Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Drama

4.9  

Varun Ravalakollu

Drama

అంతకు మించి....!!

అంతకు మించి....!!

11 mins
575


ఛ. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చేసి ఇందులోంచి బయట పడకపోతే చాలా కష్టం. అసలే అర్జెంటుగా పెళ్ళి చేసుకోమని ఇంట్లో ఒకటే గొడవ. ముప్పై ఏళ్ళొచ్చి చాలా రోజులైంది. చిన్న సమస్యే అనుకున్నది చూస్తూండగానే పెద్దదై కూర్చుంది. ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి దిక్కుమాలిన సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని. ఆలోచిస్తూ ఖరీదైన ఆఫీస్ చైర్ లో బాగా వెనక్కి వాలి కూర్చొని ఓ సారి చుట్టూ చూసాను. విశాలమైన ఆఫీసు కేబిన్, చక్కటి ఇంటీరియర్స్ తో డిజైనర్ ఎంతో శ్రద్ధ పెట్టి పని చేసి అందంగా తీర్చిదిద్దినట్టు చక్కగా తెలుస్తుంది.

మంచి పేరున్న బిజినెస్ స్కూల్లో ఎం.బి.ఏ పూర్తి చేసి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాను ఇక్కడ. మాదో పెద్ద మల్టీ నేషనల్ కార్పొరేషన్. నా పేరు ఉదయ్. చూడ్డానికి మంచి రంగు, పొడవుతో చక్కగా ఉంటానని చాలా మంది చెబుతారు. అది కరెక్టే అని నాకూ చాలా సార్లు అనిపిస్తుంది. ఒక్కడినే సంతానం అమ్మా నాన్నలకి. వాళ్ళు కూడా నాతోనే ఉంటున్నారు. మంచి డీసెంట్ లోకాలిటీలో సొంతిల్లు. ఏ అప్పులూ, దురలవాట్లు లేవు. త్వరలోనే పెళ్ళి చేసుకొని సెటిల్ అవుదామని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అయితే నన్నో సమస్య పట్టి వేధిస్తుంది. అది తీరాక పెళ్ళి చేసుకుందామని ఇన్నాళ్ళూ ఆగాను. ఇక లాభం లేదు. ఏదో ఒకటి చేయాల్సిందే. పట్టుదలగా అనుకున్నాను. మళ్ళీ దిగులుగా అనిపించింది ఏం చేయాలో అర్ధం కాక. చేస్తున్న పని పక్కనబెట్టేసాను మూడ్ బొత్తిగా లేక.

కేబిన్ డోర్ నాక్ చేసారు ఎవరో. ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూంటే ఏంటీ డిస్టర్బెన్స్? చిరాగ్గా అనిపించింది. లోపలకి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ వేణు.

“సర్ ఈ నెల మీరు లక్షా ఏభై వేలు టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి గుర్తు చేయమన్నారు. అన్ని మ్యూచుఅల్ ఫండ్స్ ఆప్షన్స్ అనలైజ్ చేసి మీకు ఈమెయిల్ చేసాను చూడండి. అలాగే జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కు ఇంటర్వ్యూలు వచ్చే నెల షెడ్యూల్ ఫిక్స్ అయింది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళను మీరు చివరగా ఇంటర్వ్యూ చేయాలి.” అంటూ ఇంకా ఏదో గ్యాప్ లేకుండా చెబుతున్న వేణు వైపు ఓసారి పరీక్షగా చూసాను అతను చెప్పేది పట్టించుకోకుండా. చక్కగా టక్ చేసుకొని, నీట్ గా ఉన్నాడు. ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నాడు. జెలసీగా అనిపించి మూడ్ పాడైంది ఇంకాస్త ఎక్కువగా.

“థాంక్స్ వేణు. మళ్ళీ పిలుస్తాను. ఓ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్ అటెండవ్వాలి ఇప్పుడు.” నోటికొచ్చిన అబద్ధం ఆశువుగా చెప్పి బయటకు పంపేసాను. కొన్ని సార్లు అబద్ధాలు కూడా ప్రశాంతతను ఇస్తాయి అనిపించింది. కాసేపు ఒంటరిగా ఆలోచించుకోవాలి.

