Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Malleswari Kolla

Drama Inspirational Others


4  

Malleswari Kolla

Drama Inspirational Others


మనసే ప్రాణాంతకం 💔

మనసే ప్రాణాంతకం 💔

21 mins 274 21 mins 274


సమయం ఉదయం పది గంటలు....

ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోని తన ఛాంబర్ లో కూర్చుని ఇందాక తను చూసిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సిద్దార్థ్.... 

ఆలోచించేకొద్దీ తన మనసు బాధతో నిండిపోతోంది... ఎందుకిలా జరిగింది? జాహ్నవి ఎందుకిలా మారిపోయింది? కాలేజ్ లో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేది... చూసేకొద్దీ మరీ మరీ చూడాలనిపించేది.... అప్పట్లో కాలేజీలో ప్రతి అబ్బాయికి తనే డ్రీమ్ గర్ల్.... తమ వైపు జాహ్నవి ఒకసారి చూస్తే చాలు అనుకునేవారు అందరూ....

అలాంటిది ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.... ముఖమంతా గుంటలు పడిపోయి, కళ్ళు లోపలకి పీక్కుపోయి, ఒంట్లోని సత్తువ ఎవరో లాగేసినట్టుగా సన్నగా అయిపోయింది.... ఎంత ఆలోచించినా జాహ్నవి ఎందుకలా మారిపోయిందో సిద్దార్థ్ కి అర్థం కాలేదు....

ఎంతసేపటికీ ఆలోచనలు తెగకపోవడంతో ఎలాగైనా సాయంత్రం జాహ్నవితో మాట్లాడాలని నిర్ణయించుకుని పనిలో మునిగిపోయాడు సిద్దార్థ్......

**************

సిద్దార్థ్ సినిమా హీరోలా ఆరడుగుల అందగాడు అని చెప్పలేకపోయినా వాళ్లకు ఏ మాత్రం తీసిపోడని మాత్రం చెప్పచ్చు.... ఆకర్షించే మొహం, ధృడమైన శరీరాకృతి, సహృదయం, ఆరంకెల జీతం, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ..... ఇంతకన్నా ఏ ఆడపిల్ల తల్లితండ్రులకైనా ఏం కావాలి....

అందుకే కట్నం విషయంలో వెనకడుగు వెయ్యకుండా కోరి మరీ ఈ మధ్యనే తమ కూతురైన సముద్రని సిద్దార్థ్ కి ఇచ్చి పెళ్లి చేసారు సునంద, బలరామ్ దంపతులు.....

వాళ్ళు ఊహించినట్లే పెళ్లైన కొన్నాళ్లకే పాలు నీళ్లలా కలసిపోయారు సముద్ర, సిద్ధార్థ్ లు.....

వారి అన్యోన్యతకు చిహ్నంగా ఇప్పుడు సముద్ర రెండు నెలల గర్భవతి......

తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసాక సముద్ర ఉద్యోగం మానేసింది సిధ్ధార్థ్ వద్దంటున్నా వినకుండా..... ఈ తొమ్మిది నెలలపాటు తన సమయం మొత్తం కేవలం బిడ్డకు, భర్తకు మాత్రమే కేటాయించాలనే తాపత్రయం తనది..... తన ఆలోచన తెలిసాక సిద్దార్థ్ కూడా ఎప్పుడూ ఉద్యోగం గురించి సముద్ర దగ్గర ఎత్తలేదు..... పైగా ఎంతో సంతోషించాడు తనని, తన బిడ్డని అంతగా ప్రేమించే భార్య దొరికినందుకు....

*********************

సిద్దార్థ్ సాయంత్రం నాలుగు గంటలకే ఆఫీసులో పర్మిషన్ తీసుకుని జాహ్నవికి కాల్ చేసాడు.....

అటువైపు జాహ్నవి కాల్ లిఫ్ట్ చెయ్యగానే "హలో... జానూ....." అంటూ పిలిచాడు సిద్దార్థ్....

ఆ గొంతులో ఎంత కాదనుకున్నా ప్రేమ తొణికిసలాడింది......

"ఎవరు....." అంటూ లో గొంతుతో పలికిందో స్వరం అటువైపు నుంచి

"నేను...... సిద్దూని....." అన్నాడు

"సిద్దూ..... నువ్వా....." అంటూ ఒక్కసారిగా బోరుమంది జాహ్నవి

వెంటనే సిద్దార్థ్ కంగారుగా "జానూ..... ఏమైంది.... ఎందుకు ఏడుస్తున్నావు....." అన్నాడు

అటువైపు నుంచి ఏడుపు తప్ప ఎటువంటి సమాధానం రాలేదు......

"జానూ..... ప్లీజ్... ఏడవకు.... ఏమైందో చెప్పు" అన్నాడు సిద్దార్థ్

"సిద్దూ...." అంటూ మళ్ళీ ఏడుస్తోంది జాహ్నవి

"జానూ..... మీ ఇంటి అడ్రస్ చెప్పు.... నేను వస్తాను..... నీతో మాట్లాడాలి" అన్నాడు సిద్దూ..... అతనికి అంతా అయోమయంగా ఉంది.... అంతకుమించి బాధగా ఉంది.....

కానీ అటువైపు నుంచి సమాధానం లేదు.....

ఈసారి "జానూ..... ఉన్నావా" అంటూ మృదువుగా పిలిచాడు సిద్దార్థ్

"మెసేజ్ చేస్తాను......" అంటూ అతికష్టం మీద ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ పలికింది జాహ్నవి....

"సరే....." అంటూ కార్ స్టార్ట్ చేసాడు సిద్దూ......

కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు తన ఆలోచనలు జాహ్నవి గురించే....

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం.......

సిద్దూ అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు...... ఒకరోజు ల్యాబ్ కోసం తన ఫ్రెండ్స్ తో కలసి కంప్యూటర్ సైన్సు వాళ్ళ బ్లాక్ లోకి వెళ్ళాడు......

మెట్లు ఎక్కుతుండగా అనుకోకుండా ఎదురుగా వస్తున్న జాహ్నవిని గుద్దుకోబోయి ఆఖరి క్షణంలో తమాయించుకుని నిలదొక్కుకున్నాడు..... ఆ క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి......

సిద్దార్థ్ ఆ క్షణమే ఆ చూపుల్లో చిక్కుకుపోయాడు.... అప్పటినుంచి క్లాసు ఉన్నా లేకపోయినా పదేపదే జాహ్నవి కోసం వెళ్లేవాడు..... దూరం నుంచి చూస్తూ ఉండేవాడు.....

కొన్నాళ్లకు ఇద్దరికీ పరిచయం పెరిగింది... ఆది ప్రేమకు దారి తీసింది..... జాహ్నవి కూడా వెంటనే ఒప్పుకోవడంతో ఇద్దరి ఆనందానికి అవధులు లేవు....

వాళ్ళు తిరగని ప్లేస్ లేదు. వెళ్ళని సినిమా లేదు.... లోకమంతా వాళ్ళదే అన్నట్లు ఎంజాయ్ చేశారు......

వారిద్దరి ప్రేమలో కాలం గిర్రున తిరిగింది..... సిద్దార్థ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే జాబ్ తెచ్చుకున్నాడు....

సిద్దూ జాబ్లో జాయిన్ అయిన కొన్ని రోజులకు ఆఫీస్ నుంచి వస్తుండగా ఒక రెస్టారెంట్ లో జాహ్నవి వేరే అతనితో క్లోజ్ గా ఉండటం గమనించాడు.....

కానీ జాహ్నవిని అనుమానించలేకపోయాడు.... దాంతో జాహ్నవి ఎక్కడ దూరమవుతుందేమోననే ఆలోచనతో ఒకరోజు జాహ్నవిని పార్క్ కి రమ్మని మెసేజ్ చేసాడు.....

ఆరోజు సాయంత్రం......

జాహ్నవి పార్క్ కి వస్తూనే "హాయ్ సిద్దూ...." అంటూ హత్తుకుంది....

మరో రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ ఒక బెంచ్ పై కూర్చున్నారు.....

"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి జానూ..." అన్నాడు సిద్దార్థ్

"చెప్పు సిద్దూ...... అదేంటో...." అంది జాహ్నవి

"మనం పెళ్లి చేసుకుందాం జానూ....." అన్నాడు సిద్దార్థ్

అది వినగానే జాహ్నవి సిద్దార్థ్ గుండెలపై తల పెట్టుకుని "సిద్దూ....." అంటూ బోరున ఏడ్చేసింది....

"ఏమైంది జానూ...... ఎందుకేడుస్తున్నావు" కంగారుగా అడిగాడు సిద్దార్థ్

"నేను నీతో ఒక విషయం చెప్పాలి....." వెక్కుతూనే అంది

"చెప్పు జానూ....." ప్రేమగా తల నిమురుతూ అడిగాడు సిద్దార్థ్

"మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పించి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను..... కానీ" అంటూ ఆగిపోయింది జాహ్నవి

"హా.... కానీ....." అన్నాడు సిద్దార్థ్ ఆత్రుతగా.... ఏం వినాల్సి వస్తుందో అని అతనికి భయంగా ఉంది.....

