Kiran Kumar

Drama

3  

Kiran Kumar

Drama

శశి చకోరిక

శశి చకోరిక

13 mins
395


నాది నాదని తలచేవు,

నీదన్నదేముందే...వెర్రి మనసా...!

నేడు నీదైనది, రేపు ఇంకొకరిదౌను,

తెలుసుకొనవే... పిచ్చి మనసా...!!

తాత్వికుని స్వరంలోని వైరాగ్యం...అంతరంగపు లోతులను ఆర్ద్రంగా స్పృశిస్తోంది.

తన మందిర గవాక్షం చెంత నిలబడి తదేకంగా శూన్యంలోకి చూస్తున్నాడు విజయపురి మహారాజు మహదేవుడు.

హృదయాంతరాలలో గూడుకట్టుకున్న విషాదం అతడిని విచలితుణ్ణి చేస్తోంది.

"నాన్నగారూ" అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూసాడు.

ఎదురుగా యువరాజు శశిధరుడు.

"అక్కడే నిలబడిపోయావేం? లోనికి రా... నాయనా" ఆప్యాయంగా ఆహ్వానించాడు.

చేరువగా వచ్చి నిలుచున్న యువరాజుని తదేక దృక్కులతో చూస్తూ...

" ఏమిటి విశేషం ?" ప్రశ్నించాడు చిరునవ్వుతో

"ఈరోజు మీ కోడలు చంద్రభాగ జన్మదినం" ఉత్సాహంగా బదులిచ్చాడు శశిధరుడు

"అవునా...! ఎక్కడ మా కోడలు?" ద్వారం వైపు చూస్తూ అడిగాడు మహదేవుడు.

"మీ పాదాల చెంతనే ఉంది నాన్నగారూ" నవ్వుతూ బదులిచ్చాడు యువరాజు. 

తత్తరపడుతూ... పాదాలకు నమస్కరిస్తున్న కోడలిని

"దీర్ఘ సుమంగళీ భవ!" అని దీవించాడు.అలా దీవిస్తున్నప్పుడు... మహదేవుని గొంతు లీలగా వణికింది. అది అతనికి మాత్రమే తెలుస్తోంది.

"నాన్నగారూ...! మీకో మాట చెప్పనా..."

సంశయపడుతూ అడిగాడు శశిధరుడు.

"చెప్పు నాయనా... సందియమేల?"

"మరి... మరి..."

"ఊఁ...మరి...?" మహాదేవుని భృకుటి ముడిపడింది.

"మీకు వయసయిపోతోంది నాన్నగారూ..." తెరలు తెరలుగా నవ్వుతూ అన్నాడు యువరాజు.

యువరాజు మోములో ఆ దరహాసం మహదేవునికి అమందానందాన్ని కలిగించింది.

'నా బంగారు తండ్రి...ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి' మనసులో కోటి వేల్పులకు మొక్కు కున్నాడు మహదేవుడు.

"చంద్రా! అమ్మను పరామర్శించాలి. పద... పద..." తొందరించాడు యువరాజు.

తండ్రి వైపు తిరిగి...

"వెళ్ళొస్తాం... నాన్నగారూ" అన్నాడు.

"మంచిది నాయనా!"

వెనుదిరిగిపోతున్న పుత్రుని చూస్తున్న మహాదేవుని కళ్ళు అప్రయత్నంగా చెమరించినాయి.

ఓ కన్నీటి చుక్క జాలువారి అతని వక్షంపై పడింది. గుండెల్లో పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఓదారుస్తున్నట్టుగా....

*    *    *    *    *    *    *    *

మహాదేవుని పట్టమహిషి అపర్ణాదేవి శయ్యా మందిరం...

"అమ్మా! ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?" లోనికి ప్రవేశిస్తూ ఆరా తీశాడు శశిధరుడు

'మనసుకు తగిలిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది' స్వగతంలో అనుకుంటూ పైకి మాత్రం

"నా ఆరోగ్యానికేం నాయనా! బాగానే ఉంది" అని మాత్రం అనగలిగింది అపర్ణాదేవి.

"మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మీ పేరిట అర్చన చేయించి వస్తున్నాం. చంద్రా...! అమ్మకు ప్రసాదం ఇవ్వు" అన్నాడు తలతిప్పి

తదేకంగా... కొడుకుని చూస్తూ ఉండిపోయింది మహారాణి

"అయ్యో...అమ్మా! చంద్ర ఈ పక్కన ఉంది" నవ్వుతూ అన్నాడు శశిధరుడు.

ఉలిక్కిపడి...యువరాజు చూపిన దిశగా తలతిప్పి చూసింది మహరాణి

"అమ్మా...." అని పిలిచి అర్ధోక్తిలో ఆగిపోయాడు

'ఏమిటన్నట్టు?' సంశయంగా చూసిన అపర్ణాదేవి.... అంతలోనే తెప్పరిల్లి

"నాకు వయసయిపోతోంది కదూ నాయనా..." అని అంది. కళావిహీనమైన వదనంతో...

కన్నబిడ్డ మనసులో ఏముందో ఆ తల్లికి తెలియదూ...?

"చూసావా... చంద్రా! అమ్మ నా మనసులోని మాటను ఇట్టే ఎలా కనిపెట్టేసారో..."

అని చంద్ర భాగతో చెబుతూనే....

తల్లికి సమీపంగా వచ్చి తల్పంపై కూర్చుంటూ... చెవిలో గుసగుసగా

"అమ్మా! అటు చూడండి మిమ్మల్ని ప్రశంసించానని, చంద్ర నా వైపు ఎలా ఈర్ష్య గా చూస్తోందో..." పకపకా నవ్వూతూ అన్నాడు.

"వీడి పరిహాసాలేవీ పట్టించుకోకమ్మా" కోడలిని అనునయిస్తూ చెప్పింది మహారాణి.

"అమ్మా! ఈరోజు చంద్రభాగ జన్మదినం, ఆశీర్వ దించండి..." పుష్పాక్షతలు ఆమె చేతికందిoచాడు శశిధరుడు.

"దీర్ఘాయుష్మాన్ భవ!"

దీవిస్తున్న మహారాణి గొంతులో మళ్లీ అదే సన్నని వణుకు, కనుల కొలనుల్లో అదే వెచ్చని కన్నీరు.

'నిజం కనిపించడం లేదు, అబద్ధం అనిపించడం లేదు'

చాలా చిత్రమైన సంకట స్థితి... ఆ రాజదంపతులది.

వారికి ఈ సంకటస్థితి ఎదురగుటకు గల హేతువు... గత ఆరు మాసాలలో జరిగిన సంఘటనలే.

