Changalvala Kameswari

Drama

4  

Changalvala Kameswari

Drama

బంగారు బాల్యం

బంగారు బాల్యం

8 mins
533నేను మా అమ్మమ్మ తాతయ్య గారి ఊరు వడలి లో పెరిగాను. నాకు ఊహ వచ్చే సరికే నన్ను వడలి స్కూలు లో వేసారు. నాలుగోక్లాస్ వరకు చదివాను.ఈలోగా మా అమ్మవాళ్లొస్తే వాళ్లు వెళ్లేప్పుడు నన్ను తీసుకెళ్లిపోతారేమో అని నేను దాక్కీవడం, మిగతావాళ్లు నన్ను దాచేయడం, మా అమ్మానాన్న నన్ను దగ్గరకు తీసుకుందామన్నా దొరికేదాన్ని కాదు. అంతిష్టం మా అమ్మమ్మ అంటే నాకు ఆవిడ ఒక ప్రాణ ప్రదాత. అమ్మమ్మ నాది అని మా తాతయ్యగారు సరదాగా ఏడిపించేవారు. కాదు నాది అని కాసేపు పోట్లాడి" పోనీ సగం మీది సగంనాది" అనేదాన్ని. అన్నట్లు నాకు అయిదో ఏడోదాకా మాటలు రాలేదుట. ప్రతీదానికి సంజ్ఞలు చేసేదాన్నిట. మా అమ్మ ఎవరికో, వెంకటేశ్వరస్వామి పూనుతారు. ఏదయినాచెప్తారు అని ఎవరితోనో వెళ్లి ప్రశ్న వేయిస్తే, ఈ పాపకి "పచ్చవాతం" మాటలు రావు" అని చెప్తే ఒకటే ఏడ్చిందిట మా అమ్మ, సడన్ గా అయిదో ఏడునుండి మాటలు వచ్చేసాయి. తెగ వస పోసారేమో! మాట్లాడితే నాన్ స్టాప్ నాన్సెన్సే! ఏదయినా వాదిస్తుంటే మా నాన్న గారు " హమ్మ కామేశ్వరి తల్లీ! నీకు మాటలు రావని ఎంత భయపడ్డామే! ఇప్పుడు ఇలా ఝణఝణలాడిస్తున్నావు. అని మురిసిపోయేవారు. అంతేకదా! అబ్బాజబ్బాదబ్బా! మధ్యాహ్నం సమయంలో ఎండలో ఆడనీయకుండా, ఊయ్యాల బల్ల కి తాడు కట్టి దాన్ని పట్టెమంచానికి కట్టి ఉయ్యాలబల్ల మీద పక్కేసి తనపక్ద్కన నన్ను పడుకోపెట్టుకునేది. నన్ను ఎవరేమన్నా నాతో ఎవరు పోట్లాడినా వాళ్లను కేకలేసి నన్ను సముదాయించేది. వడలి అగస్తీశ్వరాలయంలో ఏటేటా జరిగే ఉత్సవాలు ఆ పరగణాలో చాలా ప్రతీతి. రాత్రిళ్లు నాటకాలు, భరతనాట్యాలు,ఉండేవి అవి మొదలయ్యేంత వరకు భోగం మేళం వారు చేసే డాన్సులు ఉండేవి. రాత్రి వేళ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు పెట్రోమాక్స్ లైట్ల తో కాగడాలతో భోగంమేళంతో ప్రారంభమయ్యేది. అర్థరాత్రి ఊరేగుతూ వచ్చిన భోగం మేళం గ్రామపెద్దల ఇళ్ల ముందు ఇంకొంచెం ప్రత్యేకంగా కట్టే మేజువాణి చూడాలని భలే సరదాగా ఉండేది. బాజాలు డప్పులు సినిమాపాటలు తో బ్యాండ్ మేళం తో వచ్చి సినిమా పాటలకు వరసలవారీగా వచ్చి వాళ్లు చేసే డాన్సులు చూడటానికి బయట జనాలు విరగబడితే,ఇంట్లో ఉన్న మేమంతా అది చూడాలని ఎలా చూడాలా అని చిందులు తొక్కేవాళ్లం. మమ్మల్నెవరినీ బయటకు రానిచ్చేవారు కాదు. తాతయ్య గారికి ఇష్టముండేది కాదు .