నా కన్నతల్లే నా కన్న కూతురు
నా కన్నతల్లే నా కన్న కూతురు


“సత్యా !నేను రాత్రికి ఊరు వెళుతున్నాను.రెండు రోజుల్లో వచ్చేస్తాను.ఆఫీస్ లో లీవ్ పెట్టాను.పనమ్మాయికి ,వంట మనిషికి జాగ్రత్తలు చెప్పాను.అమ్మాయిల్ని టైంకు రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించే బాధ్యత మాత్రం మీదే.”
రాత్రి ఏడుగంటలకు ఆఫీస్ నుండి వచ్చిన భర్త కు చెప్పేసింది ప్రయాణ సన్నాహాల్లో వున్న విజయ సత్యమూర్తి భార్య.
“ఊరా?ఇవ్వాళా?ఏమిటి అంత అర్జెంట్?పెద్ద అమ్మాయి పరీక్షల టైంయిది.గుర్తుందా?”
అవును ,కాదు అనకుండా ప్రశ్నలతో పిచ్చి ఎక్కిoచేస్తున్న భర్తను వింతగా చూస్తూ .
“గుర్తుంది.నువ్వున్నావుగా.?అవును రాత్రి బస్ కే .అర్జెంట్ అంటే అర్జెంటే.మా అమ్మకు వంట్లో బాగోలేదని అన్నయ్య ఫోన్ చేసాడు.ఆవార్త విన్నప్పటినుండి గుండెల్లో ఒకటే దడ.”
“ఓహో !అదన్నమాట?విషయం.ఒOట్లో బాగున్నంతవరకు సేవలు చేయించుకున్నారు.ఇప్పుడు సేవలు చేయాల్సి వస్తుందని తమరికి ఫోన్ చేసారన్నమాట?నువ్వెందుకు వెళ్ళాలి?మీ అన్ననే చూసుకోమని చెప్పు.”
“పంతాలకు ,పట్టింపులకు పోయి కన్నతల్లిని చూడకుండా వుండడం నాకు సాధ్యం అయ్యే పనికాదు.వదినకు మనలాగే యిద్దరుఅమ్మాయిలు.అన్నయ్యది క్యాంపుల ఉద్యోగం.ఇప్పుడు అమ్మమతిమరుపు వ్యాధితోబాధపడుతోంది.ఆమెను ఎవరో ఒకరు ప్రక్కనుండి అనుక్షణం చూసుకోవాలి.ప్రతినిమిషం కంటికి రెప్పలా కాపాడుకోవాలి.”
“విజయా!అటువంటి వారిని చూసుకోడానికి అనేక కేర్ హోమ్స్ వున్నాయి.”
“అవును నేనూ విన్నాను . పిల్లల్ని చూసుకోడానికి కూడా అనేక హాస్టల్స్ వున్నాయని. కానీ మన పిల్లల్ని అందులో జాయిన్ చేయలేము కదా?అమ్మ అనాధకాదు. నేనుకూతురిని బ్రతికే వున్నాను.ఒకప్రాణికి ప్రాణం పోయాలంటే తల్లి తనప్రాణాన్ని పణంగా పెడుతుంది.అటువంటి త్యాగమూర్తిని హోమ్లో చేర్చడం అంటే గర్భ గుడిలోని మూర్తిని వీధుల పాలు చేయడమే.”
“ఏయ్ !విజయా పిచ్చిగా మాట్లాడకు.అమ్మవిలువ నాకూ తెలుసు.”
“అవును నాది పిచ్చే.కొన్ని సంఘటనల వెనుక పెద్ద ఉప్పెనలు దాగివుంటాయి.అర్ధం కానివాళ్ళు దానిని పిచ్చి అంటారు.అర్ధమై న వాళ్ళు ఏడుపు అంటారు.కాని భరించే వాళ్ళకే అందులోని బాధ ,బాంధవ్యం తెలుస్తుంది.తల్లిప్రేమలోని తీయనితనం అనుభవిస్తేనే అర్ధమవుతుంది.”
“విజయా!నన్నుకన్నది కూడాఓతల్లే.నువ్వు నాకు పాఠాలు చెప్పనక్కర లేదు.సూక్తులు చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకీ తమరి ఉద్దేశ్యం చెపితే బాగుంటుంది.”
“నేను చెప్పేశాను.అమ్మను తెచ్చుకుంటాను.నాకు మరోకూతురు అనుకుంటాను.సేవచేసి ఋణం తీర్చు కుంటాను.కన్నతల్లి ఋణం తీర్చుకోవడానికి యిదో సువర్ణ అవకాశO.”
“అంటే తుది నిర్ణయం తమరిదేనా?నాఅనుమతి అవసరం లేదా?”
“అందుకేగా మీతో చెప్పి బయలుదేరుతున్నాను.అయినా యిందులో నిర్ణయాలు అనే పెద్దపెద్ద మాటలు ఎందుకు?రేపు మీఅమ్మగారికి అవసరమొచ్చినా నాకు నలుగురు కూతుర్లనుకుంటాను .ఆనందంగా సేవచేస్తాను.అమ్మ ఎవరికైనా అమ్మే.”
