Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

R UMA Devi

Drama

4  

R UMA Devi

Drama

వ్యక్తిత్వం

వ్యక్తిత్వం

5 mins
414


                           

ఏడో తరగతి లెక్కల క్లాసు చూసుకుని స్టాఫ్ రూమ్ లోకి వచ్చింది రాధిక.

అప్పటికే అక్కడ కూర్చుని జవాబు పత్రాలు దిద్దుకుంటున్న గాయత్రి ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది.

తన అల్మారా లోని నీళ్ళ బాటిల్ తీసుకుని తాగి, గాయత్రి పక్కన మరో కుర్చీలో కూర్చుంది రాధిక.

ఆ పీరియడ్ ఇద్దరికీ ఖాళీయే. ఒకే సారి ఆ స్కూల్ కు బదిలీలో రావడం, ఒకే ఈడు వారు అవటంతో ఇద్దరికీ సాన్నిహిత్యం ఎక్కువ. వారిద్దరూ ఓ ప్రాధమికోన్నత పాఠశాల లో ఉపాధ్యాయినులు .

“నిన్నటి నుండి నిన్ను ఒక విషయం గురించి అడుగుదామని అనుకుంటున్నానే. ఇప్పటికి తీరిగ్గా దొరికావ్.” అంది గాయత్రి తన చేతిలోని కాగితాలు బొత్తిగా పక్కన పెట్టి.

“అంత ముఖ్యమైన విషయం ఏమిటబ్బా!” అడిగింది రాధిక.

“నువ్వు సైకాలజీ చదివావు కదా! పిల్లలలో మంచి వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు ఇవన్నీ ఎలా ఏర్పడుతాయి? తల్లితండ్రుల పెంపకం వల్లనా? లేక మంచి గురువు వల్లనా? మనకు శిక్షణా తరగతులలో కొంతవరకు చెప్తారనుకో ... ఇంకొంచెం వివరంగా నువ్వు చెప్పు.” అంది గాయత్రి.

“ ఇంత అర్జెంట్ గా తెలుసుకునే అవసరం ఏమొచ్చింది? ఏం జరిగింది?”

“అదంతా తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు చెప్పు.”

“ఊహు! ముందు నువ్వే చెప్పు”

 “నీకు ఐదో తరగతి లో తన్వీ తెలుసుగా!” అడిగింది గాయత్రి.

“ఊ! తెలుసు. ఆ గంగాభవాని యే కదా!” అంది రాధిక నవ్వుతూ.

తన్వీ కొంచెం సున్నిత మనస్కురాలు. క్లాసులో ఉపాధ్యాయులు కాస్త గట్టిగా మాట్లాడినా చాలు ఏడ్చేస్తుంది. తను ఎవరి వల్ల అయినా బాధపడినా లేక తన వల్ల ఎవరైనా బాధపడ్డారని తెలిసినా వలవలా ఏడుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కళ్ళ కొళాయి తిప్పేస్తూ ఉంటుందని రాధిక ఆ పిల్లకు గంగాభవాని అని పేరు పెట్టింది.

“అవును. ఆ అమ్మాయే! నిన్న క్లాసు లో ఏం జరిగిందో తెలుసా?”

                           *******

తన్వీ...పట్టుమని పదేళ్ళు కూడా లేని పిల్ల. చదువులో చురుకైనది. మనస్తత్వంలో నెమ్మది. తనేమో తన చదువేమో...క్లాసు లో ఎప్పుడూ తన గొంతు వినిపించదు. క్లాసులో మొదటి ముగ్గురిలోనే ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు మందలించే పరిస్థితి అంతగా రాదు. చారడేసి కళ్ళతో ముద్దుగా ఉండే ఆ అమ్మాయి రెండు జడలు వేసుకుని స్కూల్ కు చక్కగా తయారై వస్తుంది. ఎప్పుడూ క్రమశిక్షణ తో ఉండే తన్వీ అంటే గాయత్రికి చెప్పలేనంత ఇష్టం. అందునా తన సబ్జెక్ట్ లో ఆ పిల్ల ఎప్పుడూ ముందుంటుంది.

