Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Varun Ravalakollu

Drama


4.8  

Varun Ravalakollu

Drama


ఇస్కూల్

ఇస్కూల్

5 mins 334 5 mins 334

ఇరవై సంవత్సరాల తర్వాత ఊరికి వెళ్తున్నా. పచ్చని చెట్లతో, పక్కనే వాగుతో ఉండే అందమైన ఊరు మాది. చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఎడ్లబండిలో ఊరికి వెళ్ళే నేను ఈరోజు ఒక పెద్ద కారులో వెళ్తుంటే అదోలా ఉంది.

పక్కనే ఎడ్లబండి వెళ్తుంది...

కారు దిగి అందులో వెళ్ళిపోనా?

ఎందుకో అహం అడ్డొస్తుంది!

ఊరికి వెళ్ళాలంటే మట్టి రోడ్డు ఉండేది. ఇప్పుడు తారు రోడ్డు అయ్యింది. రోడ్డుకు ఇరుపక్కలా చెట్లు మాత్రం మారలేదు. అవే చింత చెట్లు, మర్రి చెట్లు. ఇంకో పది నిమిషాల్లో ఊరు చేరుకుంటా. మనసు చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది.

***

ఎంత బాగుండేది నా బాల్యం. చిన్నప్పుడు నేను చాలా అల్లరివాణ్ణి. ఎప్పుడు ఇంట్లో ఉండేవాణ్ణి కాదు. దోస్తులతోని కలిసి వాగులో ఈత కొట్టడం. ఏ సీజన్లో ఏ పండ్లు ఉంటే వాటి కోసం తిరగడం. ఒకరోజు మామిడి పండ్ల కోసం సూరిగాడితో గొడవ పెట్టుకోవడం, ఆ గొడవలో వాణ్ణి రాయిపెట్టి కొడితే వాడి నొసలు నుండి ఒకటే రక్తం. నాకు గుండె ఆగినంత పనైంది. తర్వాత సుగుణమ్మ పెద్దవ్వ నన్ను తిట్టిన తిట్లు ఇంకా గుర్తున్నాయి. అయినా ఆ కోపం ఎన్ని రోజులులే..., రెండు రోజులకే ఎక్కడి నుండి తెచ్చిందో ఒక సంచి నిండా మామిడి పళ్ళు నాకు తెచ్చి ఇచ్చింది. పల్లెటూరి ప్రేమలు ఎంత నిర్మలంగా ఉంటాయి. ఇప్పుడు సూరిగాడు ఏం చేస్తున్నాడో, పెద్దవ్వ ఎలా ఉందో?

ఊరికి వెళ్ళగానే అందరినీ కలవాలి. శ్రీనుగాడు, రాజుగాడు, సత్తిగాడు అందరూ ఏం చేస్తున్నారో వాళ్లతో మనసారా మాట్లాడాలి. చిన్నప్పుడు తిరిగిన అన్ని చోట్లు తిరగాలి. ఆ జ్ఞాపకాలను మళ్ళీ గుండెనిండా నింపుకుని ఆ హాయిని అనుభవించాలి. ఇలా నా ఆలోచనలో నేను ఉండగానే కారు ఆగింది. ఏమైందని డ్రైవర్ని అడిగాను.

“టైర్ పంచర్ అయినట్టు ఉంది సార్” అంటూ కిందికి దిగాడు డ్రైవర్.

“ఒక్క పది నిమిషాలు ఆగండి సార్ టైర్ మారుస్తా” అన్నాడు.

ఇంకా పది నిమిషాలా?

ఊరు దగ్గరలోనే ఉంది కదా నడుచుకుంటూ వెళ్తాను అని డ్రైవర్ కి చెప్పి నడక సాగించాను. ఏ పొల్యూషన్ లేని ఆ స్వచ్ఛమైన గాలి గుండెలనిండా పీల్చుకుంటూ, నిశ్శబ్ధంలో అప్పుడప్పుడూ వినబడే పక్షుల అరుపులు వింటూ నడుస్తూ ఉంటే నాలో కొత్త ఉత్సాహం నిండింది. ఊరు కొంచెం దూరమే ఉంది. అంత దూరం నడిచి చాలా రోజులైంది. కానీ అలాంటి వాతావరణంలో పది కిలోమీటర్లైనా నడవొచ్చు అనిపించింది.

