Varun Ravalakollu

Drama

4.9  

Varun Ravalakollu

Drama

నాతిచరామి

నాతిచరామి

6 mins
568


“మామయ్యా! నాకు విడాకులు కావాలి” అంటూ, సుడిగాలిలా లోపలకు దూసుకు వచ్చింది శిరీష . అంతవరకూ వంటింట్లోంచి వస్తున్న ఘుమఘుమలను ఆస్వాదిస్తూ, ముందు రోజు జరిగిన స్లిప్ టెస్టు తాలూకు ఇంగ్లీష్ పేపర్లు దిద్దుకుంటున్న నేను, తలెత్తి చూసి నిర్ఘాంతపోయా . సాక్షాత్తూ నా మేనకోడలు చి ॥ ల॥ సౌ॥ శిరీష, మొహం చింతాకంత చేసుకుని విసవిసా నడుస్తూ నాకు దగ్గరగా వచ్చింది. ఒక్కసారిగా తల తిరిగినట్లయ్యింది నాకు.

శిరీషకు పెళ్ళయ్యి ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఈ ఉత్పాతం ఏమిటి! నాకు నోట మాట రాలేదు, స్తబ్దంగా ఉండిపోయా. కాని నా తలలో అలజడి మొదలయ్యింది ... !

“తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల! ఈనాడు ఈ జంటకు రాసి ఉంచాడు విధి ఎప్పుడో! ” అంటూ, వాళ్ళ పెళ్లి రోజున కల్యాణ మండపంలోని మైకులో వచ్చిన పాట ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది! “శిరీష వెడ్సు శ్రీనివాస్” అన్న, అరుతూ వెలుగుతూ మెరిసే కరెంట్ బల్బులతో తయారు చేయబడ్డ వెడ్డింగ్ బేనర్ నా కళ్ళ ఎదుట ఇంకా తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నట్లే ఉంది! అప్పుడే ఈ ఉపద్రవమేమిటి?!

శిరీష చూస్తే ఇప్పుడు ఉట్టిమనిషి కూడా కాదు, త్వరలోనే తల్లి కాబోతోంది! ఈ ఉదయమే శిరీష మామగారు, నాకు రైతుబజారులో కనిపించి శుభవార్త నా చెవిలో వేశారు. ఎంతో సంతోషంగా. నేనా మాటను ఇంటికి రాగానే నా భార్యకు చెప్పా. వెంటనే ఆమె ఏవేవో పిండివంటలు చెయ్యడం మొదలుపెట్టింది. ఈ వేళ ఆదివారం నాకు సెలవు రోజు కనుక, సాయంకాలమే ఇద్దరం వెళ్లి శిరీషను చూసి రావాలన్న ప్లానుతో ఉన్నాము. ఇల్లంతా వ్యాపించిన ఘుమఘుమలు ఆ పిండివంటలవే.

శిరీష నాకు దగ్గరగా వచ్చి, “ఏమిటి మామయ్యా? నా మాటలు నీకు వినిపించనే లేదా” అంటూ బుజం పట్టి కుదిపేసరికి, నా ఆలోచనలకు గండిపడింది. నేనవి పక్కనపెట్టి, ఆమెవైపు చూస్తూ, “రామ్మా సిరీ! రా, కూర్చో. ఒంట్లో కులాసాగా ఉంటోందా? పొద్దుట కనిపించి మీ మామగారు చెప్పారులే శుభవార్త! కంగ్రాట్యులేషన్సు” అంటూ ఆమెను ఆహ్వానించి, శుభాకాంక్షలు చెప్పి, కుశలమడిగా.

శిరీష సోఫాలో చతికిలపడి, రెండు చేతులతో మొహం కప్పుకుని ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి భరించలేకపోయా. లేచి వెళ్ళి ఆమె పక్కన సోఫాలో కూర్చుని, సముదాయింపుగా ఆమె తల నిమురుతూ, “ఎందుకురా అంత దు:ఖం? అసలు నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాము. అంతేగాని నువ్వలా నిస్సహాయంగా ఏడవడం ఏమీ బాగాలేదు” అన్నా. అంతకన్నా ఆమెను ఓదార్చే విధానం ఏముందో నాకు తెలియలేదు.