ఆ రోజు త్రైమాసిక పరీక్షల జవాబు పత్రాలు దిద్ది క్లాసులో పిల్లలను ఒక్కొక్కరినే పిలిచి ఇస్తోంది గాయత్రి.

యధావిధిగా తన్వీకే నూటికి 98 మార్కులతో మొదటి ర్యాంక్ వచ్చింది. పిల్లలందరికీ పేపర్లు ఇచ్చేసాక అందరినీ చెక్ చేసుకుని పొరబాటుగా ఏవైనా జవాబులకు మార్కులు వెయ్యకపోయినా, మార్కుల మొత్తం లో తప్పులున్నా తన దృష్టికి తీసుకు రమ్మని చెప్పింది గాయత్రి.

ఆమె ఆ మాట అనగానే పిల్లలందరూ ఒక్క సారిగా లేచి టీచర్! నాకు ఇక్కడ మార్కులు వెయ్యలేదు....... నాకు టోటల్ మిస్టేక్ ఉంది ......నాకింకా మార్కులు రావాలి....నా పేపర్ చూడండి....నా పేపర్ చూడండి....అని గగ్గోలుగా అరుస్తూ ఆమె చుట్టూ వచ్చి నిలుచున్నారు.

“అందరూ వెళ్లి కూర్చోండి. ఒక్కొక్కరే రండి” గట్టిగా చెప్పింది ఆమె.

 గాయత్రి చెప్తున్నా వినిపించుకోకుండా పిల్లలు అరుస్తూనే ఉన్నారు. ఈ గొడవ మధ్యలో తన్వీ కూడా లేచి నిలబడింది.

కాసేపు చూసి గాయత్రికి ఓపిక నశించి అందరూ వెళ్లి మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరికీ మార్కులు వేసేది లేదు అని చేతిలో ఉన్న బెత్తం తో బల్ల మీద గట్టిగా కొట్టి అరిచింది.

పిల్లలందరూ పిల్లుల్లా వెళ్లి కూచున్నారు.

తన్వీ తన స్థానంలో నిలుచునే ఉంది.

గాయత్రి ఆ కోపంలోనే ఏం! నీకు ప్రత్యేకంగా చెప్పాలా.....కూర్చో ...అని తన్వీ ని గదమాయించింది.

అంతే ... ఆ అమ్మాయి కళ్ళలోంచి జల జలా కన్నీళ్లు వచ్చేసాయి.

కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంటున్న ఆ పిల్లను చూసి గాయత్రి కోపం కరిగిపోయింది. అందునా తన ప్రియ శిష్యురాలాయే!

“తన్వీ! నీ పేపర్ తీసుకుని ఇలా రా..” పిలిచింది.

తన్వీ తన జవాబు పత్రాలు తీసుకుని గాయత్రి దగ్గరికి వెళ్ళింది.

“ చెప్పు! నన్ను ఏం అడగాలనుకున్నావ్?” 98 మార్కులు వచ్చిన తర్వాత ఇంకా దాన్లో ఏం తప్పు ఉందబ్బా అనుకుంటూ అడిగింది గాయత్రి.

“మీరు మార్కుల మొత్తం తప్పు వేసారు మేడం” అంది ఇంకా వెక్కుతూనే...

98 మార్కులు వచ్చినా సరిపోలేదా అనుకుంటూ గాయత్రి మార్కులన్నీ కూడింది. 96 మార్కులు వచ్చాయి. అనుమానం వచ్చి మరోసారి చూసినా అంతే మొత్తం వచ్చింది. 96 వస్తోందే...అనుకుంది స్వగతంగా....

“ అవును మేడం. నాకు 96 మార్కులే వచ్చాయి. కానీ మీరు 98 వేసారు.” అంది తన్వీ కళ్ళు తుడుచుకుంటూ.

ఒక్క క్షణం గాయత్రికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయి నిజాయితీకి నిజంగానే అచ్చెరువొందింది . తన ఇన్నేళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి సంఘటన ఎదురుకాలేదు. అడిగి మార్కులు వేయించుకునే వారిని, పొరబాటున ఎక్కువ వేసినా చెప్పకుండా ఉండిపోయే పిల్లలను చూసింది కానీ ఇలా ఎక్కువ వేసారు తగ్గించమని అడిగిన విద్యార్థిని చూడలేదు. మార్కులు తగ్గిపోవడం వల్ల క్లాసులో తన మొదటి స్థానం కోల్పోతుందని తెలిసినా తన్వీ అలా అడగటం గాయత్రికి ఉద్వేగం కలిగించింది.

