gouse sm

Tragedy

3.4  

gouse sm

Tragedy

ధరణి

ధరణి

4 mins
624


శ్మశానంలో చితి మీద దేహం కాలుతూ ఉంది. కొద్ది దూరంలోనిలబడి ఉన్నాడు ఆకాశ్. అతని కళ్ళని చూస్తే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినట్టు తెలుస్తోంది. ఇరవై గంటల క్రితం తనతోపాటు పెళ్ళి పీటలపై కూర్చుని సిగ్గుపడుతూ తనవైపు చూస్తున్న 'ధరణి ' ముఖం గుర్తొచ్చింది. ఇప్పుడిలా చితిమీద కాలుతుండటంతో అనంతమంత శూన్యం ఆకాశ్ ని నింపేసింది.

చివరిసారిగా ధరణి, ఆకాశ్ తో చెప్పిన మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 'ఈరోజు కోసం నువ్వెంతగా ఎదురుచూసావో నాకు తెలుసు, నేను కూడా నాకు పూర్తిగా అనిపిస్తున్నాను. ఐ ఫీల్ కంప్లీట్ విత్ యూ, ఇలాగే నీ ఒడిలోనే ఒక రెండు, మూడు నాలుగొందల సంవత్సరాలు ఉండిపోవాలనుంది అన్నది ఆ మాటల సారాంశం. సరిగ్గా ఆ మాటలు చెప్పిన పది గంటలలోపే తను ఇలా చితి మీద, తనని చూస్తూ ఆకాశ్ అలా పక్కన.

విధి చాలా విచిత్రమైనది. అన్నీ ఆనందాలే అనుకునేలోపే 'భయపడకు సోదరా! బాధ పెట్టడానికి నేనున్నానుగా ' అంటూ వచ్చేస్తుంది. తనకి తాను ఒక మాంసపు ముద్దలా తప్ప మనిషిలా అనిపించట్లేదు ఆకాశ్. అంతక్రియలు పూర్తవ్వగానే అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. పెళ్ళికొచ్చిన చుట్టాలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. అందరూ ఏదో గుసగుసలాడుతూ మాటాడుతున్నట్టు అనిపిస్తోంది. కొంచెం పెద్ద నోరున్న వాళ్ళు అనుకుంటున్నారేమో ఈసారి మాటలు వినిపించాయి ఆకాశ్ కి.

"ఆ అమ్మాయికి ఏదో జబ్బంట కదా? తెలిసీ మన వాణ్ణి పెళ్ళి చేసుకుందా? అనవసరంగా మనవాడి జీవితం నాశనం చేసింది".

"తెలిసికూడా ఎందుకు చేసుకుందంటావు? ఏం అనుకుని చేసిందో ఏమో?" అనుకుంటూ ఎవరి వెర్షన్ ఆఫ్ స్టోరీని వాళ్ళు తయారు చేస్తున్నారు.

మనుషులు నిజానిజాలు తెలీకపోయినా ఒకర్నొకరు జడ్జ్ చేసుకోవటం మాత్రం ఆపరు. బ్రతికున్నవాళ్ళనే కాదు. చనిపోయిన వాళ్ళని కూడా జడ్జ్ చేయగల 'ఆదర్శ ' మనుషులున్నారు. ఆకాశ్ కి వీళ్ళందరి మాటలు వినిపిస్తున్నాయి కానీ, మనసు దాకా చేరట్లేదు, చేరవు కూడా.

తానిప్పుడు బాధ పడట్లేదు, అలాగని కోపంగానూ లేడు. ఒక మనిషి అనుభవించగల ఏవిధమైన భావనా అతనిలో లేదు. శూన్యంతో నింపబడిన ఒక ఆరడుగుల మాంసపు నిర్మాణంలా కనిపిస్తున్నాడు.

"ఐ వాంటెడ్ టు వేకప్ విత్ యూ, టుడే ఈజ్ దట్ డే. ఐ లవ్ యూ మై లవ్" అన్న మెసేజ్ వచ్చింది ధరణి మొబైల్ నుండి ఆకాశ్ కి. ధరణి మొబైల్ కోసం చూసాడు. బెడ్రూమ్ లో పిల్లో పక్కన కనపడింది. ఆ మొబైల్ తీస్కుని చెక్ చేసాడు. ఇందాక తన మొబైల్ కొచ్చిన మెసేజ్ ధరణి ముందురోజు రాత్రి షెడ్యూల్ చేసింది అని తెలుసుకున్నాడు.

