వ్యాపకం
వ్యాపకం
"వనజాక్షీ! ఈ మధ్య మీ అమ్మాయి కనబడడంలేదు!?"అడిగింది ఎదురింటి కనకం బామ్మ.
"నువ్వు ఈమధ్య ఊళ్ళో లేవు కదా బామ్మా! అల్లుడు గారు వచ్చి, తన తప్పు తెలుసుకున్నానని, మన పరిమళకి క్షమాపణ చెప్పి కాపురానికి తీసుకెళ్ళారు." అంటూ సంబరంగా చెప్పింది వనజాక్షి.
" ఏమిటో ఈ కాలం పిల్లలు. అయినదానికీ కానిదానికీ ఆవేశపడిపోవడం, ఆనక కాళ్ళు పట్టుకోవడం, గడ్డాలు పట్టుకోవడం. దానికి మీరు సంబరపడిపోవడం. సరిపోయారు అందరూ.. చూద్దాం ఈసారి ఎన్నాళ్ళో!!" కాస్త తన మాటలకు వ్యంగ్యాన్ని జతచేసి మరీ అంది కనకం బామ్మ.
కనకం బామ్మ మాటలకు వనజాక్షి మనస్సు చివుక్కుమంది. కానీ ఆవిడ అన్న మాటలన్నీ అక్షర సత్యాలే కాబట్టి వనజాక్షి కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోయింది.
కనకం బామ్మ పరిమళను, పరిమళ భర్త వికాస్ లను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంది. పరిమళ పెళ్ళిచేసుకున్న వికాస్ కనకం బామ్మకు దగ్గరి బంధువే కావడం వల్ల, పరిమళ, వికాస్ ల పెళ్లి అనగానే అసలే వద్దంది కనకం బామ్మ. ఎందుకంటే ఇద్దరూ ఆవేశపరులే.. ఇద్దరికీ ఓపిక తక్కువ.. ఇద్దరూ దుబారా మనుషులే.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఆ సంసారం ఇక నడిచినట్లే.. అందుకే వద్దంది. కానీ పరిమళ, వికాస్ పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు.
వాళ్ళ పెళ్ళయినప్పటి నుండి పరిమళ పదిరోజులు అత్తారింట్లో ఉంటే ఇరవై రోజులు పుట్టింట్లో ఉంటుంది.
ఇద్దరూ ఏదో ఒక మాట అనుకోవడం, పరిమళ అలిగి పుట్టింటికి రావడం, కొన్నాళ్ళకి పరిమళో, వికాసో రాజీపడి క్షమాపణలు చెప్పడం, తిరిగి కాపురానికి వెళ్ళడం. ఏడాది నుంచి ఇదే నడుస్తోంది.
చూసేవాళ్ళకీ చెప్పేవాళ్ళకీ విసుగొచ్చేసింది. ఇష్టపడి, పట్టుబట్టి మరీ పెళ్ళి చేసుకోవడమెందుకు? ఇలా గొడవలు పెట్టుకోవడమెందుకు? అని పెద్దలు నెమ్మదిగా చెప్పి చూసారు. అయినా పెద్దగా ఫలితం లేదు. వీళ్ళు మారరని వదిలేశారు కూడా.
ఈసారి రెండు నెలలయినా పరిమళ పుట్టింటికి రాలేదు. సరికదా పదిరోజుల నుండి తల్లితో కూడా సరిగ్గా ఫోన్ మాట్లాడడం లేదు. వనజాక్షి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చేసినా రెండు ముక్కల కన్నా ఎక్కువగా మాట్లాడడం లేదు. వికాస్ కు ఫోన్ చేసినా అదే పరిస్థితి. కారణమేమిటో ఎవరికీ అర్థం కాలేదు.