కిటికీలోనుండి చూసి ఆనందపడేవాళ్లం ఎలాగయినా వాళ్లను దగ్గరనుండి చూడాలని ఉబలాటం.గుడి దగ్గరే వాళ్లకిచ్చిన విడిది దగ్గరకు స్కూలునుండి వచ్చేప్పుడు వెళ్లిపోయి వాళ్లు మేకప్పు లు అవుతుంటే వింతగా చూసేవాళ్లం .  ఆలస్యమయితే మా తాతయ్యగారికి అనుమానమొస్తుందని. ఇంటికొచ్చి స్నానాలు చేసి ముస్తాబు అయి. మా అమ్మకయ్యను బ్రతిమాలి పరుగు పరుగున గుడి దగ్గర ఆరింటికే మొదలయ్యే భోగం మేళం చేసే రికార్డింగ్ డాన్సులు చూసేవాళ్లం ఒక రోజు మేమంతా పొలోమని వెళ్లేసరికి మా తాతయ్యగారు గుడి ధర్మకర్త తో మాట్లాడుతూ కనిపించారు మమ్మల్నందరిని చూసేసారు. ఇంక చూడాలి. ఆయనేదో మాతో అనేలోగా రయ్యిమని పరుగెత్తుకొచ్చేసి తులసి కోట దగ్గర కూర్చున్నాము. అందరం బిక్కుబిక్కుమంటుంటే ఆయన వచ్చిన అలికిడికి గుండ దడదడలాడుతోంది. పదిమంది పైనే ఉన్న మేమందరం పిల్లలు ఏరీ! వీళ్లంతా అక్కడికొచ్చారు కదా! గుళ్లో దర్శనం చేయించమని గుమస్తా కి చెప్పేలోగా వచ్చేసారు. అనంటుంటే" అందరం మొహ మొహాలు చూసుకుని "హమ్మయ్య అనుకుని ఆయనకి ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకున్నామండి. అక్కడేదో పాటలు డాన్సులు అవుతున్నాయి కదా అదేమిటో అని ఆగామండి. మీరు తిడతారని వచ్చేసాము. కొంచెం ముందూ వెనకగా చెప్పేసాము. దానికాయన "వద్దు అలాంటివేమి అక్కడ చూడొద్దు. ఏదయినా మంచి ప్రోగ్రాముంటే మనందరం వెడదాము అంటే అందరం బుద్దిమంతుల లాగా "అలాగేనండి" అని తలూపిన తీరు జ్ఞాపకం వస్తే తెగ నవ్వొస్తుంది. తర్వాత రాజమండ్రిలో మేమున్నప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు కొన్నిసార్లు రికార్డింగ్ డాన్సు లు చఙద్రకళ భరతనాట్యం, గయోపాఖ్యానం హరిశ్చంద్ర వంటి నాటకాలు కొంచెం కొంచెం చూసాము. మాకు అర్థమయ్యేవి కావు . కాని అదెంత ఉత్సాహమో! పందిరి రాటలను పట్టుకుని