నేటికి సరిగ్గా ఆరు మాసాలకు మునుపు....

*    *    *    *    *

వసంత మంటపం...

వెండి వెన్నెల మత్తుచల్లి మాయ చేస్తోంది.

పిల్ల తెమ్మెర ఆత్మీయంగా లాలిస్తోంది.

చిక్కని చీకటి మనసు మూలలను నిశ్శబ్దంగా ఆక్రమించుకుంటోoది.

చంద్రశిలా నిర్మితమైన పొడుగాటి తిన్నెపై వెల్లకిలా పడుకుని...తల క్రింద చేతులు పెట్టుకుని శయనించి ఉన్నాడు శశిధరుడు. విజయపురి యువరాజు... మహదేవుని ఏకైక వారసుడు.

ఆ నీరవ నిశ్శబ్దానికి మరింత సొబగులు అద్దుతూ ఘల్లు ఘల్లుమంటూ సిరిమువ్వల చిరుసవ్వడి లయబద్ధంగా అతనిని సమీపించింది. సుమ గంధపు సుగంధం అతని నాసికాపుటాలను సుతిమెత్తగా స్పృశిoచింది.

"చకోరీ!" యువరాజు కళ్ళు తెరవకుండానే పిలిచాడు.

"కాదు... చంద్రభాగ" శృతి చేసిన వీణాతంత్రులు పలికించిన సుస్వరాల సంగీతంలా ఉంది ఆమె స్వరం.

"అది అన్యులకు, నీ భవదీయుడైన ఈ శశిధరునికి మాత్రం నీవెప్పటికీ....మృదుమధుర, పల్లవకోమల, నయన మనోహర, వన్నె చిన్నెల, మదన మంజుల, ప్రణయవిహారివి...ప్రియతమ చకోరివే...!

శశిధరుని కళ్ళు కొంటెగా నవ్వుతున్నై...

"అయ్యారే! ఆర్య పుత్రులకు కవిత్వం కూడా తెలుసునే...!!!!"

అంది చంద్రభాగ... చుబుకం పై వేలు నుంచి విస్ఫారిత నేత్రాలతో....!

"నీవు నా చెంత నుండ, నా ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు కూడా కవిత చెప్పగలవు, నా ప్రాణేశ్వరి" చంద్రభాగను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు శశిధరుడు.

సిగ్గుదొంతరల నడుమ చకోరి మొగ్గలా ముడుచుకు పోయింది. ఆమె చెంపలపై విరబూసిన కెంపులను మురిపెంగా చూస్తూ...

"తొమ్మిది...పది..."

అర్ధంకాక అయోమయంగా చూసింది చకోరి.      

"ఆలస్యం...ఈ పదిక్షణాల ఆలస్యానికి జరిమానా చెల్లించాల్సిoదే..." కొంటెగా అన్నాడు ఆమె కురులలో తలదాచుకుంటూ...శశిధరుడు.

అతడి వెచ్చటి ఊపిరి ఆమెలో గిలిగింతలు రేపుతోంది.

"చిత్తం యువరాజా...! జరిమానా ఏమిటో సెలవియ్యండి" అతడి నుంచి విడివడుతూ అంది చంద్రభాగ.

"ఇప్పుడు మేం యువరాజులం గాదు, నీ ప్రియాతి ప్రియమైన శశిధరులం. 'శశీ...!' అన్న పిలుపే మాకెంతో ప్రియం. అంటూనే..."ఒక్కో క్షణానికి..."

"ఊఁ...ఒక్కో క్షణానికి..."

"ఒక్కో చుంబనం లెక్కన... పదిక్షణాలకు పది చుంబనాలు"

శశిధరునిలో మోహాతిశయం ఉరకలేస్తోంది.

"రాకుమారుని మనోభీష్టమును నెరవేర్చుటయే... ఈ చరణదాసి తక్షణ కర్తవ్యం" అని పలికి శశిధరుని మోమును తన రెండు చేతులలోనిడుకుని... అతని విశాలమైన నుదుటిని గాఢంగా చుంబిoచింది.

యువరాజులో ఒకింత నిరుత్సాహం!

"కోడె వయసు చిన్నవానికి వాల్గంటి జవరాలు ఈయవలసింది అధరచుంబనాలు కానీ... నుదురు చుంబనాలు కాదు ..." అంటూ చకోరి సన్నని నడుమును తన ముని వేళ్ళతో సుతారంగా మీటాడు.

కిలకిలా నవ్వింది చంద్రభాగ. ముందుకు వాలి అతని వక్షంపై గోముగా సోలిపోయింది. బిగియార కౌగలించుకున్నాడు శశిధరుడు.

గువ్వలా ఒదిగిపోయింది చకోరి.

ప్రేమ పిపాసుల గాఢ పరిష్వంగంలో మలయ మారుతం బందీకాక తప్పలేదు.

కాలం నిదానంగా కదులుతోంది... వెన్నెల నిమ్మళంగా కరిగిపోతోంది.

పొగడ పూల పొదలచాటున పొంచి నిశితంగా గమనిస్తున్న ఓ రెండు కళ్ళు... నిశ్శబ్దంగా ప్రక్కకు తప్పుకున్నాయి.

*     *    *    *    *

అంతఃపుర నేలమాళిగలోని రహస్య మందిరం....

అత్యవసరంగా ఏర్పాటుచేయబడ్డ ఆ సమావేశానికి విచ్చేసిన మహారాజు మహాదేవుడు, ప్రధానామాత్యుడు యుగంధరుడు, మహా దండ నాయకుడు అభీరుడు, దండనాయకుడు విక్రముడు, యువరాజు శశిధరుని వదనాలలో ఒక విధమైన గాంభీర్యం తొంగిచూస్తోంది.

ఆ నిశీధి సమయాన... ఆ రహస్య మందిరాన వారలా సమావేశమవడంలో గల ఆంతర్యం తెలుసు కోవాలంటే, ఒక తూరి విజయపురి పూర్వ చరిత్రను అవగతం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

విజయపురి పొరుగు రాజ్యం చంద్రగిరి. ఇరు రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం కొనసాగుతూ వస్తోంది. ఆది నుండి విజయపురి సుభిక్షమైన రాజ్యం. తద్విరుద్ధంగా చంద్రగిరిలో ఎప్పుడూ దుర్భిక్షమే. దానితో సహజంగానే చంద్రగిరి పాలకుల కన్ను విజయపురి పై పడింది. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా విజయపురి కోటను వశం చేసుకోలేకపోయారు.

ప్రస్తుతం చంద్రగిరి పురాధీశుడు నచికేతుడు... విజయపురిని హస్తగతం చేసుకోవడానికి శతవిధాల యత్నిస్తున్నాడు. పొరుగు రాజులను ప్రలోభ పెట్టి విజయపురి పై దాడి చేయడానికి సమాయత్త మవుతున్నాడు.