దారిలో కొంతమంది స్కూల్ పిల్లలు కనిపించారు. వారిని చూడగానే నేను, నా స్నేహితులు వాళ్ళలో కనిపించారు. స్కూల్ డ్రెస్ ఇంకా మారలేదు. అదే తెల్ల చొక్కా, నీలం రంగు నిక్కర్. జోకులేసుకుంటూ, నవ్వుతూ వెళ్తున్న వాళ్ళని చూస్తే ముచ్చటేసింది. రోడ్డు పక్కకు ఎవడో ఐస్ క్రీం అమ్ముతున్నాడు. కొంతమంది పిల్లలు కొనుక్కుంటున్నారు. కొంతమంది నోరు చప్పరిస్తూ వెళ్తున్నారు. నేను ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్లాను. అక్కడున్న పిల్లలందరికీ ఐస్ క్రీం ఇవ్వమని, డబ్బులు నేనిస్తాననీ చెప్పాను. వాళ్లకు ఐస్ క్రీం ఇప్పించడం చూసి మరో పాతిక మంది పిల్లలు నా చుట్టూ చేరారు. వాళ్ళకు కూడా ఐస్ క్రీం ఇప్పించాను. కొంతమంది రెండు, రెండు తీసుకున్నారు. అవి తింటుంటే వారి కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తే. నేను వెళ్తుంటే ఒక్కొక్కరు థాంక్స్ అంటూ షేక్ హాండ్ ఇచ్చి బై చెప్పారు. ఇలాంటి చిన్నచిన్న ఆనందాలే జీవితం అనిపిస్తుంది. ఊరికి దగ్గరైనకొద్దీ ఏదో నాస్టాల్జియా ఫీలింగ్. అన్నింటికంటే ముందు నా స్కూల్ చూడాలనిపించింది. ఎలా ఉందో నా చిన్నప్పుడు నాలుగు గదుల స్కూల్. చుట్టూ చెట్లు. గదిలో కంటే చెట్ల కిందే ఎక్కువ కూర్చునే వాళ్ళం.

స్కూల్ అనగానే గుర్తుకు వచ్చేది మల్లయ్య తాత. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళేది మల్లయ్య తాతను చూడటానికే. తాతకు ఎవరూ లేరు. తనకున్న రెండకరాల పొలంలో కూరగాయలు పండించుకుని బ్రతికేవాడు. చిన్నప్పుడు నేను, సూరిగాడు, సత్తిగాడు ఎప్పుడూ ఆడుకోవడమే. స్కూల్ అనగానే జ్వరమొచ్చేది. అందుకే ముగ్గురం కలిసి పొద్దున్నే స్కూల్ కి అని బయలుదేరి వాగు దగ్గర ఆడటానికి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ స్కూల్ అయిపోయే టైంకి ఇంటికి వెళ్ళేవాళ్ళం. మల్లయ్య తాత ఏం చదువుకోలేదు. కానీ చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే ఎవరైనా స్కూల్ కి వెళ్లకపొతే డెబ్భై ఏళ్ళ వయసులో కూడా వాళ్ళను వెతికివెతికి పట్టుకుని మరీ స్కూల్లోకి తీసుకెళ్ళి సార్లకు వొప్పజేప్పేదాకా ఊరుకునేవాడు కాదు.

“ఇస్కూల్ పోవాలె బిడ్డ, సదువుకుంటే బాగువడ్తవ్. జర నా మాటిను బిడ్డ” అంటూ బుజ్జగిస్తూ, బ్రతిమిలాడుతూ వినకపోతే బెత్తంతో నాలుగు తగిలిస్తూ మరీ స్కూలుకి పంపేవాడు.

చాలామంది పిల్లలు బర్రెలను, మేకలను కాయడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకి నచ్చచెప్పి వాళ్ళ పిల్లల్ని స్కూలుకి వెళ్ళేలా చేసేవాడు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సమర్ధిస్తూ మాకు లేని బాధ మీకెందుకు అనే వారు.

“సదువు ఇలువ మీకేం తెల్సురా” అంటూ వాళ్ళను కోప్పడేవాడు.

ఎవరైనా బాగా చదివేవాళ్ళు ఉంటే వాళ్ళకు రూపాయో, రెండు రూపాయలో ఇచ్చేవాడు. ఒకరోజు మేము వాగులో ఈతకొట్టి బయటికి వస్తుంటే మా దగ్గరికి వచ్చాడు.

