R UMA Devi

Drama

3.6  

R UMA Devi

Drama

నేను మంచిదాన్నేనా.....

నేను మంచిదాన్నేనా.....

6 mins
778


                         

హాల్లో నాన్న గారు..పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుకుంటున్నారు. వంట గదిలో ఉన్న నాకు, అమ్మకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

“ అదండీ విషయం! అబ్బాయి రెండో పెళ్లి వాడు అన్నమాటే గాని ఇలాంటి సంబంధం మన లాంటి వాళ్ళకు దొరుకుతుందా చెప్పండి. కట్న కానుకలతో వాళ్లకు పని లేదు. మీ అమ్మాయికి,మీకు నచ్చితే చాలు. మీరు ఏ విషయం అలోచించి చెప్తే వాళ్ళకు తెలియ జేస్తాను.” అంటూ లేచాడు పెళ్ళిళ్ళ పేరయ్య.

నాన్న ఆలోచనల్లో పడినట్టున్నాడు. గుమస్తా గా పని చేసి రిటైరైన నాన్న అప్పుడు వచ్చిన డబ్బులతో అక్కయ్య పెళ్లి ఎలాగో అయిందనిపించాడు. తర్వాతి దాన్ని నేనే. నాక్కూడా పాతికేళ్ళు దాటి మూడు సంవత్సరాలు అవుతోంది. నా వయసన్ని పెళ్ళిచూపులు జరిగాయి ఇప్పటికే నాకు. వాటిలో 99 శాతం నాన్న ఇవ్వలేని కట్న కానుకల వల్ల పెళ్లి వరకు వెళ్ళలేదు.

కాలేజి రోజుల్లో నా అందం, అణకువ చూసి తోటి స్నేహితురాళ్ళంతా నా కోసం రాజకుమారుడు వస్తాడనే వారు. నిజమే కాబోలు అని నా ఊహలు నేల విడిచి ఆకాశం లో విహరించేవి. కానీ పెళ్ళిళ్ళ విపణి లో నా అందం ఏ మాత్రం పనికి రాదని నిరూపితమయ్యాక ఆ ఊహలు కాస్త నేల మీద కాదు కదా పాతాళం లో కూడా లేకుండా పోయాయి. ఎలాగోలా నా పెళ్లి చేయాలని నాన్న....., ఎవడో ఒకడు నా జీవితాన్ని ఉద్ధరించేవాడు రాకపోతాడా అని నేను..... ఎదురు చూస్తున్న దశ లో ఉన్నాం.

ఆ సమయం లోనే ఈ రెండో పెళ్లి సంబంధం. ఆర్నెల్ల క్రితం అతగాడి భార్య కాన్సర్ తో పోయిందట. ఏడేళ్ళ కూతురు కూడా ఉంది. అతడి వయసు కూడా 35 ఏళ్ళ లోపే. చిన్న వయసే కాబట్టి మళ్ళీ పెళ్ళికి రెడీ అయాడు. నాన్నకు ఈ సంబంధం నచ్చినట్టే ఉంది. నేను కూడా ఇంతకు మించిన పెళ్ళికొడుకు వస్తాడనే ఆశ లేనిదాన్ని. అయినా ఈ పెద్దవాళ్ళు పోషించలేనపుడు పిల్లల్ని కనడం ఎందుకు? పెరిగి పెద్దయ్యాక వాళ్ళ కలల్ని కాలరాయడం ఎందుకు? మనసులో అనుకునేవే కానీ బయటకు రాని మాటలివి. మనసులో మాటలు ఎప్పుడు బయటకు అనకపోవడం వల్ల కాబోలు నేను చాలా మంచిదాన్నని అందరూ అంటూ ఉంటారు.

అతడితోనే నా పెళ్లి జరిగిపోయింది.అప్పగింతలపుడు నాన్న “నువ్వు నా బంగారు కొండవిరా . ఎందుకు రెండోపెళ్ళి వాడికి ఇచ్చి చేస్తున్నావ్ నాన్నా అని నన్ను నిలదీయలేదు. నీ తండ్రి తాహతు ను అర్థం చేసుకుని, కలల్ని, జీవితాన్ని త్యాగం చేసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నావ్..” అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. నాన్న నిస్సహాయత ను అర్థం చేసుకోలేని నేను మంచిదాన్నా.........