అది చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ పిల్లల మనస్తత్వాలు, నైతిక విలువలు బయట పడేది ఇలాంటి సంఘటనల్లోనే .... ఇంత మంచి లక్షణాలు ఎక్కడి నుండి వస్తాయి? గాయత్రికి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది.

“మీ అమ్మా, నాన్న ఏం చేస్తుంటారు?” అడిగింది తన్వీ ని.

“మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న ఆర్మీ లో పని చేస్తారు.”

మధ్య తరగతి కుటుంబం అన్నమాట అనుకుంది గాయత్రి.

“నీకు ఎవరితో చనువు ఎక్కువ?”

“మా నాన్న అంటే చాలా ఇష్టం. సెలవులో వచ్చినపుడు ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఎప్పుడూ అబద్ధం చెప్పరు. నాకు ఏదైనా తెస్తానని చెబితే తేకుండా ఉండరు. ఇవ్వలేకపోతే ముందే చెప్పేస్తారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మా అమ్మంటే కూడా నాకు చాల ఇష్టం. మా అమ్మ నాకు మంచి మంచి కథలు చెప్తుంది. నన్ను బాగా చదువుకుని మంచి అమ్మాయిగా ఉండాలి అని చెబుతూ ఉంటుంది. మా అమ్మ,నాన్న ఎప్పుడూ నన్ను కోప్పడరు.” తన వాళ్ళ గురించి చెబుతున్నపుడు ఆ అమ్మాయి కళ్ళలో ఒక విధమైన మెరుపు, కించిత్ గర్వం తొంగి చూసాయి.

“ సరే! ఇప్పుడు నీకు మార్కులు ఎక్కువ వేశానని నువ్వు చెప్పకపోతే నాకు తెలిసేది కాదు. మరి నువ్వే చెప్పి ఎందుకు తగ్గించుకున్నావ్? నువ్వు ఏం చెప్పకపోయి ఉంటే నీ మొదటి స్థానం నీకు అలాగే ఉండేది కదా?” అడిగింది గాయత్రి.

“నిజం చెప్పకపోవడం కూడా అబద్ధం చెప్పినట్టే కదా టీచర్! అందుకే చెప్పాను.” అంది తన్వీ.

గాయత్రి అప్రతిభురాలయింది. ఆ చిన్నారి నిజాయితీకి ముచ్చటేసింది. మంచి విలువలు కలిగి ఉండటం ద్వారా ఏం పొందగలుగుతారో పిల్లలందరికీ తెలియచేయాలనుకుంది.

“డియర్ స్టూడెంట్స్! మన తన్వీ మార్కులు 96 వస్తే కూడిక తప్పు వల్ల 98 వేశాను. తన్వీ ఆ విషయం నా దృష్టికి తీసుకు వచ్చి మార్కులు తగ్గించుకుంది. కానీ తన నిజాయితీకి గానూ నేను మరో రెండు మార్కులు వేసి మరలా 98 వేస్తున్నాను. కాబట్టి మొదటి స్థానం తన్వీ దే. మీరందరూ కూడా ఇలా నిజాయితీపరులు గా ఉండాలి.తెలిసిందా. అందరూ తనను అభినందిస్తూ చప్పట్లు కొట్టండి.” ఆదేశించింది.

కరతాళ ధ్వనులతో క్లాసు ప్రతిధ్వనించింది.

