Sai Sankar Mukkanti

Drama Inspirational

4.5  

Sai Sankar Mukkanti

Drama Inspirational

మీ రైల్వే స్టేషన్

మీ రైల్వే స్టేషన్

5 mins
222


నేనో రైల్వే స్టేషన్ని.ఇదేంటి ఓ రైల్వే స్టేషన్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? నాకు జీవం లేకపోయినా ఎన్నో జీవితాలని దగ్గరి నుండి చూసిన అనుభవం ఉంది. నాకు ప్రాణం లేకపోయినా ఓ మనసుంది ఆ మనసుని కదిలించే మనుషులూ ఉన్నారు.ఆ మనుషుల కథలు చెప్పడానికే ఈ రోజు మీ ముందుకి వచ్చాను.రోజూ కొన్ని వేలమంది మనుషులని చూస్తుంటాను నేను,ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు ఎక్కడినుండో వచ్చేవాళ్ళు. కలిసిపోయే మనుషులు విడిపోయే మనసులు.ఇలా ఎన్నో భావోద్యేగాలకి నేను సజీవ సాక్షిని.ఎన్నో కథలు రోజూ నా ఎదురుగా జరుగుతుంటాయి.కానీ ఒకే రోజు నా మనసుకి ఆనందం,భాద,హాయి, సంతోషం,దుఃఖం ఇలా ఎన్నో రకాల భావాలు కలిగించిన ఐదుగురి జీవితాలను,వాళ్ళ కథలను మీకు చెప్పాలని ఈరోజు ఇలా వచ్చాను...


1.గూటికి చేరిన పక్షి

సమయం ఉదయం 9. 30

నాలుగేళ్ల వయసులో అమాయకంగా అయోమయంగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ నా ఒడిలో వచ్చి చేరాడు , రెండు శరీరాలు కలిస్తే పుట్టాడు , ఇద్దరు మనుషులు విడిపోతే వాడు వీధినపడ్డాడు.అందరిలా చదువుకోవాలని వాడి కోరిక కానీ వాడి రాత మరోలా ఉంది.కడుపు నింపుకోడానికి రోజంతా మొదటి ప్లాటుఫారంలో కాఫీ టీలు అమ్ముతుండేవాడు ,రాత్రి చివరి ప్లాటుఫారంలో పడుకునేవాడు, ఐదేళ్లుగా వాడు నా దగ్గరే ఉంటున్నాడు.చదువంటే పిచ్చి వాడికి,బాబుగాడికి ఒకటే కోరిక,వాడిలా ఎవరూ లేని పిల్లలకి చదువు చెప్పించాలని ,వాళ్లందరికీ తోడుగా ఉండాలని.ఆరోజు కూడా ఎప్పటిలానే కాఫీ టీ అమ్ముతూ తిరుగుతున్నాడు. ఎవరో ఒకాయన సుమారు 45ఏళ్ల వయసు, బాబు గాడి కోసం వెతుకుతున్నాడు. నిన్న రాత్రి చివరి రైలుకి దిగాడు అతను,ప్లాటుఫారంలో బాబు గాడ్ని వాడి పక్కన ఉన్న పాత పుస్తకాలని చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు,తరువాత వెళ్ళిపోయాడు కాసేపటికి, మళ్ళి ఇప్పుడు బాబు కోసం వచ్చాడు.దూరంగా రైలు పెట్టె పక్కన నిల్చున్న బాబుగాడు కనిపించాడు ఆయనకి. ఆయన నిన్నే ఈ ఊరికొచ్చిన కొత్త కలెక్టరు గారంట . వీధిబాలలందరిని హాస్టల్ లో చేర్చి చదువు చెప్పించడం తన మొదటి పనిగా పెట్టుకున్నారట. బాబు గాడి దగ్గరికెళ్లి ఎం బాబు నీకు చదువంటే ఇష్టమా??? బాగా చదువుకుంటావా?? నేను చదివిస్తా మరి,నాతో వస్తావా నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అక్కడ. వస్తావా అని అడిగాడు. బాబు గాడి మొహంలో ఎప్పుడూ లేని ఆనందం , ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నాడు,ఆ కలెక్టరు చేయి పట్టుకొని నాకు టాటా చెబుతూ ముందుకి కదిలాడు.