“అంటే ?మీఅమ్మగారిని తీసుకు వచ్చి మనయింట్లో వుంచుకోవాలనే నిర్ణయానికి వచ్చేశావు అన్నమాట ?ఒకవేళ నేను నో అంటే?కాదంటావా?”
“మీకు అలా అనే అధికారం వుంది.ధనమిచ్చి యేవస్తువును కొనుక్కున్నా దానిమీద సంపూర్ణ అధికారం కొనుగోలుదారుకే వుంటుంది.కానీ అదేమిశాపమో? భారతీయ మహిళకు మాత్రం ఆఅధికారంలేదు.దీనిని దౌర్భాగ్యం అనాలో ,చేతకాని తనం అనాలో అర్ధంకాదు.అనాదినుండి వస్తున్నపనికిరాని పద్ధతులు మారలేదు.మార్చాలి.”
“నన్ను కట్నంయిచ్చి కొనుక్కున్నానని దెప్పనక్కరలేదు.అవును కట్నం తీసుకునే పెళ్ళిచేసుకున్నాను.కట్నం లేకుండా నిన్ను ఎవడు చేసుకునే వాడు?మీ నాన్న కాళ్ళవేళ్ళ పడితే కోటినుండి , ముష్టియాభై లక్షలకు దిగజారి ఒప్పుకున్నాను.”
“మీరు చెప్పింది నగ్నసత్యమే.ముష్టియాభై లక్షలు? మీపోలిక బాగుంది.
మనకు పెళ్లి అయ్యి పదిహేను సంవత్సరాలు.అవునా?ఇప్పుడు నాజీతం లక్ష
దాటింది.వుద్యోగం లోచేరిన నాడు ముప్పైవేలు.యావరేజ్ చేసుకుంటే అరవై ఐదువేలు.దానిని పన్నెండుతో హెచ్చించి,మరోసారి పదిహేనుతో హెచ్చవేయండి.కోటి రూపాయల పైమాటే.పోతే భార్య భర్తకు,కుటుంబానికి చేసే సేవలకు విలువ కట్టగల్గితే ఎన్ని కోట్లు దాటుతుందో ఊహకే అందని విషయం.దీనిని తిరిగి యివ్వగలిగే శక్తి మీకు వుంటే వడ్డీ వద్దు అసలు ఇవ్వండి చాలు.”
“ఏంటీ ?ఛాలెంజ్ చేస్తున్నావా?నువ్వు సంపాదించింది అంతా నాకే యిచ్చావా?తమరి తిండీ,నగలు ,చీరలు విషయం మర్చిపోయావా?”
“లేదు మహాప్రభో!ఎలా మర్చిపోతాను? అయితే నా సంపాదనలో నాలుగో వంతు తీసేసి యివ్వండి చాలు.ఏమిటి శ్రీవారు మూగనోము పట్టారు.? అనాదిగా స్త్రీ పురుషుని ముందు మోసపోతూనే వుంది.కారణం మా చేతగాని తనమే.వేదకాలoనాడే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్నాడో గొప్ప పురుషుడు.స్త్రీకి పతివ్రతా ధర్మాలు చెప్పిన ఆపురుషుడు తనకు తాను ధర్మాలు చెప్పుకోవడం మర్చిపోలేదు.. కావాలనే వదిలేసాడు.నాడు పురుషాధిక్య ప్రపంచం.కాని నేడు స్త్రీలు విద్యారంగంలో,ఆర్ధిక రంగంలో పురుషుల్ని అధిగమించారు.ఇప్పుడు మీరు చూపించే పురుషాధిక్యం యిక చెల్లదు. స్త్రీ సహనమూర్తి,త్యాగమూర్తి .ఇప్పటివరకు స్త్రీ సహనాన్నిచూసారు. ఇంకా రెచ్చగొట్టకండి.రెచ్చకొడితే సౌమ్యంగా వుండే పిల్లే పులిగా మారుతుంది.”
“ఓహో!చాలాదూరం వచ్చేశావు అన్నమాట?అంటే ఇప్పుడు మీ అమ్మగారిని నీతో తీసుకురావాలనే ప్రయత్నం ?మనది రెండు బెడ్ రూముల ఫ్లాట్.పిల్లలకు ఒకటి,మనకి ఒకటి.మరి నీ తల్లిగారిని ఎక్కడ వుంచుతావు?ఆలోచించావా?మరీ మంకు పట్టు పట్టకు.”
“అదే మీ ప్రోబ్లం అయితే చాలా సింపుల్.మూడు బెడ్ రూముల ఫ్లాట్ తీసుకుందాము.లేదా మరో రెండు బెడ్రుముల ఫ్లాట్ తీసుకుని అమ్మని ,కేర్ టేకర్స్ ని అందులో ఉంచుదాము.”
“ఓహో !తమరు ఆల్రెడీ ప్లాన్ చేసారన్నమాట?మరి చెప్పవే?”