కొన్ని క్షణాల తర్వాత "మా ఇంట్లో ఒప్పుకోలేదు సిద్దూ...... ఎంత నచ్చచెప్పినా, బ్రతిమాలినా ససేమిరా అన్నారు....." అంది జాహ్నవి

"ఎందుకు కాదన్నారు...." అడిగాడు సిద్దూ

"వాళ్లకు ప్రేమ పెళ్లిళ్ళ మీద నమ్మకం లేదంట....." అంది జాహ్నవి

"జానూ... ప్లీజ్ ఏడవకు..... నేను మాట్లాడతాను మీ ఇంట్లో......" అంటూ స‌ర్దిచెప్పబోయాడు సిద్దార్థ్

"వద్దు సిద్దూ..... నన్ను మర్చిపో" అంది జాహ్నవి

"జానూ......" ఈసారి కోపంగా పలికింది సిద్దార్థ్ స్వరం.... ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తన బాధ.....

"ప్లీజ్ సిద్దూ..... మన విషయం తెలిసాక నాతో ఇంట్లో వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు..... ఇప్పుడు నువ్వు వస్తే పెద్ద గొడవ జరుగుతుంది.... అప్పుడు నాకు వాళ్ళు శాశ్వతంగా దూరమవుతారు......" అంది జాహ్నవి

"అలా ఎందుకు ఆలోచిస్తున్నావు జానూ..... ఒకసారి పాజిటివ్ గా ఆలోచించి చూడు....." అతికష్టం మీద నెమ్మదిగా మాట్లాడాడు సిద్దూ

ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది...... స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరుని చూడగానే ఇంకా గట్టిగా ఏడుస్తూ "చూడు సిద్దూ..... మా ఇంట్లో వాళ్ళు నాకొక సంబంధం చూశారు.... ఇప్పుడు అతనే నాకు కాల్ చేస్తున్నాడు.... నా మీద ఇప్పటికే నిఘా పెట్టారు..... ఎక్కువ సేపు మనం కలవడం మంచిది కాదు..... నేను వెళ్తాను" అంటూ పైకి లేచింది జాహ్నవి

"జానూ...... ఒక్కసారి నా మాట విను" అని సిద్దూ ఏదో చెప్పబోయేంతలో

"నీకు మంచి భార్య వస్తుంది సిద్దూ.... బాధపడకు.... మనం మన తల్లిదండ్రుల కోసం విడిపోతున్నాం.... మరో జన్మంటూ ఉంటే నీకు భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నాను....." అంటూ సిద్దూ గుండెలపై తల పెట్టుకుని ఏడుస్తూ మరో క్షణంలోనే పరుగులాంటి నడకతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోయింది జాహ్నవి.....

పగిలిన మనసుతో జాహ్నవి వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు సిద్దార్థ్.....

ఆ తర్వాత నుంచి జాహ్నవికి ఎన్ని కాల్స్ చేసినా, మెసేజెస్ చేసినా కలవలేదు...... దాంతో సిద్దార్థ్ గుండె మూగబోయింది.....

తన గదిలోంచి బయటకు రావడం మానేశాడు..... భోజనం కూడా తల్లి బలవంతం మీద నాలుగు ముద్దలు తిని లేచేసేవాడు..... ఎప్పుడూ పరధ్యానంగా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటున్న సిద్దార్థ్ ని చూడగానే ఏం జరిగి ఉంటుందో ఊహించారు సిద్దార్థ్ తల్లిదండ్రులు......

దాంతో సిద్దార్థ్ మనసు మార్చడానికి చాలా కష్టపడి ఇక లాభం లేక పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామంటూ బెదిరించి సముద్ర మెడలో తాళి కట్టించారు తన తల్లిదండ్రులు.......

సముద్ర ఇంట్లో అడుగు పెట్టిన మరు క్షణం నుంచే ఇంట్లో సందడి మొదలయ్యింది..... ఎప్పుడూ చిన్నపిల్లలా అల్లరి చేసేది..... క్షణం కూడా సిద్దార్థ్ ని వదిలి ఉండేది కాదు......

మొదట్లో సిద్దార్థ్ కి సముద్రకి దగ్గరగా ఉండటం ఇష్టం లేకపోయినా పసిపాపలా స్వచ్ఛమైన మనసు కలిగి, అమాయకంగా ఉండే సముద్రని చూస్తే కోప్పడాలనిపించేది కాదు..... తన ప్రశాంతమైన వదనాన్ని చూడగానే అన్నీ మర్చిపోయేవాడు....

రోజులు గడిచేకొద్దీ సముద్రతో స్నేహం పెరిగింది.... ఆ తర్వాత చనువు పెరిగింది..... కొన్ని రోజులకు సంపూర్ణంగా భార్యాభర్తలుగా మారారు.....

ఆరోజు నుంచి ఈ రోజు ఉదయం జాహ్నవిని చూసేవరకూ మనసంతా సముద్రనే.... ఆలోచనలు అంతా సముద్ర గురించే.......

ఇలా సిద్దార్థ్ ఆలోచనల్లో ఉండగానే జాహ్నవి మెసేజ్ చేసిన అడ్రస్ రావడంతో కార్ ఒక పక్కన ఆపి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు.....

మరో రెండు నిమిషాలకు జాహ్నవి తలుపు తీసింది.... నలిగిపోయిన చీరని భుజాల నిండుగా కప్పుకుని అంతవరకూ ఏడ్చినందువల్ల ఉబ్బిన మొహంతో కడు దీనంగా ఉన్న జాహ్నవిని చూడగానే మనస్సు కలుక్కుమంది సిద్దార్థ్ కి.....

క్షణాల్లో తనని దగ్గరకు తీసుకొని గుండెల్లో బంధించి ధైర్యం చెప్పాలనిపించింది.... కానీ అతి కష్టం మీద తమాయించుకున్నాడు..... ఎందుకంటే ఇప్పుడు తను సముద్ర భర్త..... అంటే జాహ్నవి తనకు పరాయి ఆడదానితో సమానం......

కానీ ఆ విషయం మనసు ఒప్పుకోవడం లేదు.... ఇంతలో జాహ్నవి లోపలకు రమ్మని దారి చూపించింది..... వెనుకే అనుసరించాడు సిద్దార్థ్.....

హాల్ మధ్యలో రెండు కుర్చీలు వేసి ఉన్నాయి..... దాంట్లో ఒకదాన్ని ముందుకు జరిపి కూర్చోమంది జాహ్నవి......

సిద్దార్థ్ కూర్చున్న వెంటనే "ఇప్పుడే వస్తాను" అని చెప్పి లోపలికి వెళ్ళింది.....

ఆ గదినంతా పరిశీలిస్తున్నాడు సిద్దార్థ్...... అతనికంతా చిత్రంగా ఉంది..... తనకు తెలిసిన జాహ్నవి డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగింది.... ఎప్పుడూ జీన్స్ టాప్స్ వేసుకుని మోడ్రన్ గా ఉండేది.... అలాంటిది ఇవాళ నలిగిపోయిన చీరని కట్టుకుని ఇలా ఒక సామాన్యమైన ఇంట్లో బ్రతుకుతోందంటే దానికి కారణం ఏమై ఉంటుందో అంతు చిక్కడం లేదు.....

అతనలా ఆలోచిస్తుండగానే చేతిలో మంచి నీళ్ళ గ్లాసుతో వచ్చింది జాహ్నవి..... వాటిని అందుకుంటూ "కూర్చో జానూ......" అన్నాడు సిద్దార్థ్

అయినా కూర్చోలేదు జాహ్నవి......

"మీ వారు ఎక్కడున్నారు..... పిల్లలు ఎంతమంది" అన్నాడు సిద్దార్థ్ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో

విరక్తిగా నవ్వింది జాహ్నవి......

"ఏమైంది జానూ....." ఆందోళనగా అడిగాడు సిద్దార్థ్

ఈసారి ఏడుపు మొదలయ్యింది...... దాంతో సిద్దూ కంగారుగా "జానూ.... ఏమయ్యింది...... చెప్పు...." అంటూ కుర్చీలోంచి లేచాడు

"నన్ను క్షమించు సిద్దూ" అంటూ రెండు చేతులు జోడించింది జాహ్నవి

"ఎందుకు....." అడిగాడు సిద్దూ

"నేను తప్పు చేసాను.... కాదు కాదు.... పాపం చేశాను...." అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది జాహ్నవి

"ఏం మాట్లాడుతున్నావు జానూ..... నువ్వు తప్పు చెయ్యడం ఏంటి..... నువ్వెప్పటికీ అలా చెయ్యవు.... ఏడవకు" అంటూ ఓదార్చబోయాడు సిద్దూ

"అవును సిద్దూ.... నేనెప్పటికీ తప్పు చెయ్యనని నువ్వు ఇంకా నమ్ముతున్నావు..... కానీ నేను ఎన్ని తప్పులు చేసానో నాకే తెలీదు సిద్దూ..... తెలిసీ తప్పులు చేసాను...." అంటూ కళ్ళు తుడుచుకుంది జాహ్నవి

"అసలేమైంది జానూ....." అడిగాడు సిద్దూ

"చెప్తాను సిద్దూ.... మొత్తం చెప్తాను..... చెప్పాక నువ్వైనా నన్ను అసహ్యించుకోవని మాటివ్వు...." అంటూ చెయ్యి ముందుకు చాచింది....

సరేనన్నట్టు చేతిలో చెయ్యేసాడు సిద్దూ......

"సిద్దూ...... నాకు యుక్త వయసు వచ్చాక నాలో ఎన్నో ఆలోచనలు, కోరికలు కలిగేవి.... కానీ నేను ఎప్పుడూ వాటిని ఎవరితో చెప్పలేదు..... ఎందుకంటే మా ఇంట్లో పద్దతులు అలాంటివి......