***

గంగాధరం గారు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారు లందరిలోనూ మోతుబరి! ఏభై ఎకరాలు ఏక ఖండంగా ఉన్న మాగాణీని, తనకు పెద్దల్లుడైన మేనల్లుడితో కలిసి, ట్రాక్టర్ సాయంతో వ్యవసాయం చేసున్న భూకామందు. ఆయనకి నలుగురు ఆడపిల్లల తరవాత, కడసారం అపురూపంగా పుట్టిన ఏకైక పుత్రుడు శ్రీనివాసు. గంగాధరంగారికి చదువు మీద అంతగా గురి లేకపోయినా, గారాల కొడుకుని మాత్రం, అతని కోరికపై పక్క ఊరిలో ఉన్న తెలుగుమీడియం కాలేజిలో చేర్పించి చదివించారు. శ్రీనివాసు శ్రద్ధగా చదివి డిగ్రీ తెచ్చుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది, ఆ తరవాత ఏమిచెయ్యాలి - అన్నదే పెద్ద సమస్యై కూచుంది వాళ్ళకి!

ఎండనక, వాననక ఏడాదీ శ్రమించడమన్నది, పుట్టింది రైతు కుటుంబంలోనైనా, శ్రీనివాసుకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. నీడపట్టున, కుర్చీలో కూర్చుని చేసీ ఉద్యోగ మే కావాలని పట్టుపట్టాడు. కాని, ఉద్యోగం పేరుతో తమకున్న ఒక్కగానొక్క కొడుకునీ పొరుగూరికి పంపడం అన్నది అతని తల్లికి సుతలాం నచ్చలేదు. కొడుక్కి దూరమై బ్రతకలేనని గొడవ పడింది ఆమె. దాంతో మధ్యేమార్గంగా, అతడు ఇన్నాళ్ళూ చదువుకున్న కాలేజీ ఉన్న ఊళ్ళోనే, సూపర్ మార్కెట్ ఒకటి తెరిపించి, దాని బాధ్యత అతనికి అప్పగించడం బాగుంటుంది - అన్న నిర్ణయానికి వచ్చారు వాళ్ళు.

అలా వెలిసింది ఆ ఊళ్ళో ఆ “సిటీ ఎంపోరియం”! చదువుకునీ రోజుల్లోలాగే ప్రతిరోజూ, శ్రీనివాసు తన బైక్ మీద అక్కడకు వెళ్ళి, పని చూసుకుని వస్తూంటాడు. ఆ చుట్టుపక్కల పన్నెండామళ్ళ పరిధిలో అటువంటి షాపు మరొకటి లేకపోవడంతో దానికి త్వరలోనే మంచిపేరూ, తోడనే మంచి లాభాలూ కూడా వచ్చాయి. జనానికి నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలే కాక కరివేపాకు మొదలు కంప్యూటర్ల వరకూ - అన్నీ ఒకేచోట దొరకడం అన్నది దాని విశేష లక్షణం కావడంతో, ఆ చుట్టుపక్కలవున్న చాలామందికి అది “ఫేవరెట్ షాపింగ్ ప్లేస్” అయ్యింది

అలా ఆ సిటీ ఎంపోరియం “మూడుపూలు ఆరు కాయలు”గా వర్ధిల్లుతూండగా ఒక రోజు మధ్యాహ్నం, ఒక అరడజనుమంది యువతులు కిలకిలా నవ్వుకుంటూ, వాళ్ళలో వాళ్ళు గలగలా మాటాడుకుంటూ సిటీ ఎంపోరియంకి వచ్చారు. ఉద్యోగ రీత్యా వివిధప్రాంతాలనుండి వచ్చిన ONGC ఆఫీసర్ల భార్యలు వాళ్ళు. అంతా చదువుకున్నవాళ్ళే కావడంతో , భాషా భేదం రాకుండా వాళ్ళంతా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నారు. అందులో ఎక్కువమంది కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ కూడా కావడంతో, వాళ్ళ ఇంగ్లీషు ఒకవిధమైన ప్రత్యేక యాసలో తమాషాగా, వినసొంపుగా ఉంది. .