***

ఇంతకీ నా సమస్యేంటో చెప్పలేదు కదూ. నన్ను చాలా రోజులుగా కలచివేస్తున్న నా భయంకరమైన సమస్య పేరు. పొట్ట. అవును. మీరు చదివింది కరెక్టే! సమస్య పేరు చాలా చిన్నది కానీ కొన్నాళ్లుగా నన్ను పట్టి పీడించేస్తుంది. పని ఒత్తిడి వల్ల ఆఫీసులో లేట్ గా కూర్చొని పని చేయటం, సాయంత్రం పూట, వీకెండ్స్ లో నోటికొచ్చిన జంక్ ఫుడ్ స్విగీ లో ఉత్సాహంగా ఆర్డర్ చేసుకొని తినడం, రోజూ వారీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం, సరైన నిద్ర లేకపోవటం మొదలైన కారణాల వల్ల క్రమంగా నా బరువు పెరగడం మొదలైంది. ఇవన్నీ లావయ్యాక ఇంటర్నెట్లో నేను చదివి తెలుసుకున్నవి. లావవుతున్నాను కంట్రోల్ చేయాలి అనుకునే లోపే బాగా బరువు పెరిగేసాను. నా పొట్ట సైజు కూడా బాగా పెరిగి బట్టలు బిగుతవడం, కొంత గ్యాప్ తరువాత కలిసిన వాళ్ళందరూ పొట్ట గురించి కామెంట్ చేయటం లేదా జోక్ చేయటం లాంటివి మొదలైనయ్. ఉండాల్సిన దానికన్నా పదిహేను కిలోల పైన ఎక్కువ బరువున్నాను ప్రస్తుతం.

ఇంతకుముందు ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు మాత్రం కలిసిన ప్రతీ వాడి పొట్ట వైపు వారు గమనించకుండా చూడటం, ఎవరి పొట్టైనా నా కన్నా ఎక్కువగా ఉంటే సైజును బట్టి తృప్తి లేదా జాలి పడటం, తక్కువగా లేదా పొట్ట లేకుండా వేణులా ఉన్న వాళ్ళని చూస్తే జెలసీగా, వాళ్ళ అదృష్టం తగలెయ్య అనిపించడం ఎక్కువైంది. జెలసీ అనేది నిజంగా ఓ శాపం. ఇంతకు ముందు నేనే ఎన్నోసార్లు అనుకునే వాడ్ని జెలసీకి ప్రత్యేకించి పనిష్మెంట్ అక్కర్లేదు, అది ఉండటమే పెద్ద పనిష్మెంట్ అని. ఇప్పుడు నా పరిస్థితీ అదే అయింది.

యమ అర్జెంటుగా బరువు తగ్గడానికి ఇంటర్నెట్లో రకరకాల మార్గాలు వెదికి, కొద్ది రోజులుగా మార్నింగ్ వాక్ చేయటం, బాడ్మింటన్ ఆడటం లాంటివి శ్రద్ధగా, పట్టుదలగా చేసాను. ఎప్పుడూ ఎనిమిది లోపు నిద్రలేవని నేను ఆరింటికల్లా నా పరిస్థితిని తిట్టుకుంటూ లేవటం అలవాటు చేసుకున్నాను. అయితే బరువు పెరగడం కాస్త తగ్గింది కానీ, పొట్ట సైజులో పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. పోనీ చాలా మందికి ఈ సమస్య ఉంటుంది, ఈ రోజుల్లో పోట్టలేని వాళ్ళు చాలా తక్కువ, దాన్దేముందిలే అని వదిలేద్దామంటే మనసొప్పట్లేదు. ఎందుకు తగ్గదు అని పట్టుదలగా అనిపిస్తుంది.

