌కి తక్షణ ట్రాన్స్‌ఫర్ చేస్తామని వారు నిర్ణయించారు. కనీసం రాఘవతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం లేకుండా, నేను ఆ స్కూల్‌ను విడిచిపోయాను. రాఘవతో ఇంకాస్త సేపు మాట్లాడాలి అని చెప్పిన నా మాటలు మధ్యలోనే నిలిచిపోయాయి. "ఆ మాటలకు విలువ లేకపోయిందేమో?" అనే ఆలోచన నన్ను మరింత బాధపెట్టింది.

"ఈ సంఘటన ఇదంతా ఎందుకు జరిగింది? నా జీవితానికి ఇది ఏదో ఒక గుణపాఠమా?" అంటూ నా మనసు ఆలోచనలతో కుమిలిపోయింది. ప్రయాణంలో నా గుండె నిశ్శబ్దంగా చెప్పింది: "ఏ రోజు ఒకేలా ఉండదు!"


***ప్రస్తుతం***


ప్రోగ్రామ్‌లో హోస్ట్ చివరి ప్రశ్న అడిగాడు: "రాఘవ, నీ స్కూల్ జీవితాన్ని ప్రభావితం చేసిన టీచర్ గురించి చెప్పాలనుకుంటున్నావా? ఆమె ఎప్పుడు నీకు మార్గదర్శనం ఇచ్చి, స్ఫూర్తి ఇచ్చినట్లు చెబుతావు. నీకు ఏమైనా చెప్పాలనిపిస్తుందా?"

రాఘవ నవ్వుతూ, "ఆమె చెప్పిన మాటలు—'అందరు చూసే రోజు ఒకేలా ఉండదు'—అంటే ఏంటో నాకు ఇప్పుడే స్పష్టంగా అర్థమవుతోంది. నా కథలు, నా కలలు—అన్నీ ఆమె చెప్పిన ఆ మాటల ప్రేరణ వల్లే. ఆమె మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నా మనసులో ఆమె స్థానం ఎప్పటికీ మారదు," అని ఆనందంగా చెప్పాడు.

ఇది టీవీ ముందు కూర్చొని ఉన్న ఆ టీచర్ గుండెను ద్రవింపజేసింది. "నేను చేసినది చిన్న ప్రయత్నం అనుకున్నా, అది అతని జీవితానికి ఎంత పెద్ద మార్పు తెచ్చిందో ఇప్పుడు తెలుస్తోంది," అని ఆమె ఆలోచించారు. ఆ క్షణం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. "రాఘవ జీవితం మీద నేను చూపించిన ప్రభావం నా పని విలువను గుర్తు చేస్తోంది," అని తన మనసులో చెప్పుకుంది. ఆలోచనలతో పాటు, ఆమె భావోద్వేగాలు కళ్లలో చెమ్మగిలిపోయాయి.




Rate this content
Log in

Similar telugu story from Classics