ఆశ కంటే ఆశయం గొప్పది,స్వచ్ఛమైన మనసు ,బలమైన సంకల్పం ఉంటె ప్రపంచమంతా తోడ్పాటునిస్తుంది అని బాబు గాడు రుజువు చేసాడు..


2. గెలిచి నిలిచిన కేశవ్

సమయం ఉదయం 11. 30

కేశవ్.దాదాపు నాలుగేళ్ల క్రితం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా గొడవపడి మరీ వచ్చేసాడు సినిమా కోసం. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కేశవ్ కోరిక,మళ్ళీ ఇన్నాళ్ళకి చూసాను,కానీ ఇలా చూస్తానని అసలనుకోలేదు.దూరంగా అయిదో నెంబర్ ప్లాట్ఫారం మీద , బక్కపలచని శరీరం,పీక్కుపోయిన కళ్ళు , చిరిగిపోయిన బట్టలు.ఎవరి దగ్గరినుండో డబ్బులు కాజేసి పరిగెడుతున్నాడు, కేశవ్ ని తరుముతూ ఓ నలుగురు పరిగెడుతున్నారు, పరిగెత్తే ఓపిక లేక ఆగిపోయాడు,ఎదురు తిరిగే శక్తి లేక దెబ్బలు తింటున్నాడు . దెబ్బలకి తాళలేక అరుస్తూ ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు,చలనం లేదు ఒంట్లో,ఏమైందో అని కంగారు పడుతుంటే దూరం నుంచి cut …. shot ok …….అంటూ అరిచాడు డైరెక్టరు . చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు కేశవ్ ని.టక్కున లేచి మానిటర్ దగ్గరికి వెళ్లి షాట్ చూసుకొని తన కల నిజం కాబోతున్నందుకు, త్వరలోనే తన పేరు వెండితెరపై చూడబోతున్నందుకు ఆనందంతో ఉద్వేగంతో చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటూ తరువాతి షాట్ కోసం సిద్ధం అయ్యాడు .

పట్టుదల,ఆత్మ స్థైర్యం,నమ్మకం ఉంటె ఎవరైనా ఎంత గొప్ప లక్ష్యాన్ని అయినా చేరుకోవొచ్చు అని కేశవ్ నిరూపించాడు..


3. మాస్టారి సంపాదన

సమయం సాయంత్రం 6. 00

రామనారాయణ మాస్టారు .. నడి వయసు యువకుడిగా ఉన్నప్పుడు జరిగింది ఆయనతో నా పరిచయం, ఇప్పుడు ఆయనకి ఓ మనవరాలు కూడా ఉంది.ముప్పై ఏళ్లుగా రోజూ ఉదయం ఎక్సప్రెస్ రైలులో ఉద్యోగానికి వెళ్లడం,సాయంత్రం ప్యాసింజర్ రైలుకి రావడం .నాకు ఆయనకీ ఎంతో అనుబందం ఉంది.ఎప్పుడు హుషారుగా నవ్వుతూ ఉండేవారు మాస్టారు. కానీ ఈ మధ్య ఆ చలాకీతనం లేదు.ఇవాళ ఎందుకో ఎన్నడూ లేనంత దిగాలుగా ఉన్నారు,రోజాటికంటె ఒక అరగంట ముందే వచ్చి మొదటి ప్లాటుఫారం లో నా ఒడిలో కూర్చున్నారు. కళ్ళ నిండా నీళ్లు,ఎదో చెప్పాలని ఉన్నా చెప్పలేక భాదపడుతూ ఉండిపోయారు.కారణం ఏమిటో తెలీదు రైలు వచ్చింది మాస్టారు వెళ్ళిపోయారు. సాయంత్రం ప్యాసింజర్ ఎప్పుడు వొస్తుందా అని ఎదురుచూడసాగాను . సాయంత్రం రైలు వచ్చింది,మాస్టారు దిగి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చాలా దిగాలుగా ఉన్నారు . కళ్ల నిండా నీళ్లు,ఎదో పోగొట్టుకున్నాననే భాద మోహంలో తెలుస్తోంది,ఎందుకో తెలీని ఆందోళన,వణుకు ఆయన నడకలో తెలుస్తుంది.వేరే పెట్టె లోనుంచి కొంత మంది దిగారు,ఇంకో పెట్టె నుంచి ఇంకొంతమంది పిల్లలు పెద్దలూ కలుపుకొని దాదాపు 70,80 మంది దిగి మాస్టారి దగ్గరికి కదిలారు. వాళ్ళని చూడగానే మాస్టారు ఎందుకో మరింత కంగారు పడ్డారు.వాళ్లంతా మాస్టారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ చేరి మాస్టార్ని ఓదారుస్తున్నారు . వాళ్ళుకూడా ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు.వాళ్లంతా రామనారాయణ మాస్టారి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు. ఈ రోజు మాస్టారి రిటైర్మెంట్.ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి పుస్తకంలోని పాఠాలు, జీవిత పాఠాలు చెప్పారు. మాస్టారు చదువు చెప్పిన మొదటి బ్యాచ్ విద్యార్థులు నుండి ఇప్పుడు చదువుతున్న పిల్లల వరకు అందరూ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాస్టారు కోసం . ఆయన ఇన్నేళ్ళలో సంపాదించుకుంది వీళ్లందరి ప్రేమ అభిమానాలే .

