R UMA Devi

Drama

4  

R UMA Devi

Drama

చిన్ని నాన్న కు ప్రేమ తో

చిన్ని నాన్న కు ప్రేమ తో

2 mins
474


చిన్ని కన్నా!

ఎలా ఉన్నావురా? కాలేజిలో చేరడానికి నువ్వు వెళ్లి వారం రోజులు కూడా కాలేదు. నాకు అప్పుడే ఎన్నో యుగాలైనట్టు ఉంది. ఇంతవాడవైనా ఇంకా నా కొంగు పట్టుకుని తిరిగేవాడివి. అమ్మా! ఈ రోజు మా స్కూల్ లో ఇలా జరిగింది...అలా జరిగింది అని అస్తమానూ కబుర్లు పోగేసేవాడివి. ఇప్పుడు చిన్న అలికిడైనా నువ్వేనేమో అని వెతుక్కుంటున్నాను. నీ గలగల నవ్వులతో కళకళ లాడే మన ఇల్లు ఇప్పుడు వెలవెలబోతోంది.

నా కళ్ళకు నువ్వింకా నిన్న మొన్న పుట్టిన పొత్తిళ్ళలో పాపాయిలానే ఉంటావు. కాస్త కనుమరుగైనా ఉండలేనని నిన్ను ఇన్నాళ్ళూ చదువుల కోసమైనా బయటకు పంపలేదు. ఇప్పుడు కూడా ఇంజినీరింగ్ కోసం మన ఊర్లోనే కాలేజిలో చేరుద్దామని నేనంటే మీ నాన్న ఏమన్నారో తెలుసా? పక్షులు కూడా తమ పిల్లల్ని కొంతకాలం మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటాయి. రెక్కలు రాగానే వాటి బ్రతుకు వాటిని బ్రతుకమని వదిలేస్తాయి. నువ్వు ఎప్పటికీ వాడిని నీ రెక్కలకిందే దాచుకుని వాడికసలు రెక్కలు రాకుండా చేసేస్తావా? అన్నారు. నేను మరేం మాట్లాడలేక పోయాను.  నా ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు కదా!

కొత్త ప్రపంచం....కొత్త పరిచయాలు,పరిసరాలు...ఉరకలు వేసే వయసు...వీటన్నిటితో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటావు కదూ! కానీ నాన్నా! యుక్త వయసులో జీవనయానం ఆకర్షణల సర్పాల మధ్య, మంచి నడవడికల నిచ్చెనల మీద లక్ష్యసాధన కోసం సాగే వైకుంఠపాలి లాంటిది. కొత్తగా నీకు లభించిన స్వేచ్చను ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోకు. మంచికన్నా చెడుకు ఆకర్షణ శక్తి వేల రెట్లు ఎక్కువ. చెడు వ్యసనాలకు బానిసైన వారు తమ చుట్టు పక్కల మంచివారు ఉండటం సహించలేరు. ఎలాగోలా వారిని కూడా తమలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక చెడు అలవాటును మంచివాడికి నేర్పే క్రమంలో మొదట సరదాగా చేయమంటారు....ఈ ఒక్కసారికి అంటారు...అప్పటికీ లొంగకపోతే చివరి అస్త్రం...నీకు దమ్ముంటే...నువ్వు మగాడివైతే ఈ పని చేసి చూపించు అని సవాలు విసురుతారు. మగవాడి దమ్ము ఇలాంటి పనికిమాలిన సవాళ్ళను స్వీకరించడంలో ఉండదు. అటువంటి వారి మధ్య కూడా నిగ్రహంగా ఉండగలగడంలో ఉంటుందని తెలుసుకో....

ఆకతాయిలతో చేరి నీ తోటి ఆడపిల్లలను అల్లరి పెట్టకు. వారు కూడా నీ తల్లి లాంటి స్త్రీ మూర్తులని గుర్తు పెట్టుకో. నీ మాటలతో గానీ, చేతలతో గానీ, చూపులతో గానీ వారిని అవమానించకు. 

వాహనం నడిపేటప్పుడు ఎవరి మీదో పోటీ పడి మితిమీరిన వేగంతో నీకు, నీ చుట్టుపక్కల ఉన్నవారికి ప్రమాదాలు కొని తెచ్చుకోకు నాన్నా! ఇతరుల మీద పోటీ పడవలసిన మంచి విషయాలు చాలానే ఉన్నాయి. జీవితంలో అన్ని పాఠాలు మన అనుభవాలతోనే నేర్చుకోవాలని లేదు. మరొకరి అనుభవాలతో కూడా మనం గుణ పాఠాలు నేర్చుకోవచ్చు.     నాన్న నీకు కొనిపెట్టిన లాప్ టాప్ ను సద్వినియోగం చేసుకో..అంతే గానీ అంతర్జాల మాయాజాలం లో కూరుకు పోయి అందుకోవాల్సిన లక్ష్యాలను మరిచిపోకు. నీ తుంటరి వయసుకి, కొంటె మనసుకి కళ్ళెం వేయగలిగితేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతావు

నీ ఉనికి,నడత పలువురికి ఆదర్శం కావాలి.

తల్లితండ్రులకు, గురువులకు నీవు గర్వకారణం కావాలి.

నీ తెలివితేటలు మన దేశం కోసం, సమాజహితం కోసం ఉపయోగపడాలి.

నీకు రెక్కలు వచ్చి ఎగరడం నేర్చుకోవడానికి నిన్ను కొత్త ప్రపంచంలోకి పంపించాము. మేము పెద్దవాళ్ళం అయిపోయాక నీ రెక్కల కిందే బ్రతకాలని చిన్న స్వార్థం. ఉంటాను కన్నా! సదా నీ ఉన్నతిని, సంతోషాన్ని ఆకాంక్షిస్తూ......

 ప్రేమతో అమ్మ.


Rate this content
Log in

Similar telugu story from Drama