సిటీ ఎంపోరియంలో కౌంటర్ల దగ్గర పనిచేస్తూన్నవాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళుకారు. పైగా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ఎప్పుడూ విన్నది కూడా కాకపోడంతో వాళ్ళు ఆ యువతులు అడుగుతున్న వస్తువులేమిటో గుర్తుపట్టలేకపోయారు. వెంటనే వెళ్లి ప్రొప్రైటర్ని పిలుచుకొచ్చారు.

శ్రీనివాసుకి వాళ్ళ యాక్సెంటు చాలాబాగా నచ్చింది. ఇంగ్లీషు భాష మీద అతనికి ఉన్న ప్రత్యేకమైన మక్కువచేత, డిగ్రీ క్లాసులో శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇంగ్లీషులో! కాని వాళ్ళ యాస అతనికీ కొత్తే! దాన్ని అర్ధం చేసుకోడం అతనికీ కష్టమయ్యింది. ఒకటికి రెండుమాట్లు చెప్పించి, ఎట్టకేలకు వాళ్ళకి కావలసిన వేమిటో అర్థంచేసుకున్నాడు అతడు. వాళ్ళకి అలంకరణ సామగ్రి - “కాస్మెటిక్సు” కావాలిట!

వెంటనే తనదగ్గర స్టాకులో ఉన్న“లాక్మే” వారి కాస్మేటిక్సు తీయించాడు శ్రీనివాసు. కాని వాళ్ళు తమకు “రెవలాన్” కాస్మెటిక్సు మాత్రమే కావాలన్నారు. రెవలాన్ ఫారిన్ కంపెనీ, ఖరీదు కూడా ఎక్కువే!

“ఓష్, అదెంతసేపుట! ఒక్క నాల్గురోజులు టైం ఇస్తేచాలు, ఎన్నికావాలంటే అన్ని, ఏవి కావాలంటే అవి తెప్పించి ఇస్తా ” అని చెప్పాలనుకున్నాడు శ్రీనివాసు. కాని అతనికి ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు అస్సలు లేదు. ఇంతవరకు అతడు మాతృభాష తప్ప మరో భాషలో మాటాడి ఎరుగడు. కాని ఇప్పుడు వాళ్ళకి తను జవాబు చెప్పి పంపాలి కదా! ఎలా?

అతని తలలో మేధోమధనం మొదలయ్యింది. ఇంతవరకూ తాను నేర్చుకున్న ఇంగీషంతా గుర్తుతెచ్చుకుని, మొత్తానికి ఎలాగైతేనేం చచ్చిచెడి, ఒక సింపుల్ సెంటెన్సు కూర్చి, తన అనుకున్నది వాళ్ళకు చెప్పగలిగాడు శ్రీనివాస్. నట్టుతో, తడుముకుంటూ మాట్లాడిన అతని ఇంగ్లీష్ యాక్సెంట్ వాళ్ళకు నవ్వు తెప్పించింది. అది మేనర్సు కాదని, అలలు అలలుగా తెర్లివస్తున్న నవ్వుని బలవంతంగా అణుచుకునీ ప్రయత్నం చేస్తూ వాళ్ళు అక్కడనుండి వెళ్ళిపోయారు. వారిలో ఒకామె మాత్రం ఆపుకోలేక కిసుక్కున నవ్వేసింది.

