STORYMIRROR

Harianiketh M

Abstract Drama Inspirational

4  

Harianiketh M

Abstract Drama Inspirational

ఆమె ప్రేమకోణం ఎప్పుడూ 90^౦

ఆమె ప్రేమకోణం ఎప్పుడూ 90^౦

3 mins
890


కార్తీక పౌర్ణమి రేపే.నాకు ఆవుపాలు,ఓసూర్యగుమ్మడి కాయ,గుమ్మడిపువ్వు,పిందె,పిసరు బంగారం,పువ్వులు,

పళ్ళు..

ఓహో!ఆపు ధర్మపత్నీ మేడమ్.అమరావతి ఎక్స్ప్రెస్ వే ఎపుడో ఆగిపోయింది..ఇపుడు గతుకుల రోడ్డు పై సవారీ..పైగా నీ లిస్ట్ ని మించి పెట్రోల్ రేట్లు ఉన్నాయి.

ఈ దీనుడ్ని కొంచెం కనికరించు..మొర పెట్టుకున్నాడు శేఖర్..

ఏడాదికోసారి శ్రద్ధగా చేసే పూజ.పైగా నాకు తోరాలు కూడా అప్పజెప్పింది మీ అమ్మగారు.నేనయితే ఖర్చుకు వెనకాడేది లేదు..మీరు వెళ్లలేకపోతే నేనే వెళ్తాను.డ్రైవర్ ఎవరైనా ఉంటే చూడండి ఆదేశించింది భార్య చంద్రిక..

స్నేహితుడికి ఫోన్ చేసేడు..మీ డ్రైవర్ ని ఓ సారి పంపవోయ్!అంటూ.

అరగంటలో అబ్బాయి వచ్చేడు..మా అమ్మాయి(బాగా ముద్దొచ్చినపుడు చంద్రికను అలానే పిలుస్తాడు శేఖర్) బయలుదేరింది ,అమ్మయ్యా!అనుకున్నాడు.

ఫ్రిజ్ కి ఓ కాగితం అంటించింది.తడిబియ్యం ఎండలో పోసాను,కాకులు రాకుండా చూడండి అంటూ..కింద ఓ చిరునవ్వు..దానికింద ప్రేమతో....అట

ఎందుకు పుట్టదూ!?సేవ చేయాలి కదా!అనుకుంటుంటే గొప్పి తగిలింది.ఏమన్నాను శివయ్యా!ఇపుడు..నీ భక్తురాల్ని అసలే అని ఉండను..ఈ మధ్య శేఖరానికి ఆత్మవిమర్శ ఎక్కువైంది.కారణం చంద్రిక.తప్పు చెయ్యొద్దు గోప్పి తగిలించుకోవద్దు అంటుంది ప్రతిదానికీ..ఇపుడు కాదు పెళ్ళైనప్పటి నుంచీ ముఖ్యన్గా తాను తల్లి ఇంక కాబోనని తెలిసిన ఓ సందర్భం నుంచీ బాగా... అది ఆమె తారకమంత్రం.

నాకు పద్దెనిమిది తనకి పన్నెండు మా పెళ్లప్పటి వయసు.

సరిగ్గా పీటలెక్కే సమయానికి పుష్పవతి అయింది.పెళ్లి అప్పటికి ఆగింది.ఓ నెల తరువాత పెళ్లి..మొదటి రాత్రికి పుష్పవతి రెండోసారి..

అమ్మ తిట్టిపోసింది చంద్రికని.అన్నిటికీ అడ్డే నువ్వు అంటూ.నాన్న వారించినా తగ్గేదికాదు..పెళ్లయిన రెండేళ్లకు తల్లి అయింది.మనవడు పుట్టేడు.వాడికి జరగాల్సిన ప్రతి శుభాన్ని వైభవంగా జరిపిస్తూ,ఇలా!అడ్డు లేకుండా జరగాలి ఏమైనా జరిగితే నొసలుతో వెక్కిరించేది అమ్మ.