గతంలో సన్నగా ఉన్నప్పటి పాత ఫోటోలు, వీడియోలు చూస్తూంటే కలుక్కుమంటుంది గుండెల్లో. బట్టలు కూడా ఇంతకు ముందులా చక్కగా ఫిట్ అవ్వడం లేదు. బాడీ షేప్ అవుట్ అయినందుకు మనసులో చెప్పలేని బాధ. ఒక్కో ప్యాంటు బిగుతైపోయి వేసుకోలేక వదిలేస్తుంటే ఏంటీ కొలెస్ట్రాల్ జీవితం అనిపిస్తుంది. ఇవాళ కూడా క్లయింట్ ఎవరో ఆఫీసు పని మీద కలిసి, టక్ చేసుకున్న స్లిమ్ ఫిట్ షర్టు లోంచి బెల్ట్ వంగిపోయేలా బయటకు వచ్చిన నా పొట్ట గురించి ఏదో కామెంట్ చేసాడు సరదాగా. మొహమాటానికి బయటకు చిరునవ్వు నవ్వాను కానీ, మనసులో చిర్రెత్తుకొచ్చింది. నా పొట్ట నా ఇష్టం. ఎందుకు ప్రతీ అడ్డమైన వెధవా కామెంట్స్ పాస్ చేస్తాడో అర్ధం కాదు. అదేదో నాకు ఇలా ఉండటం యమ సంతోషంగా, గర్వంగా ఉన్నట్టు. చెత్త వెధవ. మనసులో తిట్టుకున్నాను.

అదిగో అప్పటినుంచీ మూడ్ పాడై చేస్తున్న పని పక్కనబెట్టేసాను.

***

ఏం చేద్దాం? ఎవరినైనా మంచి సలహా అడిగితే? వెంటనే స్నేహితుడు కృష్ణ మనసులో మెదిలాడు. వాడికైతే మొహమాటం లేకుండా అన్నీ చెప్పొచ్చు. వెంటనే సెల్ ఫోన్ తీసి కృష్ణకు చేసాను.

“ఏరా ఉదయ్ ఎలా ఉన్నావ్? సాయంత్రం కలుస్తావా?” ఫోన్ ఎత్తుతూనే అడిగాడు. మామూలుగా కలుస్తానని చెప్పటానికే నేను ఫోన్ చేస్తూంటాను.

“అవున్రా. సాయంత్రం ఇంటికి వస్తాను. ఫ్రీగా ఉండు.” చెప్పి ఫోన్ పెట్టేసాను.

కృష్ణతో టైం గడపటం నాకు చాలా ఇష్టం. నా ఎదుగుదల చూసి ఏ మాత్రం ఈర్ష్య పడని వాడే నిజమైన స్నేహితుడని నా నమ్మకం. కృష్ణ అలాంటివాడే. అందుకే వాడంటే నాకు ఇష్టం. ఇక్కడ ఎదుగుదల అంటే బరువులో కాదు, జీవితంలో. సాయంత్రం కలిసినప్పుడు బరువు ఎలా తగ్గించుకోవాలో బాగా డిస్కస్ చేయాలి. వాడి దగ్గర ఖచ్చితంగా ఏదోక సొల్యూషన్ ఉంటుంది. ఇలా అనుకున్నాక కాస్త రిలీఫ్ గా అనిపించింది. పనిలో పడ్డాను ఉత్సాహంగా.

***

“ఏంట్రా డల్ గా ఉన్నావ్? ఏదైనా ప్రాబ్లమా? లావైనట్టున్నావ్? కలిసి చాలా రోజులైంది.” సాయంత్రం కలుస్తూనే అడిగాడు కృష్ణ. ఇద్దరం కృష్ణ ఇంటి డాబా పైన కుర్చీలు వేసుకొని తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాఫీ తాగుతూ.

“అవున్రా నా ప్రాబ్లం కూడా అదే. బాగా లావైపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వేమైనా సలహా ఇస్తావని వచ్చాను” సూటిగా చెప్పాను. అలాగే బరువు తగ్గడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చెప్పాను.

“మరీ పెద్ద లావేమీ లేవు నువ్వు. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తావ్? ప్రశాంతంగా ఉండు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది నీకన్నా లావుగా ఉంటారు తెలుసా?”

“అదంతా నాకూ తెలుసు. పనికొచ్చేదేదైనా చెప్పు. నా లావు గురించి పనికిమాలిన వెధవలందరూ జోకులేస్తున్నారు. చిరాకేస్తుంది.” చిరాగ్గా చెప్పాను.

