Varun Ravalakollu

Drama

4.6  

Varun Ravalakollu

Drama

నాతిచరామి -3

నాతిచరామి -3

7 mins
578


"సిరీ! నేను చెప్పీది కొంచెం శ్రద్ధగా విను, నీకే అర్థమౌతుంది. మనసు కోరితే మార్గం దొరక్కపోదు! నువ్వు మహా నగరమైన డిల్లీలో పుట్టి పెరిగిన దానవు. కనుక నీ వేషభాషలు వీళ్ళకి భిన్నంగా ఉండడంతో వీళ్ళు నిన్నొక ఫారినర్ని చూసినట్లు చూస్తున్నారు. ఇదివిను, ఇప్పుడొక మనిషికి కిడ్నీట్రాన్సుప్లాంటేషన్ జరిగినప్పుడు ఆ వ్యక్తీ శరీరం కొత్తగా వచ్చిన కిడ్నీని వెంటనే ఆదరంగా చూడదు. పాత కిడ్నీకి కొత్తకిడ్నీకి మధ్య సామరస్యం కుదరాలంటే, దానికి చాలాకాలం పడుతుంది.కొత్తగా అత్తింటికి వచ్చిన కోడలి పరిస్థితీ అదే! వేష భాషలో తేడా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. "బి ఎ రోమన్ ఇన్ రోం" అన్నమాట ఊరికే పుట్టలేదు. నువ్విలా పాంటు, టి షర్టు, సల్వార్ కమీజు లాంటివి కాకుండా చీర కట్టుకుని; జుట్టు విరబోసుకుని ఉండకుండా చక్కగా వాలుజడ వేసుకుని; కాటుకా, బొట్టూ, పూలూ పెట్టుకుని ఇక్కడి పిల్లలందరిలాగే ఉంటే, వాళ్ళు నిన్నంతలా ప్రత్యేకంగా చూసీ వాళ్ళు కారు. ఇక మీ అత్తగారి విషయానికి వస్తే, ఆమె సనాతన సాంప్రదాయంలో పుట్టి, పెరిగినావిడ! మడి, ఆచారం అన్నవి ఆమెకు చిన్నప్పటినుండీ అలవాటైనవి. నీకు, ఆమెకు కొంతైనా సాయపడాలనిపిస్తే, నువ్వేమీ మడికట్టుకోవలసిన పనిలేదు. పదిమంది మసిలే అలాంటి ఇంట్లో మడి లేకుండా చేసీ పనులుకూడా చాలానే ఉంటాయి, అవి చెయ్యొచ్చు నువ్వు.

ఇంక ఆ చిన్నపిల్లల సంగతంటావా .... వాళ్ళలా నిన్నే చూస్తూ స్తంభాల చాటున దోబూచు లాడుతున్నారంటే, వాళ్ళు నీ పరిచయం కోసం తహతహలాడుతూన్నారని అర్థం. ఒక్కసారి వాళ్ళను నువ్వు దగ్గరగా పిలిచి, ఒక కథో, కాసిని కబుర్లో చెప్పి చూడు - ఇక వాళ్ళు నీకు "ఫేన్సు" గా మారిపోతారు! ఆ పైన నీ మాటే వాళ్ళకి వేదం ఔతుంది."

"నిజమా మామయ్యా?" కళ్ళు విశాలం చేసుకుని ఆత్రంగా అడిగింది శిరీష .

" కాసేపు విడాకుల సంగతి పక్కనపెట్టి, ఒకసారి నేను చెప్పినవి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. అంతలో పోయేదేం లేదు కదా. అప్పటికీ ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం విడాకులసంగతి, సరా?"

"మంచి జీవితం దొరికితే, విడాకులెందుకు మామయ్యా!"ఋమాలుతో కళ్ళు తుడుచుకుంది శిరీష.