కానీ అతడి ప్రయత్నాలకు చార్వాకుని రూపంలో గట్టి అవరోధం ఎదురైoది. తన అమోఘమైన తెలివి తేటలతో నచికేతుని కోటలో పాగా వేసి... అతడి సైనిక రహస్యాలను ఎప్పటికప్పుడు విజయపురికి చేరవేస్తున్నాడు చార్వాకుడు. అతడు విజయపురి వేగుల బృందానికి నాయకుడు. చిరుత వేగం, తోడేలు తెలివి, ఊసరవెల్లి నైజం, డేగ దృష్టి అతని సొంతం.

అటువంటి చార్వాకుడు స్వయంగా మహారాజైన మహదేవుని కలుసుకోవాలని విజయపురికి విచ్చేసినాడంటే... విజయపురి సామ్రాజ్య నలుదిశల ప్రమాద ఘంటికలు మోగనున్నట్టే.

యుగంధరుని కనుసైగతో గొంతు సవరించుకున్నాడు చార్వాకుడు.

"ప్రభువులకు జయము,జయము! చంద్రగిరి ప్రభువులు నచికేతువుల వారు..."

"గౌరవ మర్యాదలు చరిత్ర హీనులకు ఆపాదించబడవు చార్వాకా"

మహదేవుని కంఠం ఖంగుమంది ఆ మందిరములో...

" మన్నించండి ప్రభూ! చంద్రగిరి ప్రభువు నచికేతుడు ఏ క్షణమైనా మన రాజ్యంపై దాడి చేయవచ్చు" అని చెప్పి తలదించుకున్నాడు చార్వాకుడు.

"శత్రు దుర్భేద్యమైన విజయపురి దుర్గం వైపు క్షణకాలం వీక్షించినంత మాత్రమునే... శిరస్సు తెగి నేలబడునని తెలిసియూ... ఆ నచికేతుడు ఇంతటి సాహసానికి తెగబడుతున్నాడూ... అంటే...! దీని వెనుక ఏదో కుతంత్రం దాగి ఉండే ఉంటుంది ప్రభూ..." మహా దండనాయకుడు అభీరునిలోని ఆవేశానికి, అతని కంఠం పై నరాలు బిగదీసుకున్నాయి.

"వెల్లడి కానంత వరకే... కుతంత్రం, ఒకతూరి వెల్లడైన ఎడల అది రాజతంత్రమే అభీరా!" మహా మంత్రి యుగంధరుడు సాలోచనగా అన్నాడు.

"అమాత్యులు లెస్స పలికినారు ప్రభూ...రుద్రగిరి, భద్రగిరి, మహేంద్రగిరి పాలకులు నచికేతునితో చేతులు కలిపినారు" మహారాజుని చూస్తూ అన్నాడు చార్వాకుడు.

"భీరువు! ఒంటరిగా ఎదురు నిలిచి పోరుసల్పలేక, శత్రువులతో అంట కాగుతున్నాడు పిరికిపంద" శశిధరుని రుధిరం సలసల కాగుతోంది.

"ఆవేశకావేషాలకిది సమయం కాదు యువరాజా! తక్షణ కర్తవ్యం యోచించవలె, ఆ నచికేతునికి సరియగు గుణపాఠం నేర్పించవలె" యుగంధరుని మాటలకు అంగీకారసూచకంగా అందరూ శిరములు పంకించినారు.

"అవును ప్రభూ...! జారిపోతున్న ప్రతీక్షణం మన లక్ష్యాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది" దండ నాయకుడు విక్రముడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

ఆ మరుక్షణమే వారి ఆలోచనలు మధించబడ్డాయి. వ్యూహాలు పదునుతేలాయి.

" శత్రు సేనలు ఒక చోట చేరిన పిదప ముప్పేట దాడి చేయడమే సమయోచితమనిపిoచుచున్నది ప్రభూ" అన్నాడు మహా దండనాయకుడు అభీరుడు.

"మన్నించండి మహా దండనాయకా! వృక్షాన్ని సమూలంగా పెకలించవలెనంటే ఖండించ వలసినవి,శాఖలు కాదు... మూలాలు" ధైర్యంగా పెద్దల ముందు తన అభిప్రాయం వెల్లడి చేసాడు యువరాజు.

అతని ఆంతర్యం అక్కడున్న వారికి నెమ్మది... నెమ్మదిగా... అవగతం కాసాగింది.

"రుద్రగిరి, భద్రగిరి,మహేంద్రగిరి సేనలు విజయపురి సేనలను చేరుకొనుటకు మునుపే వాటిని నిలువరించవలె. వారి సహాయం నచికేతునికి అందకుండా చేయవలె. అతడిని ఒంటరిని చేసి నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టవలె" దీర్ఘశ్వాసతో ఒకింత విరామం తీసుకున్నాడు శశిధరుడు.

ఒక్క క్షణం నిశ్శబ్దం... ఆ మరుక్షణం అక్కడున్న వారి ప్రశంసలకు శశిధరుని హృదయం ఉప్పొంగిపోయింది.

*    *    *    *   *

అటుపిమ్మట విజయపురి రాజ్యంలోని పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. గజ, రథ, తురగ, పదాతి సేనలు సమాయత్తం చేయబడినవి. క్రౌంచ,గరుడ, మండల, సూచీముఖ వ్యూహాలు రచించబడ్డాయి.

సేన నాలుగు భాగాలు చేయబడింది. మొదటి విభాగం... యువరాజు శశిధరుని ఆధ్వర్యంలో మహేంద్రగిరి వైపు, రెండవది.... మహా దండ నాయకుడు అభీరుని నాయకత్వంలో రుద్రగిరి వైపు, మూడవది... దండనాయకుడు విక్రముని నేతృత్వంలో భద్రగిరి వైపు సమరోత్సాహంతో కదం తొక్కుతూ ముందుకు సాగి పోయాయి.

విజయపురి కోట రక్షణను స్వయంగా మహారాజు మహదేవుడు తన భుజస్కంధాలపై వేసుకుని... నేరుగా నచికేతుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు

*    *    *    *    *

రాత్రి... రెండవయామం పూర్తి చేసుకుని మూడవ యామంలోకి ప్రవేశించింది.

అప్పటికి చంద్రభాగ వసంతమంటపం చేరుకుని చాలా సమయమైంది. ఉరుకుతూ అక్కడికి చేరుకున్నాడు శశిధరుడు.