“చెప్పటానికి పెద్దగా ఏమీ లేదురా. అవసరానికి మించి తినడం, తిన్నది పూర్తిగా అరిగించుకోలేక బరువు పెరగడం అనేది క్రమంగా, చాలా కాలంగా జరుగుతుంది. అలాగే బరువు తగ్గడం కూడా క్రమంగా జరుగుతుంది. దీనికి టైం పడుతుంది. చాలా మంది ఇంత చిన్న విషయం పట్టించుకోకుండా అర్జెంటుగా బరువు తగ్గాలని ఆత్రంగా ఏది బడితే అది చేసి అనుకున్న ఫలితం రాక నిరాశ పడుతూంటారు. నీ పరిస్థితీ అంతేలా ఉంది. నిరాశ పడకుండా పట్టుదలగా ప్రయత్నిస్తే బరువు తగ్గడం పెద్ద విషయం కాదు..”

శ్రద్ధగా విన్నాక అడిగాను “అంటే ఇప్పుడు నేను చేసే మార్నింగ్ వాక్ లాంటివి చేస్తే సరిపోతుందంటావా?”

“అదొక్కటే సరిపోదురా. బరువు తగ్గడానికి చాలా ముఖ్యంగా కావాల్సింది తిండి మీద గొప్ప నియంత్రణ. ఇది సాధించలేనప్పుడు బరువు తగ్గడమనే కల కల గానే మిగిలిపోతుంది. తిండి బాగా తగ్గించు. జంక్ ఫుడ్ మానెయ్. రాత్రి పూట తక్కువగా తిను. కొన్నాళ్ళు రాత్రి పూట పూర్తిగా మానేస్తే మరీ మంచిది. అలాగే పొట్ట తగ్గడానికి సిట్ అప్స్ చెయ్యి. మంచి రిజల్ట్ వస్తుంది.”

కాసేపు కృష్ణతో మాట్లాడి ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాను. వాడు చెప్పింది విన్నాక బరువు తగ్గొచ్చు అన్న కాన్ఫిడెన్సు పెరిగింది. రేపటి నుంచీ పొద్దున్నే లేచి సిట్ అప్స్ మొదలైనవి చేసి, తిండి బాగా తగ్గించాలి. అంత ఈజీ కాదు. అసలే తినడమంటే నాకు యమ ఇష్టం. రాత్రి పూట టీవీ చూస్తూ భోజనం చేయటం అనేది నాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం. రేపటి నుంచీ కుదరదు. ఇదే ఆఖరి రోజు. దిగులుగా మామూలు కన్నా కాస్త ఎక్కువగా డిన్నర్ లాగించాను ఇవాళ. కాసేపు టీవి చూసి త్వరగా పడుకున్నాను పొద్దున్నే లేవాలి అనుకుంటూ.

***

పొద్దున్నే ఉత్సాహంగా నిద్ర లేచాను. సిట్ అప్స్ ఎలా చేయాలో రాత్రి యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకున్నాను. చాలా కష్టం నిజంగా. చమటలు పట్టేసినయ్ కాసేపటికే. అయినా పట్టుదలగా నేను చేయాలనుకున్నది పూర్తి చేసాను. అలాగే మార్నింగ్ వాక్ మొదలైనవి కూడా చేసి స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఓ సారి అద్దంలో చూసుకున్నాను. కాస్త సన్నబడ్డట్టు అనిపించింది. ఉత్సాహంగా ఈల వేస్తూ ఈ మధ్య కొత్తగా బిగుతైన ప్యాంటు తీసి వేసుకున్నాను పడుతుందో లేదో అనుకుంటూ. కొంచెం కష్టమైంది మొదట్లో కానీ ఆశ్చర్యం చక్కగా తేలిగ్గా పట్టింది. ఈల సౌండ్ ఎక్కువైంది వెంటనే. సిట్ అప్స్ నిజంగా ఇంత బాగా పని చేస్తాయా? మరీ ఒక్క రోజులోనే ఇంత రిజల్టా? టక్ చేసుకొని బెల్టు పెట్టుకొని ఆఫీసుకు రెడీ అయ్యాను. ప్యాంటు తేలిగ్గా పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. కృష్ణకు మనసులోనే ధాంక్స్ చెప్పుకున్నాను. బ్రేక్ ఫాస్ట్ చాలా కొద్దిగా తిన్నాను. ఆకలి ఏ మాత్రం తీరలేదు. ఇంకొంచెం తినాలనిపించింది. కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. బలవంతగా కంట్రోల్ చేసుకొని బయటకు వచ్చి కార్ ఎక్కి ఆఫీసుకు పోనిచ్చాను.

