Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Soudamini S

Inspirational

5.0  

Soudamini S

Inspirational

తప్పు చేసింది ఎవరు ?

తప్పు చేసింది ఎవరు ?

4 mins
790


రాత్రి చూసిన విజిల్ సినిమా ఇంకా బుర్ర లోనించి దిగలేదు. సినిమాలు  చూసి జనాలు పాడై పోతున్నారు అంటున్నారే, ఇలాంటి సినిమాలు చూసి కొంత మంది అయినా ఆలోచిస్తే బాగుండు. యాసిడ్ బాధితురాలు అయిన అమ్మాయి నేనేమీ తప్పు చేయనప్పుడు నేనెందుకు ఒంటరిగా కూర్చుని బాధ పడాలి అని బయటకు వచ్చిన సన్నివేశం అయితే నాకు భలే నచ్చింది.“సివంగి వే, సివంగి వే” పాట పాడుకుంటూ హుషారు గా కాఫీ కలుపుతున్నాను.


మా వారు హాలు లో ఎవరితోనో ఫోను లో మాట్లాడటం చూశాను. ఈయన ఏదో బాధ పడుతున్నట్లు నాకు కనిపించింది. కాఫీ కప్పు ను సోఫా లో ఉన్న మా వారికి అందించాను. మరొక కప్పు తో నేను ప్రక్కనే కూర్చుని “ఏమయ్యింది?” అని అడిగాను. “ఇప్పుడే కళ్యాణి నుంచి ఫోన్ వచ్చింది” అని దిగులు గా చెప్పారు . కళ్యాణి మా వారికి బాబాయి కూతురు, మా వారికి చెల్లెలి వరస అవుతుంది.   ఈ మధ్యనే తన పెళ్లి జరిగింది. తాను మా ఇంటికి రెండు మూడు కిలోమీటర్ ల దూరం లోనే ఉంటుంది. మేము వారానికి ఒక సారి కలుస్తూనే ఉంటాం. 

“తనకు ఏమైంది?” నాకు కంగారు వచ్చింది. మా వారు తన watsapp మెసేజ్ నాకు చూపించారు. కళ్యాణి తన ఫోటో ని పంపించింది మెసేజ్ లో. తన ముఖం బాగా ఎర్ర గా కందిపోయి ఉంది. ఇంకా చేతి మీద వాతలు తేలి ఉన్నాయి. 


నాకు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. “ఎవరు చేశారు ఈ పని?” అని ఆవేశం గా అడిగాను.

“ఎవరో కాదు, నువ్వు ఆవేశ పడకు, మా బావ గారే ట, రాత్రి ఇద్దరికీ ఏదో పెద్ద గొడవ జరిగింది ట ” అన్నారు మా వారు కంగారు గా.

ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది. అదేమిటి అంత చదువుకున్నవాడు, తెలిసిన వాడు అతనేమిటి ఇలా..

“మరి మీరేం చేస్తారు ఇప్పుడు” అని మా వారి వంక సూటిగా చూసి అడిగాను.

“అదే అర్థం కావట్లేదు, బావ తో ఈ విషయం ఎలా మాట్లాడేది, అదేమో అన్నయ్యా, నువ్వు వచ్చి తీసుకెళ్లు అంటోంది”

అన్నారు సంశయం గా.

ఇదంతా వింటున్నారు కాబోలు మా అత్త గారు పూజ గది లో నించి బయటకు వచ్చారు. “ఏదో మొగుడు పెళ్ళాల మధ్య గొడవ జరిగి ఉంటుంది. మనం మధ్యలో దూరితే ఏం బావుంటుంది? అందులో ఎవరిది తప్పో మన కి తెలీదు. కాసేపు ఊరుకుంటే, గొడవ అదే సద్దు మణుగుతుంది” అన్నారు.

“అదేమిటి అత్తయ్య గారు, తప్పు ఎవరిది అయినా అతను అంత లా కొట్టడం తప్పు కదా, కళ్యాణి మన కు తెలిసిన అమ్మాయి, తన కు ఏదైనా జరగరానిది ... ?“ నా మనసు తరువాతి మాటలు అనటానికి ఒప్పుకోలేదు, అక్కడితో ఆగిపోయాను.


మా సంభాషణ కు అంతరాయం కలిగిస్తూ కాలింగ్ బెల్ మ్రోగింది. అవతల నుంచి మునెమ్మ, మా ఇంట్లో నాకు పనికి సహాయం చేసే అమ్మాయి. “ఏం మునెమ్మ, ఈ రోజు బాగా ఆలస్యం అయ్యిందే”, అంటూ ఆమె ను అనుసరిస్తూ వంట గది లోనికి వెళ్ళాను.


“ఏం సెప్పనమ్మ, నా మొగుడు నన్ను రోజూ తాగి వొచ్చి ఒళ్ళు వాతలు తగిలే దాకా కొడుతూ ఉంటాడమ్మా, ఎవరికైనా సెప్తే నా పరువు పోతుందని ఇన్నాళ్ళూ ఎవ్వరికీ సెప్పలేదమ్మా. ” అంది చీర కొంగు తో కన్నీళ్ళు తుడుచుకుంటూ.


“బాధ పడకు మునెమ్మా, ఇంత కి ఏమిటి అతని సమస్య?” అని నా సందేహం అడిగాను.


“ఏముంది, ఇంటి కరుసులకి డబ్బు అడిగితే ఆడికి బాద. ఆడు సంపాదించినదంతా ఆడి తాగుడు కే సరిపోతుంది. ”


“నిన్న పొద్దు మళ్ళీ కొట్టాడమ్మా”, “నా కొడుకు, కూతురు ఈ బాగోతం రోజూ సూస్తూనే ఉన్నారు, అందుకే నిన్న బాగా ఆలోచించాను”.


“ నా కొడుకు కూడా ఆడి పెళ్ళాన్ని ఇట్టాగే కొట్టాలి కాబోసు అనుకోని రేపు అట్టాగే సూస్తే? అట్టాగే నా కూతురు మగాడు కొడితే ఇట్టాగే పడుండాలేమో అని సోచాయిస్తే కట్టం కదా అమ్మా”.


“నేను నా నోరు నొక్కుకొని కూకుంటే తప్పు నాదే అవుద్దీ. అందుకే నిన్న మా అన్న కి పొను కొట్టి రమ్మని సెప్పా. మా అన్న పొద్దున్నే వచ్చి బాగా గడ్డి పెటాడు ”. “ఇప్పుడు నా పానం కొద్దిగా కుదురు గా ఉంది” అని కాసేపు మౌనం గా ఉండి పోయింది మునెమ్మ.


“మంచి పని చేశావు మునెమ్మా, నాకు ఈ విషయం ముందే చెప్పాల్సింది. మీ ఆయన కి బుద్ధి వచ్చిందా సరే, లేక పోతే నేను మిమ్మల్నిద్దరిని counselling కి తీసుకెళ్తాను” అని నాకు చేతనైన ఓదార్పు ఇచ్చాను.

“అప్పుడు కూడా బుద్ధి రాక పోతే అప్పుడు గృహ హింసా చట్టం ఉందనే ఉంది కదా” అన్నాను కొంచెం కటువు గా.

“ఒక నెల సూదాం మంచి గా సూసుకుంటాడేమో, ఇంకా బుద్ధి రా పోతే అప్పుడు సూదాం ” అంది మునెమ్మ గిన్నెలు పీచు తో గట్టి గా రుద్దుతూ.


సివంగి వే పాట మళ్ళీ నా నోట్లో నానుతోంది.


ఇది హాలు లో నుంచి మా వారు, మా అత్త గారు వింటూనే ఉన్నారు. కార్ తాళాలు తీసి మా వారి చేతిలో పెట్టి అన్నాను “ఇప్పుడు మనం చేయాల్సింది తప్పెవరిది అనే చర్చ కాదు, తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనే చర్చ. ఈ విషయం తెలిసి కూడా మనం ఏమి చేయకపోతే తప్పు మనది కూడా అవుతుంది. పదండి వెళ్దాం. ”

“అవునబ్బాయి, ఆలోచిస్తే కోడలు చెప్పింది నిజమే, మీరు వెళ్ళటమే మంచిది. మనం ఎవరిది తప్పూ తేల్చక్కర్లేదు, మనం అండ గా ఉన్నాం అన్న ధైర్యం ఇస్తే చాలు “ అని మా అత్త గారు స్పష్టం చేశారు.


మా వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల ఊపి బయలు దేరారు. 


*****************************************************************************************

గృహ హింస ఆ వ్యక్తి శారీరక మరియు మానసిక స్థితి ని అతలాకుతలం చేస్తుంది. వారినే కాదు వారి కుటుంబాన్ని కూడా క్రుంగతీస్తుంది.

“National Family Health Survey” ప్రకారం మన దేశం లో గృహ హింస కేసు లు 29% గ్రామీణ ప్రాంతాలలో నమోదు అయితే 23% పట్టణ ప్రాంతాల నమోదు అయ్యాయి. పెళ్లి అయిన వారి లో 31% మంది భర్త నుండి ఏదో ఒక రక మైన గృహ హింస కు గురి అవుతున్నారు. వీరి లో 27% మంది శారీరక హింస కు గురి అవుతున్నారు. అయితే కుటుంబం పరువు పోతుందని రిపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఇక తప్పుడు కేసులు నమోదు చేసే వారు కూడా కొద్ది మంది లేక పోలేదు, వారి వాళ్ళ నిజం గా హింస అనుభవించే ఆడ వారిని అనుమానించ వలసి వస్తోంది. 2015 లో ప్రభుత్వం గృహ హింస కేసులను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి అనుమతి నిచ్చింది. బాధితులు, వారి భర్త మొదట కౌన్సిలర్ల సహాయం తో సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించవచ్చు.

ఇక పురుషులు కూడా గృహ హింస కు గురి అవుతున్నట్లు ఇంకొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఆర్థిక హింస ఎక్కువ శాతం ఉన్నట్లు ఫ్యామిలీ ఫౌండేషన్(2007) నిర్వహించిన నివేదిక లో తెలుస్తోంది. అయితే దీనికి ప్రస్తుతం చట్టం నుండి ఎటువంటి మద్దత్తు లేదు.

మీ(స్త్రీ/పురుషుడు) పై గృహ హింస జరుగుతుంటే దానిని గుర్తించి దాని నుండి బయటకు రావటానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వారి పై గృహ హింస జరుగుతోందని తెలిస్తే వారి ని సందేహించడం మానేసి, వారికి చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం. 


Rate this content
Log in

Similar telugu story from Inspirational