"మన్నించు చకోరీ! యుద్ధ సన్నాహాలలో తల మునకలుగా నిమగ్నమైపోయిన కారణంగా జాగైనది" సంజాయిషీ ఇచ్చుకున్నాడు శశిధరుడు.

చంద్రభాగా మౌనంగా వింటోంది.

యువరాజు వచ్చి ఆమె చెంత తిన్నె పై కూర్చుని...

"ఈ క్షణం కోసం ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు నిరీక్షించానో నీకు తెలియదు చకోరీ...ఈ నాటికి నా చిరకాల స్వప్నం ఫలించబోతున్నది" అంటూ ఒర నుండి సర్రున కరవాలాన్ని బయటకు లాగాడు.

వెన్నెల కిరణం ఆకరవాలపు మొనదేలిన అంచుపై పడి తళుక్కుమంది.

"మరి కొద్ది రోజులలో శతృ మూకల రుధిరధారలతో నా కరవాలానికి అభిషేకం జరగనున్నది. ఆ మహేంద్రగిరి సైనికుల కుత్తుకలు ఖండించి... మా తండ్రిగారి పాదాల చెంతపడవేయు క్షణం కోసం మదీయ హృదయం ఎంతగానో ఉరకలు వేస్తోంది"

ఆవేశంగా చెప్పుకుపోతున్న శశిధరుడు ఒక్క క్షణం ఆగి... సందియమంది చంద్రభాగ వైపు పరికించి చూసి నివ్వెరపోయాడు.

చంద్రభాగ శోకతప్తయే అయింది.

"చకోరీ!" అంటూ చుబుకాన్ని పైకెత్తి కళ్ళలోకి చూసాడు.

ఆ ఆశృనయనాలలో అతని రూపం అస్పష్టంగా గోచరిస్తోంది. ఆ నయనాలలో ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, ఆత్మ నివేదన ఉంది, అన్నిటినీ మించి... ఒక ఆత్మీయ అభ్యర్థన ఉంది.

"నా చకోరి ఇంత బేలయని అనుకోలేదు సుమీ...!" విచలితుడై అన్నాడు యువరాజు.

"శశీ...! మీ హృదయంలో ప్రణయానికి మాత్రమే స్థానముందని భావించానే కానీ...ఇంతటి ప్రళయం దాగి ఉందని ఎంత మాత్రం ఊహించలేకపోయాను. నిన్నటి వరకు మీలోని ప్రేమ పిపాసినే చూసిన నా మనసు... నేడు మీలో యుధ్దోన్మాదిని చూసి తాళలేక పోతోంది" అంటూ యువరాజుని గాఢంగా ఆలింగనం చేసుకుంది.

ఆమె అంతరంగాన్ని అవగతం చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు శశిధరుడు.

చంద్రభాగ ఎంతటి సున్నిత మనస్కురాలో అతడికి తెలుసు. ఆమెలోని ఆ సున్నితత్వమే...గాఢంగా ఆమెను ఆరాధించేలా అతడిని సదా ప్రేరేపిస్తూ ఉంటుంది.

"చకోరీ!క్షత్రియధర్మం అనంతమైన సాగరం వంటిది. పైకి నిర్మలంగా గోచరించినా... లోలోన బడబాగ్నులు సదా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. రాచపుట్టుక పుట్టిన తరువాత క్షత్రియధర్మానికి ఆ పరమాత్ముడైనా తలవంచి తీరవలసిందే. సమయానుసారం, సందర్భానుసారం హిమశిల్పం లాంటి అంతరంగాన్ని కూడా రాతి శిలగా మలచుకోవాలి తప్పదు"

యువరాజు లాలనలో కన్నతల్లి ఆత్మీయ స్పర్శను ఆమె సంపూర్ణంగా అనుభవిస్తోంది.

అప్పటికి చంద్రభాగ దుఃఖం కొంత ఉపశమించింది.

"మాకు... నీ దుఃఖం ఆవేదనాభరితమూ... నీ చిరుదరహాసవదనారవిందమే ఉత్తేజభరితమూను. నవ్వుతూ సాగనంపలేవా చకోరీ...? ధర్మయుద్ధంలో అజేయునిగా... ప్రేమయుద్ధంలో విజేతగా ఈ... శశిధరుడు, నీ ముందు నిలవాలని నీ హృదయం కాంక్షించడం లేదూ...?"

ఏం చెప్పాలో తోచక బేలగా చూస్తోంది చంద్రభాగ.

కదనరంగం నుండి మరలి వచ్చిన మరుక్షణమే.. మన విషయం మా తండ్రి గారితో విన్నవిస్తాను. వారు అవునంటిరా... సరే! కాదంటిరా..."

ఆప్రయత్నంగా శశిధరుని నోటికి తన చేతిని అడ్డం పెడుతూ...

"పరిహాసానికైనా అశుభం పలుకవలదు శశీ...! మీ తండ్రిగారి మీద గౌరవం, మీ మీద అనురాగం, మన ప్రేమ మీద నమ్మకం ఎన్నటికీ సడలిపోవు. మీరు అవశ్యం విజయం సాధిస్తారు. సంతోషంగా వెళ్ళి రండి" భారమైన హృదయాన్ని అదిమి పెట్టుకుంటూ భావగర్భితంగా... పలికింది చంద్రభాగ.

సమర సన్నాహాల్లో భాగంగా కోట బురుజుల పైనుండి బాకాలు ఊదబడుతున్నాయి, యుద్ధభేరీలు మోగింబడుతున్నాయి.

ఇనుమడించిన ఉత్సాహంతో నిష్క్రమించినాడు శశిధరుడు.

చెమ్మగిల్లిన కళ్లతో వీడ్కోలు పలికింది చకోరి.

పొగడ పూల పొదల మాటున పొంచి చూస్తున్న అవే నిశిత దృక్కులు నిశ్శబ్దంగా పక్కకు తొలగిపోయాయి.

దూరంగా తీతువు కూత పెట్టింది, అప్రయత్నంగా చంద్రభాగ మేను జలదరించింది.

*    *    *    *    *

ఏకాంత మందిరం....

నచికేతుడు స్వర్ణముఖి నదీతీరానికి చేరుకున్నాడన్న సందేశం కోసం ఎదురు చూస్తున్నాడు మహదేవుడు.

మనసు చిక్కబట్టుకుని ఆ మందిరంలోకి ప్రవేశించింది చంద్రభాగ. ఆమె లోనికి అడుగు పెట్టగానే మందిర ద్వారాలు వాటంతట అవే మూతబడ్డాయి.

ఇటువంటి రోజొకటి వస్తుందని ఆమెకు ముందే తెలిసినా... ఇంత త్వరగా వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.

