Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

Varun Ravalakollu

Drama Romance


4.7  

Varun Ravalakollu

Drama Romance


ఆ రాత్రి...!!!

ఆ రాత్రి...!!!

5 mins 756 5 mins 756

ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. సూరిగాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఆడ్ని కావలించుకుని పడుకుంది రత్తాలు. అది చిన్న పూరి పాక. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉందది.

చెక్క తలుపుపై చిన్నగా చప్పుడు. సూరిగాడు గుర్రు పెట్టి నిద్ర పోతూనే ఉన్నాడు. ఆ చప్పుడుకి రత్తాలుకి మెలకువ వచ్చింది. ‘ఈ యాలప్పుడు ఎవరొచ్చినారు చెప్మా’ అనుకుంది.

బయట గాలీ వానా. అందులోనూ రాత్రి. గాలికి చెక్క తలుపు కొట్టుకుంటుందేమోనని అనుకొని మళ్ళీ పడుకొంది రత్తాలు. మళ్ళీ తలుపు పై చిన్నగా కొడుతున్న శబ్దం.

ఉలిక్కి పడి లేచింది రత్తాలు. “మావాఁ… ఎవలో తలుపు కొడుతున్నట్టుందే. లేచి సూడవే” అంది. సూరిగాడు ఇటునుంచి అటు తిరిగి పడుకున్నాడు. కానీ లేవలేదు.

రత్తాలే మెల్లగా లేచింది. తలుపు చెక్కకి అడ్డు పెట్టిన రాయిని పక్కకి తీసి తలుపు తీసింది. ఒక్కసారిగా చల్లని గాలి లోపలి కొచ్చింది. దాంతో పాటే అప్పటివరకు వర్షంలో బాగా తడిసిపోయిన నాగులు కూడా గబుక్కున లోపలి కొచ్చాడు. గుడ్డి దీపం వెలుతురులో నాగుల్ని గుర్తు పట్టింది రత్తాలు.

“నువ్వా… ఇయ్యాలప్పుడు వచ్చావేం?” అని అడిగింది .

నాగులు సూరిగాడికి ఎరుకే. రత్తాలుకూ తెలుసు. ఇద్దరూ దోస్తులు. ఎప్పుడో తన పెళ్లప్పుడు సూసింది రత్తాలు నాగుల్ని. మళ్ళీ ఇన్నాళ్టికి కనిపించాడు.

“మీ గుడిసెను పోల్చుకోలేకపోయాను. అప్పట్లో ఇక్కడ ఒకటో రెండో పాకలుండేవి. ఇప్పుడు సానా పాకలు ఎలిసాయి” అన్నాడు నాగులు. సంచీలోంచి గుడ్డ తీసి తల తుడుచుకున్నాడు.

“కూడు తిన్నావా?” అడిగింది రత్తాలు. లేదన్నట్టు తలూపాడు నాగులు.

“వణ్ణమైతే లేదు గానీ గెంజుంది. తాగి తొంగో. తెల్లారేక సూరిగాడి తో మాట్టాడు” అంది రత్తాలు. గిన్నెతో గెంజిచ్చింది. బాగా ఆకలి మీదున్నాడేమో నాగులు గట గటా తాగేశాడు. కడుపులో ఆకలి మంట తీరింది. పాకలో ఓ పక్కగా గుడ్డ పరుచుకుని పడుకున్నాడు నాగులు.

తెల్లారింది. నాగుల్ని సూసి ఆశ్చర్యపోయాడు సూరిగాడు. మద్ది రాత్రేళ నాగులు రావడం, గంజి తాగి తొంగోడం ముందే చెప్పింది రత్తాలు. సూరిగాడు నాగులు కేసి పరిశీలనగా చూసాడు. నాగులు బాగా చిక్కాడు. తన పెళ్లప్పుడు బాగా బలంగా బలిష్టంగా ఉన్న నాగులు ఇప్పుడు కొంచెం తగ్గాడు.

“సానా ఏళ్లయ్యిందిరా నిన్ను సూసి. ఎట్టాగున్నావ్. నీ పెళ్ళాం పిల్లలు ఎలాగున్నారు?” అని అడిగాడు సూరిగాడు. నాగులు కొంచెం సేపు ఊరుకుండిపోయాడు.