నాకో అక్క ఉంది పేరు ఐశ్వర్య.ఆయన బాంక్ ఉద్యోగి.రెండోసారి అక్క,చంద్రిక ఒకేసారి తల్లి కాబోతున్నాం అనే శుభవార్త చెప్పారు..కూతురికి మొదటికాన్పు.పైగా పదేళ్లవుతుంది.అందుకే ముందునుంచీ పుట్టింట్లో ఉంచాలని పట్టుబట్టింది అమ్మ.బావ కుటుంబం కూడా ఒప్పుకుంది..

ఎవరో అన్నారని,మంచిది కాదంటూ ఇద్దరూ ఒకే ఇంట్లో వద్దు అంది.పుట్టింటికి వెళ్లమంటే మొదటి సారి నన్ను చుట్టుకు ఏడ్చేసింది చంద్రిక.అత్తయ్యా మావయ్యా ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు.రానంటే రానంది వాళ్ళతో..మొదటిసారి ఇంటి లక్ష్మిని హద్దుదాటి తిట్టినందుకు నాన్న చేయి చేసుకున్నాడు అమ్మ మీద..దాంతో అమ్మకి మరింత కోపం,జుట్టు పట్టుకు దొడ్డివైపు గుమ్మం బయటకు గెంటేసింది.

చంద్రిక అంటే ఇష్టం కాదు అలా అని కోపమూ లేదు.తనన్నది జరగలేదు,ఇద్దరూ గర్భిణులు ఒకేచోట ఉంటే కీడు జరుగుతుందన్న ఏదో ఆవేశం,భయం అమ్మ చేత అలా చేయించాయి..

ఫలితంగా ఇంక అమ్మగా పనికిరాలేదు చంద్రిక..అప్పుడిక పుట్టింటికి వెళ్లక తప్పిందికాదు.తప్పు చేశాను బాగా తగిలింది ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుందో!?

అప్పటికి నాకూ కొంచెం ప్రేమ పుట్టింది..చంద్రిక నాకు సoబంధించిన ప్రతి పనీ చాలా ఇష్టంతో చేసేది అని అర్ధమయింది అప్పటికి..బ్రష్ పేస్ట్ అందించడం మామూలుగానే అనిపించినా,పనయి వాటిని అక్కడ పడేసాక శుభ్రన్గా వేన్నీళ్ళతో కడిగి ఆరబెట్టేది.నా బట్టలు

చాలా శ్రద్ధగా ఉతికేది..ఇష్టమయిన వంట గురించి ఆరా తీస్తుందని నాకు తెలిసేది కాదు,మర్నాడు కూర ప్రత్యక్షం.

కొంగున కట్టుకోవడానికి వేసే వేషాలు అన్నీ అని తిట్టేది అమ్మ..అమ్మకి వంతపాడే అక్క కూరల్లో కారాలు,ఉప్పులు కొసరు దట్టించేవారు..చంద్రిక నా కోసం ఓ చిన్ని గిన్నెలో కూరల్ని వేరే తీసి ఉంచేది.దాన్ని ఎక్కడ పెట్టేదో ఆమెకే తెలుసు.ఎందుకు ఇదంతా అంటే..మీరు ఇంకో అమ్మాయివైపు చూడకుండా ఉండాలంటే ఇవన్నీ చేస్తూండాలని నాన్నమ్మ,అమ్మ చెప్పేరు..ఈ విషయం ఇలాగే ఇంకెవరికీ చెప్పొద్దన్నాడు.నేను ఇంట్లో అందర్నీ గౌరవిస్తాను.మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తాను అంది.

అక్క కడుపుతో ఉన్న సమయంలో బోల్డన్ని పూజలు చేసేది అమ్మ.పూజకి పాలు అందించలేదు,ప్రసాదం చేయలేదు,ఆడపడుచుకి జ్యూస్ ఇవ్వలేదు ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువయినియ్యి..

చంద్రిక తొణికేది కాదు ఎప్పుడూ..ఆ మౌనం మాత్రం నాకు చిరాకు తెప్పించి చెయ్యి చేసుకున్నాను చాలా సార్లు..ఓ సంవత్సరంన్నర కాలం అగ్నిపరీక్ష సమయం అయింది ఇంట్లో..చంద్రిక సాయంత్రానికి నా దగ్గరకి చిరునవ్వుతోనే వచ్చేది..వాళ్లకు నచ్చేది కాదు.నేను అన్ని రకాలుగా దూరం అయ్యేను తనకు.అలా అని ఎవరికి దగ్గర కాలేదు..అంతా ఉండి ఒంటరితనం..