మందిర కుడ్యమునకు అమర్చబడిన ఆముదపు దీపం గాలికి రెపరెప లాడుతోంది...ఆమె మనసు లాగే... మందిర గవాక్షం దగ్గర అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు మహాదేవుడు.

"కుశలమా! చ...కో...రీ...?" 'చకోరి' అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ ప్రశ్నించాడు. 

ఆ పిలుపుకు చంద్రభాగ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నిస్సత్తువ ఆమె తనువును నిర్దయగా ఆక్రమించు కుంటోoది. అతి ప్రయాసతో గొంతు పెగల్చుకుని

"చిత్తం ప్రభూ" అని మాత్రం అనగలిగింది.

మహాదేవుడు చంద్రభాగ వైపు తిరిగి...

'ఆసీనురాలవుకా...' అంటూ అజ్ఞాపించాడు. అతడి గొంతులోని కాఠిన్యం ఆమెకు భీతి గొలుపుతోంది.

మంత్రముగ్ధలా చలువరాతి నేలపై పరిచిన రత్న కంబళి పై ఆసీనురాలైoది.

"యువరాజు శశిధరుని... ప్రణయజగాన ప్రియమైన అభినేత్రివి, ఈ సువిశాల విజయపురి సామ్రాజ్యానికి కాబోయే పట్టమహిషివి, నీ స్థానం అక్కడ కాదేమో..." అన్నాడు మహదేవుడు వ్యంగ్యంగా.

ఆమె స్వరం మూగబోయింది. తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది.

మెత్తని రత్నకంబళి పై మహాదేవుని సుతిమెత్తని అడుగుల సవ్వడి ఆమెను భయ విహ్వలను చేస్తోంది.

ఆమెను సమీపించి.... తన పాదరక్షలను ఆమె ముందు విడిచాడు మహదేవుడు.

చంద్రభాగ హృదయంలో దావానలం ఉప్పొంగుతోంది.

కంబళిని చిన్నగా తాటిస్తున్న మహదేవుని పాదాలను... చెంతనే విడిచిపెట్టబడిన పాదరక్షలను పదే పదే చూసింది.

మహదేవుని ఆంతర్యాన్ని అవగతం చేసుకోలేని జడురాలు కాదామె.

అవమానాన్ని దిగమింగుకుని, చేయి ముందుకు చాచి పాదరక్షలను అందుకుని అతని పాదాలకు తొడగ బోయింది.

తన పాదాన్ని వెనక్కి తీసుకున్నాడు మహాదేవుడు.

మనసును మెలిపెడుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ...

తన వల్లెవాటుతో అతడి పాదాలను శుభ్రపరిచి పాదరక్షలను తొడిగింది.

అతడి పాదం ఇంకా కంబళిని తాటిస్తూనే ఉంది.

ఈతూరి పాదరక్షలను కూడా తన వల్లెవాటుతో తుడిచి శుభ్రం చేసింది. పాదాలకు ప్రణమిల్లినది.

"భేష్...! ప్రభువుల పాద ధూళి సేవకుల నుదుటి విభూదియని గ్రహించినావు. చతురికవే..."

మహదేవుడు సంధిoచిన శరం గురి తప్పలేదు. చంద్ర భాగ హృదయంలో గాఢంగా నాటుకుంది.

ఆమె నయనాలు అశృపూరితాలయ్యాయి. రెండు కన్నీటి చుక్కలు నిస్సహాయంగా జారి... రత్నకంబళిపై పడ్డాయి.

ఆ మరుక్షణం... ఆమె ముందు రెండు వరహాలు విసిరి వేయబడ్డాయి. ఆమె హృదయం మూగగా ఆక్రోశిస్తోంది.

"చంద్రా! పాదరక్షలా పాదం కింద మనగల గాలనియే కోరుకో...అది సముచితం. అంతియే కానీ... మకుటమై శిరస్సును అలంకరించాలని మాత్రం కోరుకోకు...అది దుస్సాహసం. నీ దుస్సాహసానికి ప్రతిఫలం నీ ప్రాణం. నువ్వు నిండు నూరేళ్లు జీవించాలన్నదే మా అభిమతం. రణభూమి నుండి యువరాజు తిరిగి వచ్చే సమయానికి నీ నీడ కూడా విజయపురి సామ్రాజ్యంలో మిగలరాదు. అలా కాని పక్షంలో... నీవు మిగిలి ఉండబోవు" అంటూ తీవ్రంగా హెచ్చరించినాడు మహదేవుడు.

"ఇది మా ఆజ్ఞ! మా ఆజ్ఞే నీకు శిరోధార్యం...సర్వదా శ్రేయస్కరం" అని పరుషoగా నుడివి అక్కడినుండి విసవిసా నడుచుకుంటూ వెళ్లి పోయాడు మహదేవుడు.

దూరంగా వెళ్లి పోతున్న మహదేవుని చెవులకు లీలగా వినిపిస్తోంది... పొగిలి పొగిలి ఏడుస్తున్న చంద్రభాగ ఆక్రందన

*    *    *    *    *

శశిధరుని యుద్ధ వ్యూహం అద్భుతంగా ఫలించింది. మిత్రుల సహకారం అందక... నచికేతుడు ఒంటరివాడయ్యాడు. ఇదే అదనుగా విజయపురి సేనలు మూకుమ్మడిగా విరుచుకుపడి నచికేతుని సేనలను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాయి.

సువర్ణముఖి నదీ తీరాన ఈ సంగరం ఇలా కొనసాగుతూ ఉండగానే... రుద్రగిరి, భద్రగిరి, మహేంద్రగిరి సేనలను చిత్తుగా ఓడించిన విజయపురి సేనలు మహ దేవునితో జత కలిశాయి. శశిధర, అభీర, విక్రములు అవక్రవిక్రపరాక్రమానికి ఆ సమరాంగణంలో ఎదురులేకుండా పోయింది. 

తలలు తెగిపడ్డాయి, మొండాలు వేరు పడ్డాయి, శరీరాలు రక్తమోడాయి. రుథిర ధారలు ఏరులై ప్రవహించినవి. నచికేతుని శిరస్సు... శశిధరుని ఖడ్గ ప్రహారానికి తెగిపడి, మహదేవుని పాద పద్మాలకు రుధిరవర్ణాన్ని అలదినది.

అఖండ విజయలక్ష్మి మహదేవుని పాదాక్రాంతమైనది.

*    *    *    *    *

ఉత్సాహం ఉరకలెత్తగా... ! సంతోషం మది నిండగా...!! వసంత మంటపం చేరుకున్న శశిధరుని కళ్ళు ఆత్రంగా చకోరిని వెదుకుతున్నాయి. మంటపం అంతా కలియతిరిగినా చకోరి జాడ కానరాలేదు. ముప్పిరిగొన్న నిరాశానిస్పృహలతో నిస్త్రాణగా కూలిపోయాడు.

