Varun Ravalakollu

Drama

4.8  

Varun Ravalakollu

Drama

నాతిచరామి -2

నాతిచరామి -2

5 mins
624


నాకు ఆశ్చర్యంతో మతి పోయినంతపని అయ్యింది. శ్రీనివాసు చాలా రోజులుగా నా దగ్గరకి చదువుకునేందుకు వస్తూనే ఉన్నాడు. కాని నాకు ఎప్పుడూ అతనితో శిరీష కు పెళ్లి జరిపిస్తే బాగుంటుందన్న ఆలోచన, ఊహా మాత్రంగా కూడా రాలేదు. దానికి కారణం గంగాధరంగారు శ్రీమంతులు కావడం కావచ్చు! మేము చూస్తే మామూలు మధ్యతరగతి వాళ్ళమాయే! పైగా బావగారి స్థితిగతులు ప్రస్తుతానికి ఏమీ బాగాలేవు కదా, వాళ్ళతో సరితూగే స్తోమత మాకెక్కడది!

నా మనసులోమాట ఇంకా చెప్పకముందే శంకరశాస్త్రిగారు మాటాడారు ......

“చూడు బాబూ! గంగాధరం గారు మీతో మరోమాట కూడా చెప్పమన్నారు, శాన్నాళ్ళనుండి మంచం మీదున్న వారి ముసలి తల్లిగారు మనవడి వివాహం చూడడం కోసం, వివాహం ఇక్కడే, ఈ ఊళ్లోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపిస్తామన్నారు. వారికి ఉన్నది ఒక్క అబ్బాయి, ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది వాళ్లకి! కట్నకానుకల విషయంలో కూడా మిమ్మల్నేమీ హైరాన పడొద్దనీ, కేవలం కొబ్బరిబొండం పిల్లని ఇస్తే చాలుననీ చెప్పి రమ్మన్నారు” అంటూ మాట ముగించారు ఆయన.

మేమందరం అవాక్కై నోరు వెళ్ళబెట్టేశాము. “ఇట్ ఈజ్ టూ గుడ్ టు బి ట్రూ ” అనిపించింది నాకు చెప్పొద్దూ! ఏం జవాబు చెపుతారు - అన్నట్లుగా ఎదుచూస్తూ కూర్చున్నారు శాస్త్రి గారు. చివరకు, ఏమాటా చెప్పడానికి మాకు రెండురోజులు గడువు కావాలని చెప్పి, ఆయనకు దక్షణ తాంబూలా లిచ్చి పంపాము.

ఆయనలా గుమ్మాలు దిగి వెళ్ళారో లేదో, మేమిలా డిస్కషన్లు మొదలుపెట్టాము. అయాచితంగా అంత మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందంటే తన మనుమరాలు ఎంతో అదృష్టవంతురాలంటూ మురిసిపోయింది మా అమ్మ! ఇంక ఆ రోజంతా అదే విషయం మీద చర్చించుకున్నాము అందరం. ఆ మరునాటికల్లా అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, నేను తప్ప!

శిరీష పెద్ద అందగత్తేమీ కాదు! సంసారిపక్షంగా ఉంటుంది. శ్రీనివాసు స్ఫురద్రూపి! చాలా బాగుంటాడు. అతన్ని చూడగానే అదే ఉద్దేశం ఏర్పడుతుంది ఎవరికైనా. ఇకనేం, శిరీషకు అతడు చాలా బాగా నచ్చాడని వేరే చెప్పడం ఎందుకు!. “కన్యా వరైతే రూపం”! అన్నది ఏనాడో పెద్దలు ధృవపరిచారు కదా! మా అక్కకైతే వాళ్ళ భాగ్యం నచ్చింది. ఇక మా బావగారికి - వాళ్ళు ఉభయ ఖర్చులు భరించి పెళ్ళి ఘనంగా జరిపిస్తామనడం ఇంకా బాగా నచ్చింది. నా కొక్కడికే ఒక సందేహం పుట్టి, పురుగులా బుర్రంతా దొలవడం మొదలుపెట్టింది ...

గంగాధరంగారిది సమిష్టి కుటుంబం. సిరిసంపదలూ, పాడిపంటలూ, సంవృద్ధిగా ఉన్న మంచి కుటుంబం వారిది. అతిధులతో, అభ్యాగతులతో, వచ్చిపోతూండే చుట్టాలతో, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ సందడిగా ఉంటుంది. ఆ సంగతి ఊళ్లో ఉండే మా కందరికీ తెలుసు. ఇక శిరీష - పూర్తిగా పట్నంలో పుట్టి పెరిగిన పిల్ల! ఒంటెత్తుతనానికి బాగా అలవాటుపడినది. ఆ ఇంట్లో ఈ పిల్ల ఇమడిపోయి అక్కడి పద్ధతులతో సద్దుకుపోగలదా - అన్నది నా సందేహం!