ఆడుకోవడం, ప్రసాదాల సమయానికి పరుగులు పెట్టడం. అది కూడా మా వీధిలోనే జరిగే ఉత్సవాల వల్ల , మా అమ్మ కి నాన్నగారికి పౌరాణిక నాటకాలు, భరతనాట్యాలు పట్ల కల మక్కువ వల్ల కొన్ని చూడనిచ్చేవారు. కొన్ని అధికారికంగా, మరికొన్ని అనధికారికంగా చూసేవారం ఏది ఏమైనప్పటికీ భానక్క ఇచ్చిన ఇన్స్పిరియేషన్ వలన ఎన్నో జ్ఞాపకాలు ఎదలో కదలాడుతున్నాయి. సరదాకబుర్లు చాలానే ఉన్నాయి. కాని,అంతఃకరణశుధ్దిగా మదిలో కొలువయిన వారి గురించి కొంతయినా చెప్పాలని చెప్పాను.వేసవి శెలవులకి కూతుళ్లు కొడుకులు కుటుంబాల తో వడలి లో తాతయ్య గారిల్లు మహా సందడి గా ఉండేది. పిల్లలందరూ వస్తారని,మా తాతయ్య గారు ఇంటి బయట పెరట్లోనూ చల్లగా ఉంటుందని పందిరి వేయించేవారు . వీధి గుమ్మానికి ఉన్న మెట్లకి అటూ ఇటూ ఏనుగు తొండాలు ఉండేవి వాటి మీద జారడం పెద్ద ఆట మాకు. తాతయ్యగారు ఉదయం స్నానం చేయడానికి వెళ్లేముందు ఆయనకి అరి చేతిలో కొబ్బరి నూనె వేయాలి. స్నానం చేసి వచ్చేసరికి అక్కులు అరగదీసి చీపురుపుల్లకు పెట్టి ఆయనకు ఇచ్చి అద్దం చూపించాలి. ఈ డ్యూటీ ఎప్పుడూ అక్కడ ఉండే, రమాదేవి అలివేలు, వాళ్లకే పడేది. సెలవులకి వచ్చినవారినెవరిని చేయమన్నా హడిలి చచ్చేవారు. ఆయనంటే ఉన్న భయం అలాంటిది. అలాగని ఆయనెవరినీ కొట్టిందిలేదు తిట్టింది లేదు.ఆ రోజుల్లో పెద్దలంటే ఉన్న గౌరవం అలాంటిది. సాయంకాలాలు మేమంతా స్నానాలు చేసి మెట్ల మీద కూర్చుంటే మా తాతయ్యగారు మడతమంచం పైన కూర్చుని మమ్మల్ని నోటి లెక్కలు అడిగేవారు ప్రభవ విభవ అంటూ సంవత్సరాలు, నక్షత్రాలు, వారాలు ఇంగ్లీష్ నెలలు చెప్పించేవారు. భోజనాలకు పిలుపు వచ్చాక అందరం ఒక్కసారే వరసగా వెళ్లాలి. మాకు భోజనాలు చేయటానికిపొడుగు పీటలు వేసి కంచాలు మంచినీళ్లు పెట్టాక పిలిచేవారు. మాకు కాస్త ఎడంగా మా తాతయ్యగారికి వడ్డించేవారు. వేడి మంచినీళ్ల మరచెంబు గ్లాసు ఆయనెక్కడికి వెళ్లినా, ఆయనతో అమ్మమ్మ గారితో రావల్సిందే! పాతికమంది పిల్లలు ఒకేవరసలో కూర్చుని మాట్లాడకుండా ఏదీ వద్దనకుండా నిశ్సబ్దంగా తినడం ఈ రోజుల్లో చూడలేము. ఆయన తింటున్నంతసేపు అమ్మమ్మగారో, మనవరాళ్లో విసనకర్రతో విసరవలసిందే!