ఆ అమవాస నిశిలో తన చకోరి పిలుపు కోసం అతని మనసు ఎదురుతెన్నులు కాస్తోంది. ప్రియ మనోహరి ఆగమనానికై హృదయం కవాటం తెరుచుకొని నిరీక్షిస్తోంది.

ఆ నిశిరాత్రిలో ఆ నిరీక్షణ నిరంతరాయమైంది.

హృదయాంతరాలలోని అగాధం... మరింతగా విస్తరించింది.

కష్టసుఖాలకు, సుఖదుఃఖాలకు, సంతోష విచారాలకు అతీతంగా కాలవాహిని నిరాటంకంగా ముందుకు సాగిపోతూనే ఉంది.

చకోరి జాడకై శశిధరుని హృదయం పరితపిస్తోంది. ఆ హృదయ పరితాపం అతడిని మరింత ఉన్మత్తునిగా చేస్తోంది. సంధ్య వేళకు వసంత మంటపం చేరుకొని... చకోరి కోసం నిరీక్షించడం అతని నిత్యకృత్యమై పోయింది.

*     *     *     *     *

శశిధరుని శయ్యా మందిరం...

ఘల్లు ఘల్లుమంటూ అందెల రవళి శశిధరుని కర్ణాలను లీలగా తాకుతోంది. తటాలున లేచి కూర్చున్నాడు. నుదుటన చిరుచెమటలు దట్టంగా అలముకున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఉనికి అతడికి స్పష్టంగా తెలుస్తోంది.

చెవులొగ్గి శ్రద్ధగా విన్నాడు. అంతటా నిశ్శబ్దం. అతడి అంతరంగంలో ఏదో మూల చిన్న ఆశ మాత్రం మిణుకు మిణుకుమంటోంది.

మందిరంలో అలికిడి లేదు... మనసులో అలజడి తప్ప.

నిస్సత్తువగా దిండుపై వాలి కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ అదే సవ్వడి. తెలియని ఆందోళన అతడి మదిలో విశృoఖలంగా చెలరేగుతోంది.

సవ్వడి.... అదే సవ్వడి... అతనికి ఎంతో చిరపరిచితమైన సిరిసిరిమువ్వల చిరుసవ్వడి.

ఒక్క ఉదుటున శయ్య దిగి మందిర ద్వారం వద్దకు పరిగెత్తుకొని వచ్చి వసారాలోకి దృష్టిసారించాడు.

కునికిపాట్లు పడుతున్న కాపలా భటులు తప్ప అంతా నిర్మానుష్యంగా ఉంది.

నిస్తేజంగా... మందిర గవాక్షం వద్దకు చేరుకొని సూటిగా చూసాడు. నిశీథిని చీల్చుకుoటు అతని దృక్కులు సూటిగా దూసుకుపోయాయి.

ఒక్క క్షణం అతడి ఎడద లయ తప్పింది. ఉద్వేగంతో కాళ్లు చేతులు సన్నగా వణుకుతున్నాయి.

అక్కడ.... ఆ వసంతమంటపంలో... చంద్రకాంతశిలా తిన్నెపై చకోరి అతని కోసం నిరీక్షిస్తోంది.

"చకోరీ!" అని బిగ్గరగా పిలుస్తూ అడ్డువచ్చిన రక్షక భటులను నిర్దాక్షిణ్యంగా నెట్టివేస్తూ వసంత మండపం వైపు పరుగు తీశాడు.

మరుక్షణంలో ఈ వార్త మహారాజు మహాదేవుని చేరింది. చెదిరిన గుండెను చిక్కబట్టుకుని వసంత మండపం చేరుకున్నాడు మహాదేవుడు.

అక్కడ...ధూళి, ధూసరితమైన నేలపై అచేతనంగా పడి ఉన్నాడు శశిధరుడు.

మహాదేవుని నేత్రాలు అగ్ని విస్ఫుల్లింగాలయ్యాయి.

శశిధరుని మందిరానికి చేర్చి... చుట్టూ కాపలా కట్టుదిట్టం చేసాడు. రేయింబవళ్ళు యువరాజుని అంటిపెట్టుకొని సంరక్షిస్తోంది వ్యక్తిగత భద్రతా దళం.

*    *     *     *     *

అంధకూపంలాంటి కారాగార గృహంలో పెడరెక్కలు విరిచికట్టి కట్టబడి ఉంది చంద్రభాగ.

కొరడా దెబ్బలకు ఆమె శరీరంపై రక్తం చారికలు కట్టింది.రక్తమోడుతున్న గాయాలు భీతి గొలుపుతున్నాయి.

కరుకు రాచరికపు కఠిన దాస్యశృంఖలాలకు ఒక చివర ఆమె చేతులు, మరో చివర ఆమె కాళ్లు బంధించబడి ఉన్నాయి. ఎగశ్వాసతో ఆమె శరీరం ఎగిరెగిరి పడుతోంది.

మహాదేవుని కళ్ళల్లోని క్రౌర్యం కర్కశంగా నవ్వుతోంది.

"మా ఆజ్ఞ ధిక్కరించిన నీ తెగువను అభినందించ కుండా ఉండలేకపోతున్నాను చంద్రా! మా కళ్ళుగప్పి మారువేషంలో అంతపురంలోకి ప్రవేశించి శశిధరుని కలుసుకోవాలన్న నీ యోచన అమోఘం, అద్భుతం" అంటూ కాలితో ఆమె పొత్తి కడుపులో ఈడ్చి తన్నాడు. బాధతో లుంగలు చుట్టుకుపోయింది చంద్రభాగ.

"సార్ధకనామధేయురాలవే...జాణవే... ఉహూఁ... నెర జాణవే...చంద్రా! కానీ...నీవు గ్రహించని విషయమొ కటి నీకు విశదపరచనా....? చకోరిక... పులుగు కేవలం కవుల కల్పితం...ఊహాజనితం. కల్పన యదార్ధo కాదు, కారాదు. నీ ఉనికి కూడా కల్పనగానే మిగిలిపోవాలని ఆదేశిoచితి.... ఆశించితి...తుదకు భంగపడితి. మా ఆశను అడియాసపాలు చేసిన నీ అపార మేధా సంపత్తికి మా నజరానా ఏమిటో తెలుసా...? న...ర...క... యా...త...న... !! రోజుకో కండ నీ శరీరం నుండి వేరుచేయబడుతుంది. చావలేక... బ్రతకలేక...చావు బ్రతుకుల సంధిస్థితిలో... చస్తూ... బ్రతుకుతూ...! బ్రతుకుతూ... చస్తూ...! కుళ్ళి కుళ్ళి చావు,ధూర్తు రాలా...!"

