Latha Murty Palagummi

Inspirational

3.5  

Latha Murty Palagummi

Inspirational

గంగమ్మ - పూలదండలు

గంగమ్మ - పూలదండలు

1 min
351



గంగమ్మ - పూలదండలు


రంగా.. రంగా!! ఏంట్రా!! ఉలకవు  పలకవు అన్ని మార్లు పిలుత్తాంటే..అంది తల్లి గంగమ్మ  పుస్తకాలలో తల దూర్చిన రంగడితో. 


“సదూకుంటున్నానే” అంటూ తలెత్తి చూసిన రంగడు తల్లి చేతిలో అందంగా, వత్తుగా కట్టబడినలిల్లీ పూల మాలని చూస్తూ సంబరంతో  " నువ్వు  గింత సక్కగా మాల కడతావు గందే!! ఎందుకుగుడిలో పెద్దాయన తీసుకోమంటే కసురుకుంటాడు అని అడిగాడు తల్లిని.


“పానీలే!! ఇప్పుడు అయన్నీ ఎందుకు..ఆయన కాకపొతే గుడికి అచ్చేవాళ్ళు తీసుకుంటారుగా, ఆభగమంతుడికి మన మీద సిన్న సూపు లేదులే” అంది గంగమ్మ. 


ఆళ్ళని కొనకుండా ఆపలేడుగా ఆ పెద్దాయన.. లేకపోతే అదీ సేత్తాడు అన్నాడు రంగడు కోపంగా. 

పెద్ద పూజారిగారిని పెద్దాయన అనడం అలవాటు రంగడికి.


“హుష్!! గట్ల  అనమాక, రోజూ ఇదే వాదన నీతో.. ఏదో బాడుగ లేకుండా 

ఈడుస్తున్నా రోజులు ఆ శివయ్య దయ వల్ల.. ఎవరైనా ఇంటే ఈడ నుండి కూడా తరిమేస్తారుమనల్ని” అంది గంగమ్మ భయంగా.


తల్లి వత్తుగా, అందంగా కట్టిన లిల్లీపూల దండలు శివలింగానికి.. పండుగలప్పుడు బంతి పూలదండలు శివయ్య గుడిలో పెద్ద సింహ ద్వారానికి, బయట..అంతా తన చేతులతో అలంకరించిచూసుకోవాలని పెద్ద కోరిక అతనికి. వాళ్ళమ్మకి చెప్పకుండా అప్పుడప్పుడు దండలు పట్టుకెళ్ళిపెద్దాయన్ని బ్రతిమాలుకోవడం, ఆయన కసురుకోవడం పరిపాటైపోయింది రంగడికి.


బయట నుండి ఎవరో  పలుచగా కట్టి తెచ్చిన బంతి పూల దండలు  మూర పదిహేనురూపాయలకి  కొని గుడి అంతా అలంకరించడం ఎప్పుడూ  చూస్తుంటాడు రంగడు.


మనం పది రూపాయలకి  మూర ఇత్తానన్నా తీసుకోడు పెద్దాయన, ఆళ్ల  కాడ మాత్రం పదిహేనుఇచ్చి కొంటాడు నాసి  రకం దండలు ఇదేం పక్షపాతమే అమ్మా!! అన్నాడు రంగడు కోపంగా. "మనం తక్కువ కులపోళ్ళమని మన కాడ తీసుకోడు, ఎవరితో అనమాక" అంది రహస్యంగాగంగమ్మ. 


“మనం తక్కువ కులపోళ్ళమైతే మన పూలకేమైందే” అన్నాడు బాధగా రంగడు. 


ఇలా రోజూ మాట్లాడుకోవడం పరిపాటి వాళ్ళిద్దరికీ..


“ఈడికి ఎంత కోపమున్నా రెండు పూటలా  రంగా.. అంటూ ప్రేమతో పెద్దాయన పిలిచి ఇచ్చేప్రసాదంతో  ఆడి కోపమంతా మటుమాయం అయిపోతుంది.. ఆయన దయ వల్లే కదా..తిండికిలోటు లేకుండా జరిగిపోతోంది” అనుకుంటూ.. ”ఇంక  పశ్నలతో  యిసిగించమాక నన్ను.. అనికసురుకుని నువ్వు  సదూకుంటా కూసుంటే పూలు అయిపోతాయి బిడ్డా!! లిల్లీలు, సన్నజాజులు, విరజాజులు, గులాబీలు అన్నీ పదేసి కిలోలు, బంతి పూలు మాత్రం యాభై  కిలోల కాడికి  అట్టుకురా గమ్మున పోయి” అంది గంగమ్మ. 