ఇంతలో ఆకాశ్ కి డాక్టర్ శేఖర్ నుండి కాల్ వచ్చింది. అతని దగ్గరే ధరణి ట్రీట్మెంట్ తీస్కుంటూ ఉండేది. అవును ఇందాక పెళ్ళికొచ్చిన చుట్టాలు మాట్లాడుకున్నది నిజమే, ధరణికి ఆరోగ్యం బాగుండేది కాదు. ఈ విషయం ఆకాశ్ కి కూడా తెలుసు. తెలిసినా కూడా తన మీదున్న ప్రేమతో పెళ్ళి చేసుకున్నాడు.

డాక్టర్ శేఖర్ ఫోన్ లో " హలో ఆకాశ్, నేను విన్నది నిజమేనా? అందరూ చెప్తున్నారు" అనడిగారు.

"అవును" అన్నాడు ఆకాశ్ నిర్జీవమైన గొంతుతో.

"నువ్వు నన్ను కలిస్తే నీకు కొన్ని విషయాలు చెప్పగలను, ఇవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి" అన్నాడు డాక్టర్.

"సరే డాక్టర్ ఇప్పుడే వస్తాను" అని చెపి ఫోన్ కట్ చేసి బయల్దేరాడు ఆకాశ్.

ధరణికి ఆరోగ్యం బాలేదని, తను ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశాలు కూడా తక్కువనీ ఆకాశ్ కి ముందే తెలుసు. కానీ ఆరోగ్యం బాలేదని ప్రేమించిన మనిషిని దూరం చేస్కోలేం కదా? అలాగే ఆకాశ్ కూడా ధరణిని దూరం చేసుకోలేకపోయాడు.

పెళ్ళికి వారం రోజుల ముందు నుండి కూడా ధరణి ఆరోగ్యం కొంచెం కుదురుగానేఉన్నట్టు అనిపించింది. మొత్తానికి తను ప్రేమించిన ఆకాశ్ ని పెళ్ళి చేసుకుంటున్నా అనే ఆనందం కనపడేది ధరణి ముఖంలో. కానీ ఇంతలోనే ఇలా ఎందుకు జరిగిందో ఆకాశ్ కి అర్థం కావటం లేదు, డాక్టర్ దగ్గర ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అని వెళ్ళాడు.

ఆకాశ్ ని చూడగానే లోపలికి పిలిచి కూర్చోమన్నాడు డాక్టర్.

ఆకాశ్ లోపలికెళ్ళి కూర్చున్నాడు.

"ఆకాశ్ నేను నీకు ఈ విషయం చెప్పి తీరాలి" అన్నాడు డాక్టర్.

"చెప్పండి" అన్నట్టు చూసాడు ఆకాశ్.

“కొద్దిరోజుల క్రితం ధరణి నా దగ్గరికొచ్చి నేను ఆకాశ్ ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అనడిగింది. తన హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం తన బాడీ చాలా వీక్ గా ఉండేది. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనడానికి సిధ్ధంగా లేదు. ఒకవేళ అది జరిగితే తను బ్రతికే ఛాన్సెస్ తక్కువ. అందుకే వద్దన్నాను.

సరే అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్నిరోజులకి వచ్చి అలానే అడిగింది. మళ్ళీ బాడీకి టెస్ట్ లు చేయించి రిపోర్ట్స్ చెక్ చేసాను. ఏం మారలేదు అలానే ఉంది. కాబట్టి మళ్ళీ అలానే చెప్పాను. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. బానే ఉందిలే అనుకున్నాను. ఇన్ ఫ్యాక్ట్ తను మెంటల్లీ, ఫిజికల్లీ హెల్తీగా అవుతున్నట్టు గమనించాను. కానీ నేను లాస్ట్ టెన్ డేస్ ఊరిలో లేను. వచ్చేలోపే తనిలా పెళ్ళి చేసుకుంటుందని అనుకోలేదు. ఒకవేళ చేసుకున్నా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు" అన్నాడు శేఖర్.

ఆకాశ్ కి డాక్టర్ చెప్పింది మెల్లగా అర్థం అయింది. అంటే ఇలా జరిగితుందని తెలిసి ధరణి పెళ్ళి చేసుకుందా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు చేసుకుంది. ఇలాంటి ప్రశ్నలన్నీ చుట్టుముట్టాయి.

డాక్టర్ తో వెళ్ళొస్తానని చెప్పి అక్కడినుండి బయల్దేరాడు ఆకాశ్.

ధరణికి డైరీ రాసే అలవాటుందని ఆకాశ్ కి తెలుసు. వెంటనే ఇంటికెళ్ళి డైరీ కోసం వెతికాడు. కనపడింది. తీసి చదవటం మొదలు పెట్టాడు.