ఆడపిల్ల పరాయి మగాడితో చనువుగా మాట్లాడకూడదు.... ఒంటినిండా బట్టలు వేసుకోవాలి.... పద్దతిగా పనులు చెయ్యాలి.... చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనేవారు....

అప్పుడు నేను ఆలోచించేదాన్ని..... ఆడపిల్ల పుట్టింది వీటి కోసమేనా..... ఇంకేం లేదా..... ఇదేనా జీవితం అని....

అసలు అబ్బాయిలని మాత్రం ఎవరూ పట్టించుకోరు.... ఏమైనా అంటే వాడు మగాడు.... ఎలాగైనా ఉండొచ్చు.... ఏమైనా చెయ్యచ్చు అనేవారు.....

దాంతో నేను కూడా అబ్బాయి లాగా ఉండాలని అనుకునేదాన్ని.... నాకు నచ్చినట్లు తిరిగి, నచ్చినట్లు చేసి ఆడది కూడా ఇలా చెయ్యచ్చని నిరూపించాలనుకున్నాను......

అందుకే ఇంట్లో ఒప్పించి హాస్టల్లోకి మారాను.... చుడీదార్లు వదిలి జీన్సులు వేసుకోవడం మొదలు పెట్టాను..... డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదాన్ని...

అప్పుడే నాకు చాలా మంది అబ్బాయిలు పరిచయమయ్యారు.... వారందరూ నా చూపు కోసం తపిస్తుంటే నాకెంత గర్వంగా ఉండేదో తెలుసా.... ప్రపంచంలో నేనే గొప్ప అందగత్తెనని భావించేదాన్ని.....

దాంతో నా కళ్ళు నెత్తికి ఎక్కాయి..... అలాంటి సమయంలోనే ఒకరోజు ఒకతనితో సుఖపడ్డాను..... ఆ క్షణం అర్థమయ్యింది మగాళ్లందరూ ఎందుకు ఆ అనుభవం కోసం అంతలా ఆత్రపడతారో అని.....

అప్పటినుంచి నేను కూడా అలాగే ఉండాలనుకున్నాను.... అందుకే నన్ను కోరి వచ్చిన మగాడితో కలిసాను.... దానికి ఎంజాయ్మెంట్ అనే పేరు పెట్టుకున్నాను..... అలాగే నీతో కూడా....." అంటూ తలెత్తి సిద్దార్థ్ కళ్లలోకి చూసింది జాహ్నవి.....

అప్పటి వరకూ జాహ్నవి చెప్తున్నది నిజమేనా అని ఆలోచిస్తున్న సిద్దార్థ్ కి ఒక రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చింది.....

ఒకరోజు జాహ్నవి, సిద్దార్థ్ ఇద్దరూ రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళారు..... సినిమా అయిపోయేసరికి బాగా లేటవడంతో ఇద్దరూ సిద్దూ గదికి వచ్చారు.....

ఒకవైపు వయసు ప్రభావం, మరోవైపు సినిమా ప్రభావం ఇద్దరినీ కుదురుగా ఉండనివ్వలేదు..... దాంతో ఆ రాత్రి వారికి మధురమైన రాత్రిగా మిగిలిపోయింది.... కానీ అదే రాత్రి భవిష్యత్తుని అంధకారం చేస్తుందని గ్రహించి ఉంటే పరిస్థితి ఇప్పుడిలా ఉండేది కాదేమో.....

సిద్దార్థ్ ఆలోచనల్లో ఉండగానే "నన్ను క్షమించు సిద్దూ..... నువ్వు నన్ను ఎంత నిజాయితీగా ప్రేమించావో నాకు తెలుసు.. కానీ అప్పుడు ఉన్న నా మానసిక పరిస్థితిని బట్టి జీవితం అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే అనుకున్నాను.....

అసలు నువ్వు ఏదో ఒకరోజు పెళ్లి గురించి అడుగుతావని నాకు ముందే తెలుసు... అందుకే నీకెలా సమాధానం చెప్పాలో ముందే ఆలోచించుకున్నాను.... దాంట్లో భాగంగానే నాకు పెళ్లని, ఇంట్లో వాళ్ళు చచ్చిపోతామన్నారని ఏదేదో చెప్పాను.....

నిజాయితీగా ప్రేమించినవాడివి కదా నేను చెప్పినవన్నీ నమ్మేశావు.... నీ బాధ ఆ క్షణం నుంచి తీరిపోతుంది అనుకున్నాను.... కానీ అప్పుడే అసలైన సమస్య మొదలైంది.......

కొన్ని నెలలకు జ్వరం మొదలయ్యింది..... ఎన్ని రోజులైనా తగ్గకపోవడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను..... డాక్టర్లు అన్ని టెస్టులు చేసారు.....

మలేరియా, టైఫాయిడ్ ఏవీ కాకపోవడంతో చివరగా యూరిన్ టెస్ట్ చేసారు.... అప్పుడే తెలిసింది నాకు హెచ్ఐవీ అని......" అంటూ సిద్దూ వైపూ చూసింది జాహ్నవి

భూమి బద్దలైపోతున్నట్టుగా తలంతా తిరిగిపోయింది సిద్దూకి.....

"నాకు హెచ్ఐవీ పాజిటివ్ అంటే నేను నమ్మలేదు సిద్దూ..... అందుకే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ చేయించుకున్నాను..... అందులో కూడా అదే నిజమని తేలింది...... ఆల్రెడీ హెచ్ఐవీ విండో పీరియడ్ దాటేయడంతో అది ఎయిడ్స్ గా రూపాంతరం చెందింది..... డాక్టర్లు ఇంకొన్ని సంవత్సరాలకు మించి బ్రతకనని చెప్పేశారు.....

కానీ నాకు అప్పుడే చావాలనిపించలేదు.... అందుకే ఏం మందులు వాడైనా సరే జబ్బు నయం చెయ్యమని వేడుకున్నాను.....

ఆ క్షణం డాక్టర్లు నా వంక ఎంత అసహ్యంగా చూశారో తెలుసా సిద్దూ...... ఒక చీడ పురుగుని చూసినట్టు చూసి "ప్రాణాల మీద ఇంత ఆశ ఉన్నదానివి అంతమందితో ఎందుకు తిరిగావు?" అన్నారు

మౌనమే నా సమాధానమయ్యింది.... దాంతో మళ్ళీ ఒక లేడీ డాక్టర్ "తిరిగితే తిరిగావు..... రక్షణగా కండోమ్ వాడాలని తెలీదా..... చూస్తే చదువుకున్నదానిలా ఉన్నావు.... నీ బుద్దేమయింది.... రోజూ టీవీల్లో, న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇస్తుంటారు.... చూడలేదా...." అంది

"ఇద్దరు మనుషులు కలిస్తునప్పుడు వారి మధ్య ప్రేమ, కోరిక, నమ్మకం ఉండాలి కానీ ముసుగులు ఎందుకు అనుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని చెప్పాను.....

ఆ క్షణం తర్వాత నా చుట్టు పక్కల ఒక్కరు కూడా లేరు..... వెళ్తూ వెళ్తూ వాళ్ళు చూసిన చూపులు, మాటలు నాకింకా గుర్తున్నాయి....

విషయం అందరికీ తెలిసింది.... ఇన్నాళ్లూ నా చూపు కోసం పరితపించే అబ్బాయిలు ఇప్పుడు నా చూపు సోకితే ఎక్కడ ఎయిడ్స్ వస్తుందేమోనని భయంతో పరుగులు తీసేవారు..... ఆఖరికి నేను చేసిన పనులు తెలిసి ఇంట్లో వాళ్ళు మొహం మీదే తలుపేశారు.....

ఊర్లో నా గురించి తెలిసి మా ఇంట్లో వాళ్లని ఖాళీ చెయ్యమని ఒకటే గొడవ చెయ్యడంతో వాళ్లంతా రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్లిపోయారు నాక్కూడా చెప్పకుండా......

అప్పటినుంచి నేను సమాజంలో అంటరానిదాన్ని అయిపోయాను సిద్దూ..... ఎవరితో మాట్లాడలేను, ఏ పనీ చెయ్యలేను..... చేసిన తప్పులకి పశ్చాత్తాప పడుతూ చావు కోసం ఎదురుచూస్తూ ఇలా ఒంటరిగా బ్రతకడం తప్ప...

కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు బ్రతకడానికి కూడా ధైర్యం లేదు....." అంటూ చెప్పడం ముగించింది జాహ్నవి

సిద్దూ ఏం మాట్లాడలేదు.... తన మనసంతా భయంతో నిండిపోయింది......

"సిద్దూ..... నువ్వైనా నన్ను క్షమిస్తావు కదూ....." అంది జాహ్నవి ఆశగా

"నాకు...." అన్నాడు సిద్దూ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని

"హా... నీకు...." అడిగింది జాహ్నవి

"నాక్కూడా ఎయిడ్స్....." అంటూ ఇక చెప్పలేక ఆగిపోయాడు సిద్దూ

అది వినగానే తన సందేహం అర్థమైనదానిలా "ఏమో సిద్దూ..... ఒకసారి చెక్ చేయించుకో..... ఎందుకైనా మంచిది....." అంది జాహ్నవి

ఇంతలో సిద్దూ ఫోన్ మోగింది..... స్క్రీన్ మీద సముద్ర పేరు చూడగానే టైం చూసాడు సిద్దూ.....