                                              *******************

“ఇదీ జరిగింది రాధికా! ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో నిజాయితీకి కట్టుబడి ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సంఘటనే కాదు చాలా సార్లు ఆ అమ్మాయి ప్రవర్తనని గమనించాను. తన వల్ల తప్పు జరిగితే వెంటనే క్షమాపణ చెప్తుంది. ఎదుటి వారి వల్ల తప్పు జరిగితే పట్టించుకోకుండా వాళ్ళతో కలిసిపోతుంది. పోయిన వారం లో ఒక సారి మీకు అత్యంత సంతోషం కలిగించేది ఏమిటి? అని తరగతి లో అడిగితే చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడటం వల్లనో, టీవీ లో కార్టూన్ సీరియల్ చూడటం వల్లనో, కారులో తిరగటం వల్లనో, ఖరీదైన బొమ్మల వల్లనో...ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. తన్వీ మాత్రం తన తల్లి తండ్రులతో, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో గడిపే సమయంలో సంతోషంగా ఉంటానని చెప్పింది. అనుబంధాల విలువలు నేర్పుతున్న ఆమె తల్లి తండ్రులు నిజంగా అభినందనీయులు కదా. ” అంది గాయత్రి.

“ఇందాక నువ్వు అడిగావు కదా వ్యక్తిత్వం ఎలా ఏర్పడుతుంది అని....ఖచ్చితంగా ఫలానా కారణాల వలనే ఏర్పడుతుంది అని చెప్పలేం. మొట్టమొదటగా తల్లితండ్రుల పెంపకం మీద కొంతవరకు ఆధార పడుతుంది. అలాగని ఒకే తల్లికి పుట్టిన పిల్లలు అందరికీ ఒకే లాంటి వ్యక్తిత్వం ఉండదు. ఉదాహరణకు తండ్రి తాగుబోతు అయి, కుటుంబాన్ని పట్టించుకోని వాడనుకో. పిల్లల్లో ఒకడు తాగుడు తప్పు కాదనుకుని చెడు మార్గం పట్టవచ్చు. మరొకడు దాని వలన వచ్చే దుష్ఫలితాలను చూసి తాగుడును అసహ్యించుకుని మంచి వైపు అడుగులు వేయవచ్చు. అలాగే మంచి గురువు కూడా తన విద్యార్థులకు అందరికీ ఒకేలా చదువు నేర్పుతాడు. కానీ కొంత మందే దాన్ని వంటబట్టించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఒక మనిషి వ్యక్తిత్వo రూపు దిద్దుకోవడానికి తనకు ఎదురయ్యే పరిస్థితులు, మనుషులు, వారితో ఆ మనిషి అనుభవాలు, అనుబంధాలు, వాటి పట్ల అతడి ప్రతిస్పందన ఇలాంటి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. జీవితంలో తనకు తారసపడే మనుషులు కొంత వరకు ప్రభావితం చేస్తారు. మంచి గానీ, చెడు గానీ దేనికి ఆకర్షితులు అవుతారో ఆ మేరకు నైతిక విలువలు ఏర్పడుతాయి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో ఇంట్లో తల్లితండ్రులు, గురువులు, చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ మంచి వైపు నడిపించేలా ఉన్నపుడే వారు మంచి నైతిక విలువలు కలిగి, పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుని సమాజంలో గౌరవప్రదంగా ఎదుగుతారు అని నా అభిప్రాయం. పిల్లలకు అన్ని విషయాల్లో మొదటి గురువులు తల్లితండ్రులే. వాళ్ళు పిల్లలకు ఏమీ నేర్పించరు. కానీ వారిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారినే అనుసరిస్తారు. తన్వీ విషయంలో తల్లితండ్రులు ఆమెకు నైతిక విలువలు తెలియచేయడమే కాకుండా తాము కూడా ఆచరిస్తూ ఉంటారు. అందుకే ఆ అమ్మాయి మనస్తత్వం, వ్యక్తిత్వం అంత ఉన్నతంగా రూపు దిద్దుకుంటూ ఉంటాయి.”

“ఊ! అయితే మనం కూడా మన పిల్లల విషయంలో ఏం చేయాలో, ఎలా నడచుకోవాలో ఆ అమ్మాయి తెలియచేస్తోందన్నమాట..” సాలోచనగా అంది గాయత్రి.

“అంతే కదా!” అంది రాధిక గడియారం వంక చూసి తన బ్యాగు, పుస్తకాలు తీసుకుని లేచి నిలబడుతూ....

అంతలో గంట మోగడంతో ఇద్దరూ తమ క్లాసుల వైపు దారి తీసారు.


 Rate this content
Log in

More telugu story from R UMA Devi

Similar telugu story from Drama