మహాదేవుని లోని మృగం బాహాటంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.

"రూపలావణ్యాలను, ఒంపుసొంపులను ఎరవేసి పదుగురి ముందు నాట్యం చేసుకుని పొట్టపోసుకునే ఎంగిలి విస్తరాకువు, నీకు విజయపురి సామ్రాజ్య యువరాజుతో ప్రణయమా...? ఎంత సాహసం...?? మరెంత కండకావరం...? నీ రుధిరంతో యువరాజు నుదుట కళ్యాణ తిలకం దిద్దని వాడనైతినేని.... మేము అరివీరభయంకర, శత్రుసంహార విజయ పురాధీశుoడ మహదేవ నామధేయుండనే గాను"

మహాదేవునిలోని క్రౌర్యo అక్కడ ఉన్న కావలి భటుల శరీరాలను జలదరింపజేస్తోంది.

అమానుష, అమానవీయ రాచరిక పద ఘట్టనల కింద పడి ఓ ప్రేమసుమం వసివాడి పోయింది.

నిస్సహాయంగా తెరుచుకుని ఉన్న కళ్ళనుండి చంద్రభాగ ఆత్మ స్వేచ్ఛా వాయువులను పీల్చు కుంటూ... యువరాజు శశిధరుని మందిరం వైపుగా సాగిపోయింది.

*     *     *     *     *

రెక్కలు విప్పుకున్న విషాద స్మృతులు స్తబ్దుగా మనసు పొరల మాటున దాగిపోయినవి.

గతం... వర్తమానానికి చోటిచ్చి నిశ్శబ్దంగా తొలగిపోయినది

వర్తమానంలో....

మహదేవుని ఏకాంత మందిరం...

"ప్రభూ...!" అన్న పిలుపుతో... మహదేవుని ఆలోచనలకు అడ్డుకట్ట పడింది.

ఎదురుగా అపర ధన్వంతరిగా పేరొందిన ఆచార్య నాగార్జున దీక్షితులు.

"దయచేయండి ఆచార్యా!" మహదేవుని స్వరంలో జీవం లేదు.

"ఎన్ని ప్రయత్నాలు చేసినా... యువరాజు శరీరం స్పందించడం లేదు. మనోవ్యాధికి నివారించగల ఔషధం లేదు కదా ప్రభూ"

ఆచార్యుని మాటలతో మహదేవుని వదనం మరింత మ్లానమైoది. ఆశాదీపం కొండెక్కిపోతున్న భావన

"చంద్రభాగ తనతోనే ఉందన్న చిత్త భ్రమలో ఉన్నారు యువరాజు. ఆమె సజీవంగా లేదన్న యదార్ధo తెలిసిన మరుక్షణం... యువరాజు నిండు నూరేళ్ళ జీవితానికి అదే ఆఖరి క్షణం కాగలదు ప్రభూ!"

సుంత విరామం తీసుకొని చెప్పసాగారు ఆచార్యుడు

"చంద్రభాగ జాడ కానరాక ... నిరంతరం ఆమె తలపులే మదిలో చెలరేగ...మతి స్థిమితం కోల్పోయి చిత్త భ్రమకు లోనైనారు యువరాజు. అత్యంత విషాదకరముగా...వారి ప్రేమ ఫలించి... ఆమెతో తన కళ్యాణం జరిగినట్టుగా... యువరాజు హృదయం గాఢంగా విశ్వసిస్తోంది. ఆమె ఉనికిని అతడి హృదయం తీవ్రంగా అభిలషిస్తోంది. ఆ కారణంగానే మనకు అగోచరమైన ఆమె రూపం వారికి మాత్రం గోచరిస్తోంది. మనకు వినపడని ఆమె స్వరం వారికి మాత్రమే వినవస్తోంది"

మహదేవుని అంతరంగం అతడిని మొదటిసారి ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలకు తన వద్ద సమాధానాలు లేవన్న సంగతి అతడి మనస్సు ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోంది.

"ఈ సమస్యకు పరిష్కారం....?

"మన చేతులలోనే ఉంది ప్రభూ! ఇంతవరకూ కొనసాగిన రీతిగా...ఇకపై కూడా... యువరాజుల వారి నిజం మనకూ నిజం కావలి, వారి అబద్ధం మనకూ అబద్దం కావలి. చంద్రభాగ తనతోనే ఉందన్న భ్రమలోనే యువరాజుని ఎప్పటికీ ఉంచడం మనందరి కర్తవ్యం. చంద్రభాగ సజీవంగా ఉన్నట్టుగానే మనమందరం ప్రవర్తించాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే యువరాజుతో పాటు మనం కూడా అదే భ్రమలో జీవించాలి. 'బుద్ధి కర్మాణుసారిణీ' అని అన్నారు పెద్దలు. ఎంతటి వారలైనా కర్మ ఫలం అనుభవించక తప్పదు కదా ప్రభూ"

ఆచార్యుని పలుకులు ములుకులై మహాదేవుని అంతరంగాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.

"కానీ ఆచార్యా ! ఇలా ఎంతకాలం...?" మహదేవునిలో నైరాశ్యం

"కాలం చేసిన గాయం కాలమే మాన్పగలదు. మనం కేవలం నిమిత్తమాత్రులం, ప్రభూ...! ఎట్టి పరిస్థితుల లోనూ ఈ నిజం యువరాజుల వారికి తెలియరాదు.."

ఆచార్యుని మాటలింకనూ పూర్తికాలేదు.

అంతలో...మందిర ద్వారం వద్ద చిన్నగా అలికిడి.... తదుపరి కాస్త అలజడి.

శశిధరుడు మందిర ద్వారం చెంత అచేతనంగా పడి ఉన్నాడు.

దాచాలనుకున్న నిజం దాగలేదు. రాకుమారునికి తెలియకుండానూ ఆగలేదు.

తన చకోరి ఇక లేదన్న వాస్తవం యువరాజు హృదయం భరించగలదా....???

*    *    *    *    *

నిశ్శబ్దం కాటుక రంగు పులుముకుంది.

శశిధరుని శయ్యా మందిరంలో వెలుగు, చీకట్లు దోబూచులాడుతున్నాయి.

రేయి మూడవ యామం లోకి ప్రవేశించింది.

"శశీ..." సన్నని పిలుపు. శశిధరునికి చాలా ఇష్టమైన పిలుపది. నిదానంగా కళ్ళు తెరిచి చూశాడు.

ఎదురుగా తన ప్రియ మనోహరి చకోరి....!!!