కరకరలాడే ఆకలి. లైఫ్ లో మొదటిసారి తిండి తగ్గించుకొని తినటం. మ్యూజిక్ గట్టిగా పెట్టాను మైండ్ ఆకలి బాధ గురించి ఆలోచించకుండా. ఆకలిని జయించడం అంత తేలిక కాదు. బాగా ఇబ్బంది పెడుతుంది. ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్ళే దార్లో కనిపించిందది. ఆ ఏరియాలో మంచి పేరుమోసిన టిఫిన్ సెంటర్. సెలవ రోజున మామూలుగా అక్కడే టిఫిన్ చేస్తూంటాను. తెల్లని, మెత్తని ఇడ్లీలు, ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ గుర్తుకు వచ్చాయి. మనసు ఊరుకోవట్లేదు. అతి కష్టం మీద ఆ చోటు దాటాను. ఆకలి దంచుతుంది. ఏమవుతుంది ఇడ్లీలు తింటే? కావాలంటే లంచ్ తక్కువగా తిందాం. ఎలాగూ సిట్ అప్స్ వల్ల పొట్ట ఎంత తేలిగ్గా తగ్గుతుందో అర్ధమైంది కదా? పట్టదనుకున్న ప్యాంటు కూడా బాగా పట్టింది. తింటే ఏం పోయింది? మనసు తీవ్రంగా కన్విన్స్ చేయటం మొదలు పెట్టింది. నిజానికి ఇలాంటి విషయాల్లో మనసు చేసే మార్కెటింగ్ మామూలుగా ఉండదు. పట్టుదలగా ముందుకు వెళ్ళాను. కాసేపటికి మనసే గెలిచింది. పట్టు వదిలిన విక్రమార్కుడిలా యు టర్న్ తీసుకొని వచ్చి టిఫిన్ సెంటర్ లో నాకిష్టమైన ఇడ్లీలు బాగా లాగించేసాను. తింటున్నంత సేపూ ఎక్కడ లేని తృప్తి. ఆకలి కావలసిన దాని కన్నా ఎక్కువగా తీరింది. చేతులు కడుక్కొని, ప్యాంటు పైకి లాక్కుంటూ అక్కడనుంచి బయలుదేరాను. తిండి విషయంలో ఓడిపోయినా పొద్దున చేసిన ఎక్సర్సైజ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

***

“ఏరా అలా ఉన్నావ్? నేను చెప్పిందేమీ పని చేయలేదా?” అడిగాడు కృష్ణ మునుపటి కంటే ఎక్కువ దిగులుగా ఉన్న నన్ను చూసి. ఇద్దరం కృష్ణ ఇంటి డాబా మీద నిలబడి మాట్లాడుకుంటున్నాం. కొద్ది రోజుల తరువాత కలిసాను కృష్ణను.

“ఏం పని చేయడం రా? జీవితం మీద విరక్తి కలుగుతుంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగా తగ్గిపోతుంది రోజురోజుకూ. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. ఏ రిజల్ట్ లేదు.” చెప్పాను షర్టు మీదుగా పొట్టని రెండు చేతుల్తో పట్టుకొని పైకి కిందకి ఊపుతూ.

“సిట్ అప్స్ చేయట్లేదా? ఏ రిజల్ట్ లేకపోవడమేంటి? అసలేం జరిగింది?”

“చేసాను. మొదటి రోజే ప్యాంటు బాగా ఫిట్ అవడంతో ఉత్సాహంగా ఆఫీసుకు వెళ్ళాను. ఇంత తేలిగ్గా పొట్ట తగ్గడం నిజంగా ఎప్పుడూ ఊహించలేదు. అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళాక తెలిసింది జరిగిందేంటో. ప్యాంటు బిగుతైపోయి నడుము దగ్గర వెనక వైపు మొత్తం కుట్లూడి పోయి చినిగిపోయింది. అందుకని తేలిగ్గా పట్టిందది. పొట్ట తగ్గడం వల్ల కాదు. అలాగే బెల్ట్ పెట్టుకొని వెళ్ళిపోయాను సంతోషంగా. అసలు విషయం తెలిసాక ఎక్కడ లేని నీరసం ఆవరించింది.”