పరిమళ క్షేమంగానే ఉందా?? తనకేమీ ప్రమాదం రాలేదు కదా?? అనే కొత్త అనుమానాలు కూడా లేవనెత్తాయి. ఇక ఉండబట్టలేక వనజాక్షీ, కనకం బామ్మ పరిమళ ఇంటికి వెళ్లారు. ఇల్లు తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళను అడిగి, వికాస్, పరిమళ ఇద్దరూ కలిసే బయటకు వెళ్ళారని తెలుసుకునేలోగానే పరిమళ, వికాస్ హాయిగా చిలకాగోరింకల్లా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేశారు.
చెప్పాపెట్టకుండా వచ్చిన అమ్మనూ, కనకం బామ్మనూ చూసి ఆశ్చర్యపోయింది పరిమళ.
ఎప్పుడూ కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కనిపించే జంట చిలకాగోరింకల్లా ముచ్చటగా కనిపించేసరికి వనజాక్షి, కనకం బామ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
అందరూ ఆనందాశ్చర్యాల నుండి తేరుకుని, ఇంట్లోకి వెళ్లి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు.
కాఫీ పెట్టడానికని వికాస్ వంటగదిలోకి వెళ్ళగానే, వనజాక్షి, కనకం ఇద్దరూ పరిమళను ప్రశ్నల వర్షంలో ముంచెత్తారు. ఈ రెండు నెలల్లో వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత ఇద్దరిదీ..
వాళ్ళ ఆతృతకు తెరదించుతూ నోరు విప్పింది పరిమళ. " అమ్మా! బామ్మా!! మీరు నాకు చాలా సార్లు సర్దుకుపోవాలని సలహా ఇచ్చేవారు గుర్తుందా?" అంది.
"హా.. ఎందుకు గుర్తు లేదూ!! అందుకేగా గొడవైనప్పుడల్లా బ్యాగు సర్దుకుని వచ్చేసేదానివీ!!" నవ్వుతూ చురక వేసింది బామ్మ.
వనజాక్షి, పరిమళ కూడా ఫక్కున నవ్వారు. "అబ్బా బామ్మా!! నన్ను చెప్పనివ్వు. మీ ఇద్దరూ మీ భర్తలతో మీ అనుబంధం గురించి చెప్పారు కదా ఇదివరకు. నేనూ మా పిల్లలకు మా అనుబంధం గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఏం చేయాలా అని, నేనూ వికాస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. మేము ఇద్దరం ఫామిలీ కౌన్సెలింగ్ సెషన్స్ కు హాజరయ్యాం. ఇప్పుడు నేను బొటిక్ కూడా మొదలు పెట్టి చీరలు, డ్రస్సులు డిజైన్ చేస్తున్నాను. ఇన్నాళ్లూ వికాస్ మాత్రమే ఉద్యోగానికి వెళుతూ, నేను ఇంట్లో ఖాళీగా ఉండేసరికి ఏ వ్యాపకమూ లేక పిచ్చెక్కేది. అదంతా వికాస్ మీద రుద్దేదాన్ని. పాపం వికాస్ ఆఫీసులో చికాకులు, నా రుసరుసలూ అన్నీ కలిసి పెద్ద గొడవయ్యేది. అందుకే నాకంటూ ఇప్పుడు ఓ వ్యాపకం ఉంది. మేమిద్దరం ఇప్పుడు ఒకరి కోసం ఒకరం సమయం కేటాయించుకుంటున్నాం. సరదాగా గడుపుతున్నాం. ఇంటి పనులూ పంచుకుంటూ, మా పనులు మేము చేసుకుంటున్నాం. ఒకవేళ మళ్లీ గొడవ పడినా వెంటనే సారీ చెప్పుకుని అక్కడితో మర్చిపోతున్నాం." అంటూ సంతోషంతో గలగలా చెప్పేసింది పరిమళ.
"హమ్మయ్య! ఇప్పుడు మనశ్శాంతిగా ఉందే నాకు. ఈ వ్యాపకమేదో పెళ్ళయిన వెంటనే మొదలు పెట్టి ఉంటే, మీ అమ్మ బీపీ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉండేదే మనవరాలా!!" అంటూ పరిమళను ప్రేమగా మెటికలు విరిచింది కనకం బామ్మ.