అప్పటికే సమయం ఆరు దాటడంతో కంగారుగా లేచి "నేను బయలుదేరాలి" అన్నాడు

"ఒక్క నిమిషం..... కాఫీ తీసుకొస్తాను...." అంటూ మరో మాటకి తావివ్వకుండా కిచెన్ లోకి నడిచింది జాహ్నవి....

మరో ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో బయటకు వచ్చిన జాహ్నవికి సిద్దార్థ్ కనపడలేదు.....

అతను ఎందుకు వెళ్లిపోయాడో అర్థం అవడంతో విరక్తిగా నవ్వుకుంది జాహ్నవి.......

**************

సిద్దూ కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ మనసు మనసులో లేదు...... ఆరోజు క్షణికావేశంలో తను జాహ్నవితో కలిసాడు..... ఆరోజు చేసిన తప్పు ఈరోజు మెడకు చుట్టుకుంటుందని అతను ఊహించలేదు.....

ఊహించుంటే ఇలా జరిగేది కాదు.... కానీ "ఇప్పుడేం చెయ్యాలి.... సముద్రకు తన మొహం ఎలా చూపించాలి..... " అనే ఆలోచన రాగానే మనసంతా వికలమైపోయింది......

ఆ ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు సిద్దార్థ్.... ఇంట్లోకి అడుగు పెట్టేసరికే సముద్ర నవ్వుతూ ఎదురొచ్చింది......

రోజూ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే సముద్రని దగ్గరకు తీసుకుని తన కడుపులో ఉన్న బిడ్డతో ఆఫీస్ కబుర్లు అన్నీ చెప్తూ సరదాగా గడిపే సిద్దార్థ్ కి ఈరోజు సముద్రని చూడగానే భయం కలిగింది.....

దాంతో వేగంగా తన గదిలోకి వెళ్లిపోయి ఫ్రెష్ అవడానికి బాత్రూమ్ లోకి దూరిపోయాడు.....

భర్త ఈరోజు కొత్తగా ప్రవర్తించినా ఆఫీసులో టెన్షన్స్ ఏమో అని సముద్ర సరి పెట్టుకుని కాఫీ కలపడానికి వంట గదిలోకి వెళ్లింది.....

సిద్దార్థ్ స్నానం చేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఎన్నో ఆలోచనలు..... జాహ్నవికి ఎయిడ్స్ ఉందంటే అది తనకు కూడా వచ్చుంటుంది.... ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నందుకు సముద్రకు కూడా వచ్చుండచ్చు.... మరి తన బిడ్డకి..... ఒకవేళ తను చేసిన తప్పు వల్ల అభం శుభం తెలియని ఆ పసికందుకి కూడా ఎయిడ్స్ వస్తే ఎలా అనే ఆలోచన రాగానే బాధతో మౌనంగా రోదించాడు సిద్దార్థ్......

తను ఫ్రెష్ అయ్యేసరికి సముద్ర కాఫీ కప్పుతో వచ్చింది......

కాఫీ తీసుకుని సముద్ర ఏదో అడగబోయేంతలో "నాకు కొంచెం వర్క్ ఉంది సముద్రా...... కాసేపు డిస్టర్బ్ చెయ్యకు....." అన్నాడు

"సరే...." అని తాగేసిన కాఫీ కప్ అందుకుని కిచెన్ లోకి వెళ్లి సిద్దూకి ఇష్టమైన వంటలు చెయ్యడం మొదలు పెట్టింది సముద్ర.....

ఆ క్షణానికి గండం గడిచినంతగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సిద్దార్థ్..... మరు క్షణంలోనే లాప్టాప్ ఆన్ చేసి ఎయిడ్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు.....

హెచ్.ఐ.వి అనేది రిట్రో వైరస్ కి చెందిన లెంటి వైరస్ ఉప తరగతికి సంబంధించినది... ఇది సిడి 4 సెల్స్ లోకి చేరిన తర్వాత హెచ్.ఐ.వి వైరస్ లోని ఆర్.ఎన్.ఏ మొత్తం డి.ఎన్.ఏ గా మారి సిడి 4 సెల్ యొక్క డి.ఎన్.ఏ తో కలుస్తుంది.... అంటే మానవ శరీరంలో సహజంగా ఉండే డి.ఎన్.ఏ హెచ్.ఐ.వికి సంబంధించిన డి.ఎన్.ఏ గా మారిపోతుంది.... ఇక అప్పటి నుంచి సిడి 4 సెల్ అనేది హెచ్.ఐ.వి డి.ఎన్.ఏ ఆదేశాల ప్రకారం పని చేస్తుంది.... కొన్ని రోజులకు మానవ శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే సీడీ 4 సెల్స్ అన్నీ తగ్గిపోయి శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది....

ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారని అనుకోవడం ఒకప్పటి మాట.... కానీ ఇప్పుడు హైలీ యాక్టివేటెడ్ యాంటీ రిట్రో వైరల్ థెరపీ అనే చికిత్స ద్వారా ఎయిడ్స్ వచ్చినా సాధారణ జీవితం గడపొచ్చు.....

ఇదంతా చదివిన తరువాత సిద్దార్థ్ కి కొద్దిగా ధైర్యం వచ్చింది... రేపు ఎలాగైనా డాక్టర్ ని కలసి ఆ థెరపీ గురించి కనుక్కోవాలి అనుకుంటూ ఉండగా సముద్ర భోజనానికి పిలవడంతో ఇక తప్పక లేచి వెళ్లాడు.....

సముద్ర చేసిన వంటలు చూస్తుంటే మామూలుగా అయితే ఒక పట్టు పట్టేవాడే కానీ ఇప్పుడు ముద్ద గొంతు దిగటం లేదు.... అతికష్టం మీద నాలుగు మెతుకులు తిని తలనొప్పిగా ఉందంటూ గదిలోకి వెళ్లిపోయాడు సిద్దూ.......

భర్త అలా దిగులుగా ఉండటంతో సముద్రకు కూడా భోజనం రుచించకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం కొద్దిగా తిని గదిలోకి వెళ్ళింది.....

సముద్ర వెళ్లేసరికి సిద్దార్థ్ అటు వైపు తిరిగి పడుకుని ఉండటంతో మొదట సముద్ర ఆశ్చర్యపోయినా వెంటనే తనే చొరవ తీసుకుని వెనుక నుంచి అతని చుట్టూ చేతులు బిగించింది.....

అయినా ఇటు తిరగలేదు సిద్దార్థ్.....

"సిద్దూ..... ఏదైనా ప్రాబ్లమా....." లాలనగా అడిగింది సముద్ర

"తలనొప్పిగా ఉందని చెప్పాగా సముద్ర..... విసిగించకుండా పడుకో....." అంటూ కసురుకున్నాడు సిద్దార్థ్

ఈసారి మాత్రం సముద్రకు బాధేసింది.... ఎప్పుడు తనకు తలనొప్పిగా ఉందని అనిపించినా "నీ తలనొప్పికి మందు నేనేస్తానోయ్...." అంటూ అల్లుకుపోయే సిద్దార్థ్ ఇప్పుడు తలనొప్పిగా ఉందంటూ దూరంగా ఉన్నాడు.....

ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న సముద్ర మరు క్షణంలోనే మనసులో "ఛ.... నేనేంటి సిద్దూ గురించి ఇలా ఆలోచిస్తున్నాను..... ఉదయం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే లేనిపోని ఆలోచనలతో మనసు పాడుచేసుకుంటున్నాను" అనుకుని నిద్రపోయింది.....

సిద్దార్థ్ కి మాత్రం ఆ రాత్రి కాళ రాత్రిగా మిగిలిపోయింది.....

ఉదయాన్నే సముద్ర లేవకముందే లేచి ఫ్రెష్ అయ్యి అర్జెంట్ వర్క్ ఉండటంతో బయటకు వెళ్తున్నట్లు ఒక పేపర్ లో రాసి సముద్ర పక్కన పెట్టబోతూ ఒక్క క్షణం సముద్ర వైపు చూసాడు సిద్దార్థ్.....

ఒక బిడ్డకు తల్లి కాబోతూ కూడా ఇంకా పసి బిడ్డలానే అమాయకంగా నిద్రపోతున్న సముద్రను చూడగానే ప్రేమగా నుదుటిన ముద్దాడాలనిపించింది.....

కానీ అంతలోనే ఏదో సందేహం..... ఒకవేళ తన ద్వారా క్రిములు సముద్రలోకి ప్రవేశిస్తే ఎలా అని.... దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మనసారా తల మీద చెయ్యేసి నిమరాలనుకున్నాడు......

తన చెయ్యి సముద్రను తాకబోతుండగా ఒళ్లంతా చిరు చెమట పట్టడంతో ఒకవేళ చెమటలో కూడా ఎయిడ్స్ క్రిములు ఉంటాయేమో అనే ఆలోచన రాగానే భయంతో చెయ్యి వెనక్కి తీసుకుని వడివడిగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు......

కానీ ఎటు వెళ్లాలో తెలీడం లేదు..... అందుకే కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న పార్కు దగ్గర ఆపి లోపలికి నడిచాడు సిద్దార్థ్......

అప్పటికి సమయం ఐదున్నర కావడంతో అప్పుడప్పుడే కొద్దిగా వెలుతురు వస్తోంది......

