STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Inspirational Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Inspirational Children

పంటికింద రాయి

పంటికింద రాయి

1 min
52

పంటి కింద రాయి

**********************

వేణుగోపాలరావు గారు వృత్తిరీత్యా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు అయినప్పటికీ తెలుగు భాషాభిమాని. తెలుగు భాష మీద మక్కువ పెంచుకున్న ఆయన రోజూ సాయంత్రం పూట పిల్లలందరినీ కూర్చోబెట్టి నుడికారాలు, లోకోక్తులు భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయంటూ సామెతల కథలు, పొడుపు కథలు చెప్తారు.  తెలుగుభాష మీద మమకారం పెంపొందించడం కోసం ఆట, పాట, మాటలతో కృత్యాలు చేయిస్తారు. అందులో భాగంగా మా తెలుగుతల్లికి మల్లెపూదండ మొదలగు గేయాలు పిల్లల చేత పాడిస్తారు. ఉక్త లేఖనం చెప్పి రాయిస్తారు. గేయాలు రాగయుక్తంగా పాడక పోయినా, ఒత్తులు దీర్ఘాలు సరిగ్గా పలక లేకపోయినా, రాసేటప్పుడు అక్షరదోషాలు ఉన్నా ‘పంటికింద రాయిలా’ ఉంది అనేవారు. పంటికింద రాయంటే ఏమిటో అర్థం కాలేదు పిల్లలకు. హాసిని ధైర్యం చేసి “మాష్టారు పంటి కింద రాయి అంటే ఏమిటి?” అని అడిగింది.


“పూర్వం రోజుల్లో కందులు, పెసలు మొదలైనవి పండించి, ఆ పంటను పొలం నుంచి ఇంటికి తెచ్చేవారు. ఇంటి దగ్గర దినుసులను చేటతో చెరిగి, జల్లెడతో జల్లించి శుభ్రం చేసేవారు. అవసరాల నిమిత్తం ఇంట్లో వాడుకునేవారు.


 ఒకసారి పండుగ సందర్భంగా ఒక ఇల్లాలు పప్పు వండి, ఇంట్లో వాళ్లందరికీ వడ్డించింది. ఎంతో ఇష్టంగా అందరూ తింటూ ఉండగా ‘పంటి కింద రాయి’ పడి కరేల్ మనడంతో చిరాకుపడ్డారు. “పప్పులో రాళ్ళు ఉండిపోయాయే” అని ఆవిడ ఎంతో బాధపడింది. అప్పటినుంచి పంటి కింద రాయి అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. 


పప్పులోని రాయి పంటి కింద పడి, తినడానికి ఎలా చిరాకనిపించిందో, అలాగే ఉచ్ఛారణ దోషాలు, ముద్రారాక్షసాలు లేదా అక్షర దోషాలు

వినడానికి, చదవడానికి విసుగుని కలిగిస్తాయి. భాషా సౌందర్య విలువను తగ్గిస్తాయి. మధురమైనది మన తెలుగుభాష, తేనెలొలుకు భాష మన తెలుగు భాష. అజంత భాష మన తెలుగు భాష. అన్య భాషల కన్న అమ్మ భాషే మిన్న” అని వివరించారు మాష్టారు. నాటి నుంచి సాధన చేసి పలకడంలో, రాయడంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు పిల్లలు. అమ్మదనం నిండిన కమ్మనైన తెలుగును మెరుగు పరచుకున్నారు.


(ప్రజాశక్తి చిన్నారి లో 31-8-2024 న ప్రచురితమైంది)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational