వేమనా!మహాకవీ!!
వేమనా!మహాకవీ!!
వేమనా! మహాకవీ!!
ఆ. వె.తప్పు జేయువాడు గొప్పవాడైనను
బెదరలేదు నీ కవిత్వ మెపుడు
తప్పులొప్పులెల్ల విప్పిచెప్పితివయా
వేమనా!మహాకవీ!నమోస్తు!
ఆ. వె.కులములోన గలుగు కుళ్లుకుతంత్రాలు
ప్రజలకెల్ల తేట పరిచినావు
నిక్కమైన మంచి నీలమ్మువోయన్న!
వేమనా!మహాకవీ!నమోస్తు!
ఆ. వె.భూములేలు వారు పుత్తడిచ్చెదరని
రాయలేదు కావ్య మీయలేదు
ప్రజల మేలు గోరి రచియించితివి గాని
వేమనా!మహాకవీ!నమోస్తు!
ఆ. వె.పెద్ద కావ్యములను విరచించి ఎందరో
కన్ను మూసినారు గాని నేడు
కీర్తి బొందిరొక్కొ స్ఫూర్తి నీవలె నింపి?
వేమనా!మహాకవీ!నమోస్తు!
ఆ.వె.తరతరాలనుంచి తల్లిదండ్రుల వోలె
మంచిచెడులను వివరించు చుండె
పద్యములకునప్పు వడినది మా జాతి
వేమనా!మహాకవీ!నమోస్తు!
ఆ. వె.ప్రజల నోళ్లలోన పరిమళించుచు నెంత
కాలమవని తెలుగు గ్రాల గలదొ
అంత వరకు తమరి ఆయుష్షు గలదన్న!
వేమనా!మహాకవీ!నమోస్తు!
-తోకల రాజేశం
9676761415