సిద్దార్థ్ నేరుగా వెళ్లి ఒక బెంచ్ పై కూర్చుని ఆలోచిస్తున్నాడు..... హాస్పిటల్ కి వెళ్లాక డాక్టర్ ని ఏమని అడగాలి.... నాకు హెచ్.ఐ.వీ టెస్ట్ చెయ్యమని అడిగితే ఆయన ఎలా చూస్తాడు..... ఎలా చూస్తే ఏంటి అనుకున్నా రిపోర్ట్స్ వచ్చాక నాకు ఎయిడ్స్ ఉందని తెలిస్తే నా వైపు జాలిగా చూస్తాడా..... లేదు లేదు.... అసహ్యంగా చూస్తాడేమో "వీడు ఎంతమందితో తిరిగాడో.... ఏంటో...." అనుకుంటూ.....

ఈ ఆలోచన రాగానే సిద్దార్థ్ హాస్పిటల్ కి వెళ్లే ప్రయత్నాన్ని మానుకున్నాడు.... ఇంతలో దూరంగా ఒకతను అనుమానాస్పదంగా తిరగడం గమనించి వెంటనే అక్కడికి వెళ్లాడు సిద్దార్థ్.....

పరుగులాంటి నడకతో అతన్ని సమీపించి "ఏయ్.... ఎవరు నువ్వు..... ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు" అన్నాడు

"బాబూ..... క్షమించండయ్యా..... ఇంకెప్పుడూ ఈ పార్కులోకి రాను..... " అంటూ చేతులు జోడించాడు అతను

"అసలు ముందు ఎందుకు వచ్చావో చెప్పు..... లేదంటే పోలీసులని పిలుస్తాను " అన్నాడు సిద్దార్థ్ గట్టిగా

"వద్దయ్యా.... చెప్పేస్తాను....." అన్నాడు అతను

చెప్పమన్నట్టుగా చూశాడు సిద్దార్థ్

"నాలుగు నెలల కిందట నాకు జ్వరం వచ్చిందయ్యా..... అది బాగా ముదిరిపోవడంతో ఒకసారి హాస్పిటల్ కి వెళ్లాను.... డాక్టర్లు ఏవేవో టెస్టులు చేసి నాకు ఎయిడ్స్ ఉందని చెప్పారు.... అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు భయంతో పట్టించుకోవడం మానేసారు....

ఇక అక్కడ ఉండలేక ఇల్లు వదిలి వచ్చేసాను.... ఉదయం అంతా రోడ్లపై తిరుగుతూ రాత్రి అవగానే ఈ పార్కులో వచ్చి పడుకుని మళ్ళీ తెల్లారేసరికి లేచి వెళ్లిపోతానయ్యా......" అన్నాడాయన

"ఎయిడ్స్ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా....." అడిగాడు సిద్దార్థ్

"ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి బయట ఆడవాళ్ల వెంట పడితే రాకుండా ఉంటాదా అయ్యా..... " అన్నాడు అతను

"తెలిసి కూడా ఎలా తిరిగావు" అని అడగాలనిపించింది సిద్దార్థ్ కి.... కానీ తను చేసింది కూడా అలాంటి పనే కదా.... అందుకే అడగలేక మౌనంగా ఉండిపోయాడు....

కాసేపటికి తేరుకుని "నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు...." అన్నాడు

"అందరూ మొహం మీద రాసుకుంటారా అయ్యా నేను ఇలాంటోడినని.... పైకి ఎవరూ చెప్పుకోరు..... అసలు నాకు ముందు ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదయ్యా.... కానీ ఒకసారి మా బామ్మర్ది సూరిగాడి వల్ల ఒకావిడని కలిసాను....

అప్పటి నుంచి అలవాటయ్యింది.... నేనే కాదు... సూరిగాడు కూడా చాలా మందితో తిరిగాడు.... కాకపోతే నాకు ఎయిడ్స్ వచ్చిందని త్వరగా బయటపడింది.....

వాడిది బయట పడలేదు.... " అంటూ మళ్ళీ తనే "అసలు వాడు పరీక్షలు చేయించుకోలేదయ్యా.... నాకు వచ్చిందని తెలిసాక వాడిని అడిగాను చేయించుకోమని..... కానీ వాడేమన్నాడో తెలుసా...." అంటూ సిద్దార్థ్ మొహంలోకి చూశాడు.....

ఏమన్నాడో చెప్పమన్నట్టు కుతూహలంగా చూశాడు సిద్దార్థ్.....

"ఒకవేళ వస్తే వచ్చింది లేరా.... ఇప్పుడు అందరికీ చెప్తే అందరూ నన్ను కూడా నీలాగే దూరంగా పెట్టేస్తారు.... వీడొక ఎయిడ్స్ రోగి అంటూ ముద్రేస్తారు.... దానికన్నా చెప్పకుండా బతికినంత కాలం బతికి చచ్చిపోవడం మేలు " అన్నాడు

"మీ భార్యా పిల్లలకు టెస్టులు చేయించారా....." అడిగాడు సిద్దార్థ్

"చేయించాను అయ్యా.... వాళ్లకందరికీ నెగటివ్ వచ్చింది.. దేవుడున్నాడు.... నా భార్యాబిడ్డలని కాపాడాడు....." అంటూ చేతులెత్తి దేవుడికి మొక్కాడు అతను

మళ్ళీ అతనే చిన్నగా "అసలు పర స్త్రీ మోజులో పడి ఏనాడైనా నా భార్యతో కాపురం చేసుంటే కదా.... అది నా దగ్గరకు వచ్చినా విసిరి కొట్టేవాడిని..... నీకిదేం పోయే కాలమే అంటూ తిట్టేవాడిని.....

నేను మాత్రం వేరే ఆడదాన్ని భయపెట్టో, బెదిరించో, డబ్బు ఆశ చూపించో లొంగదీసుకునేవాడిని.... అప్పుడు వాళ్ళెంత బాధ పడేవారో......

ఇద్దరివీ ఆకలి బాధలే..... వాళ్లవి గుప్పెడు మెతుకుల కోసమైతే నాది తీరని దాహం కోసం.... అప్పుడు అన్ని పాపాలు చేశాను కాబట్టే ఇప్పుడు ఇన్ని శిక్షలు అనుభవిస్తున్నాను....." అంటూ తల దించుకున్నాడు

సిద్దార్థ్ అన్నీ వింటున్నాడే కానీ అతని మనసు మనసులో లేదు.....

ఇంతలో "మీకొక విషయం చెప్పనా అయ్యా...." అన్నాడు అతను

"చెప్పు...." అన్నాడు సిద్దార్థ్

"నాకు ఎయిడ్స్ ఉందని తెలిసినా కూడా నాతో మాట్లాడుతున్న మొదటి మనిషి మీరే..... మీరు చల్లగుండాలయ్యా...... " అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను....

అతను వెళ్లగానే సిద్దార్థ్ మనసులో "నేను కూడా నీలాగే కాలిపోతున్నాను..... నువ్వు నాతో చెప్పుకున్నావు... నేను నీతో చెప్పుకోలేదు.... అంతే తేడా.....

ఒకవేళ నేను కూడా చెప్పుంటే "వీడు కూడా నా బాపతేనా" అని చులకనగా చూసేవాడివేమో....." అనుకున్నాడు

వెంటనే "అమ్మో వద్దు.... సిద్దార్థ్ అంటే సమాజంలో ఉన్న మంచి పేరు చెదిరిపోకూడదు.... అలా ఉండాలంటే నాకు ఎయిడ్స్ ఉందని ఎవరికీ తెలీకూడదు..... ఒకవేళ తెలిస్తే అప్పుడు అందరూ నన్ను కూడా దూరంగా పెడతారేమో.....

నా సముద్ర నన్ను అసహ్యించుకుంటుందేమో..... నా బిడ్డ నా దగ్గరకు కూడా రాడేమో....." అని ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సిద్దార్థ్.....

రాత్రంతా నిద్రలేకపోవడంతో కునుకు పట్టేసింది.....

ఇంతలో "నాన్నా....." అంటూ పలికిందో గొంతు

"ఏం కన్నా..... ఏం కావాలి.... ఇక్కడకు రా....." అంటూ ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు సిద్దార్థ్

కానీ ఆ పసివాడు ఉన్నచోటు నుంచి కొంచెం కూడా కదలకుండా ఏడుస్తూ "నాన్నా..... నాక్కూడా నీ దగ్గరకి రావాలనే ఉంది.... నీ ఒడిలో కుర్చోవాలని ఉంది.... నీ భుజమెక్కి ఆడుకోవాలని ఉంది.... కానీ నేను నీ దగ్గరకు రాకూడదంట కదా......" అన్నాడు బేలగా

"ఎవరు చెప్పారు...." అన్నాడు సిద్దార్థ్

"అమ్మ చెప్పింది.... మరేమో నీకు ఎయిడ్స్ ఉందంట కదా.... అందుకని నీ దగ్గరకు వెళ్లకూడదు, నీతో మాట్లాడకూడదని చెప్పింది.... అసలు ఎయిడ్స్ అంటే ఏంటి నాన్నా.... నీకు ఎందుకు వచ్చింది..." అడిగాడు ఆ పసివాడు

అది విని ఏం చెప్పాలో తెలీక తల దించుకున్నాడు సిద్దార్థ్.....

"నాన్నా.... మా స్కూలుకు రోజూ మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు వస్తుంటారు తెలుసా..... వాళ్లెంత బాగా ఆడుకుంటారో.... వాళ్లని చూసినప్పుడు అంతా నాకు నువ్వే గుర్తొస్తావు..... ఎయిడ్స్ వస్తే నువ్వు వాళ్లలా నాతో ఉండకూడదా నాన్నా....