శ్రీనివాసుకి ఆ సన్నివేశంతో తలకొట్టేసినట్లయ్యింది. ఎలాగైనా, తన ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకుని, వాళ్ళలా తనూ కాన్వెంటు యాక్సెంట్ లో చకచకా అందరితోనూ ఇంగ్లీషులో మాటాడడం నేర్చుకోవాలి - అనుకున్నాడు గట్టిగా. ఆరోజు మొడలు ప్రతి వారాంతపు శలవురోజునా, తప్పకుండా నాదగ్గరకు వచ్చీవాడు ఇంగ్లీషు నేర్చుకోడానికి! పట్టుదలగా నేర్చుకుని త్వరలోనే తన ఇంగ్లీషుని బాగా ఇంఫ్రూవ్ చేసుకుని ఇంగ్లీషులో చక్కగా మాటాడసాగాడు. కాని అతను కోరుకున్న కాన్వెంట్ యాక్సెంటులో మాత్రం కాదు, అసలు సిసలు తెలుగువారి ఇంగ్లీషు యాక్సెంటులో! అంటే - నాలాగ అన్నమాట.

తెలుగు భాషను అక్షర రమ్యత గల భాష అంటారు అందరూ. ప్రతీ తెలుగుమాట “అజంతంగా”, అంటే - ఏదో ఒక అచ్చు శబ్దంతో ముగుస్తుంది. దాని వల్ల భాషకు ఒకవిధమైన నిండుతనం వచ్చింది. నిజమేగాని, పరాయి భాషలు మాట్లాడడానికి ఈ పద్ధతి పనికిరాదు. వాళ్ళ పధ్ధతి ఏమిటో తెలుసుకుని ఆ విధంగా మాటాడాలి కదా! అతనికి ఎలాగైనా కాన్వెంట్ యాక్సెంట్ నేర్చుకోవాలని ఉంది. కాని నాకూ రాదది! ఈ చుట్టుపక్కల మాకు తెలిసినవారిలో ఎవరూ కాన్వెంటులో చదివిన వాళ్ళులేరు. ఆ యాక్సెంట్ రావాలంటే అలా మాటాడే వాళ్ళ సాహవాసం చేసి మరీ నేర్చుకోవాలి గాని పుస్తకాల్లో చదివి నేర్చుకునేది కాదది!

***

నేనా ఊళ్ళో ఉన్న హైస్కూల్లో ఇంగ్లీషు టీచర్ గా పనిచేస్తున్నాను. మా అమ్మగారికి అనారోగ్యంగా ఉండడంతో, మా అక్క, కుటుంబ సమేతంగా, అమ్మను చూసివెళ్ళడానికని మా ఊరు వచ్చింది. మా అక్కకి ఒక కొడుకూ, ఒక కూతురూ ఉన్నారు. మా బావగారు ఒకప్పుడు ఢిల్లీలో బిజినెస్ చేస్తూ, తోటివారిచేత ఒక మంచి వ్యాపారవేత్త అనిపించుకున్నారు. కాని అకస్మాత్తుగా, సునామీలా ఈ ప్రపంచం మీద విరుచుకుపడ్డ “ఫైనాన్షియల్ డిప్రెషన్” వల్ల కూలిపోయిన కంపెనీల్లో ఆయనది కూడా ఒకటి కావడంతో, వాళ్ళు ఢిల్లీని విడిచిపెట్టి కోనసీమలో మారుమూల ఉన్న తమ స్వగ్రామానికి వచ్చిచేరారు. అక్కడ ఇప్పుడు ఆయన బ్రతుకుతెరువు కోసం కొబ్బరికాయల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళరోజులు సుమారుగా గడిచి పోతున్నాయి. ఒకప్పుడు ఎంతో భాగ్యవంతులనిపించుకున్నా ఇప్పుడుమాత్రం వాళ్ళది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం.