చిన్నగా నవ్వి చెప్పాడు కృష్ణ “సర్లేరా. ఇలాంటివి పట్టించుకోవాకు. తిండి తగ్గించమని చెప్పాను కదా. దాని సంగతేంటి?”

“నా వల్ల కాలేదు రా. ప్రతీ రోజూ మరుసటి రోజు నుంచీ తిండి తగ్గిద్దామని ఆ పూట ఎక్కువగా తినడం. ఆకలికి తట్టుకోలేక మరుసటి రోజు కూడా తినేయడం. ఇదే పని. బాగా పట్టుదలగా తినడం మానేద్దామనుకునే సరికి, ఇంట్లో ఏ బిర్యానీయో ఇంకేదో వండటం, పట్టుదల మొత్తం వదిలేసి తినటం. తిన్న మరుక్షణం నుంచీ అనవసరంగా తిన్నానని ఫీల్ అవ్వడం. ఇదంతా ఓ వలయంలా తయారయింది. నా బతుకు ఇంతేనా అని ఓ పక్క దిగులు. ఏం చేయాలో తోచట్లేదు.”

కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి చెప్పాడు కృష్ణ సీరియస్ గా “ఉదయ్. తిండి మీద కంట్రోల్ లేనిది నువ్వు బరువు తగ్గలేవు. ఆకలిని, తినాలన్న కోరికను జయించాలంటే, నీ మనసు తినడానికి మించి ఎక్కువ తృప్తినిచ్చే దాని మీదికి వెళ్ళాలి. అప్పుడు కానీ పనవ్వదు. తినాలన్న కోరిక కంట్రోల్ చేసుకునే టైంలో ఏ పుస్తకాలు చదవటమో, మంచి సినిమా చూడటమో చేసి, ఆలోచనలు తిండి మీద లేకుండా చూసుకోవాలి. అలా ఏదైనా ట్రై చెయ్యి.”

ఏదో సినిమాలో చూసిన “అంతకు మించి.” అన్న డైలాగ్ గుర్తుకొచ్చింది కృష్ణ చెప్పింది విన్నాక.

“నువ్వు చెప్పేవన్నీ ఎప్పుడో ట్రై చేసి ఫెయిల్ అయ్యాన్రా. తినటానికి మించి తృప్తినిచ్చేది ఏంటో మరి. అయినా మళ్ళీ ట్రై చేస్తాన్లే.” కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడి ఇంటికి వచ్చేసాను. ఈ రాత్రికి మాత్రం డిన్నర్ మానేయ్యాల్సిందే. కృత నిశ్చయంతో అనుకున్నాను ఇంట్లోకి అడుగు పెడుతూ.

“నాన్న ఇందాక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే అందరికీ పీట్జా తెప్పించారు. నీకోసం టేబుల్ మీద ఉంది. వచ్చి తిను.” నేరుగా నా గదిలోకి వెళుతూంటే చెప్పింది అమ్మ. ఎక్కడలేని కోపం వచ్చింది. అసలే లావై చస్తూంటే, ఇవన్నీ ఒకటి. ఏది ఏమైనా ఇవాళ ఏమీ తినకూడదు. జవాబివ్వకుండా లోపలకు వెళ్ళి ఫ్రెష్ అయి మంచి పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టాను. ఆకలి. కరకరలాడుతుంది. పీట్జా వాసనకి మతి పోతుంది. ఏంటీ నరకం? దృష్టి మళ్ళించి, పుస్తకం మీద ఫోకస్ చేసాను. ఇక నా వల్ల కాలేదు. వెళ్ళి ఆత్రంగా తినేసాను ఏదైతే అదవుతుందని.

***

“మే ఐ కమిన్ సర్” కేబిన్ డోర్ సగం తెరిచి లోపలకు రాబోతూ అడిగాడు.