: 'గుడ్! నువ్వు నాకు నచ్చావు! మీ అత్తగారి బాధను నువ్వుకూడా కొంచెం అర్థంచేసుకోవాలి. ఆమె పాతకాలపు మనిషి. ఆమె దృష్టిలో బొట్టు, పూలు, గాజులు లాంటివన్నీ సుమంగళీ చిహ్నాలు. వాటిని తీసేస్తే నీ భర్తకు ఆయుశ్శు తరిగిపోతుందని ఆమె నమ్మకం. నీ దృష్టిలో అవి కేవలం అలంకరణ సామగ్రి! చూడు ఇద్దరి దృక్పధంలోనూ ఎంత తేడా ఉందో! ఊళ్ళో అంతా ఆమెను ఎంతో మంచి ఇల్లాలు, సాక్షాత్తు అన్నపూర్ణ - అంటారు తెలుసా! నువ్వామెను కష్టపెట్టకుండా, ఆమెకు ఇష్టమయ్యేలా మసులుకుంటే, ఆమె నిన్ను ప్రాణంగా చూసుకుంటుంది . ఒకటి మనం కావాలనుకుంటే వేరొకటి ఇవ్వక తప్పదమ్మా! ఈ ప్రపంచ మంతా "బార్టర్ సిస్టమ్" ఆదారంగా చేసుకునే నడుస్తోంది! ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోడమే సబవు! భగవంతుడికి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఆయన దయని కోరి ముడుపులు చెల్లిస్తారు భక్తులు!

నువ్వు ఉట్టిమనిషివి కూడా కావు కదా! ఇప్పుడు నువ్వు పొరపాటున తప్పటడుగు వేసినా, రేపు దాని ప్రభావం, మీ బిడ్డపైన పడుతుంది. ఒక బిడ్డ పుట్టి పెరిగి వృద్ధిలోకి రావాలంటే తల్లితండ్రుల సమిష్టి కృషి ఉండాలి. ఈ విషయం నువ్వు కొంచెం ఆలోచించి చూడు. ఆ తరవాత అవసరాన్నిబట్టి మనం ప్రొసీడవుదాం, ఏమంటావు?"

" అలాగే మామయ్యా! ఇప్పుడప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా మా అమ్మా నాన్నలకి. "

"అలాగే! అది సరేగాని, మీ శ్రీవారి సంగతేమిటి? అతడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా? అతనిగురించి ఏమీ చెప్పావు కావేం?"

శిరీష కొంచెం సేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు మళ్ళీ వర్షించ సాగాయి. శిరీష పడుతున్న బాధ చూడలేకపోయా. నాకు మా అక్కమీద చాలా కోపం వచ్చింది. పిల్లలు తప్పుదారి తొక్కితే పెద్దాళ్ళు మందలించి సరైన దారికి మళ్ళించాలి. అలాంటిది పెద్దవాళ్ళే తప్పుచేస్తే!? పట్నం పిల్ల సిరి, పల్లెటూరి జనంతో సద్దుకోవడం కష్టమంటే, "అడవి ఉసిరికాయ, సముద్రపు ఉప్పూ కలిసి ఊరగాయ అవ్వడం లేదా?" అంటూ నా నోరు మూయించింది! కూతురు పరిస్థితి చూసి ఇప్పుడేం జవాబు చెపుతుందో చూడాలి - అనుకున్నా.

శిరీష కళ్ళు తుడుచుకుని మాట్లాడడం మొదలుపెట్టింది, " శ్రీని మొదట్లో కొన్నాళ్ళు బాగానే ఉండేవాడు! ఆ తరవాత నన్ను పట్టించుకోడమే మానేశాడు. ఇప్పుడు అసలు తనతో ఎక్కడకీ తీసుకెళ్ళడంలేదు. నెలకొక్క సినిమా చూడడమే బ్రహ్మాండమైపోతోంది! నాకీ లైఫ్ టోటల్గా బోరు కొట్టేస్తోంది మామయ్యా! ఎవరూ పలకరించరు, ఎవరూ నాతో మాటాడరు. అందరూ ఎడం ఎడంగా, నన్ను తప్పించుకుని తిరుగుతున్నారనిపిస్తుంది. సరదాగా కబుర్లు చెప్పుకోడానికి నాకొక్క స్నేహితురాలు కూడాలేదు ఇక్కడ!"