“పిల్లలు లేర్రా. నా పెళ్ళాం చచ్చి పోయింది” అన్నాడు తలొంచుకుని మెల్లగా.

రత్తాలు కూడా నాగుల్ని పరీక్షగా చూసింది. నాగుల్లో మార్పేమీ లేదు. అదే ఉంగరాల జుత్తు. మెలి తిరిగిన మీసం. చురుకైన చూపులు. కాకపోతే అప్పట్లో కాస్త బలంగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం సన్నబడ్డాడు. నాగులు చూడ్డానికి కంటికి నదురుగా కనిపిస్తాడు. ఏ ఆడదైనా అతడ్ని ఒకసారి చూసిందంటే మనసు పారేసుకోవాలిసిందే. ఇద్దరికీ గంజి పోసిచ్చింది రత్తాలు .

“అయితే ఇప్పుడు ఏం సేద్దామనుకుంటున్నావురా” అడిగాడు సూరిగాడు బీడీ వెలిగిస్తూ.

“నువ్వు తప్ప నాకెవరూ లేర్రా… కొన్ని రోజులు ఇక్కడే మీ తోటే ఉండాలనుకుంటున్నాను. ఏదో ఒక కూలీ నాలీ సేసుకుంటాను. పొట్ట పోషించుకుంటాను” అన్నాడు నాగులు దిగులుగా.

సూరిగాడు తల పంకించాడు. “నాకు ఒక పనంటూ ఉండదురా. పొట్టకోసం ఎంత కట్టమైన పనైనా సేత్తాను. మూటలు మోత్తాను. రాళ్లు కొడతాను. కూలీ నాలీ అన్నీ సేత్తాను. ఏ పనీ నేకపోతే రిచ్చా కూడా తొక్కుతాను” అన్నాడు సూరిగాడు. బేలగా చూసాడు నాగులు.

“నీతో పాటూ నాగుల్ని కూడా పనిలోకి తీసుకు పో మావాఁ. కలో గంజో కలిసే తాగుదాం. నువ్వు సేసే పనే నాగులు కూడా సేత్తాడు” అంది రత్తాలు.

“సర్లే… ఇద్దరికీ బువ్వెట్టవే. ఏదైనా పనెతుక్కోడానికి పోతాం” అన్నాడు సూరిగాడు .

ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. వారం రోజులనుండి తుపాను. ఉరుములు మెరుపులు. మధ్య మధ్యలో కాస్త తెరిపిచ్చినా మళ్ళీ వర్షం కురుస్తూనే ఉంది.

సూరిగాడు నాగులు కలిసి దొరికిన పనికి పోతున్నారు. వస్తున్నారు. నాలుగు పైసలు కళ్ళ జూస్తున్నారు. సాయంత్రమయ్యేసరికి ఇద్దరికీ ఒళ్ళు హూనం అయిపోతోంది. వచ్చిన డబ్బుల్లో కొంత పక్కకి తీసే వారు.

అది ఇద్దరికీ వళ్ళు నొప్పులు తగ్గటానికి ఔషధంగా పనికొచ్చేది. చిన్న చిన్న బుడ్డీలతో గుడిసె కొచ్చేవారు .

“దుకాణం దగ్గరే తాగేసి పోతే పోద్ది కదా? మళ్ళీ గుడిసె కెందుకు పట్టుకెళ్ళటం?” అన్నాడు నాగులు.

“మొదట్లో అట్టాగే తాగి పోయే వాడిని. ఓ పాలి కొట్టు కాడ ఇంకొకడితో గొడవైంది. ఇద్దరం కొట్టుకున్నాం. అప్పటినుంచి రత్తాలు భయపడి ఇంటికే తెచ్చుకుని తాగ మని సెప్పింది” అన్నాడు సూరిగాడు. ఉన్ననాడు పనుండేది ఇద్దరికీ. లేని నాడు లేదు. ఇద్దరూ పొద్దస్తమానమూ గొడ్డుల్లా కష్ట పడేవారు. సాయంత్రం సుక్కేసి తొంగుండేవారు.

సూరిగాడు సుక్కేసాడంటే మొద్దులా నిద్రోతాడు. పక్కన పిడుగు పడినా ఆడికి తెలివి రాదు.