“ఎస్.” చెప్పాను వస్తున్న వ్యక్తి వైపు తేరిపారా చూస్తూ. వయసు పాతికేళ్ళ లోపే ఉండొచ్చు. చూడగానే మంచి అభిప్రాయం కలిగేలా ఉన్నాడు. కాస్త తక్కువ ధర బట్టలు వేసుకొని ఉన్నా, ఉన్నంతలో నీట్ గా, ఫిట్ గా ఉన్నాడు. కళ్ళల్లో అదో రకమైన పట్టుదల, చురుకుదనం. దేన్నో సాధించాలన్న తపన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది.

“ప్లీజ్ సిట్.” చెప్పాను ఎదురుగా ఉన్న కుర్చీ వైపు చూపిస్తూ. జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కి షార్ట్ లిస్ట్ అయిన కాండిడేట్ అతడు. నాది చివరి రౌండ్. నేను సెలెక్ట్ చేస్తే అతడికి ఉద్యోగం వచ్చినట్టే. ఇప్పటి దాకా చూసిన ముగ్గురి కన్నా ఇతడు చూడగానే నాకెందుకో బాగా నచ్చాడు.

ఎందుకో తెలీదు. ఏదో జరగబోతున్నట్టుగా అనిపించింది.

“మీ పేరు?” ఇంగ్లీషులో అడిగాను ఇంటర్వ్యూ మొదలు పెడుతూ.

“విక్రమ్ సర్.” చెప్పాడు. నిటారుగా కూర్చొని ఉన్నాడు కుర్చీలో, శ్రద్ధగా నా వైపు చూస్తూ.

రొటీన్ ప్రశ్నలు అయ్యాక, టెక్నికల్ ప్రశ్నలు అడిగాను. చక్కగా జవాబులు చెప్పాడు. ఒకటి రెండు ప్రశ్నలకి సమాధానం తెలీదని కూడా నిజాయితీగా చెప్పాడు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడకపోయినా గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడాడు. అన్నీ బావున్నాయి. సెలెక్ట్ చేసే ముందు చివరగా వ్యక్తిగత విషయాలు అడిగాను మామూలుగా. ఆ క్షణం నాకు తెలీదు అతడు చెప్పే విషయాలు నా ఆలోచనల్ని ఊహించని మలుపు తిప్పుతాయని.

“మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?” అడిగాను చాలా మందిని అడిగినట్టుగా.

“నేను అనాధను సర్. మెన్స్ హాస్టల్లో ఉంటున్నాను”

ఆశ్చర్యపోయాను. మొదటి సారి ఓ అనాధను కలవడం. చక్కగా ఎం కాం చదివి ఇక్కడి దాకా రావటం నిజంగా గొప్ప విషయం. ఇతడి గురించి మరింత తెలుసుకోవాలనిపించింది.

“మీరు బాగా చదువుకొని ఈ స్థాయికి రావటానికి ఇన్స్పిరేషన్ ఏంటి విక్రమ్?” తెలుగులో అడిగాను.

“ఆకలి.”

చివుక్కున తలెత్తాను. “కొంచెం వివరంగా చెబుతారా?” అడిగాను. నాకు తెలియని కొత్త కోణం ఏదో తెలుస్తున్నట్టుగా అనిపించింది.

“.అవును సర్. ఆకలే నేను జీవితంలో పైకి వచ్చేలా చేసింది. నేను పెరిగింది భోజన సదుపాయం ఏ మాత్రం సరిగ్గా లేని ఓ అనాధాశ్రమంలో. చిన్నతనం నుంచీ ఆకలి బాధేంటో బాగా తెలుసు నాకు. అక్కడి పరిస్థితి ఒక్క సారి ఊహించండి సర్. అమాయకమైన పసి పిల్లలు. వాళ్ళు అలా అక్కడ ఎందుకు ఉన్నారో తెలీదు. అమ్మా, నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో ఊహకందదు. ఆకలి బాధ భయంకరంగా ఏడిపిస్తూంటుంది. ఓదార్చడానికీ, అక్కున చేర్చుకోడానికీ ఎవరూ ఉండరు. తినడానికి సరిపోయేలా ఎందుకు ఉండదో తెలీదు. బయట ఎక్కడైనా తల్లిదండ్రులు వారి పిల్లలకి తినటానికి ఏదైనా కొని పెడితే ఆశగా అటు వైపు చూస్తారు మనసులో తమ పరిస్థితి తలచుకొని కుమిలిపోతూ.