నిబద్దత , అంకిత భావం తో పని చేస్తే అమూల్యమైన ఎన్నో జ్ఞాపకాలను.ఎప్పటికి తరగని గౌరవం ప్రేమ, ఆప్యాయతలను పొందవచ్చు అని రామనారాయణ మాస్టారు రుజువు చేసారు..


4.రాధామాధవీయం

సమయం సాయంత్రం 8. 15

మూడో నెంబర్ ప్లాట్ఫారం దగ్గర మాధవ్ కోసం ఎదురుచూస్తుంది రాధ.ఆరింటికల్లా మాధవ్ రావాలి కానీ ఇంకా రాలేదు,నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి తనకి,చీకటి పడుతుంది కంగారు పెరిగిపోతుంది.ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం అయింది. వచ్చిన ప్రతీ లోకల్ రైల్లో వెతుకుతుంది మాధవ్ ఎక్కడా లేడు.సమయం గడిచే కొద్దీ రాధ లో భయం పెరిగిపోతుంది.ఎనమిది గంటలైంది .ప్లాట్ఫారం దగ్గరే బెంచి మీద దిగాలుగా ఏడుస్తూ కూర్చుంది రాధ.వెనక నుంచి ఎవరో మెల్లిగా నడుస్తూ రాధ భుజం మీద చేయి వేశారు . ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది రాధ.చేతిలో ఉన్న తన హ్యాండ్బ్యాగ్ తో అతన్ని దబదబా నాలుగు దెబ్బలు వేసింది . అతను బిగ్గరగా నవ్వుతూ అడ్డుకోబోయాడు. రాధ కోపంతో తన చేత్తో కొట్టేసింది.అతని కళ్ళజోడు పడిపోయింది,చేతిలో ఉన్న కర్ర దూరంగా పడింది ,అతను కూడా కింద పడబోతుంటే టక్కున పట్టుకుంది రాధ .. వచ్చింది మాధవ్ . ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత ఆలస్యం చేసినందుకు కోపంతో ఇదంతా చేసింది రాధ