అసలు నీకు మాత్రమే ఎయిడ్స్ ఎందుకు వచ్చింది నాన్నా.... అమ్మని ఎన్నిసార్లు నీ గురించి అడిగినా ఏడుస్తుంది తప్ప సమాధానం ఇవ్వదు... నువ్వైనా చెప్పు నాన్న..... " అంటూ ఏడుస్తున్న తన బిడ్డకు ఏం చెప్పాలో తెలీక

"నేను బ్యాడ్ బాయ్ ని రా కన్నా.... అందుకే ఎయిడ్స్ వచ్చింది.... " అన్నాడు సిద్దార్థ్

"ఓహో..... మరైతే గుడ్ బాయ్స్ కి ఎయిడ్స్ రాదన్నమాట.... అలాగైతే నేను గుడ్ బాయ్ లాగానే ఉంటాను నాన్నా.... నాకు ఎయిడ్స్ వద్దు...." అన్నాడు అతను కళ్ళు నులుముకుంటూ

ఆ క్షణం తన బిడ్డని ప్రేమగా దగ్గరకు తీసుకుని తనివితీరా ఏడవాలనిపించింది సిద్దార్థ్ కి... అందుకే ఆత్రంగా చేతులు చాచాడు.... కానీ తన బిడ్డ తన దగ్గరకు రాలేదు..... భయంతో పరిగెత్తుకుంటూ పారిపోతున్నట్టు అనిపించింది....

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సిద్దార్థ్.... జరిగిందంతా కల అని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు.... కానీ రేపు నా బిడ్డ ఈ భూమ్మీదకి వచ్చాక ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అనే ఊహ కలగగానే భయంతో కంపించిపోయాడు.....

మెల్లగా లేచి వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు..... కాసేపటికి ఆఫీసు ముందు ఆగింది కార్..... లోపలికి వెళ్లాడన్నమాటే కానీ పని చెయ్యలేకపోయాడు.....

ఆఫీస్ అయిపోయాక కూడా ఇంటికి వెళ్లడానికి భయమేసి రోడ్ల వెంట తిరుగుతూ ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు సిద్దార్థ్.....

అలా వారం రోజులు గడిచాయి..... సిద్దార్థ్ మునుపటిలా లేడు..... మొహం వాడిపోయింది... బరువు తగ్గినట్టుగా అనిపిస్తున్నాడు..... కళ్ళు నిద్రలేక పీక్కుపోయాయి.....

సముద్ర ఇదంతా గమనిస్తూనే ఉంది.... భర్త వాలకం తనకు అర్థం కావడం లేదు.... ఏదో జరగరానిది జరిగిందని అర్థం చేసుకుంది.... అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది.... కానీ తెలుసుకోలేకపోయింది......

అందుకే ఓ రోజు సిద్దార్థ్ ఇంటికి వచ్చేవరకు మేల్కునే ఉంది..... సిద్దార్థ్ వచ్చి పడుకోబోతుండగా "ఏవండీ...." అని పిలిచింది సముద్ర

సిద్దార్థ్ పలకలేదు....... ఈసారి పైకి లేచి సిద్దార్థ్ చెయ్యి పట్టుకుని "సిద్దూ..... ఎందుకలా ఉంటున్నావు" అంది సముద్ర

సమాధానం చెప్పలేదు సిద్దార్థ్...... చేతిని విడిపించుకోబోయాడు.... కానీ సముద్ర వదల్లేదు.... దాంతో అతి కష్టం మీద వదిలించుకోబోయాడు సిద్దార్థ్......

సిద్దార్థ్ చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్న సముద్ర భయంతో ఒక్క క్షణంలో సిద్దార్థ్ గుండెల్లో ఒదిగిపోయింది ఏడుస్తూ..... " సిద్దూ..... ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు.... ఎందుకిలా అయిపోతున్నావు.... ఏదైనా ప్రాబ్లమా..... ఏమున్నా చెప్పు సిద్దూ....." అంది

ఏం మాట్లాడలేదు సిద్దార్థ్...

"నేనేదైనా తప్పు చేసానా సిద్దూ..... తెలియక నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు సిద్దూ.... నువ్వు ఇలా ఉంటే నాకేం తోచడం లేదు..... భయంగా ఉంది....." అంది సముద్ర సిద్దార్థ్ ని గట్టిగా హత్తుకుంటూ

"తప్పు చేసింది నువ్వు కాదు సముద్ర.... నేను.... నేనే చేసాను..... అదెంత పెద్ద తప్పు అంటే నన్నే కాక నాతో పాటూ నిన్నూ, మన బిడ్డని బలి తీసుకునేంత...." అంటూ సముద్రతో చెప్పాలనిపించింది సిద్దార్థ్ కి....

కానీ చెప్పలేకపోయాడు..... బలవంతంగా విడిపించుకుని గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు.....

మరో రెండు నిమిషాలకు హాల్లో నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న సముద్ర గొంతు వినిపించింది......

అది వినగానే మౌనంగా రోదించాడు సిద్దార్థ్..... ఒక్క క్షణం జాహ్నవి మీద అంతులేని కోపం వచ్చింది..... ఫోన్ చేసి తిట్టాలనిపించింది..... అందుకే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.....

"నువ్వేం తప్పు చెయ్యలేదా....." అని నిలదీసింది మనసు.....

"నిజమే.... నేను తప్పు చేశాను.... ఎయిడ్స్ ప్రాణాంతకం అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించాను...... ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను..... " అనుకుంటూ సిద్దూ ఆలోచనలతోనే పడుకున్నాడు....

మనం ఏదైనా విషయంలో తప్పు చేస్తే అది పరిస్థితి ప్రభావం వల్ల చేయాల్సి వచ్చిందని మనసుకి సంజాయిషీ ఇచ్చుకుంటాం.... కానీ అదే తప్పు ఎదుటివారు చేస్తే ఒప్పుకోలేం.... అదే మానవ నైజం....

మరుసటి రోజు యధావిధిగా సిద్దూ ఆఫీసుకి బయలుదేరి వెళ్ళేసరికి ఆఫీసులో అందరూ దేని గురించో సీరియస్ గా మాట్లాడుకోవడం గమనించి అక్కడకు వెళ్లాడు సిద్దార్థ్ "ఏమైంది...... దేని గురించి అంత సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు" అంటూ

"ఎయిడ్స్ గురించి...." అన్నాడు ఒకతను

ఆ మాట వినగానే వెళ్తున్న సిద్దార్థ్ ఒక క్షణం ఆగిపోయాడు..... తనకు ఎయిడ్స్ ఉందనే విషయం వీళ్లందరికీ తెలిసిపోయిందా అనే భయం కలిగింది అతనికి......

ఇంతలో ఇంకొకతను "ఈ పేపర్ చూడు సిద్దూ.... ప్రపంచంలో మన దేశం ఎయిడ్స్ లో రెండవ స్థానంలో ఉందంట..... కొన్ని సంవత్సరాలు పోతే దాదాపు పది కోట్ల మంది వరకూ ఎయిడ్స్ బారిన పడొచ్చని రాసారు..... " అన్నాడు

విషయం తన గురించి కాదని తెలిసి కాస్త సంతోషం కలిగినా అది కనపడనీయకుండా వెళ్లి పేపర్ తీసుకున్నాడు సిద్దూ.....

ఆ క్రమంలో తన చెయ్యి వణుకుతుండటం తనకు స్పష్టంగా తెలిసింది......

సిద్దూ హెడ్ లైన్స్ చదువుతుండగానే వెనుక నుంచి ఒకామె ఒక ఫోటో చూపిస్తూ "ఈ పసిపిల్లలని చూశారా..... వీళ్లేం పాపం చేశారు అసలు..... అభం శుభం తెలియని ఈ పసిపిల్లలు కూడా హెచ్ఐవీ బారిన పడ్డారు...... పాపం కదా" అంది సానుభూతి చూపిస్తూ

"నిజమే..... పెద్దవాళ్ళు నిర్లక్ష్యంతో చేసే పనులకు ముక్కుపచ్చలారని పసిపిల్లలు బలి అవుతున్నారు..... అసలు దీనికంతటికీ కారణమైన వాళ్లని అనాలి ముందు.... కనీసం రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నచ్చిన వాళ్లతో ఎంజాయ్ చెయ్యడం.... ఎయిడ్స్ తెచ్చుకోవడం....." అంటూ సానుభూతితో కలిసిన విసుగుని ప్రదర్శించింది ఒకావిడ.....

"హలో మేడమ్..... ఎయిడ్స్ అనేది తిరిగితేనే కాదు..... పొరపాటున డిస్పెంసరీ చెయ్యని ఇంజక్షన్స్ వాడటం వల్ల కూడా రావచ్చు..... బ్లడ్ ఎక్కించడం వల్ల కూడా రావచ్చు......" అన్నాడు ఒకతను

"బ్లడ్ ఎక్కించేటప్పుడు పరీక్షలు చేస్తారు కదా....." అన్నారొకరు

"ఒక్కోసారి ఎంత పరీక్ష చేసినా ఫాల్స్ రిపోర్ట్ వచ్చే అవకాశముంది...... " అన్నారు ఇంకొకరు

ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా అవేవీ సిద్దార్థ్ మనసులోకి వెళ్లడం లేదు..... తను ఇందాక ఫోటోలో చూసిన పసిపిల్లల దగ్గరే ఆగిపోయింది మనసు......

రేపటి రోజున తన బిడ్డను అలాంటి పరిస్థితుల్లో ఊహించుకోవడానికి భయమేసింది..... ఏం చెయ్యాలో అర్థం కాలేదు..... వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు......