“కన్న తల్లికోసం ఆమాత్రం ఆలోచించడం లో తప్పేముంది?ప్లాన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడ కండి.వున్న గౌరవం పోగొట్టుకోకండి.”
అమ్మంటే అర్ధం తెలుసా?
అమ్మ నాకేమి యిచ్చిందని అనకు.
తన రక్తంలో రక్తం యిచ్చింది.
తన ఆహారంలో ఆహారం పంచింది.
తన గర్భంలో తొమ్మిది నెలలు మోసింది .
తన ప్రాణం పణంగా పెట్టి నీకు జన్మనిచ్చింది.
తన పాలతో నీకు ప్రాణం పోసింది.
నీ ముక్కు తుడిచింది. మల ముత్రాలను యెత్తింది.
నువ్వు నవ్వితే నవ్వింది. ఏడిస్తే ఏడ్చిoది.
నీకు తొలి గురువయ్యింది.
నీకు జబ్బు చేస్తే నర్సు అయ్యింది.
నీకు నిద్రోస్తే లాలిపాట అయ్యింది.
నీ పాలిట దేవత అయ్యింది.
"తెలుసు ..అన్నిటిని మించిన మరో విషయం వుంది. .ఖర్చు యెంత అవుతుందో ఐడియా ఉందా?చెప్పమంటావా?”
“అక్కర్లేదు మహా అయితే యాభై వేలు.అంటే నాజీతంలో సగం కూడా కాదు.”
“అంటే నిర్ణయానికి వచ్చేసావన్న మాట?మరి నన్నెందుకు అడగడం?నీ యిష్టం.”
“అవును నాయిస్టమే .నాకు నిర్ణయం తీసుకునే అధికారం,అవకాశoలేదన్నది మీ ఉద్దేశ్యం అనిపిస్తోంది.పోనీ మీ నిర్ణయం చెప్పండి.ఆలోచిస్తాను. నాకు తల్లి మీకు అత్తగారేగా?”
“నువ్వు యిప్పుడు వెళ్ళడానికి వీలులేదు.ఇంతకాలం సేవలు చేయించుకున్న
తమరి అన్నగారే చూసుకుంటారు.నామాటగా నువ్వే చెప్పు మీ అన్నగారికి.”
“నిజమే వాడు చూసుకో గలడు.అమ్మ ఒకస్త్రీ .స్త్రీని స్త్రీ మాత్రమె చూసుకోగలదు.
ఇప్పుడు అమ్మపరిస్థితి అయోమయ స్థితి.జ్ఞాపక శక్తి లేదు.మనుషుల్ని గుర్తించే శక్తి లేదు.తను యిప్పుడు ఒక పసిపాపతో సమానం.క్యాంపుల్లో అన్నయ్య తిరుగుతుంటే యిద్దరు పిల్లలతో వదిన అమ్మను చూసుకోలేదు.నేను మాత్రమే చూసుకోగలను.”
“అయితే నిర్ణయం తీసేసుకున్నావు.నానిర్ణయం కూడా విను.వెళ్ళు కాని తిరిగి రాకు”
మూడురోజుల తర్వాత విజయ తన సామాను కోసంవచ్చింది.
“నేను చెప్పానుకదా?తిరిగి రావద్దని.తిరిగి నాపాదాల దగ్గరకే వచ్చావు?”
“భ్రమ పడకండి ,భయపడకండి. మనకు యిద్దరు కూతుళ్ళు.శ్రేయా,సౌమ్యా.ఇద్దరినీ నాకు యిచ్చినా ఓకే.లేదా యిద్దరిని మీరు పెంచినా ఓకే.నేను ఒకప్పుడు మాఅమ్మకు కూతురిని.ఇప్పుడు మాఅమ్మే నాకుకూతురు.ఇదేలోకాలిటీలో ఫ్లాట్ తీసుకున్నాను.ఇద్దరు రెడ్ క్రాస్ అమ్మాయిల్ని అపాయింట్ చేసాను.సర్వెంట్ కం వంటమనిషిని పెట్టాను.మీకు విడాకులు తీసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి తీసుకోండి.భరణం వంటి కక్కుర్తి కాసులకు కక్కుర్తి పడే మనస్తత్వం నాదికాదు.మగవాడిని అనిఅనిపిoచుకోవాలనుకుంటే మానాన్నగారిచ్చిన ముష్టి యాభై లక్షలు తిరిగి యిచ్చేయండి.నా అడ్రస్ వాట్స్ యాప్ చేస్తాను.అమ్మా శ్రేయా,సౌమ్యా యిది మేల్ ఇగో వున్న సమాజం.వారు చెప్పిందే వేదం.మీరు ఆలోచించుకోండి..ఎవరితో వుండాలి అనుకుంటున్నారో.ఈతల్లి హృదయం అనుక్షణం మీకోసం ఎదురుచూస్తూనే వుంటుంది.నా ఫోన్ నెంబర్ వుంది మీదగ్గర.మాట్లాడండి.కానీ దానికి కూడా అనుమతి యిస్తారో లేదో మీ నాన్నగారిని అడగండి.ప్రస్తుతానికి సెలవ్.
****సమాప్తం***
.