ప్రేమంటే ఏమిటో నాకు రాధ మాధవ్ లని చూసే దాకా తెలీదు .ఇద్దరు మనుషులు,మనస్తత్వాలు కలిస్తేనే ప్రేమ అనుకునే మనుషులున్న ఈ కాలంలో,ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరికొకరు తోడు నడుస్తూ . ప్రేమంటే శాశ్వతమైన బంధం.అనిర్వచనీయమైన ఆనందం అని తమ ప్రేమకథతో నాకు తెలిసేలా చేసారు.మాధవ్ కి కళ్ళు కనిపించవు. ఓ ప్రమాదంలో తన కంటి చూపు పోయింది. మాధవ్ అద్భుతమైన రచయిత.మాటల్తో మనసుని కదిలించేలా కరిగించేలా రాయగలడు . మాధవ్ కవితలంటే రాధకి పిచ్చి.ఆలా ఒకరికొకరు పరిచయం అయ్యారు.ఆ పరిచయం ప్రణయం,పరిణయం దాకా వెళ్ళింది. రాధ ఓ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. మాధవ్ ప్రస్తుతం ఓ సినిమాకి మాటలు,పాటలు రాస్తున్నాడు,రోజూ రైల్లో సినిమా ఆఫీసుకి వెళ్లి వస్తుంటాడు.సాయంత్రం రాధ మాధవ్ లు కలిసి ఇంటికి వెళ్తుంటారు. ఆలస్యం అయ్యేసరికి భయం తో కంగారుతో మాధవ్ ని ఆలా కొట్టేసింది రాధ . ఈ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టిన మనుషులు.రాధకి మాధవే బలం బాధ్యత . మాధవ్ కి రాధే ధైర్యం . మాధవ్ రాసే కవితలకు కలం తానైతే కాగితం రాధ .ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు . ఒకరులేకపోతే ఇంకొకరు లేరు.అందుకే వాళ్లిద్దరూ 1+1 = 1.


5. పడిలేచిన కెరటం ఫర్జానా

సమయం రాత్రి 9. 00

ఫర్జానా,ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద మరో అరగంటలో రావాల్సిన రైలు కోసం ఎదురుచూస్తుంది.ఇపుడు నేను చూస్తున్న ఫర్జానా,మూడు నెలల క్రితం నేను చూసిన ఫర్జానా వేరు.అప్పుడు తనో చలాకి అల్లరి పిల్ల.తన తండ్రి కలనే తన లక్ష్యంగా మార్చుకుంది.ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఫర్జానాకి తన తండ్రి అంటే.డాక్టర్ గా తన తండ్రి ముందు నిల్చోవాలని తన పట్టాని తండ్రికి అందివ్వాలని ఎన్నో కలలు కంది .కానీ అనుకున్నవి అన్నీ జరిగితే అని జీవితం అవ్వదు.సరిగ్గా ఫర్జానా డాక్టర్ పట్టా అందుకున్న రోజునే పూంచ్ సెక్టార్ దగ్గర జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఫర్జానా తండ్రి మొహమ్మద్ నవాజుద్దీన్ వీర మరణం పొందాడు.నవాజ్ పార్థివదేహాన్ని తోటి సైనికులు జమ్మూ నుండి తీసుకువచ్చారు.ఇదే మొదటి నెంబర్ ప్లాట్ఫారం మీదే గుండె పగిలేలా ఏడ్చిన ఫర్జానాని చూసి రాయినైన నాకే మనసు చెలించింది.ఏ తండ్రి కోరిక మీద డాక్టర్ అయ్యిందో ఆ తండ్రి నిర్జీవంగా పడి ఉండడం చూసి ఫర్జానా ప్రాణం తల్లడిల్లిపోయింది.తనకి ఇది ఎవరూ తీర్చలేని నష్టం.తను మళ్ళీ మాములు మనిషిగా మారడానికి చాలా సమయం పడుతుందనుకున్నా.కానీ మూడునెలలు కూడా గడవకముందే తనని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది .ఇప్పుడు తను వెళ్తుంది జమ్మూకి ,అక్కడ ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా తనకి ఉద్యోగం వచ్చింది.ప్రాణాలని లెక్కచేయక పోరాడే సైనికులకు వైద్యం చేయడానికి ఇప్పుడు తను బయల్దేరుతుంది.తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయ్యింది.తండ్రి ఆశయం కోసం ఆర్మీలో చేరింది . నవాజ్ ఎక్కడున్నా ఈరోజు ఫర్జానాని చూసి ఎంతో గర్వపడుతూ ఉంది ఉంటాడు .

తనిప్పుడు డాక్టర్ ఫర్జానా ఫాతిమా D /o మేజర్. మహమ్మద్ నవాజుద్దీన్

ఇలాంటి మరికొందరి జీవితాలని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు

– మీ రైల్వే స్టేషన్


Rate this content
Log in

Similar telugu story from Drama