                                     ************

       ఆడపిల్లకు ఏ దశలో నైనా ఊహలకు కొదవ ఉండదనుకుంటా..... పెళ్ళికి ముందు ఒక రకం కలలైతే పెళ్లి తర్వాత భర్త తో గడప బోయే జీవితం గురించి మరో రకం కలలు. కానీ నేను ఆశల ఆకాశం లోకి ఎగిరిన ప్రతి సారీ వాస్తవాలు నన్ను నేల మీదికి లాగేస్తూ ఉంటాయి. ఆయన కు చనిపోయిన భార్య మీద వల్లమాలిన ప్రేమ. కూతురు కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి పోరు పెడితే తప్పని సరై నన్ను పెళ్లి చేసుకున్నాడు. భార్య స్థానం లో మరో స్త్రీ ని ఊహించలేకనేమో నన్ను దగ్గరికి తీయనే లేదు. పెళ్లి కాకముందు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు భర్త ఎప్పుడు ఆదరిస్తాడా అని ఎదురు చూస్తున్నా..... అసలు నా లాంటి జాతకాలు ఎందుకు పుడతాయో?

       ఆయన కూతురిని కొన్నాళ్ళు మా అత్తగారు తీసుకెళ్ళారు మా మధ్యన ఎందుకని. అలా ఓ నెల రోజులు గడిచాయి. ఆయనకు టైం కు అన్ని అమరిస్తే చక్కగా ఆఫీస్ కు వెళుతున్నారు. మనసులో వేదన ఉంటె నాకు తిండి ఎలా సహిస్తుంది. నెల రోజుల్లోనే నేను బాగా చిక్కి పోయాను. ఇష్టం లేనపుడు నన్ను పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఇలా నన్ను తన మౌనంతో చిత్రవధ ఎందుకు చెయ్యాలి? చెప్పానుగా నాకు మనసులో అనుకునే మాటలు బయటికి అనే అలవాటు లేదని..... లోలోపలే కృంగి పోతానంతే.....

       కాస్త వాతావరణం మారే సరికి నాకు జ్వరం పట్టుకుంది. ఆ పూట ఆయనకు భోజనం వడ్డిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంట్లో ఎవరు లేకపోవడం వల్లనో లేక నా స్థితి కి తనే కారణమనే అపరాధభావం వల్లనో మా ఆయన నన్ను గబగబా హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు.

అలా పట్టుకున్న జ్వరం నాలుగు రోజులైనా తగ్గలేదు. ఆయన ఆఫీస్ కు సెలవు పెట్టక తప్పలేదు. మా వాళ్లకు, అత్తగారికి చెప్తే తన వల్లే నాకిలా అయిందని తిడతారేమో అని వాళ్ళకు తెలియచేయలేదనుకుంటా! ఎవరూ నాకోసం రాలేదు. పలవరింతల్లో నేను తన కోసం ఎంత ఆరాట పడుతున్నానో తెలిసిందేమో! తర్వాత ఆయన నన్ను వదిలి వెళ్ళలేదు.

ఆ రోజే హాస్పిటల్ నుండి వచ్చాము. పత్యం తీసుకోవడం తో కాస్త తెరిపి గా ఉంది. నాల్రోజుల నుండి ఇంటిని పట్టించుకునే వాళ్ళు లేక చిందర వందర గా ఉంది.కాస్త శుభ్రం చేద్దామని పూనుకున్నాను. ఆయన మెల్లగా నా దగ్గరికి వచ్చారు.

“ఇంకా నీరసంగా ఉన్నావుగా. ఇప్పుడే ఈ పనులెందుకు?” అడిగారు.

నేను మౌనంగా నిలుచున్నాను.

“నిన్ను చాలా బాధ పెట్టాను కదూ.....నన్ను క్షమించగలవా?”

నా గుండెల్లో బాధ ఉప్పెనై కళ్ళలో నిలిచింది. తల వంచుకున్నాను ఆయన కు కనిపించకుండా.

తను మెల్లగా నా చుబుకాన్ని పట్టి తల పైకి ఎత్తాడు.

నా కన్నీటి వాగు కు గండి పడింది.

అది చూసి ఆయన చలించిపోయారు.

కొన్ని సందర్భాలలో జాలి... ప్రేమ గా రూపాంతరం చెందుతూ ఉంటుంది.

“నువ్వెంత మంచి దానివి! మరొకరైతే ఎంత గొడవ చేసేవారు? ఇంకెప్పుడూ నిన్ను నొప్పించను.” నన్ను గట్టిగా హత్తుకున్నారు. నిజంగా నేను మంచిదాన్నా....ఏమో........ విడిచిపెడితే మళ్ళీ ఆ ఆనందం దూరమవుతుందేమో అనే భయం తో మరింత దగ్గరైపోయాను తనకు.

ఆ రోజు నా ఊహలు వాస్తవాలయ్యాయి. ఆయన తనతో నన్ను స్వర్గానికి తీసుకెళ్ళారు.

                            ********************

ఆ రోజు ఆయన టిఫిన్ చేస్తూ ఉండగా అన్నారు ......రేపే వెళ్లి ఊరి నుండి భువన ను తీసుకొస్తున్నా అని. భువన ఆయన కూతురు.

స్వర్గం నుండి నేల మీదికి గెంటేసిన ఫీలింగ్. మా ఆయన గురించి తెలిసిన మా అత్తగారు కొన్ని రోజులు మాకు ఏకాంతం కల్పించాలని పాప ను తనతో తీసుకెళ్ళి నట్టుంది.

ఏ అమ్మాయి అయినా తన భర్త తో పాటు బోనస్ గా ఆయన గారి పిల్లలు కావాలని కోరుకుంటుందా..... కానీ నాకు తప్పదుగా...

మరుసటి రోజు అన్నట్టుగానే పాపను తీసుకొచ్చారు. నన్ను చూసి బెరుగ్గా తన గది లోకి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ పిల్ల చాకిరీ కూడా ఉంటుంది కాబోలు! మనసులోనే అనుకున్నా.

కానీ నన్ను ఆశ్చర్య పరుస్తూ పాప తన పనులు తనే చేసుకోవడం చూసాను. ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంది. వచ్చీ రాక బట్టలు పిండేసింది. నేను గమనిస్తూనే ఉన్నాను. తల దువ్వుకోవడం ఇంకా రాలేదేమో అవస్థ పడుతోంది.

“పాపా! ఇలా రా...నేను జడ వేస్తాను.” పిలిచాను తన పాట్లు చూసి.

మెల్లగా నా దగ్గరికి వచ్చింది. తల దువ్వుతూ అడిగాను.....నిన్ను పనులు చేయమని ఎవరు చెప్పారు అని..

“నాన్నమ్మ నా పనులు నన్నే చేసుకోమని చెప్పింది.”

“ఇంకా ఏం చెప్పింది?” కుతూహలంగా అడిగాను.

“నువ్వు చాలా మంచి దానివని చెప్పింది. నిన్ను విసిగించకుండా బుద్ధిగా ఉండాలని చెప్పింది.”

సవతి తల్లి అంటే బ్రహ్మ రాక్షసి అని నేర్పించని మా అత్తగారి సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించాను.

“నిన్ను ఏమని పిలవాలి?” అడిగింది సందేహంగా పాప.

నాన్నమ్మ చెప్పలేదా ఏమని పిలవాలో...అడిగాను.

“నీకెలా ఇష్టమైతే అలా పిలవమంది.” చెప్పింది పాప.

“అయితే నీకెలా ఇష్టం? “

ఏదో చెప్పబోయి మొహమాటంగా ఆగిపోయింది.

తన మనసులో మాట ను గ్రహించాను. నేను మంచిదాన్ని అని బిరుదు ఇచ్చారుగా... మరి దాన్ని నిలబెట్టుకోవద్దూ...

పాప బుగ్గలు పుణికి “అమ్మా అనే పిలవచ్చు” అన్నాను.

పాప సంబర పడిపోయింది. అలా కనకుండానే పాపకు తల్లినయ్యాను.

“మరో పెళ్లి అన్నపుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో.....పాప ఎంత ఇబ్బంది పడుతుందో.... అని చాలా భయపడ్డాను....నువ్వు నా జీవితం లోకి రావడం నా అదృష్టం” ఏకాంతంలో మా ఆయన ప్రశంసలతో ముంచెత్తే వాడు.

                                     ****************

ఆయన తో స్వర్గ విహారం చేసిన పుణ్యం.....నేను నెల తప్పాను.

బాబు పుట్టాడు. భువనకు తమ్ముడంటే ఎంతో ప్రీతి. చక్కగా చూసుకునేది.

ఇద్దరూ పెరిగి పెద్ద వాళ్లవుతున్నారు. బాబూ పుట్టాక పిల్లలిద్దరి మీద నా ప్రేమలో తేడా ఉండకూడదని నానా తంటాలు పడే దాన్ని. ఎక్కడ లెక్క తప్పిందో తెలియదు కానీ బాబు కాస్త దుడుకు గానే ఉన్నాడు.