భోజనాలవగానే, చేతులు కడుక్కుని ఎవరి కంచం వారు కచ్చికపొడితో తోమి వంటిల్లు ని ఆనుకుని పెరటి వైపు ఉన్న గచ్చుదొడ్డి లో అరుగుల మీద బోర్లించాలి. ఇలా మాకెవరు నేర్పారో గుర్తులేదు.అందరం ఒకరినిచూసి మరొకరు ఫాలో కావడమే! ఆ రోజుల్లో ఇంతంత కుటుంబాలని ఎలా మెయింటెయిన్ ఎలా చేసారో కాని ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి తలకి కొబ్బరినూనె రాయాలంటే, ఒక సీసాడు నూనె అయిపోయేది. అందరివీ భారీ తలకట్లే! తలంట్లు పోయాలంటే ఎన్ని కుంకుళ్లు కొట్టేవారో నాకు లెక్కతెలీదు దాలి మీద కాగిన పాలు పెరుగులు వెన్నలు నేతులు జున్నులు సమృధ్దిగా పెట్టి పోషణ చేయాలంటే మాటలు కావు. కాకపోతే గ్రామ కరణం అంటే  ఊరికి మహారాజే ఆ రోజుల్లో ! జీతాలు మహా స్వల్పం! దస్తావేజులు రాసి కచేరీ ఆఫీస్ లకు వెళ్లడంమాత్రమే తెలుసు మాకు. అంత మంది ఆడపిల్లలకు రెండేసి జడలు వేయాలంటే కమలపిన్నికి హైమవత అమ్మకయ్యకు ఎంత సేపు పట్టేదో కాని, వాళ్లకు రెక్కలు నెప్పి పుట్టేవనుకుంటాను. మా హైమవతి అమ్మకయ్య పలక బొందులు గుమ్మాలు గా అమర్చి మట్టి తో బొమ్మరిళ్లు కట్టేది. మేమంతా బొమ్మలపెళ్లి చేసేవాళ్లం. మాకు ఏదయినా చేసిచ్చేది.  పిల్లలందరికీ ఈ అమ్మకయ్య అంటే చాలా చనువు. వెన్నెల్లో కూర్చోపెట్టి సినిమా కథలు చెప్పడం, గొబ్బిళ్లు పెట్టించడం , అట్గతద్ది కి అందరికి గోరింటాకు పెట్టడం, తెల్లవారు ఝామున లేపి స్నానాలు చేయించి, జడలు వేసి నువ్వుపొడి, ఉల్లిపాయలపులుసు, గడ్డపెరుగుతో చద్దన్నాలు పెట్టి ఉయ్యాలలు ఊగడానికి ఆటలకి పంపించడం, చేసేది. వంటిల్లుని ఆనుకుని వీధి వైపు ఉన్న ఉన్న తీగల దొడ్డి దగ్గరకు పూల వాడిని రమ్మని మాకిష్టమైన పూలు కొనడం , కొన్ని మా తాతగారికి ఇష్టం లేని పనులు మా పేచీలు భరించలేక ఇలా చాటుగా అయినా మా సరదాలు తీర్చేది. మా తాతగారికి తలనిండా పూలు పెట్టేసుకుంటే ఇష్టముండేది కాదు. ఒకసారి ఆయన ఒక రైల్వే స్టేషన్ లో ఒకావిడ నిద్రపోతుంటే ఆవిడ తల్లో పూలు మేక తినడం చూసారుట. అప్పటినుండి ఆయనకి పూలు కొనడానికి ఒప్పుకునేవారు కారు జడ లో పెట్టుకుంటే అంతగా పట్టించుకునేవారు కాదు మరి! అప్పట్లో హైదరాబాద్ అంటే అమెరికా యే మా దృష్టిలో మా పెద్దమామయ్య కుటుంబం వస్తే, వాళ్లు మాట్లాడే హిందీ, హిందీ, పాటలు వాళ్లు తెచ్చే తెల్ల ద్రాక్షపళ్ల బుట్టలు, పుల్లారెడ్డి స్వీట్స్ కోసం తహతహలాడేవాళ్లం! మా మామయ్య కొడుకు సత్యం బావ రాజాబావ కాస్త పెద్దాళ్లే , కాని సీత ( ఏఎస్ లక్ష్మి( ఆంధ్రభూమి ఎడిటర్) శ్రీను మాత్రం కాస్త మా కన్నా చిన్నవాళ్లు. అవడంతో కలిసి మెలిసి తిరిగేవాళ్లం అందరం మామిడితోటలకి వెళ్లటం, కబుర్లు ఆటలు తో నాలుగయిదు ఎడ్లబళ్ల మీద అందరం పెనుగొండ మినర్వా టాకీస్ లో, సినిమాలకు వెళ్లటం గొప్ప అనుభూతి.