చాలా రోజులనుండి రత్తాలుకి ‘ఆ సుఖం’ కరువైంది. ఆమె మనసులో నాగులున్నాడు. తన పెళ్లిలోనే నాగుల్ని చూసి మనసు పారేసుకుంది రత్తాలు. కానీ అప్పటికే సూరిగాడు తన మెళ్ళో మూడు ముళ్ళూ ఏసేసాడు. నాగులు అందగాడు. సూరిగాడి కన్నా బాగుంటాడు. సూరిగాడితో పోల్చుకుంటే వయసు కూడా తక్కువే. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం నాగుల్ది.

నాగులు మీద మనసు పోయింది రత్తాలుకు. ఆమె మాటలు, సూపులు అన్నీ గమనిస్తున్నాడు నాగులు. తన పెళ్ళాం పోయినప్పటినుంచీ తనకి ఆడ వాసన లేదు. ఆ సుఖం లేదు. రత్తాలు బాగుంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ముద్ద బంతి పువ్వులా ఒళ్ళుగా ఉంటుంది. మల్లె పూవులా తెల్లగా ఉంటుంది. మొత్తానికి అందంగా ఉంటుంది. చూపులతోనే తన మతి పోగొడుతోంది. సూరిగాడికి ఇవేమీ తెలియవు. ఆడో ఎర్రిమాలోకం. పనికెళ్ళానా, వచ్చానా తాగి తొంగున్నానా అంతే.

ఆ రోజు కూడా నాగులు సూరిగాడు పనిచేసి బాగా అలిసిపోయి రాత్రయ్యేసరికి గుడిసె కొచ్చారు. తుపాను కొంచెం తగ్గుముఖం పట్టింది. చెదురు మొదురుగా వర్షం కురుస్తోంది. రత్తాలు సేపల పులుసు సేసింది. ఆ వాసనతో పాకంతా గుమ గుమ లాడు తోంది. బాగా ఒళ్ళు హూనం సేసుకొని వచ్చారేమో మంచి ఆకలి మీదున్నారిద్దరూ. తెచ్చుకున్న మందు బుడ్డీలు ఖాళీ చేసారు. కడుపు నిండా సేపల కూరతో బువ్వ లాగించారు. తిన్న కాసేపటికే సూరిగాడు మొద్దు నిద్ర పోయాడు .

ఇయ్యాల ఎలాగైనా నాగుల్ని ముగ్గులోకి దింపాలనుకొంది రత్తాలు. ఉన్నంతలోనే కాస్త మంచి చీర కట్టుకుంది. నున్నగా తల దువ్వుకొని పూలెట్టుకుంది. చక్కగా ముస్తాబయింది. నాగులుతో మాటా మంతీ కలిపింది. సానా సేపు ఇద్దరు ముచ్చట్లాడుకున్నారు. కబుర్లాడుకున్నారు. నాగులు పెళ్ళాం ఎలా పోయిందీ, ఎప్పుడు పోయిందీ, ఇంతకాలం నాగులు ఎలా ఉన్నాడూ, ఏం చేసాడూ అన్నీ అడిగి తెలుసుకుంది రత్తాలు. నాగులు కూడా మనసు విప్పి అన్ని విషయాలు రత్తాలుకి చెప్పాడు.

ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మధ్య మధ్యలో నాగులు మాటలకి పడీ పడీ నవ్వేది రత్తాలు. ఆమెకి ఇదో కొత్త అనుభవం. చాలా బాగుందనిపించింది. తాను సూసిన సినిమాల్లో పేమించుకున్న ఈరో ఈరోయిన్లు గుర్తుకొచ్చారు ఆమెకి. వాళ్లలాగే తామిద్దరినీ ఊహించుకుంది. అప్పటికే సగం రాత్రయ్యింది. బయట వర్షం కురుస్తూనే ఉంది. చెక్క తలుపు సందుల్లోంచి వస్తున్న చల్ల గాలికి వాళ్ళిద్దరి శరీరాలు చిన్నగా వణుకుతున్నాయి. ఇద్దరికీ వెచ్చదనం కావాలనిపిస్తోంది. నాగులుకి చాలా దగ్గరలోనే కూర్చుంది రత్తాలు. ఆమె తల్లోని మల్లెపూల సువాసనలు నాగుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనని సయ్యాటకు రారమ్మని ఆహ్వానిస్తున్నట్టే ఉంది రత్తాలు .