ఒక్క క్షణం ఆలోచించా. "సిరీ! నువ్వు, పిల్లలు నీకు దూరంగా ఉంటున్నారంటున్నావు కదా, మరి నువ్వు వాళ్ళకు దగ్గరగావెళ్ళి పలకరించి మాటాడావా ఎప్పుడైనా? ఒక్కసారి పరిచయమైతే చాలు, వాళ్ళు నీతో చక్కగా మాట్లాడుతారు. పల్లెటూరిజనం స్నేహశీలులమ్మా. దగ్గరగా వస్తే, నోరారా పలుకరిస్తే నువ్వేమనుకుంటావో, అసలు మాటాడుతావో లేదో - అన్న బెరుకు వాళ్ళనలా దూరంగా పట్టి నిలబెట్టి ఉంచుతోoదనిపిస్తోంది నాకు. ఒకసారి ట్రైచేసి చూడు."

"అలాగే" - అన్నట్లుగా సిరి తలతిప్పింది.

"గుడ్! నువ్వు లోపలకువెళ్ళు, మీ అత్తయ్య నీకోసం ఏవేవో వండుతోంది ! ఇంతకీ, నువ్విలా వస్తున్నట్లు ఇంట్లో చెప్పివచ్చావా?"

శిరీష గతుక్కుమంది, "లేదు మామయ్యా! ఎవరికీ చెప్పాలనిపించలేదు" అంది.

"తప్పమ్మా!నువ్వు చాలా పెద్ద తఫ్ఫు చేశావు. ఈ సరికి వాళ్ళు నీకోసం వెతుకుతూ ఉండివుంటారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, మనవల్ల తప్పు ఉన్నప్పుడు, మనమే ముందుగా "సారీ" చెప్పడం బాగుంటుంది. "సారీ" అన్నది ఒక గొప్ప మేజిక్ వర్డు! ఆ చిన్నమాటతో, ఎదుటి వాళ్ళు మన తప్పును మరిచిపోతారు."

" సరే మామయ్యా! నువ్వు చెప్పినవన్నీ పాటించి చూస్తా"అంది సిరి తల వంఛుకునే.

"నువ్వు అత్తయ్య దగ్గరకు వెళ్ళు. నీకోసమే చేస్తోంది ఏవేవో. వేడిగా తిందువుగాని. ఈ లోగా నేను వెళ్ళి మీ మామగారికి ఫోనుచేసి, నువ్వు ఇక్కడ వున్నావని చెప్పివస్తా" అంటూ సిరిని లోపలకు పంపి నేను టెలిఫోన్ బూత్ కి బయలుదేరా గంగాధరంగారింటికి ఫోన్ చెయ్యడానికి.

* * *

నేను ఫోన్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ పేపర్లు దిద్దడానికి కూచున్నా. కాని ఏకాగ్రత కుదరలేదు. ఇక నావల్ల కాదనిపించి, ఆ పని ఆపి పేపర్లని సద్దేస్తూంటే, "సార్! సిరి వచ్చిందా ఇక్కడికి" అని అడుగుతూ ఆదుర్దాగా లోపలకు వచ్చాడు శ్రీనివాసు. అతని ముఖమంతా దిగులుతో నిండి ఉంది. " శిరీష ఇక్కడ లేదు" అన్నమాట ఎక్కడ వినాల్సొస్తుందోనన్న భయం అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

నేను, " వచ్చింది" అని అర్థం వచ్చేలా తలతిప్పి సైగచేశా. వెంటనే అతని ముఖం తేటపడింది.

ఈ భార్యా భర్తల బంధం ఎంత విచిత్రమైనది! మనసులు కలిస్తే ఒకరికొకరు సర్వస్వం అవుతారు!. అదే మనసులు వ్యతిరేకిస్తే, పరమపదసోపానపఠంలో పెద్దపాము నోట్లో పడ్డ పావుల్లా మళ్ళీ స్క్వేర్ వన్ కి చేరుకుంటారు. ఇక విడాకులతో ఒకరికోకరు పరాయివారుగా మారిపోతారు కదా! - అనుకున్నా బాధగా. వాళ్ళమీద జాలితో నిండిపోయింది నా మనసు.

అతన్ని లోనికి ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించా. ఆ తరవాత కొంతసేపు ఏమీ మాటాడుకోలేదు మేము. అతని భావోద్వేగం తగ్గి, కుదుటపడ్డాక, మరి ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే, "శిరీష నీనుండి విడాకులు కావాలంటోందోయ్" అన్నా.

అదిరిపడ్డాడు మానవుడు. "న్నో" అంటూ పెద్ద కేక పెట్టాడు. "నేను ఒప్పుకోను, అలాగైతే మా కుటుంబం పరువు ఏమైపోవాలి" అని అడిగాడు శ్రీనివాసు కంఠశోషగా.