“ఇస్కూల్ పోకుండా ఏందిరా ఈ ఆటలు?” అన్నాడు.

మేమందరం నవ్వాం. ఎందుకు నవ్వుతున్నారన్నట్టు చూసాడు.

“అది ఇస్కూలు కాదు తాత స్కూల్, స్కూల్ అనాలే ఒకపారి మల్లను” అన్నాను నేను నవ్వుతూ.

తాత తంటాలు పడుతూ, “ఇసుకూల్” అన్నాడు మళ్ళీ.

అందరూ గొల్లున నవ్వారు.

“స్కూ...ల్”

“ఇస్కూ....ల్”

“ఇస్కూల్ కాదు స్కూల్”

తాత కొంతసేపు ప్రయతించి, “నేను సదువుకోలే, నాకోస్తలే. మీరెందుకురా ఇస్కూల్ పోకుండా ఆడుకుంట కూసున్నరు. నడువుర్రి, నడువుర్రి ఇస్కూల్కి పోదురుగానీ” అన్నాడు.

“మేము రాం నీకెందుకు?” అన్నాను నేను.

“సదువుకోకపోతే బర్లు గాసుకొవాలే” అన్నాడు తాత.

“కాసుకుంటే కాసుకుంటాం నువ్వీడినుంచి పో ముందుగాల్ల” కల్లెగరేస్తూ అన్నాను నేను.

తాతకు కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని అందరినీ బెదిరిస్తూ స్కూల్ వరకు తీసుకెళ్ళాడు. నా ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్లోకి వెళ్ళారు. నేను మాత్రం అక్కడి నుండి పారిపోయాను. తాత మరుసటి రోజు ఇంటికి వచ్చాడు. అమ్మ బీడీలు చేస్తుంది. నేను బంక మట్టితో వినాయకుని బొమ్మ చేస్తున్నాను. తాతను చూడగానే అమ్మతో నన్ను తిట్టిస్తాడనుకున్నా. కానీ తాత రెండు జామ కాయలు తీసుకొచ్చి నాకొకటి, అమ్మకొకటి ఇచ్చాడు.

“కొడుకుని స్కూలుకి పంపవా బాలవ్వ?” అన్నాడు అమ్మను చూస్తూ. తాత “స్కూల్” అనడం చూసి ఆశ్చర్యపోయాను నేను.

“ఏం జెయ్యాలే పెద్ద నాయిన, ఎవ్వలు జెప్పినా ఇంటలేడు. అయ్య ఎద్దు గుద్ది సచ్చిపాయె. ఆయనుంటే భయంల ఉండేటోడు” అంది అమ్మ.

“మనమంటే సదువుకోలే..., బిడ్డల్నైనా సదివిస్తే కొలువుజేసుకుని బతుకుతరు. మనలాగ గీ కూలి పనులెందుకు?” అన్నాడు.

“ఏం జెయ్యాలే పెద్ద నాయినా.. నువ్వన్న జెప్పు, సదువుడు ఇష్టం లేకపొతే ఏదో ఒక పనిలా పెడ్తా” అంది.

“నాకు ఈ సదువైతలే నేను గూడ మల్లిగానితోని గొర్రెలు కాయినీకి పోతా” అన్నాను నేను రోషంతో.

అమ్మ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ, “చూసినవా ఎట్ల మాట్లాడుతున్నాడో” అంది.

అమ్మ కళ్ళల్లో నీళ్ళు చూసి నా గుండె తరుక్కుమంది.

“స్కూలుకి పొయ్యి మంచిగ సదువుకో బిడ్డా, ఎందుకు తల్లిని బాధ పెడ్తవ్. జెల్ది తయారుగా.. స్కూల్ దగ్గర నేను దిగబెడ్తా” అన్నాడు తాత.