ఇంక మా కన్నా పెద్ద బ్యాచ్ అన్నయ్యలు సత్యం అన్నయ్య,మురళి అన్నయ్య,సూరిబాబు అన్నయ్య నాగేందన్నయ్యలు ,గదిలో ఫాన్ కొక్కానికి తగిలించిన పండినఅరటిగెల ను ఒకరు పరుగెత్తుకు వచ్చి మరోవైపు విసిరితే అటువైపు వాళ్లు క్యాచ్ పట్టి పళ్లు లాగేసేవారు. అలా ఆ గెల సగానికి సగం ఖాళీ చేసేసేవాళ్లం. మా అందరికి అదో గేమ్ లా ఉండేది. ఆదివారాలు బాలానందం, మధ్యాహ్నం మూడు గంటలకు  నంక్షిప్త శబ్ద చిత్రాలు, ఒకెత్తు.కరిణీకం వచ్చి కమలపిన్ని కుటుంబం కాకిలేరు లో కాపురం పెట్టడం వల్ల పెనుగొండ, నర్సాపురం తో పాటు కాకిలేరు లో కూడా వారమేసి రోజులు ఉండిపోవడాలు. ఎంతానందంగా ఉండేదో కాని కరెంటు లేకపోవడం,పాములు తరచు రావడం, వల్ల భయంగా ఉండేది. లెట్రిన్స్ ఉండేవి కాదు. ఎక్కడో పుంతల్లోకి వెళ్లాల్సిందే! రాత్రిళ్లు ఆ అవసరం రావొద్దని ఎంత మొక్కుకునేదాన్నో! కాని నా టెన్షన్ కి అలానే వచ్చేది. పాపం మా కమలపిన్ని విసుక్కోకుండా, ఒక లాంతరు తీసుకుని, నన్ను తీసుకెళ్లేది.  మట్టిఇల్లు పొయ్యి మీద వంట, ఇల్లు, పొయ్యి అలుక్కోవడం పనిమనిషి లేకుండా ఇంటెడు చాకిరీ చేసుకునేది. పిల్లలందరికి రకరకాల చిరుతిళ్లు చేసిపెట్టేది. ఆవిడ కూడా పుస్తకప్రియురాలు కావటాన ఇంట్లో బోలెడు పుస్తకాలు, వీక్లీలు నవలలు, డిటెక్టివ్ బుక్స్ , కావల్సినంత మేత, పుస్తకాలు ,మా కమలపిన్ని పిల్లలతో సరదాగా గడిపేయడం తో  ఇట్టే గడిచిపోయేవి ఎన్ని రోజులయినా, వర్షం వస్తే మాత్రం పెనుగొండనుండి కాకిలేరు వెళ్లేదారి మూడు కిలోమీటర్ల దూరం బురద బురద గా అయిపోయేది. వాళ్లకు స్కూలుకు వెళ్లి రావడం వల్ల అలవాటయి బాగానే నడిచేవారు. నేను మాత్రం చచ్చేట్టు పడేదాన్ని. ఇంక నన్ను జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్లే వారు. ఎడ్ల బళ్లు రిక్షాలుతప్ప బస్సులు లేవు ఆ ఊరికి.తర్వాత అన్నీ వచ్చాయి.