వాళ్ళ గ్రామంలో చదువు టెన్తుక్లాసు వరకే ఉంది. శిరీష ఢిల్లీలో ఉండగానే కాన్వెంటులో చదివి టెంతు క్లాసు పాసయ్యింది. కాని ఇప్పుడు ఆమెను పై ఊరుకి పంపించి, హాస్టల్లో ఉంచి పైచదువు చదివించగల స్తోమత లేక, ఆమె చదువును టెన్తు క్లాసుతోనే ఆపేశారు. కొడుకు చిన్నవాడు, చిన్నక్లాసు చదువుతున్నవాడు కనుక ప్రస్తుతానికి వాడు ఇంకా ఆ ఊళ్ళో ఉన్న హైస్కూల్లోనే చడువుకుంటున్నాడు. వాళ్ళకిప్పుడు దసరా సెలవులు కావడంతో అక్కని సకుటుంబంగా మాతో పండుగ వెళ్ళీదాకా ఉండమని అడిగాము మేము .

మా అక్కకూతురు, శిరీష పుట్టినదాది ఢిల్లీలోనే పెరిగి, పెద్దదయ్యింది. నాలుగేళ్ళు నిండగానే, కాన్వెంట్ లో ఎ బి సి డి లతో ఆమెకు అక్షరాభ్యాసం జరిగింది. అది మొదలు ఆమె చదువు ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగింది. ఆమెకు మాతృభాషా జ్ఞానం కంటే ఇంగ్లీషుభాషా పరిజ్ఞానమే ఎక్కువ అనడం అతిశయోక్తి కాదు.

చిన్నప్పటినుండి ఎత్తుకుని ఆడించిన మేనమామను కనక శిరీషకు నా దగ్గర చనవు ఎక్కువ. ఆవేళ ఏదో విషయం మీద నాతో వాదం పెట్టుకుంది శిరీష. ఇంగ్లీషులోనే సాగుతోంది మా సంభాషణ. సరిగా అప్పుడు వచ్చాడు నాకోసం శ్రీనివాస్ . కాన్వెంట్ యాక్సెంట్ లో ఇంగ్లీషు చకచకా మాట్లాదేస్తున్న శిరీషను ఆశ్చర్యంగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయాడు. అతడ్ని చూడగానే నే నతనిని లోనికి ఆహ్వానించి, కూర్చోమని సోఫా చూపించి శిరీషను అతనికి పరిచయంచేశా. పట్నంలో పెరిగిన శిరీష అతనికి అరమరికలు లేకుండా “హాయ్” చెప్పి, షేక్ హాoడ్ ఇచ్చి అక్కడే ఉండిపోయింది. మా సంభాషణ మధ్యలో కల్పించుకుని అతనితో చనువుగా మాటాడింది. ఆమె అదిరిపోయే కాన్వెంట్ యాక్సెంటులో ఇంగ్లీషు మాటాడుతూంటే, అతడు ఆమెతో తిరిగి ఇంగ్లీషులో మాటాడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తనకు కావలసిన పుస్తకం తీసుకుని , ఎక్కువసేపు మాతో ఉండకుండానే వెళ్ళిపోయాడు.

మరి రెండు రోజులు గడిచిపోయాయి. పండుగను అందరం కలిసి చేసుకోవాలని మా అమ్మకోరడంతో, మా బావగారు కూడా వచ్చి ఉన్నారు. ఆ రోజు విజయదశమి. మధ్యాహ్నం అందరం హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూండగా, నెమ్మదిగా గుమ్మాలెక్కి లోపలకు వచ్చారు మా ఊరి పురోహితులైన శంకర శాస్త్రిగారు. వెంటనే నేను లేచి, ఎదురెళ్ళి ఆయన్ని మర్యాదగా లోనికి ఆహ్వానించా . పరిచయాలు అయ్యిన తరవాత వచ్చినపని ఏమిటో నన్నుద్దేసించి చెప్పారు ఆయన ...

“అయ్యా! నన్ను గంగాధరంగారు పంపించారు, పెళ్లి మాటలు మాటాడి రమ్మని! మీ మేనకోడలికి వాళ్ళ అబ్బాయికి ఈడూ జోడూ బాగుంటుందనీ, మీకు సమ్మతమైతే సంబంధం మాట్లాడడానికి, మంచిరోజు చూసుకుని వస్తామని చెఫ్ఫమన్నారండి” అన్నాడు ఆయన.

***


Rate this content
Log in

Similar telugu story from Drama