ఆ మాట పైకి అనగానే మా అక్కకి నాపై కోపం వచ్చింది. “ఒరేయ్ బుద్ధూ! శుభం పలకరా మంకెన్నా - అంటే... ఏమిటిరా ఈ మాటలు? మతిగాని పోలేదు కదా! ఇప్పుడు పరిస్థితిలో శిరీషకి మంచి సంబంధం తెచ్చి పెళ్ళిచెయ్యడం ఎలాగరా దేవుడా - అని మేము బెంగపడుతూంటే, భగవంతుని దయవల్ల, అయాచితంగా ఈ సంబంధం మనల్ని వెతుక్కుంటూ ఎదురుగా వచ్చింది. సంతోషంగా ఒప్పుకోకుండా యతిపక్షిలా తప్పుడు కూతలు కూస్తావేమిటిరా? వెనకటికి నీలాంటివాడే ఒకడు, సిరి వస్తోంటే మోకాలు అడ్డం పెట్టేడుట” అంటూ నిష్టూరంగా ముక్కచివాట్లు పెట్టింది నన్ను. చివరకు నా భార్యకూడా నన్నే ఆడిపోసింది ...

“అటువాళ్ళకీ లేదు, ఇటువాళ్ళకీ లేదు, మద్యలో మీకెందుకండీ ఈ కుశ్శంకలు? ఆవూ, దూడా ఉండగా గుంజ అరిచిందిట” అంటూ చాటుకు తీసుకెళ్ళి నీటుగా, మొట్టినట్లు బుద్ధిచెప్పింది.

“హతోస్మి! ఐపోయానురా దేవుడా” అనుకుని, నేను మరి ఆ విషయం మాటాడితే ఒట్టు!

***

అంగరంగ వైభోగంగా శ్రీనివాసుతో శిరీష పెళ్లి జరిగిపోయింది, ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది . ఇది జరిగి సుమారుగా పదినెలలు అయ

“ఏమిటి మామయ్యా! అలా కూర్చుండిపోయావు? నా విషయం నీకు పట్టడం లేదా” అంటూ మళ్ళీ నా బుజం పట్టి కుదుపుతూ అడిగింది శిరీష.

అప్పటికి నేను తేరుకుని మామూలు మనిషి నయ్యాను. నా బుజంమీడున్న శిరీష చెయ్యి నా చేతులోకి తీసుకుని,“అదేం మాటలమ్మా సిరీ! నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా” అంటూ నేనేదో చెప్పబోగా నా మాటలకు అడ్డుపడింది శిరీష,

“ఐతే, నువ్వు నాకీ సాయం చెయ్యి చాలు. నాకు విడాకులు ఇప్పించు, అంతే! ఇంక ఒక్క క్షణమైనా నే నా ఇంట్లో ఉండలేను గాక, ఉండలేను! అమ్మా నాన్నలకు నువ్వే సద్ది చెప్పాలి” అంటూ ఏడవసాగింది శిరీష .

నాకు మతి పోయింది. క్షణంసేపు ఏం మాట్లాడాలో తెలియక కొట్టుకున్నా. చివరకి నాకో ఆలోఛన వచ్చింది, “సరేనమ్మా! నువ్వు కోరుకున్నట్లే జరిపిద్దాంలే, దాందేముంది! ఊరుకో” అన్నా, ఓదార్పుగా ఆమె వెన్నుపై చెయ్యుంచి నిమురుతూ.

శిరీష కళ్ళలో కన్నీటి చాటునుండి సంతోషం తొంగిచూసింది. “నిజమేనా మామయ్యా! నువ్వు నాకు సాయం చేస్తావు కదూ” అని అడిగింది.

నిజమే - అన్నట్లుగా తలతిప్పాను నేను.“కాని సిరీ! సంసారంలో వచ్చే చిన్నచిన్న సమస్య లన్నింటికీ పరిష్కారం విడాకులు కాదమ్మా! తొందరపడితే, బ్రతుకు ‘ఫ్రం ది ఫ్రయ్యింగ్ పేన్ ఇన్ టు ది ఫైర్’ అన్నట్లుగా అవుతుంది. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా , ఆచి తూచి అడుగులు ముందుకి వెయ్యాలి. అదీకాక ఇండియాలో ఏ కోర్టూ తొందరపడి విడాకులు మంజూరు చెయ్యడానికి ఇష్టపడదు. ఎన్నెన్నో ప్రశ్నలడిగి కూపీలు లాగి, ఎంతో ఆలోచించిగాని భార్యాభర్తలు విడిపోడానికి ఒప్పుకోదు. అందుకని ఆ ప్రశ్నలేవో ముందే మనం ఊహించుకుని, జవాబులు సిద్ధం చేసుకుని పెట్టుకుంటే తరవాత మనకు పని సులువౌతుంది కదా!” అన్నాను. వేర్రిపిల్ల, నా మాటలు నమ్మేసిమ్ది. .

“సరే, మామయ్యా! ఎలాగైనా విడాకులిప్పించు నాకు, చాలు” అంది, పాంటుజేబులోంచి ఋమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ.

నా మనసంతా అల్లకల్లోలంగా తయారయ్యింది. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా మరి, కయ్యానికైనా వియ్యానికైనా ఉజ్జీ కుదరాలని! అక్కాబావలకు ఆలోచన తక్కువైన దానికి ఇప్పుడు, శిరీష తనకు ఏమాత్రం నచ్చని పరిసరాలలో మనసు సరిపెట్టుకుని బ్రతకడం చేతకాక, పాపం! కష్టాల్లో పడింది. శిరీషను ఎలా సముదాయించాలో తెలియడం లేదు. ఏదో నాకు తోచిన మాటలు ఓ నాలుగు మాటాడడం తప్ప ఇంక నేనేం చెయ్యగలను ఇప్పుడు!

“అమ్మా సిరీ! ఇప్పుడు అక్కడ నీకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో ఒకసారి చెపుతావా, పరిష్కారం ఆలోచిద్దాము” అంటూ లాలనగా అడిగాను.

“మామయ్యా! మనిషికి ‘రోఠీ, కపడా అవుర్ మకాన్’ ఉంటే చాలు సుఖంగా బతికెయ్యవచ్చు - అనుకుంటారు గాని, అవిమాత్రమే సరిపోవు. మనసుకి నచ్చిన పరిసరాలు, మనసిచ్చి మాటాడే మంచి మనుష్యుల సహవాసం కూడా ఉంటేగాని ఎవరూ సంతృప్తిగా బ్రతకలేరు. ఆ ఇంట్లో అందరూ నన్నొక కార్టూన్ పిక్చర్లోని బొమ్మని చూసినట్లు చూస్తారు. నే నసలు వాళ్ళకి మనిషిలా కనిపించడం లేదేమో నని అనుమానం వస్తోంది నాకు! ఇక మా అత్తగారి విషయానికి వస్తే .... ఎప్పుడూ నసే! దేనికో ఒకదానికి ఆమె సణుగుతూనే ఉంటుంది. ఆమె దృష్టిలో నేను ఏంచేసినా అది తప్పు పనే ఔతుంది! మొహం చిట్లించి, అదోలా చూస్తుంది నా వైపు. అలా బొట్టు లేకుండా ఉండకూడదు, ఇలా జుట్టు విరబోసుకు తిరగ కూడదు, అరిష్టం చుట్టుకుంటుం ది! ఆ బట్టలేమిటి మగరాయుడిలాగ, ఇంట్లో ఆ జోడేసుకు తిరగడ మేమిటి” అంటూ , ఇలా దేనికో ఒకదానికి సణుగుతోనే ఉంటుం ది. ఇంక మడి, ఆచారం - అంటూ, సొంటు అంటూ; ఒక అంటరాని వస్తువులా చూస్తుంది నన్ను. . ప్రాణం విసిగిపోతోంది నాకు.

“మొన్న మా పెద్దాడపడుచు నన్ను చెడామడా మాటలతో దులిపేసింది, ఆమె పురిటి మంచం ఎక్కాక, వాళ్ళ అమ్మగారికి సాయంచేసీవాళ్ళు ఎవరూ లేకపోయారు అంటూ. నేను కూర్చుని పెద్దామెచేత చేయించుకుని తింటున్నానుట! ఇక ఆ పెద్దావిడను చూస్తే, ఇది మడి, అది అంటు - అంటూ వంటింట్లోకి వెళ్ళగానే హడలకొట్టేస్తుంది. నాకా ఛాయలకు అసలు వెళ్ళబుద్ధి పుట్టదు. ఇక మా అడపడుచు పిల్లలు సరే సరి! స్తంభాలచాటున నక్కి, నా వైపు చూస్తున్నవాళ్ళల్లా, నేను వాళ్ళవైపు చూడగానే పళ్ళికిలిoచి పారిపోతారు. ఇక పనివాళ్ళు ...? వాళ్ళు నన్నొక వింత జంతువులా గుడ్లప్పగించి మరీ చూస్తారు. అంతే గాని, నన్ను పలకరించి మాటాడేవాళ్ళెవరూ లేరక్కడ! ఇలా నేను ఎంతకాలం బ్రతకగలను మామయ్యా?” శిరీష కళ్ళలో ఫ్రెష్ గా కన్నీరు ఉబికింది.

నాకు చాలా బాధనిపించింది. “బాధపడకు సిరీ! పరిష్కారం ఆలోచిద్దామ్. నువ్వు చెప్పిన కారణాలన్నీ నిన్ను బాగా బాధపెట్టేవిగానే ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో ఐతే ఇవి చాలు విడాకులు అడగడానికి. ఇక్కడలా కాదమ్మా, సద్దుబాటుకి మార్గాలు వెతుకుతారు.”

“సద్దుబాటా! అదెలా సాధ్యం మామయ్యా! నువ్వు మా అత్తగారి నస ఆపగలవా, నన్నంతా ప్రేమగా చూసుకునీలా చెయ్యగలవా, చెప్పు మామయ్యా? జరగని విషయాలని గురించి ఆశలు పెంచుకోడంలో అర్థంలేదు” అంది శిరీష.

***


Rate this content
Log in

Similar telugu story from Drama