ఇలా కొంత కాలం గడిచిపోయింది…


రంగడికి మెుదటినుంచి చదువంటే మక్కువ కాబట్టి కష్టపడి చదువుకుని సివిల్స్ కి  ప్రిపేర్ అయి  కలెక్టర్ అయ్యాడు . పూలమ్మే ఆమె కొడుకు కలెక్టర్ అయ్యాడని అన్ని పేపర్లలో, టీవీలలో అదేవార్త. 


కాలక్రమంలో గుడి ట్రస్టీలు, మానేజ్మెంట్ మారి గుడి వేరేవారి ఆధ్వర్యంలోకి  వెళ్ళింది. ఈవృద్ధాప్యంలో మీరు ఇంక  పౌరోహిత్యం చేయలేరని చెప్పి వాళ్ళు పెద్దపూజారి గారి ప్లేసులోఇంకొకరిని  నియమించారు. ఇది పూజారిగిరికి చాలా బాధ కలిగించింది.


“జీవితం చరమాంకంలో  ఉన్నవాడిని, నన్ను శివయ్య పూజల నుండి వంచితుడిని చేయకండని.. తనకి ఏవిధమైన అస్వస్థత లేదని.. అదే తన జీవనాధారమని  ఎంత ప్రాథేయపడినాప్రయోజనం కనపడదు. 


పూజారి గారి పిల్లలు పౌరోహిత్యంలో డబ్బుల్లేవని  కార్పొరేట్ ఉద్యోగాల్లో  స్థిరపడ్డారు..

తండ్రి ఎంత  బాధ పడుతున్నా పట్టించుకోకుండా “నాన్నా!! చేసినంత కాలం చేశావు కదా!! ఇంకా ఎందుకింత ప్రాకులాట?? 

‘కృష్ణా రామా’ అనుకుంటూ ఇంట్లో కూర్చోక” అని విసుక్కున్నారు.


విషయం తెలుసుకున్న రంగడు కలుగచేసుకుని ట్రస్టీలతో  సంప్రదించి పెద్దాయనకి ఓపిక ఉన్నంతకాలం  గుడి ఆయన ఆధ్వర్యంలోనే ఉండేలా చేశాడు.  


రంగడు తల్లిని దండలు కట్టడం మానమంటే ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటా నాయనా!! అలవాటైన చేతులు దండలు గుచ్చకుండా ఉండలేవు బిడ్డా!! అంది. తల్లి మాటని గౌరవించిఆమెకి  ఉదయాన్నే పూలు తెచ్చిపెట్టేవాడు  రంగడు ఎప్పటిలా. 


ఆ వయసులో తల్లికి ఎంతో ఇష్ట మైన గుడిని దూరం చేయడం ఇష్టం లేక  అక్కడికి  దగ్గరలోనేఇల్లు  తీసుకున్నాడు.


మహా శివరాత్రి పర్వదినం  నాడు పెద్ద పూజారి గారు రంగడిని పిలిచి గంగమ్మ చేతి బంతి పూలదండలతో శివాలయం అంతా అలంకరింప చేయించారు. 


తన సొంత పిల్లలు కూడా చేయని సహాయం చేసి తనకెంతో ప్రాణప్రదమైన శివాభిషేకంకొనసాగించడానికి  కారకుడైన  రంగడికి  కన్నీటితో  కృతఙ్ఞతలు తెలుపుకుని ఇన్నేళ్ల తన ప్రవర్తనకిక్షమించమని అడిగారు.


“పెద్దాయనా!! మీరు హుందాగా ఎప్పటిలా కసురుకుంటేనే బాగుంటుంది, అదే అలవాటు నాకు. రోజూ మీరు పెట్టిన పులిహోర, దద్దోజనం, బూరెలు లాంటి నేతి  ప్రసాదాలు తిని పెరిగిన వాడిని. మీ ఆశీస్సులతో  చదువుకుని ఈ స్థాయికి వచ్చాను..మీకు ఎంత చేసినా తక్కువే 

సామీ!! అని చెప్పి తన తల్లి  చేతి బంతి పూల దండలతో  అలంకరించబడిన  గుడినితన్మయత్వంతో, తృప్తిగా చూసుకున్నాడు రంగడు.

      

సమాప్తం


******************


Rate this content
Log in

Similar telugu story from Inspirational