ఇలాంటి సందడి నుండి మా అమ్మా నాన్న గారి దగ్గరకు వచ్చేసాను. విశాఖ జిల్లా ఏటికొప్పాక లో అయిదో క్లాసులో చేరాను. అక్కడ కెళ్లాక మా అమ్మమ్మ గారి కోసం బెంగెట్టుకుని ఏడ్చేదాన్ని. నన్ను తీసుకెళ్లడానికి అమ్మమ్మ ఎలా ఒప్పుకుందో నాకు తెలియని వయసు. అక్కడ తమ్ముళ్లు సత్యంబాబు, శ్రీను చెల్లెలు పద్మ అన్నయ్య శివరామ్ కూడా వచ్చేసాడు.వాడు నేను వెళ్లిన కొన్నాళ్లకి వచ్చాడు ఎలా వచ్చాడు అంటే, దానికో కథ ఉంది. 

 దేనికో, మా బామ్మ తిడుతుందని భయంతో ఫ్రెండ్ ప్రోధ్బలంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు"ట' అప్పట్లో ఫోన్స్ లేవు ట్రంకాల్స్ లేవు. మా తాతయ్య "శివరామ్ ఇక్కడ లేడు, వెళ్లి అయిదు రోజులయింది అక్కడికి వచ్చాడా" అని ఇచ్చిన టెలిగ్రామ్ చూసి మా నాన్నగారు హడిలిపోయి మా అమ్మ కంగారు పడుతుందని అసలు విషయం చెప్పకుండా, హుటాహుటిని నర్సాపురం వెళ్లిపోయారు. ఆఫీస్ కొలీగ్స్ వాళ్లిళ్ల ల్లో చెప్పారు. కాని అమ్మకు చెప్పొద్దని చెప్పలేదు. ఇంకేముంది. ఇంటికి రావడం అమ్మను ఓదార్చడానికి ధైర్యం చెప్తుంటే అమ్మకు విషయం తెలిసింది. నాన్న గారు వెళ్లాక ఉత్తరంలేదు. పదిహేను రోజులయింది. మాకు ఏదో చేసి పెట్టి ఏడుస్తూ కూర్చునేది. అప్పట్లో నరబలులు ఇచ్చేవారుట ఏవేవో ఊహించుకుని భయపడిపోయేది.మేమేమో మధ్యాహ్నం టిఫిన్స్ చేయలేదని అమ్మను విసిగించేవాళ్లం! ఈ లోగా పేపర్ లో అన్నయ్య ఫొటో వేయించి రేడియోలో చెప్పించారు. ఎట్టకేలకు ఎవరో తెలిసిన వాద కి అన్నయ్య కనిపించడం వాళ్లు తీసుకొచ్చి దిగపెట్టడం జరిగి , నాన్న గారొచ్చి మమ్మల్నందర్నీ నర్సాపురం తీసుకెళ్లారు. ఆ తర్వాత వాడు కూడా మాతో వచ్చేస్తే చుట్టుపక్కల వారికి ఆశ్చర్యం! అమ్మానాన్నకు ముగ్గురే పిల్లలు అనుకున్నారుట  నన్ను మా అన్నయ్యని చూసి చాటుగా అడిగేవారు మీ అమ్మ నిజం అమ్మేనా! అని. వాళ్ల లా అడగటానికి కారణం మా అమ్మ అందం! అన్ని కాన్పులయినా, తెల్గగా, పెద్ద జుట్టుతో చాలా అందంగా ఉండేది. నా కన్నా చిన్న పిల్లలు చెల్లి తమ్ముళ్లు ఏ పెచీలు పెట్టేవారు కాదు. నేను అమ్మమ్మ గారం వలన అన్నింటికి పేచీలు పెట్టేదాన్ని. మజ్జిగ చేద్దామని పెరుగు లో నీళ్లు పోసి కవ్వం పెట్టగానే నేను పెద్ద ఫిట్ వచ్చినదానిలా క్రిందపడిపోయి శోకాలు పెట్టేసేదాన్ని. మొదట్లో మా అమ్మ హడిలిపోయింది.అమ్మమ్మ నాకు పెరుగే వేసేది. మజ్జిగ వేసుకోను అని పెంకితనం చేస్తే కొన్నాళ్లు విడిగా తీసి వేసేది. తర్వాత ఆవిడకి విసుగొచ్చి..తింటే తిను లేకపోతే మానేయి! నీ కన్నా చిన్నవాళ్లు తింటంలేదూ అని కళ్లెర్ర చేస్తే దెబ్బకి దెయ్యం దిగింది. ఇంక కుంపటి విసరమన్నా, కరివేపాకు దూయమన్నా అవి పెద్ద పనులు నాకు. నాన్మ గారికి కంప్లయింట్లు. మా అమ్మ కి విసిగిపోయి "బాబోయ్ దీన్ని తీసుకురావడం మంచిదయింది. లేకపోతే ఇంకెలా తయారయేదో! అని తిట్టేది. మా నాన్న గారు అసలు మమ్మల్ని తిట్టేవారు కాదు.ఒకే ఒక్క సారి నా రెండు జడలు పట్టుకుని పైకి ఎత్తారు. పక్కన ఉన్న అరసవిల్లి రాజుగారు పోనీయండి చిన్న పిల్ల అని ఏడుస్తున్న నన్ను సముదాయించి పంపేసారు. అసలు కారణం ఏంటి అంటే! మా పెద్ద తమ్ముడు ని రాయి పెట్టి కొడితే నెత్తి మీద తగిలి చిల్లడి నెత్తురుమయం! అది చూసి నాన్నగారికి కోపం ఆగలేదు.అదీ సంగతి! ఆరాత్రి అలక నాకు ,అన్నంతినకుండా అలిగిన నన్ను బ్రతిమాలి వినకపోయేసరికి, "మొగుడిని కొట్టి, మొగసాలకి ఎక్కిందన్నట్లు వాడినంత దెబ్బ కొట్టి వెధవ అలకా! అని గద్దించినా తినలేదు. మా నాన్నగారే వచ్చి తప్పుకదా! తమ్ముడ్ని  