"నీకు మీ ఇంటి పరువు మాత్రమే కాదు, నీ భార్య సుఖశాంతులు కూడా ముఖ్యమే అని నీకు అనిపించి ఉంటే, ఇప్పు డిలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. తాళి మెడలో పడగానే, అంతవరకూ ఏ పరిచయమూలేని వ్యక్తి చిటికినవేలు పట్టుకుని, ఒక అమ్మాయి అతనివెంట నడిచి, ఇంతకిముందు ఏమీ తెలియని ప్రదేశానికి వస్తోందంటే, ఆమె అతని మీద ఎంత నమ్మకం ఉంచుకుందో అంచనా వెయ్యగలవా? కంచే చేను మేసిందన్నట్లుగా, ఆ భర్తే ఆమెను పట్టించుకోకుండా ఇబ్బందిపెడితే ఆమె ఏమైపోవాలి?

తనభార్యకు ఏంకావాలి ; ఆమె ఆశలు, ఆశయాలు ఏమిటి; ఏమి చేస్తే ఆమె సంతోషిస్తుంది - లాంటివేమీ పట్టించుకోకుండా, భర్త - తన దారిన తాను బ్రతికేస్తూంటే, ఆమెనింక అత్తవారింట్లో ఎవరు పట్టించుకుంటారు చెప్పు? శిరీష పరిపూర్ణ వ్యక్తిత్వం గల వనిత! పట్నవాసపు పద్ధతులకు పూర్తిగా అలవాటుపడినది. ఆమెను వారానికో రెండువారాలకో ఒకసారి సినిమాకు తీసుకెళ్ళడం, నీ స్నేహితుల ఇళ్ళకు మీరిద్దరూ కలిసి వెళ్ళడం, అప్పుడప్పుడు "సైట్ సీయింగ్" పేరుతో సరదాగా మీ ఇద్దరూ ఎక్కడకైనా వెళ్ళి కొద్దిరోజులు ఏకాంతంగా గడిపి రావడం లాంటివన్నీ మీ దాంపత్య జీవితానికి బూష్టు నిస్తాయి! శిరీష పట్నం పిల్ల. ఆమె కిలాంటివన్నీ కావాలి. ఆమె కోరికలు తీర్చాల్సిన పూచీ నీదే కదా, ఎలా మరిచిపోయావు?"

"నిజమే సార్! నాకంత ఐడియా లేకపోయింది. క్షమించండి" అంటూ తల మరింతగా వంచేసుకున్నాడు శ్రీని.

నిజానికి అతన్నలా నిలదీసి అడిగే హక్కు నాకు లేదు. కాని అతనికి చదువు నేర్పిన గురువుగా నేనా చొరవ తీసుకున్నా, ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబడాలన్నకోరికతో! తన శతకంలో వేమన చెప్పిన నీతి గుర్తువచ్చింది, "బుద్ధిచెప్ప గురువు గ్రుద్దితేనేమయా ... !"

ఎలాగైనా శిరీషాశ్రీనివాసుల కాపురాన్ని చక్కదిద్దాలన్న సత్సంకల్పం తప్ప నాకు మరో ఆలోచన లేదు. " మొదట్లో కొన్నాళ్ళు నువ్వు ఆమెను నీ స్నేహితుల ఇళ్ళకు తీసుకెళ్ళీవాడివిట కదా, ఎందుకు ఇప్పుడది మానేశావు? అంతలో ఏమయ్యింది" అని అడిగా సూటిగా.

తలెత్తకుండానే జవాబుచెప్పాడు శ్రీని. "భర్త అంటే భరించేవాడనే అర్థం ఉన్నా, అతడు భరించలేని పరిస్థితులుకూడా కొన్ని ఉంటాయి కదా మాష్టారూ! శిరీష నా ఫ్రెండ్సుతో చనువుగా మాటాడుతూ, షేక్ హాండు ఇస్తూ, ఏ అరమరికలూ లేకుండా మసిలేది. దాంతో వాళ్ళు నన్ను అసలు పట్టించుకోడం మానేసి, బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లా, ఆమె చుట్టూ మూగేవారు. నాకది నచ్చలేదు. అది మావాళ్ళెవరి కళ్ళా బడకముందే ఆపెయ్యాలనిపించింది. ఆ తరవాత ఆమెను ఫ్రెండ్సు ఇళ్ళకు తీసుకుని వెళ్ళడం మానేశా. అది తప్పంటారా మాష్టారూ?"

ఠక్కున జవాబుచెప్పా. "తపా, తప్పున్నరా! ఇంకా నెమ్మదిగా అడుగుతున్నావా? దానివల్ల శిరీష మనసు ఎంత గాయపడిందో నీకు తెలుసా? ఆమె కాన్వెంట్ యాక్సెంట్ కి మురిసిపోయి నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, బాగానేవుంది!. కాని, నువ్వు ఆ కాన్వెంట్ చదువువల్ల ఆమెకు అబ్బిన మిశ్రమ సంస్కృతిని గురించి ఆలోచించ లేదు. ఆమెలో నీకు నచ్చని విషయాలు ఉంటే "ఇక్కడి పద్ధతులు ఇవి కావు" అని నువ్వు ఆమెకు మృదువుగా వివరించి, నచ్చచెప్పాల్సింది. నువ్వలా చెప్పి ఉంటే ఆమె నీమాట కాదనేది కాదని నా గట్టి నమ్మకం!..."

కొత్తగా కాపరానికి వచ్చిన కోడలు అత్తవారింటి పద్ధతులకు అలవాటుపడి, వాళ్ళలో ఒకతెగా మసలడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కసారి కనక సామరశ్యం కుదిరిందంటే, ఆ తరవాత ఇక ఏ గొడవా ఉండదు. అంతవరకూ దానికి నీ సహకారం అవసరమవుతుంది. సరిగా అర్థం చేసుకోవాలి నువ్వు. సిరి ఇప్పుడు ఉత్తిమనిషి కూడా కాదు కదా! ఆమె క్షోభ పడితే, దాని ప్రభావం ఆమెకు త్వరలో పుట్టబోయే బిడ్డ మీద కూడా పడుతుంది. ఆమె సంతోషంగా ఉండేలా చూసుకునీ పూచీ ముఖ్యంగా నీ మీద ఉంది. ఆపైన నీ ఇష్టం!"

" మీరు చెప్పిన మాటలు తప్పక గుర్తుపెట్టుకుంటా సార్! కృతజ్ఞుణ్ణి" అన్నాడు శ్రీని తలెత్తి నావైపు చూస్తూ. .

"మామయ్యా! ఎంతో అనుభవంతో నువ్వు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు! మేమిద్దరమూ నీ సలహాలను తప్పక పాటిస్తాము" అంది శిరీష వెనకనించి, ఆమె అక్కడకి ఎప్పుడు వచ్చిందోగాని!

"మేమిక వెళ్ళేదా మాష్టారూ" అంటూ లేచాడు శ్రీనివాసు. అతనిపక్కకు వచ్చి నిలబడింది శిరీష.

"క్షేమంగా వెళ్ళిరండి. మీరిద్దరూ ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది, అది, "నాతిచరామి" అని అం టూ మీ రిద్దరుచేసిన పెళ్ళీనాటి ప్రమాణం! సూక్ష్మంగా చెప్పాలంటే దాని తాత్పర్యం, "నీకు ఇష్టంలేని పని ఏదీ నేను చెయ్యను" అని చెప్పవచ్చు. పచ్చని పందిరి నీడలో, మంగళ వాయిద్యాలు హోరులో, పెద్దల సమక్షంలో నవదంపతులు ఒకరికొకరు, అగ్నిసాక్షిగా చేసుకునే ప్రమాణం ఇది! భార్యాభర్తలు దీనిని గుర్తుంచుకుంటే చాలు, భాష లో ఉన్న ఈ "విడాకులు" అన్న పదాన్ని తీసి అవతల పారెయ్యవచ్చు - అనిపిస్తోంది నాకు" అన్నాను చిరునవ్వుతో.