"ఏంటి సిద్దూ..... ఈ మధ్య బాగా డల్ అయిపోయావు.... ఇంట్లో గొడవలా లేక ఒంట్లో బాగోలేదా" అంటూ పలకరించాడో మిత్రుడు.....

"ఏం లేదు..... " అంటూ బలవంతంగా నవ్వి మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు సిద్దార్థ్......

చాలాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి త్వరగా పని ముగించుకుని ఆఫీసుకి లీవ్ పెట్టి ఇంటికి వెళ్లాడు సిద్దూ......

అంత త్వరగా ఇంటికి వచ్చిన సిద్దూని చూసి సముద్ర మొదట ఆశ్చర్యపోయినా అతనిలో కొంత చురుకుదనం కనిపించేసరికి ఆనందంగా "ఏమైంది సిద్దూ.... ఆఫీస్ అయిపోయిందా....." అంటూ వచ్చింది

"నీతో మాట్లాడాలి సముద్రా..... వచ్చి కూర్చో.... " అంటూ సోఫా చూపించాడు సిద్దూ.....

సముద్ర కూడా ఎప్పుడెప్పుడు సిద్దూతో మాట్లాడుదామా అని ఎదురు చూస్తుండటంతో ఆనందంగా కూర్చుని "చెప్పు సిద్దూ...." అంది

ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని "మనకీ బిడ్డ వద్దు.... నువ్వు అబార్షన్ చేయించుకో....." అన్నాడు సిద్దార్థ్

"వాట్....." అంది సముద్ర తనేం విందో అర్థం కాక

"నువ్వు కరెక్ట్ గానే విన్నావు..... " అన్నాడు సిద్దార్థ్

"ఎందుకు....." అంది సముద్ర..... అప్పటికే గొంతు పూడుకుపోవడంతో మాట బయటకు రాలేదు.....

"నాకిష్టం లేదు....." అంటూ అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు సిద్దార్థ్......

సముద్రకి తలంతా మొద్దుబారిపోయింది..... తన బిడ్డ..... తన కడుపులో నవ మాసాలు మోసి కనే బిడ్డ గురించి ఎన్ని కలలు కంది.... ఎన్ని ఊహించుకుంది.... ఎంత ప్రేమను పెంచుకుంది.... కానీ ఇప్పుడు అదే బిడ్డను చంపుకుందామని సిద్దార్థ్ చెప్పడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు......

భయంతో కడుపు మీద చెయ్యి పెట్టుకుంది..... అంతే ఒక్కసారిగా తన బిడ్డ మీద ప్రేమ పెల్లుబికింది..... అలాంటి ఆలోచన తన భర్తకు వచ్చినందుకు కుమిలిపోయింది.....

చాలా సేపటి తరువాత ఒక నిర్ణయానికి వచ్చింది.... వెంటనే లేచి తలుపు దగ్గరకు వెళ్లి "సిద్దూ..... ఒకవేళ నువ్వు చెప్పినదానికి నేను ఒప్పుకోకపోతే" అంది

"నన్ను మర్చిపో..." అన్నాడు సిద్దార్థ్

"ఇదే ఆఖరి నిర్ణయమా....." అడిగింది సముద్ర

"అవును....." అన్నాడు సిద్దార్థ్

"అయితే నా ఆఖరి నిర్ణయం కూడా విను..... నా బిడ్డ నా ఇష్టం..... నీకు పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకానీ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడితే నేను నా బిడ్డను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను..... నాకు నా బిడ్డ కావాలి....." అంది సముద్ర

మౌనంగా ఉండిపోయాడు సిద్దూ.....

"మాట్లాడు సిద్దూ...." అడిగింది సముద్ర

"మాట్లాడటానికి మన మధ్య ఇంకేం మిగలలేదు...." అన్నాడు సిద్దార్థ్ కఠినంగా

మరు క్షణం ఉన్నచోటే కుప్పకూలిపోయింది సముద్ర..... సిద్దార్థ్ బయటకు రాలేదు.... వస్తే తను సముద్రకు నిజం చెప్పేస్తాడు.... అప్పుడు సముద్ర తనని అసహ్యించుకుంటుంది..... ఆ ఊహ కూడా అతను భరించలేకపోతున్నాడు.....

ఒక్కోసారి ఇలా భయంతో బతకడం కన్నా చచ్చిపోవడం మేలనిపిస్తోంది తనకు.... కానీ చచ్చిపోయాక అయినా డాక్టర్ రిపోర్ట్స్ లో తనకు హెచ్ఐవీ ఉందనే విషయం అందరికీ తెలుస్తుంది....

అప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకుంటారు.... సముద్రకి కూడా ఉందేమో అనే అనుమానంతో తనని దూరం పెడతారు..... అందుకే ఆ ఆలోచన మానుకున్నాడు.....

ఆ రాత్రంతా ఎవరికీ కంటి మీద కునుకు లేదు..... మరుసటి రోజు నుంచి సముద్ర సిద్దూతో మాట్లాడలేదు..... సిద్దూ కూడా మాట్లాడించలేదు.... ఎవరి దారిన వారు ఉదయాన్నే బయటకు వెళ్లి సాయంత్రం వస్తున్నారు....

సముద్ర ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందని అర్థమైంది సిద్దూకి..... సముద్ర ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరి మాటా వినదు..... ఇప్పుడు తనకు భర్త కన్నా బిడ్డే ముఖ్యమనుకుంటోంది..... ఆ విషయం సిద్దూకి తొందరగానే అర్థమైంది.....

ఏం చెయ్యాలో తెలీక రోజులు గడుపుతున్నాడు సిద్దూ.... ఇలా మరో నెల రోజులు గడిచాయి.....

ఈ నెల రోజుల్లో ఎన్నో మార్పులు.... ఇద్దరికీ సరైన తిండి లేదు.... కంటి నిండా నిద్రలేదు.... దాంతో ఆరోగ్యం క్షీణించింది.....

ఇలా ఉండగా ఒకరోజు సిద్దూ ఆఫీసుకి వెళ్ళాక తనకొక ఫోన్ వచ్చింది..... వెంటనే కంగారుగా హాస్పిటల్ కి వెళ్లాడు......

అతను వెళ్లేసరికి సముద్ర తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు..... వాళ్ళు సిద్దూని చూడగానే ఏడుస్తూ "బాబూ.... మా కూతురు" అంటూ చెప్పలేక ఐసీయూ వైపు చూపించారు.....

ఐసీయూ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు లోంచి లోపలికి చూశాడు సిద్దార్థ్..... అక్కడ బెడ్ పై సముద్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.... అది చూడగానే సిద్దూకి ఏడుపు తన్నుకొచ్చింది....

ఇంతలో ఎవరో అడగడంతో సముద్ర పరధ్యానంగా రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయ్యిందని బలరామ్ గారు చెప్పడం వినిపించింది.....

సముద్ర..... తన సముద్ర..... ఇప్పుడు తన వల్లే ఈ పరిస్థితిలో ఉంది..... స్వచ్ఛమైన నవ్వుతో అమాయకంగా ఉండే సముద్రలో సుడిగుండం లాంటి ఆలోచనలు కలిగించింది తనే అనే ఆలోచన రాగానే తన మీద తనకే అసహ్యం వేసింది.....

సిద్దార్థ్ ఇలా బాధ పడుతూ ఉండగానే డాక్టర్ బయటకు వచ్చి అర్జెంటుగా బ్లడ్ అరేంజ్ చెయ్యమని చెప్పాడు......

అది వినగానే సిద్దార్థ్ కంగారుగా పైకి లేచి బ్లడ్ కోసం తనకు తెలిసిన వాళ్లకి ఫోన్ చెయ్యడానికి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.....

ఇంతలో "మా అల్లుడి గారిది, సముద్రది ఒకే బ్లడ్ గ్రూప్ డాక్టర్......" అంది సునంద

అప్పుడు గుర్తొచ్చింది సిద్దార్థ్ కి తనదీ, సముద్రదీ ఒకే బ్లడ్ గ్రూప్ అని.... కానీ ఇప్పుడు తను బ్లడ్ ఇస్తే తనకు హెచ్ఐవీ ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది..... ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగానే

"అవునా..... అయితే మీరు నాతో రండి....." అంటూ సిద్దార్థ్ ని తనతో తీసుకెళ్లాడు డాక్టర్

సిద్దార్థ్ డాక్టర్ తో మాట్లాడటానికి ప్రయత్నించాడు.... ఇంతలో డాక్టర్ "మీరేం కంగారు పడకండి.... మీ భార్యాబిడ్డలని మేము క్షేమంగా కాపాడుతాం.... " అంటూ సిద్దార్థ్ కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు....

కాసేపటికి బ్లడ్ తీసుకుని డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లబోయాడు..... ఇంకొన్ని క్షణాలే ఉన్నాయి.... సిద్దార్థ్ ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తన రక్తాన్ని సముద్ర ఒంట్లోకి ఎక్కించేస్తారు.....