ఒక్కొక్క పేజీ చదువుతుంటే వాళ్ళ అందమైన గతం అలా కళ్ళముందు మెదులుతోంది. ఆ డైరీలో తొంభై శాతానికి పైగా ఆకాశ్ గురించే రాసింది.

ప్రతి మూడు పేజీలకోసారి " అయామ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఆకాశ్ ఇన్ మై లైఫ్" "ఐ ఫీల్ కంప్లీట్ విత్ హిమ్" అని ఉంది.

ఒక పేజీ దగ్గరికొచ్చాక ఇలా రాసింది. " ఈరోజు ఆకాశ్ పెళ్ళి చేసుకుందాం అని అడిగాడు. ప్రేమకైతే నిమిషం కూడా ఆలోచించకుండా యెస్ చెప్పేసాను, కానీ పెళ్ళికి కష్టం. నా ఆరోగ్యం గురించి ఒకసారి డాక్టర్ తో అడిగి ఆకాశ్ కి యెస్ చెప్పాలి".

తర్వాతి పేజీలో "నేననుకున్నట్టు జరగలేదు. పెళ్ళి చేసుకోవటం మంచిది కాదు అన్నాడు డాక్టర్. ఆకాశ్ కి నో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే కొన్ని రోజులు ఆగుదాం అని చెప్పాను. నేను చూసిన ఆనందమంతా ఆకాశ్ వల్ల వచ్చినదే. ఏరోజూ ఏదీ అడగలేదు. ఇన్నాళ్ళకి పెళ్ళి చేసుకుంటావా అనడిగాడు. ఇది కూడా నేను చేయలేకపోతున్నాను".

కొన్ని పేజీల తర్వాత" ఆకాశ్ మళ్ళీ ఈరోజు కూడా పెళ్ళి గురించి అడిగాడు. నేను వాడికి సగం, సగం వద్దంట. పూర్తిగా కావాలంట. నన్ను పెళ్ళి చేసుకుంటే వాడు చాలా ఆనందంగా ఉంటాడంట. ఇంకా ఇలా చాలాసేపు చెప్పాడు. వాడు చాలా ఇష్టంగా కోరుకుంటున్నాడు. మళ్ళీ డాక్టర్ ని అడిగాను ఆరోగ్యం గురించి, మళ్ళీ అదే సమాధానం. ఇంకొన్ని రోజులు ఆగుదాం అన్నాను".

ఇంకొన్ని పేజీల తర్వాత "ఈ మధ్య కాలంలో ఆకాశ్ నన్ను పెళ్ళి గురించి అడగలేదు . నన్ను అంత బాగా చూస్కుంటున్నవాడు ఒకే ఒక విషయం కూడా నేను నిజం చేయలేకపోయాను. ఇప్పుడు కాకపోతే ఏదొ ఓకరోజు నేను చనిపోవటం తప్పదు. అప్పటివరకూ వాడితోనే బ్రతుకుతాను. పెళ్ళి వాడి కల మాత్రమే కాదు. నాది కూడా. ఒక్క నిమిషం బ్రతికినా చాలు, నేను పూర్తిగా వాడి దాన్ని అవ్వాలి. అంతే ఏం జరిగినా నాకు సమ్మతమే.

"ఆకాశ్, ఎనీథింగ్ ఫర్ యూ, ఎవరీథింగ్ ఫర్ యూ. యువర్స్ అన్ద్ సోల్లీ యువర్స్ ధరణి".

ఇది చదివాక ఆకాశ్ కళ్ళ వెంట నీళ్ళాగలేదు. ధరణి తనని ఇంతగా ప్రేమించినందుకు ఆనందపడాలో, ఆ ప్రేమ వల్లే తను ఎక్కువ రోజులు బ్రతకలేదని బాధపడాలో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆకాశ్ కి ఈరోజు నుండి ఇంకెప్పుడూ కన్నీళ్ళు రావు. "మన జీవితంలో ఏదైన ముఖ్యమైనదీ లేదా అన్నిటికంటే విలువైనదీ కోల్పోతే దాని తర్వాత యేది పోయినా పెద్దగా బాధ ఉండదంట. " నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి వల్ల తెలుసుకున్నాను.

నిజానికి ధరణి చేసింది తప్పో, ఒప్పో, ఆకాశ్ ఇప్పుడేం చేయాలో ఏమీ తెలీదు నాకు. నువ్వు ఈ కథ చదివావ్ కదా? ధరణి, ఆకాశ్ ల గురించి తెలిసింది కదా? నీకనిపించింది చెప్పు. నేను వింటాను.

-- సమాప్తం -- 


Rate this content
Log in

More telugu story from gouse sm

Similar telugu story from Tragedy