అలా కొడతారా! పద అని బుజ్జగిస్తే అప్పుడు తిన్నాను .ఆ అలకలు ఇప్పుడూ ఉన్నాయి. మా నాన్నగారు, తర్వాత మా వారు ఇప్పుడు మా పిల్లలు. అలక తీరుస్తుంటారు. ఈ అలకల రాణికి. ఏటికొప్పాక లో షుగర్ ఫ్యాక్టరీ లో నాన్నగారు ఆడిటర్ గా వర్క్ చేసేవారు. చుట్టూ కొండలు. ఉండేవి. క్వార్టర్స్ లో ఉండేవారం కొండలు ఎక్కేసేవాళ్లం ఏవేవో పళ్లు కోసుకుని తినడం దిగిరావడం అప్పట్లో తెల్ల దుస్తులు వేసుకుని తిరిగే అన్నలను కూడా చూసాము. క్వార్టర్ కి క్వార్టర్ కి నడుమ దడి ఉండేది. పనులయ్యాక ఆడాళ్లు అటొకళ్లు ఇటొకళ్లు మాట్లాడుకుంటూ ఉంటే పాములు పాకుతూ వెళ్లేవి. మామిడి చెట్లు నేల దాకా విరగ కాసేవి. అక్కడే మానాన్నగారు కొనే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, ఝాషువాగారి పిరదౌసి, కరుణశ్రీ గారి కుంతీ విలాపం పుష్పవిలాపం వంటి చదవటం జరిగింది. అంతగా అర్థమయ్యేది కాదు కాని మా అమ్మతో ఆయన జరిపే సాహిత్య చర్చలు వల్ల తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. మాకేమయినా డబ్బులిస్తే ఏం కొనుక్కోవడానికి ఏమీ దొరికేవి కావు. నాన్న గారికి సిగరెట్ ప్యాకెట్ అగ్గి పెట్టె తేవడానికి వెళ్లే వాళ్లం అది కూడా బోలెడు దూరం చెరకుబళ్లు ఫ్యాక్టరీకి వెడుతుంటే " బండబ్బి గారండీ ఒక చెరకు ఇస్తారా" అని అడిగానని మా నాన్నగారి కొలిగ్ చెప్పడం నవ్వడం. అయిదో క్లాస్ వరకే ఉన్న స్కూలు అన్ని క్లాసులకి ఒకడే మాస్టర్ ఆయనకి ఉన్నట్టుండి ఫిట్స్ కూడా వచ్చేవి. మాకు తెలియక నిద్దరోతున్నారు అనుకునేవాళ్లం. బొమ్మల ఫ్యాక్టరీకి  నాన్నగారు తీసుకెడితే అక్కడ ఎన్నిరకాల బొమ్మలో! బయటకి వచ్చాక చూస్తే, కొన్నవి కాకుండా మా అందరి జేబుల్లోను చిన్ని చిన్ని లక్కబొమ్మలు చూసి మా అమ్మనాన్బకి కోపం నవ్వు రెండు వచ్చేసాయి.అలా చేయకూడదని మందలించారు. అప్పుడప్పుడు జీపులో అనకాపల్లి వైజాగ్ సినిమాలకి తీసుకెళ్లేవారు మీరు ఇచ్చిన టాపిక్ వల్ల మా జ్ఞాపకాల తేనె తుట్టె కదిలింది.


Rate this content
Log in

Similar telugu story from Drama