కల
కల
"ఉన్నంతలోనే సర్దుకుని బతకాలి. అంతేకానీ ఇలా గొంతెమ్మ కోరికలు కోరితే, నేను మాత్రం ఎక్కడినుండి తేను? నా దగ్గర పైసా కూడా లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో.." అంటూ భార్య సుగుణ మీద రంకెలేస్తున్నాడు రవి.
రవి ఓ మధ్యతరగతి కుటుంబీకుడు. ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సుగుణ, పదోతరగతి చదువుతున్న ఒక కొడుకు రిషి.
చాలీచాలని జీతంతో కుటుంబ ఖర్చులు, కొడుకు చదువు సాగిస్తున్నారు. పెద్దల వారసత్వం నుండి వచ్చిన రెండు గదుల పాత ఇల్లు తప్ప పెద్దగా ఆస్తులేమీ లేవు. నెలాఖరు వచ్చిందంటే తిండికి, బట్టకీ కూడా కొరతే.
తమ లాగా తమ కొడుకు కూడా కష్టపడకూడదని సుగుణ కోరిక. తమ కొడుకైనా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ సుఖంగా ఉండాలని ఒక తల్లిగా నిస్వార్థమైన కోరిక సుగుణది.
అందుకే రిషిని ఇంటర్మీడియట్ కోసం మంచి కార్పొరేట్ కాలేజీలో చేర్పించి, ఐఐటీ పరీక్ష కోసం కోచింగ్ కూడా ఇప్పించాలని రవిని కోరింది.
రవికి కూడా తన కొడుకును బాగా చదివించాలనే ఉన్నప్పటికీ కార్పొరేట్ కాలేజీ, ఐఐటీ కోచింగ్ అంటే లక్షలతో పని. అంత డబ్బు తన తల తాకట్టు పెట్టినా కూడా తీసుకురాలేడని రవికి తెలుసు.
అందుకే సుగుణకు నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. కానీ సుగుణ తన మాటే నెగ్గాలని మొండి పట్టుదలతో కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు.
"మీరు ఎన్నయినా చెప్పండి. బాబును మాత్రం మంచి కాలేజీలో చేర్పించి, ఐఐటీ కోచింగ్ ఇప్పించాల్సిందే. లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా.. తర్వాత మీ ఇష్టం." తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది సుగుణ.
ఈ విషయాన్ని ఇంకా పొడిగిస్తే సుగుణతో అనవసర వాదన తప్ప పెద్దగా ప్రయోజనం లేదనుకుని రవి "సరే సుగుణా! నాకు మాత్రం రిషిని బాగా చదివించాలని ఉండదా? అయినా మనవాడు ఇంకా పదోతరగతే కదా.. స్కూల్ మొదలై ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే ఇంటర్ చదువు గురించి వాదన ఎందుకు? ఇంకా ఏడాది సమయం ఉంది కదా! ఈ ఏడాదిలోపు డబ్బు గురించి ఏదో ఒకటి ఆలోచిద్దాం. నువ్వు అనవసరంగా ఆవేశపడకు." అంటూ ఆ సంభాషణ అక్కడితో ముగించాడు.
కానీ ఏం చేసి అంత డబ్బు సంపాదించాలో అర్థం కావడం లేదు రవికి. చాలా కష్టపడుతున్నాడు. ఆఫీసులో ఓవర్ టైం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం కూడా పట్టించుకోవడం లేదు రవి.
భర్త కష్టాన్ని చూసి సుగుణకూ బాధగానే ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం తప్పడం లేదని, తనూ తనకి వచ్చిన పచ్చళ్ళు, పొడులూ తయారు చేసి అమ్ముతూ భర్తకు సహకరించసాగింది.
ఎలాగైతేనేం మొదటి సంవత్సరం ఫీజు కోసం కావలసిన డబ్బులు సమకూర్చారు. ఇంతలో రిషి పదోతరగతి ఫలితాలు రానే వచ్చాయి. రిషి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తల్లిదండ్రులు తనకోసం పడుతున్న కష్టం చూసి, రిషి కూడా బాగా చదివాడు.
దాంతో ఫీజు లేకుండానే ప్రముఖ కాలేజీలో ఉచితంగా సీటు లభించింది. రిషి ఇంటర్మీడియట్ కూడా బాగా చదివి, ఐఐటీలో సీటు సాధించి తల్లిదండ్రుల కలను నెరవేర్చాడు.