నాకు తెలియకుండానే రెడీ అయ్యి తాత వెంట నడిచాను. అప్పటినుండి ఎప్పుడూ స్కూలుకి వెళ్ళకుండా ఉండలేదు. తర్వాత నేను క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడల్లా నాకు ఎంతో కొంత డబ్బుని గిఫ్టుగా ఇచ్చేవాడు తాత. నాకు అది కొత్త ఉత్సాహానిచ్చి ఇంకా బాగా చదివేవాన్ని. తర్వాత పై చదువులకి అమ్మతో పాటు సిటీ వచ్చేసాను. చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు ఊరికి వెళ్లి అందరినీ పలకరించేవాన్ని. ఉద్యోగం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా అర్ధం కాలేదు. మొదట్లో అమ్మ ఊరెల్లినప్పుడల్లా నన్ను పిలిచేది. నేను బిజీగా ఉండేవాన్ని. అమ్మకు మోకాలి చిప్పలు అరిగిపోయిన తర్వాత ఆమె కూడా ఊరు వెళ్ళడం మానేసింది. కొన్నిసార్లు వెళ్ళాలి అనుకున్నా ఏదో ఒక పని పడి కుదరలేదు. కనీసం ఫోన్ చెయ్యాలన్న జ్ఞానం కూడా లేదు అంటే నేను ఊరిని పూరిగా మర్చిపోయానేమో అనిపించింది.

ఇన్నిరోజుల తర్వాత ఇప్పుడు ఎందుకో వెళ్ళాలనిపించింది. జీవితం ముందుకు వెళ్తుంటే మనతోపాటు చివరికి మిగిలేవి జ్ఞాపకాలే అని అర్ధం అవుతుంది. నా అడుగులు స్కూల్ ముందు ఆగాయి. నా మనసులో తియ్యని బాధ. స్కూల్ ఏం మారలేదు. అవే చెట్లు. కాకపొతే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. పక్కకు మరో రెండస్తుల బిల్డింగ్ కట్టారు. కొంచెంసేపు స్కూల్ చూసుకుని తాత ఇంటికి బయలుదేరాను. పై చదువులకి ఊరు వదిలి వెళ్ళేటప్పుడు తాత నాకు తన చేతికి ఉన్న బంగారు ఉంగరం అమ్మి డబ్బిచ్చాడు. దానికి బదులుగా పెద్దయ్యాక చేతికి బంగారం కడియం చేయిస్తానన్నాను. తాత నాకెందుకు అన్నట్టు నవ్వాడు.

“బాగా సదువుకొని మంచి పేరు తెచ్చుకో బిడ్డా” అంటూ సాగనంపాడు.

టీవీలో పాత సినిమా చూస్తుంటే ఒక రాజు కవికి బంగారు కడియం చేతికి తొడగడం చూసి తాతకు ఇచ్చిన మాట అది. ఇన్నిరోజులు ఎలా మర్చిపోయానా అని నామీద నాకే అసహ్యం వేసింది. కాలంతో పాటు మనుషుల్ని ఎలా మర్చిపోతాం అనిపిస్తుంది. మరుసటి రోజు తాతను స్కూలుకి తీసుకెళ్ళి స్టూడెంట్స్ అందరి ముందూ ఆయన్ని పొగుడుతూ చేతికి బంగారు కడియం తొడిగి, చిన్న సన్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనుకుంటూ తాత గుడిసె దగ్గరికి వెళ్ళా.

ఇంటికి తాళం ఉంది.

పక్కనే రామయ్య తాత కనిపించాడు.

“మల్లయ్య తాత ఎక్కడా?” అని అడిగా.

“ఇంకెక్కడి తాతరా. చచ్చిపోయి సంవత్సరం అయిపొయింది” అన్నాడు.

ఆ మాట వినగానే నా హృదయంలో పిడుగుపడినంత పనైంది. ఊర్లో ఎవ్వరిని కలిసినా ఇక సంతోషం కలగలేదు. అయినా నాదే తప్పు. ఇన్ని రోజులుగా గుర్తుకురాని తాత ఇప్పుడు గుర్తుకువచ్చాడు. కాలం మన కోసం ఆగదు కదా. తాత చనిపోయేటప్పుడు కూడా తన రెండకరాల పొలం స్కూలుకి రాసి చనిపోయాడంట. చదువంటే ఎంత ఇష్టం తాతకి. నేను కూడా స్కూల్ కోసం ఏదైనా చెయ్యాలి, చదువు మధ్యలో ఆపేస్తున్నవారికి చేయూత ఇచ్చి చదివించాలి. ఇదే తాతకి తొడిగే నిజమైన బంగారు కడియం అనుకుని బాధతో ఊరికి వీడ్కోలు చెప్పి బయలుదేరాను.

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Drama