"చకోరి...! వచ్చావా... నాకోసం వచ్చావా...!!" ఉద్వేగంతో అతడి మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.

"శశీ...నాతో వస్తావా...?"

"ఎక్కడికి...?"

"వలపు సీమకు"

"అదెక్కడుంది?"

"దిగంతాలకావల"

"ఎలా ఉంటుంది?"

"చాలా అందంగా..."

"నీకంటేనా...?"

"ఎంతో మిన్నగా..."

"ఏముందక్కడ..?"

"ఏo లేదని అడుగు....కుట్రలు-కుతంత్రాలు, ద్వేషం-మోసం, ఆజ్ఞలు-అనుమతులు, కట్టుబాట్లు - శాసనాలు, ఆరోపణలు- అపనిందలు... ఇవి ఏవీ లేని...ప్రేమ- అనురాగం, ఆప్యాయత- అనుబంధం, మనసు- మమత, ఆర్ద్రత -స్వచ్ఛతలకు మాత్రమే చోటున్న మనోహరమైన వలపు సీమయది. అన్నిటికన్నా మిన్నగా నీ ప్రాణప్రదమైన చకోరి ఉంది మరి! వస్తావా...?" ఆశగా పిలుస్తోంది. ఆమె మాట మంత్రంగా భాసిస్తోంది.

"అవశ్యం" శశిధరుని కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి.

"అయితే... రా మరి! రా.. త్వరగా.. త్వరత్వరగా..." చకోరి కవ్విస్తోంది.

యువరాజుకి అందకుండా పరుగులు తీస్తోంది.

యువరాజులో ఆమెను అందుకోవాలన్న ఆరాటం.

అతడికి అందకూడదని ఆమె ప్రయత్నం.

పరిగెడుతున్నాడతడు. పట్టుకు చిక్కడం లేదామె.

"రా...నాతో రా..." చేతులు చాచి ఆహ్వానిస్తోంది చకోరి.

"వస్తున్నా... నీ వెనకే వస్తున్నా" ఆయాసంతో రొప్పుతూ ఆన్నాడతడు.  

హఠాత్తుగా అదృశ్యమై పోయింది చకోరి. అతడు ఉన్మత్తుడే అయిపోయాడు.

"చకోరీ... చకోరీ..." ఉన్మాదంతో కేకలు పెడుతున్నాడు.

"ఇక్కడ..."

శిరస్సు పైకెత్తి చూసాడు. వసంత మండపం పై అంతస్తు నుండి రమ్మని స్వాగతిస్తోంది చకోరి.

"వలపుసీమ...మోసం... ప్రేమ... ద్వేషం... అనురాగం... కట్టుబాట్లు... స్వేచ్ఛ..." చకోరి మాటలు అతడి చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి.

"శశీ...నా శశీ, రా..."

ఆమె ఆహ్వానిస్తోంది, అర్థిస్తోంది, ఆక్రోశిస్తోంది.

అతడి మస్తిష్కం మొద్దుబారిపోయింది, తనువెల్లా మైకం కమ్ముకుంది.కళ్ళు మూతలు పడుతున్నాయి, అవయవాలను బలవంతంగా స్వాధీనం లోనికి తెచ్చుకొని ఆమె వెనుక పరుగుతీస్తూ వసంత మండపం పై అంతస్తు చేరుకున్నాడు.

నవ్వుతూ పిలుస్తోంది చకోరి. తెరలు తెరలుగా నవ్వుతోంది. గుండెలవిసిపోయేలా... శరీరం జలధరించేలా... పడి పడి నవ్వుతోంది. ఉండుండి వికృతంగా ఏడుస్తోంది.

అతడికి అంతా అయోమయంగా ఉంది.

స్వప్నానికి, వాస్తవానికి మధ్య అతని హృదయము ఊగిసలాడుతోంది. తెలివికి, ఉన్మాదానికి మధ్య అతడి తనువు వగరుస్తోంది.

అకస్మాత్తుగా చకోరి నవ్వు ఆగిపోయింది. అతడిలోని ఉన్మాదం తారాస్థాయికి చేరుకుంది. మండపం సూక్ష్మకుడ్యoపై ఉంది చకోరి.

అతను చూస్తూ ఉండగానే పట్టు తప్పి జారి పోయింది.

గబగబా ముందుకు వచ్చి చూసాడు శశిధరుడు. చకోరి శరీరం గాలిలో అలా... అలా.. తేలుతూ క్రిందనున్న చంద్రకాంత తిన్నె వైపు సాగిపోతోంది.

ఆమెను అందుకోవాలని అడుగు ముందుకేసాడు.

కాళ్లు పట్టు తప్పాయి. వసంత మంటపం పై అంతస్తు నుండి అతడి శరీరం తూలి పడింది.

ఒక్క క్షణం నిశ్శబ్దం... ఆ మరుక్షణం ఓ వికృతమైన ఆర్తనాదం... మళ్లీ అంతలోనే భయంకరమైన నిశ్శబ్దం.

తీతువు పిట్ట రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరిపోయింది.

చంద్రకాంతశిలా తిన్నెపై శశిధరుని శరీరం నిర్జీవంగా ఒరిగిపోయింది.

*    *    *    *    *

వసంతమంటపం....

చంద్రకాంత శిలా తిన్నెపై చకోరి, శశిధరులు వెల్లకిలా పరుండి వినీల, నిర్మల గగనంవైపు దృష్టి సారించి చూస్తున్నారు.

"నువ్వు చకోరివి, నేను శశి(వెన్నెల)ని. శశిని త్రావక చకోరి మనలేదు, చకోరిని కానక శశికి జీవం లేదు. మన అజరామరమైన ప్రేమకు మరణం లేదు...రాదు"

అతడు గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆమె గువ్వలా ఒదిగిపోయింది. అతడు పరిహాసమాడాడు. ఆమె కిలకిలా నవ్వింది.

ఇప్పుడు ఏ నిశిత దృక్కులకూ వారి ఉనికి చిక్కదు. కారణం...ఆ ఆత్మీయ సమాగం రెండు తనువులది కాదు...రెండు ఆత్మలది.

రాచరికపు కట్టుబాట్లు, అధికార వ్యామోహాలు, కసాయి మనసుల కఠిన నిర్ణయాలు, ఇవేవీ ఆ ఆత్మలను ఇక శాసించలేవు.

ఆ ప్రణయమూర్తుల అమర ప్రేమకు చెమ్మగిల్లిన కళ్లతో నేను అంజలి ఘటిస్తున్నాను. మరి మీరు....?

- కిరణ్ కుమార్Rate this content
Log in

More telugu story from Kiran Kumar

Similar telugu story from Drama