Achari Veeramallu

Inspirational Tragedy

4.8  

Achari Veeramallu

Inspirational Tragedy

కాగితం పడవలు

కాగితం పడవలు

2 mins
1.9K


సాగర తీరం..

సముద్ర జాలరులు ఒడ్డు విడిచి జాము గడిచింది..

వాతావరణం హోరాహోరీగా మారి, అల్పపీడనంలో చిక్కుకున్న ఓ సామాన్యుడి కథ..


అదిగో అస్తమిస్తున్న ఎర్రని సూరీడు హెచ్చరిస్తున్నాడు

జాగు సేయకుండా గూటికి జారుకోమని..

కనిపిస్తున్న తీరాన్ని చూస్తూంటే, చేరాలన్న ఆశ పెరిగి పోతుంది..

గూటికి చేరే పక్షులని చూస్తుంటే ఈర్ష కలుగుతుంది..

ఆకాశాన మెరిసే చుక్కలని చూస్తూంటే ఇంటికాడ వేచిచూస్తున్న భార్యా-బిడ్డలు గుర్తొచ్చారు..

మసక వెల్తురు దోవలో.. ముందుకు కదిలే నావ మీద వేగం పెంచుకుంటూ సాగిపోయా..


కురిసే నీరు, కారే కన్నీరుతో కలుస్తుంటే

చేసిన పాపాలే, నల్ల మబ్బులై కమ్ముకుంటున్నాయేమో అనిపించింది..?

బాధో..? భయమో తెలియదు, బాల్యం గుర్తొచ్చింది..

ఊయల ఆటలకన్నా, అలల వేటలు నేర్చి..

పలక పట్టకుండా, పడవలెక్కి సముద్రంలో మునిగి తేలి..

గూటికి ఎగిరే పక్షులని రాళ్లతో కొట్టి.. పిల్ల చేపలని వలవేసి పట్టా..

చేసినవి తప్పులో, ఒప్పులో తెలియవు..

ఇపుడు వెంటపడ్డాయ్..!!


కష్టాన్ని కాసుగా మార్చి, కట్టుకున్నదానికి ముక్కెర కొనాలన్న కోరిక..

వచ్చే జాతరకన్నా పిల్లలని తిప్పి చూపిస్తా అని ఇచ్చిన మాట..

చుట్టాలని, పక్కాలని పిలిచి కమ్మని భోజనం పెట్టాలన్న ఆశ..

దాచుకున్న డబ్బు, చేసిన అప్పు..

ఇలా ఎన్నో జ్ఞాపకాలు, ఇంకెన్నో ఆలోచనలు మనసులో మెదులుతూంటే..


ఉరుములు, మెరుపుల మధ్య వర్షం ముంచెత్తింది..

కెరటాల వరుస సర్రున లేచి ఎగసి పడుతుంది..

సముద్ర గోష గర్జన గా మారి విజృంభించింది..

ప్రవాహ వేగం పెరిగి, నావ దారి తప్పి తూగిసలాడి పోతుంది..

అసలే చెక్క పడవ.. తేరచాపేమో చిరిగి చిల్లు పడిపోతుంది..

పదేళ్ల కష్టం సముద్రం పాలైపోతుంది అనుకున్నా..


ఇంతలో ప్రాణభయం పట్టుకుంది..

వరుణ వర్ణం విడిచి, ఉగ్రరూపం దాల్చిన ప్రకృతికి

చేతులు ఎత్తి మొక్కా.. మోకరిల్లి వేడుకున్నా..

నా దయనీయ పరిస్థితి చూసి తుఫాను పగలపడి నవ్వింది..

ప్రాణాలతో పంపమని పంతం పట్టా..

నా వాళ్ళని కలుసుకోవాలి అని గట్టిగా అరచి, కోపంగా ఎం చేస్తావో చేసుకో అని నావ ముందుకు కదిపా..


అంత ఎత్తు సర్పంలా లేచిన ఒక అల నన్ను జడిసి కొట్టింది..

ఆ ఒక్క దెబ్బతో పడవ ముక్కలైంది సముద్రంలో పడి కొట్టుకుపోయి..

 

నిశ్శబ్దం మెల్లగా కరిగి, పక్షుల హోరు వినిపిస్తుంది..

కళ్ళు తెరిచేసరికి తీరం ఒడ్డున పడి ఉన్న, బాగా తెలవారిపోయింది..

మసక కంటికి సూర్యకాంతి తగిలింది.. భారంగా పైకి లేచి నడిచా..

ఒంటి నిండా దెబ్బలు, అప్పుడే నొప్పి తెలుస్తుంది..

నా సంకల్పమే కాపాడిందేమో..? తిరిగి వెనుకకి కూడా చూడలేదు..


ఎలాగో అలాగా ఇంటికి చేరిపోయా..

గుమ్మం దగ్గరే ఇంటిది ఇంకా ఎదురుచూస్తూ కూర్చుంది.. ఏడుచుకుంటూ వచ్చి పట్టుకుంది..

లోపల పిల్లలు ఆదమరచి నిద్ర పోతున్నారు, పాపం నిన్నంతా నా గురించి ఏడ్చి నిద్రపోయారు..

చప్పుడు సేయకుండా రోజు జీవితం గడిపేసా..



మళ్ళీ సూరీడు అస్తమిస్తున్నాడు..

దూరంగా మెరిసిపోతున్న సముద్రంతో మాట్లాడుతున్నా..

నా మీద గెలిచిన నీతో మాట్లాడుతున్నా..

ఉన్న ఒక్క పడవా పోయింది, ఒంటి నిండా దెబ్బలు..

ఇంకొన్ని రోజులు వేటకి వెళ్లే శక్తి లేదు..

అయినా నేను ఓడిపోలేదు..

 

కోరుకున్న దానికి ముక్కుపుడక ఇవ్వలెనేమో..? కానీ, ప్రేమతో హత్తుకోగలను..

పిల్లలు కోరింది కొనలేనేమో..? కానీ, ఎత్తుకు తిప్పగలను..

అందరిని పిలిచి భోజనం పెట్టలేనేమో..? కానీ కలసి బ్రతకగలను..

అందుకే నేను ఓడిపోలేదు..


నాదీ అనే అహాన్ని తీసుకుపోయి..

నిధి అనే ఆనందాన్ని మిగిల్చేసావ్..

అందుకే నేను ఓడిపోలేదు..

ఏది వదులుకోవాలో.. ఏది దాచుకోవాలో నేర్పించావ్..

అందుకే నేను ఓడిపోలేదు..

 

ఇలా ఎందరో, ఇంకెందరో

చచ్చి బ్రతికిన, ఓడి గెలిచిన వారి కథ.. ఓ సామాన్యుడి కథ..

 

*కాగితం పడవలు..

  నమ్మకం లేని జీవితాలే కావచ్చు..

  చాలా చిన్న ప్రయాణమే అవ్వచ్చు..

  ఒడ్డుకి చేరచ్చు లేదా నీట నానిపోవచ్చు.. 

  కానీ వాటికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటాయి..

     

  

మీ ఆచారి అందరివాడు..

}----------------------------------------------------------------------------------------------{

కథను కదిపిన మలుపులకి, నన్ను కదిపిన స్నేహితులకి ఈ రచన అంకితం.

}----------------------------------------------------------------------------------------------{


Rate this content
Log in

More telugu story from Achari Veeramallu

Similar telugu story from Inspirational