ఇప్పడు భువన PG చేస్తోంది.బాబూ హై స్కూల్ చదువుతున్నాడు.

ఒకరోజు బాబు స్కూల్ నుండి వచ్చి విసురుగా బ్యాగ్ గిరాటేశాడు. వాడి చెంప ఎర్రగా కమిలి పోయి ఉంది.

“ఏమైంది కన్నా! చెంప మీద ఈ దెబ్బలేమిటి? ఎవరు కొట్టారు?” కంగారుగా అడిగాను.

“అక్క నన్ను నా స్నేహితులముందే కొట్టింది.” ఉక్రోషం గా అన్నాడు.

నా కన్నతల్లి మనసు భగ్గుమంది. నా బాబును కొట్టడానికి తను ఎవరు? ఏమైనా ఉంటె నాకో, తండ్రికో చెప్పాలి గాని ఇలా నా బిడ్డను కొడుతుందా! మనసులో కుత కుతా ఉడికిపోతున్నాను.

ఇంటికి రానివ్వు అక్క పని చెప్తాను అని బాబు ను బుజ్జగించాను.

నేను పెట్టిన తిను బండారాలు తిని వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు.

ఓ గంట గడిచాక భువన వచ్చింది. బట్టలు మార్చుకుని, ఫ్రెష్ అయి వంట గది లోకి వచ్చింది. నేను అంత వరకు తనని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నా....

“అమ్మా! నన్ను క్షమించమ్మా! ఈ రోజు బాబూ ని కొట్టాను. ఆకతాయిలతో చేరి అమ్మాయిలను అల్లరి చేస్తుంటే వద్దని వారించాను. కానీ వాడు వినలేదు. నాకు చెప్పడానికి నువ్వెవరు? అని బిరుసు గా మాట్లాడాడు. చివరికి చేయి చేసుకోక తప్పలేదు. నువ్వు నన్ను, వాడిని ఏనాడూ వేరుగా చూడలేదు. నన్ను కన్న తల్లి కంటే ఎక్కువ గా చూసుకుంటూ ఉన్నావు. అలాంటి నీ కడుపున పుట్టి వాడు దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకోలేక పోయానమ్మా!”

నన్నెవరో చెళ్ళున కొట్టినట్టయింది. నిజమే.... భువన కు తమ్ముడంటే ఎంతో ప్రేమ. అలాంటిది చేయి చేసుకుందంటే కారణం ఏమై ఉంటుందో అని ఆలోచించ లేకపోయాను. ఇంకా నయం....నేను తనని అడగలేదు.......నేను మంచిదాన్నా....కానే కాదు.

                            *************

భువన కు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఎన్ని చూసినా భువనే తిరగ్గొడుతోంది. కారణం ఏమిటంటే చెప్పడం లేదు. అబ్బాయి అమ్మాయి ని మాట్లాడుకోమని పంపితే ఏం అడుగుతోందో తెలీదు కానీ సంబంధం కుదరడం లేదు.

ఎలాగైతేనేం చివరకు ఒక పెళ్ళికొడుకు దాని ధాటికి తట్టుకుని నిలబడ్డాడు. సంబంధం ఓకే అయింది.

కుతూహలం పట్టలేక అడిగాను .....ఇన్నాళ్ళూ పెళ్లికొడుకులను ఏం అడిగావే అందరు అలా పారిపోయారు...అని.

ఏం లేదమ్మా! పెళ్లి అయ్యాక తమ్ముడి కంటే ఎక్కువగా మీ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాను. అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటా అన్నాను. నా తల్లి చనిపోయాక ఆమె కంటే బాగా నన్ను చూసుకున్నావ్. నిన్ను నేను వదులు కోలేనమ్మా! జీవితాంతం నీకు సేవ చేసినా నీ ఋణం తీర్చుకోలేను. అందుకే ఈ షరతు కు ఒప్పుకున్న వాడితోనే నా పెళ్లి అని నిర్ణయించుకున్నా....

వింటున్న నాకు తల తిరిగిపోయింది. ఇంత ప్రేమ కు నేను నోచుకున్నానా.... అసలు నేను అంత మంచిదాన్నేనా.......ఏమో......






Rate this content
Log in

Similar telugu story from Drama