అందుకే కంగారుగా వెళ్లి "డాక్టర్...... నా బ్లడ్ సముద్రకి ఎక్కించకండి......" అన్నాడు సిద్దార్థ్

"ఎందుకు...." అడిగాడు డాక్టర్

"అందులో హెచ్ఐవీ ఉంది....." అన్నాడు సిద్దార్థ్

"ఎవరు చెప్పారు......" అడిగాడు డాక్టర్ ఆశ్చర్యంగా

జరిగినదంతా చెప్పాడు సిద్దార్థ్..... మొత్తం విన్న తరువాత డాక్టర్ సూటిగా సిద్దార్థ్ వైపు చూస్తూ "నీకసలు హెచ్ఐవీ లేదు సిద్దార్థ్....." అన్నాడు

"వాట్...." అన్నాడు సిద్దార్థ్ షాకింగ్ గా

"అవును.... కావాలంటే రిపోర్ట్స్ చెక్ చేసుకో....." అంటూ రిపోర్ట్స్ చూపించాడు డాక్టర్

నిజమే.... అందులో హెచ్ఐవీ నెగటివ్ ఉంది.... అది చదివాక ఆనందంగా ఉన్నా మళ్ళీ అనుమానంగా "ఫాల్స్ రిపోర్ట్ ఏమో...." అన్నాడు

"ఇది ఫాల్స్ రిపోర్ట్ కాదు..... ఇక్కడ మీ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చూడండి కావాలంటే..... అంతా నార్మల్ గానే ఉంది....." అన్నాడు డాక్టర్

"ఇదంతా నిజమా డాక్టర్....." ఆనందంగా అడిగాడు సిద్దార్థ్......

అవునన్నట్టు చిరునవ్వు నవ్వాడు డాక్టర్

"థ్యాంక్యూ..... థ్యాంక్యూ సో మచ్ డాక్టర్" అన్నాడు సిద్దార్థ్ డాక్టర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ

"చూడు సిద్దార్థ్.... అందరూ ఎయిడ్స్ అనగానే ఎందుకంత భయపడతారో నాకర్థం కాదు.... ఎయిడ్స్ ఒక జబ్బు మాత్రమే..... అందరూ అన్నట్లు ఎయిడ్స్ ప్రాణాంతకం కాదు..... మనసే ప్రాణాంతకం.....

ఎయిడ్స్ వచ్చిందేమోననే అనుమానం కలగగానే అర్థం లేని భయాలను సృష్టించుకుంటారు.... ఆత్మీయత, ఆదరణలకు దూరమవుతారు..... దాని ద్వారా ఒంటరితనంగా ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్తారు..... భయాందోళనకు గురై సరైన పౌష్టికాహారం తీసుకోవడం మానేస్తారు.... తద్వారా శరీరంలో ఉన్న రక్త కణాలు తగ్గిపోయి చావుకి దగ్గరవుతారు......

అదే గనుక ఎయిడ్స్ ఉందని తెలియగానే ధైర్యంగా ఉండి, సరైన పౌష్టికాహారం తీసుకుంటూ, వైద్యం చేయించుకుంటే ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు....

ఒక మనిషి బతకడానికి ప్రాణం ముఖ్య కారణమే అయినా అతను ఎక్కువ కాలం బతకడానికి ప్రేమ, ఆదరణలే ఎక్కువ దోహద పడతాయి......

కాబట్టి అర్థం లేని ఆలోచనలను, భయాలను పక్కన పెట్టి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండు....." అన్నాడు డాక్టర్ సిద్దార్థ్ భుజం తడుతూ

"డాక్టర్.... ఒక విషయం అడగొచ్చా....." అన్నాడు సిద్దార్థ్

అడగమన్నట్టు చూశాడు డాక్టర్.....

"జాహ్నవికి ఎయిడ్స్ ఉంటే మరి నాకెందుకు రాలేదు... అదెలా సాధ్యం" అన్నాడు సిద్దార్థ్

"హెచ్ఐవీ ఉన్న మనిషితో కలిసినంత మాత్రాన హెచ్ఐవీ సంక్రమించదు.... ఆ సమయంలో నీ శరీరంలో గాట్లు ఉంటేనే హెచ్ఐవీ సంక్రమించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది....." అన్నాడు డాక్టర్

"థ్యాంక్యూ డాక్టర్...... ఇంకెప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యను" అన్నా సిద్దార్థ్.... ఇప్పుడతనికీ చాలా ధైర్యంగా ఉంది......

ప్రతి మనిషీ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు.... కానీ వాటి వల్ల జరిగే అనర్థాన్ని గ్రహించి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఆ తప్పుని సరిదిద్దుకునేవాడే నిజమైన మానవుడు.....

మరో రెండు గంటలకు ఆపరేషన్ పూర్తయింది.... సిద్దార్థ్ మాట్లాడాలని ప్రయత్నించినా సముద్ర మాట్లాడలేదు.....

రెండు రోజుల తర్వాత సముద్రను డిశ్చార్జ్ చేసారు.... సముద్రకి సహాయంగా సునంద, బలరామ్ కూడా అక్కడే ఉండటంతో వారందరి ప్రేమ, ఆప్యాయతల కారణంగా తొందరగానే కోలుకుంది సముద్ర....

దాంతో సునంద, బలరామ్ సముద్ర, సిద్దార్థ్ లకు జాగ్రత్తలు చెప్పి ఊరికి వెళ్లిపోయారు.....

ఆరోజు రాత్రి......

సముద్ర భోజనం ముగించుకుని పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది... తన రాక కోసమే ఎదురు చూస్తున్న సిద్దార్థ్ వెనుక నుంచి సముద్రని గట్టిగా హత్తుకున్నాడు.....

"వదలండి....." అంది సముద్ర కోపంగా

అయినా వదల్లేదు సిద్దార్థ్...... బలవంతంగా విడిపించుకోవటానికి ప్రయత్నించింది.... కానీ సాధ్య పడలేదు...... దాంతో గింజుకుంటున్న సముద్ర తన భుజానికి తగిలిన కన్నీటి స్పర్శకి వెనక్కి తిరిగింది....

ఎదురుగా కన్నీళ్ళతో నిలబడిన సిద్దార్థ్ ని చూడగానే కంగారుగా "ఏమైంది సిద్దూ.... ఈ కన్నీల్లేంటి" అంది సముద్ర

"నన్ను క్షమించు సముద్రా....." అన్నాడు సిద్దార్థ్

ఆ తర్వాత జరిగినదంతా చెప్పాడు సిద్దార్థ్..... మొత్తం విన్న తర్వాత సముద్ర సిద్దార్థ్ జుట్టు సవరిస్తూ "ఈ విషయం చెప్పడానికి ఇంత బాధపడ్డారా..... " అంది

అవునన్నట్టు తలూపాడు సిద్దార్థ్.....

"నేను మీ భార్యని..... చావైనా, బ్రతుకైనా మీతోనే అని నిర్ణయించుకున్నాకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను... అలాంటిది ఇప్పుడు మీకు దూరమవుతానని ఎలా అనుకుంటారు..... ఈ సముద్ర ఎప్పటికీ సిద్దార్థ్ తోనే ఉంటుంది..... అప్పుడే తనకు అందం, ఆనందం రెండూ....." అంది సముద్ర

ఆనందంతో సముద్రని చుట్టేశాడు సిద్దార్థ్..... చాలా రోజుల ఎడబాటుని కరిగిస్తూ ఆ రోజు నుంచి ప్రతి రాత్రీ వారికి వసంతరాత్రిగా మారి ఎన్నో మధురానుభూతులని మిగిల్చింది.....

సంవత్సరం తరువాత.....

ఒక పెద్ద బిల్డింగ్ ముందు కార్ ఆపాడు సిద్దార్థ్.... వెనుకే దిగిన సముద్ర చేతిలోంచి తన బంగారు కొండ సూర్యని తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని ఒక చేత్తో సముద్ర చేతిని అందుకుని ముందుకు నడిచాడు సిద్దార్థ్......

ఇంతలో చాలా మంది ఆఫీసర్లు, డాక్టర్లు, మీడియా వాళ్ళు సిద్దార్థ్ ని చుట్టేశారు....

సిద్దార్థ్ వారందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్లాడు......

"సూర్య ఎయిడ్స్ కౌన్సెలింగ్ సెంటర్" అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డును తనివితీరా చూసుకుని సూర్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి లోపలికి అడుగు పెట్టారు సముద్ర, సిద్దార్థ్ లు ఇద్దరూ సూర్యతో కలసి.....

సమాప్తం********

ప్రపంచమంతా సాంకేతిక, వైద్య రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా మన చుట్టూ ఉన్న సమాజం మాత్రం ఎయిడ్స్ అనే పదం వినేసరికి తమ ఆలోచనా ధోరణిని మార్చుకోలేకపోతున్నారు.. వారు చూపించే వివక్షకు భయపడి చాలా మంది ప్రేమ, ఆదరణలకు నోచుకోక తక్కువ సమయంలోనే మరణానికి దగ్గర అవుతున్నారు....

అందుకే ఈ కథ ద్వారా నాకు తెలిసినంత వరకు ఎయిడ్స్ సోకిందని తెలిసిన వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలు, భయాలు ఉంటాయో తెలియచెప్పే ప్రయత్నం చేసాను.... వాళ్ళు అసలే భయంతో క్రుంగిపోయి ఉంటారు.... అలాంటి వారికి మీరు సానుభూతి చూపించకపోయినా పర్లేదు మీ మాటలతో, చూపులతో బాధ పెట్టకండి..... వీలైతే ఆదరించండి.... లేదా ధైర్యం చెప్పండి.... అదీ కుదరకపోతే సాటి మనిషిగా అయినా గౌరవమివ్వండి....

ఈ కథ ద్వారా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతినుంటే నన్ను క్షమించండి.....

ఇట్లు ❤️

మీ కొల్లా మల్లీశ్వరిRate this content
Log in

More telugu story from Malleswari Kolla

Similar telugu story from Drama