ఆమె నవ్వుతుంటే గుండె పిండుతున్నట్టే ఉంది నాగులుకి. ఆమె మాటల్లో రత్తాలు తనపైన మనసు పడిందని, తనను కోరుకుంటోoదని అర్ధమయ్యిoదతనికి. ఆమె కవ్వింపు మాటలు, చూపులు తనకు మత్తెక్కిస్తున్నాయి. ఓ పక్క మద్యం మత్తు, మరో పక్క రత్తాలు అందం తనని కైపెక్కిస్తున్నాయి. ఓ మూలగా బొంత పరుచుకుని పడుకుంది రత్తాలు. తనవైపే చూస్తూ నవ్వుతోంది. ఆ పడుకునే భంగిమ కూడా నాగుల్ని పిలుస్తున్నట్టే ఉంది. నాగులు గురించి ఊహించుకుంటూనే పడుకుంది రత్తాలు.

అనుకున్నట్టే నాగులు రత్తాలు పక్కలో చేరాడు. ఆమెని గాఢంగా కావలించుకున్నాడు. ఇద్దరికీ ఎప్పటినుంచో తీరని దాహంలా ఒకరినొకరు అల్లుకుపోయారు. నాగులు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరూ పాముల్లా పెనవేసుకు పోయారు. నువ్వా నేనా అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. చాలా కాలం తర్వాత ఇద్దరికీ సొర్గం కనిపించినట్టయ్యింది.

పక్కనే సూరిగాడు గుర్రు పెట్టి నిద్రోతూనే ఉన్నాడు. బయట గాలీ వానా ఉధృతమైంది. తలుపు చెక్క గాలికి టప టపా మని కొట్టుకోసాగింది. ఉలిక్కిపడి లేచింది రత్తాలు. తన పక్కలో సూసింది. అక్కడ నాగులు లేడు. సూరిగాడు పక్కనే నిద్రోతున్నాడు. నాగులు ముఖం చాలా ప్రశాంతంగా కనిపించింది రత్తాలుకి. అంటే ఇదంతా కలన్న మాట. తానూహించింది ఏదీ జరగలేదన్న మాట. నవ్వుకుంది రత్తాలు. తాను ఎంత అవకాశమిచ్చినా నాగులు చలించ లేదు. తనని తాక లేదు. సూరిగాడికి ద్రోహం చేయలేదు. దాంతో నాగులు మీద మరింత ప్రేమ పెరిగింది రత్తాలుకి.

తెల్లారింది. రత్తాలు కళ్ళల్లోకి సూటిగా సూడలేకపోయాడు నాగులు. తాను తప్పు సేయలేదు. సేయడు. అయినా ఏదో భయం బెరుకు. లీలగా తన తండ్రి మాటలు గుర్తొచ్చాయతనికి. పేదోడయినా, పెద్దోడయినా ఎప్పుడూ నీతి తప్పకూడదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్ట కూడదు. ఆదరించి నోళ్ళకి ద్రోహం చేయకూడదు.

సూరిగాడు నాగులు ఇద్దరూ పనికి పోయారు. కానీ సాయంత్రం సూరిగాడు ఒక్కడే తిరిగొచ్చాడు గుడిసెకి. “నాగులేడి?” అని అడిగింది రత్తాలు. ఆమె కళ్ళు నాగులు కోసం వెతికాయి.

“నాగులు మరో పని సూసుకున్నాడు. ఇంక ఇక్కడికి రానన్నాడు. ఆడికి ఓ పెద్ద ఇంటికి కాపలాదారు పని దొరికింది. అక్కడే ఉండడానికి ఆ ఇంటి యజమాని చిన్న గది కూడా ఇచ్చాడు. తిండి, నిద్ర, పని అన్నీ అక్కడే…” చెప్పుకుపోతున్నాడు సూరిగాడు. అదే నాగులు స్థానంలో మరొకడుంటే… ఈపాటికి తనను… రత్తాలు ఇంకా ఆలోచిస్తూనే ఉంది .

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Drama