శిరీషా శ్రీనివాసు కూడా సిగ్గుపడుతూ నావైపు చూసి చిన్నగా నవ్వారు. ఆ తరవాత మా ఆవిడ అందించిన పిండివంటలతో ఉన్న కారేజీ తీసుసుకుని, చెయ్యీ చెయ్యీ కలుపుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

* * *

ఒకవారం గడువిచ్చి, పరిస్థితి ఎలా ఉందో చూద్దామని నేనూ, నా భార్యా గంగాధరంగారి ఇంటికి వెళ్ళాము. హాల్లో ఒక వారగా ఉన్న ఉయ్యాలాబల్ల మీద కూర్చుని ఊగుతూ, పెద్దాడపడుచు పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని, వాళ్ళతో కబుర్లు చెపుతున్న శిరీష, మమ్మల్ని చూసి లేచి వచ్చింది. గుమ్మంలోనే ఎదురుగా వచ్చి మమ్మల్ని లోనికి ఆహ్వానించింది శిరీష. ఆమె ఇదివరకులా జుట్టు విరబోసుకు తిరక్కుండా చక్కగా జడ అల్లుకుని పూలు పెట్టుకుంది. చీర కట్టుతో , నొసట బొట్టుతో ముచ్చటగా, అచ్చం పదహారణాల తెలుగింటి ఇల్లాలులా ముస్తాబైయ్యుంది. లేతనెలలు కావడంతో కొత్త అందాలతో, సరికొత్త కళలతో మెరిసిపోతున్న శిరీషను మేము వెంటనే గుర్తించలేకపోయాము. తనే ముందుగా మమ్మల్ని పలకరించింది ......

"హల్లో! అత్తయ్యా, మామయ్యా! రండి రండి" అంటూ సంతోషంగా మమ్మల్ని లోనికి ఆహ్వానించింది.

శిరీష ముఖంలోని ప్రశాంతత చూసి నా మనసు శాంతించింది. మేము తెచ్చిన బహుమతులు ఆమెకు అందించి, అక్కడున్న సోఫాలో కూర్చున్నాం. పక్కనున్న కుర్చీలో కూర్చుని మాతో కబుర్లు చెప్పసాగింది శిరీష. అంతలో గంగాధరంగారు మమ్మల్ని పలకరిస్తూ, అక్కడకు వచ్చారు. శిరీష , ఆయనను చూడగానే గౌరవ పురస్కారంగా లేచి నిలబడింది. గంగాధరంగారు వెంటనే ఆమెను వారించారు .....

"చూడమ్మా కోడలా! నువ్విప్పుడేం ఉట్టిమనిషివి కాదు. నువ్విలా చీటికీ మాటికీ, నేను కనిపించి నప్పుడల్లా లేస్తూ, కూర్చుంటూ గుంజీలు తీస్తూంటే, నా మనవడికి కోపం వస్తుంది. ఆ తరవాత ఏమనుకునీ ఏం లాభం ఉండదు. ఇక నేను ఎప్పుడు ఎత్తుకున్నా, వాడు నా బట్టలు తడిపేసి, నన్నుచూసి ఓ బోసినవ్వు నవ్వి వాడి కసి తీర్చుకోగలడు! నువ్వలా అస్తమానూ లేవొద్దు తల్లీ" అన్నారు ప్రేమగా, సగం నెరిసిన బుర్రమీసాలచాటునుండి ముసిముసి నవ్వులు తొంగిచూస్తూండగా.

అందంగా సిగ్గుపడింది శిరీష. నా భార్య నర్మగర్భితంగా నావైపు చూసి చిరునవ్వు నవ్వింది.

ఇంతలో, "అమ్మా సిరీ! ఇటురా. మీ అత్తయ్యా, మామయ్యా మనల్ని చూడాలని వచ్చారు కదా, వాళ్ళకి నువ్వు మంచినీళ్ళైనా ఇచ్చవా? ఇదిగో, ఇవి పట్టుకెళ్ళి పెట్టు, ఎప్పుడు భోంచేశారో ఏమో! నేను కాఫీ కలిపి తెస్తా" అంటూ లోపలనుండి శిరీషను పిలిచింది అత్తగారు. ఆమె కంఠంలో వినిపించిన ప్రేమ తాలూకు జీర నాకు సంతృప్తి నిచ్చింది. నా మనసు ఆనందంతో పులకించింది. చిన్నచిన్న సద్దుబాట్లు ఎంతటి అగాధాలనైనా ఇట్టే పూడ్చి, అంతులేని ఆనందాన్ని అందించగలవన్న నిజం మరోసారి ఋజువయ్యింది.

                  *******



Rate this content
Log in

Similar telugu story from Drama