ఇక అక్కకి బిడ్డ పుట్టినప్పుడు మామూలు ఆనందం కాదు..ఏడ్చినోళ్ళకి ఏడ్చినట్టే అవుతుంది కోడలికి గర్భం పోయినందుకూ,కూతురు మెట్టినింటికి వారసుడిని ఇచ్చినందుకు..

తరువాత వచ్చిన కష్టానికి చంద్రికే కారణం అంది అమ్మ..మనవడికి మాటలు రాలేదు.ఇది మూగగా రోధించి ఉంటుంది వాడికి మాటలు రానివ్వొద్దని.. హూంకరించింది.

అలా నిలబడి నన్నే చూసింది చంద్రిక.నేను మాత్రం ట్రాన్స్ఫఫర్ పెట్టుకుని గొడవలు నుంచి పారిపోయానని చాన్నాళ్ళకి అర్ధమయింది.

అమ్మ మీద మొదటి నా అభిప్రాయం తప్పు.తనవాళ్ళు గౌరవించని ఆడదాన్ని ఎవ్వరూ గౌరవించరు అని అర్ధమయింది.నా కొడుకు సెటిల్ అయ్యేవరకూ చంద్రికని చూడడానికి చుట్టం చూపుగానే వచ్చేవాడిని.కాపురం పెట్టు అని అమ్మ అనలేదు.పిల్లాడికి ఆస్తి అప్పచెప్పాలన్న ఆలోచన చంద్రికకి దగ్గరగా ఉండమని చెప్పలేదు.

అయినా నేను కనిపించినపుడు కళ్ళు బంగారంలా మెరిసిపోయేవి..

ఉద్యోగపు బడలికలో నాకు అపుడు అలా అనిపించలేదు.కొడుకు పెళ్లి చేస్తూ ,కోడలికి కొడుక్కి కూడా చంద్రిక గీత బోధిస్తున్నపుడు నేను ఎలా ఉండాలో ,ఎలా ఉన్నానో,తాను ఎంత బాధ పడిందో తెలిసొచ్చేలా చెప్పింది.ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు,అమ్మ పోయునపుడు కూడా ఏడ్చి ఉండను.

అందుకే రిటైర్ అయ్యాక సిటీలో ఇల్లు కొన్నా,అది అబ్బాయికి అప్పజెప్పి ఊరికి వచ్చేసాను.ఇల్లు బాగు చేయించాను.నీకు ఎలా ఇష్టమో చెప్పు అలా చేయిస్తాను మొదటిసారి తన ప్రేమకి బానిసలా మారి అడిగేను.

మీరు ఇష్టంతో ఎం చేయించినా ఇష్టమే..తన ప్రేమ డిగ్రీ ముల్లు ఎపుడూలా అంతే స్టైర్యంగా నిలబడి అంది.నవ్వుతుంది ఎప్పుడూ..అది గుచ్చింది నన్ను.అయినా ప్రేమగానే అనిపించింది..

అందుకే కాకుల్ని కొట్టమన్నా,నూకల్ని ఏరమన్నా,పిండి జల్లించమన్నా ...అల్ ఇన్ వన్ అయిపోయి చంద్రిక ప్రేమని ఆస్వాదిస్తున్నాను.

పనోడిలా మారేను అని తన ప్రేమలో మార్పు లేదు.అదే స్థిరత్వం..ముందు నుంచీ ఈ అమృతాన్ని తాగుతూ ఉండుంటే...అనుకుంటుంటే ఫ్రిజ్ స్టాండ్ మరో వేలికి తగిలింది.

ఇప్పుడేం తప్పు చేసాను శివయ్యా!?

ఇప్పుడు ఏది నీదో!?అదంతా నీదే..ఇంక ముందు గొడవ ఎందుకు!?అనిపించింది



Rate this content
Log in

Similar telugu story from Abstract