ఇలాంటి వాతావరణంలో పెరిగిన నేను, ఎన్నో సార్లు ఎంతో మంది డబ్బున్న వాళ్ళను చూస్తూండే వాడ్ని. హాయిగా కార్లలో తిరిగుతూ, సొంత ఇళ్ళల్లో సుఖంగా ఉంటూ, కావల్సింది తింటూ తాగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అవసరానికి మించిన డబ్బు, ఆస్తి ఉంటాయి. వాటిలో కొంత నాలాంటి వారి ఆకలి తీర్చడానికి ఎందుకు ఇవ్వరు అని ఆలోచించే వాడ్ని. సమాధానం దొరికేది కాదు. మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతీ రోజూ ప్రతిజ్ఞ చేసేవాళ్ళం మీకు గుర్తుందా సర్. భారత దేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. అందరూ సహోదరులే అయితే మరి ఎందుకు సర్ నా లాంటి వాళ్లకు ఇన్ని కష్టాలు. ఎందుకు డబ్బున్న వాళ్లకు నా లాంటి సోదరులు పడే బాధలు పట్టవు? వాళ్ళకు పేద వారి ఆకలి తీర్చడం కన్నా డబ్బు దాచుకోవటంలోనే ఎందుకు అంత తృప్తి?

ఇలాంటి ఆలోచనల్లోంచి పుట్టిందే నేను బాగా చదువుకొని పైకి రావాలన్న పట్టుదల. నేను సంపాదించే ప్రతీ రూపాయిలో సగం పేదవారి ఆకలి తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నిజమైన భారతీయుడంటే ఎలా ఉండాలో, మనం బళ్ళో చేసుకున్న ప్రతిజ్ఞ ఆచరణలో పెడితే ఎంత గొప్పగా ఉంటుందో ఈ లోకానికి నేను చూపిస్తాను సర్.” ఏ మాత్రం ఆవేశ పడకుండా, సూటిగా, స్పష్టంగా చెప్పాడు విక్రమ్.

***

మనసంతా బరువెక్కింది. విక్రమ్ వెళ్ళిపోయాక కేబిన్ లో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాను. అతడు చెప్పింది ఎంత చేదు నిజం. ఎంత మంది పేద వాళ్ళు, అనాధ పిల్లలు మన చుట్టూ ఉన్నారు? వాళ్ళ గురించి నాలాంటి వాళ్ళు అసలు ఆలోచిస్తారా?

బరువు తగ్గడానికి ఎంత తపన, అవస్థ పడ్డాను ఇన్నాళ్ళూ? కొద్ది సేపు కూడా ఆకలి బాధకి తట్టుకోలేక డైటింగ్ పక్కన బెట్టి ఆత్రంగా తినడం గుర్తుకు వచ్చింది. పేదవారు, అనాధ పిల్లలు ఎంతో మంది అదే ఆకలి బాధ ప్రతీ రోజూ అనుభవిస్తున్నారు. తినాలన్న కోరిక, వయసు ఉండీ, స్తోమత లేక తినలేక పోవటం ఎంత బాధాకరం నిజంగా.

ఎన్నో సార్లు టిఫిన్ సెంటర్ దగ్గర, రెస్టారెంట్ల దగ్గర పేద పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా ఏదైనా తినడానికి పెడతారని ఆశగా తచ్చాడటం గుర్తుకొచ్చింది. ఎప్పుడూ వాళ్ళని పట్టించుకోలేదు. కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినయ్. బరువు తగ్గాలంటే తినటానికి మించి తృప్తినిచ్చేదేంటో అది చేయాలి. ఇప్పుడు అర్ధమైంది అదేంటో. తినటానికి మించిన తృప్తినిచ్చేది లేని వారికి పెట్టడం! అవును అంతకు మించి తృప్తినిచ్చేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు!! ఇన్నాళ్ళూ ఇంత చిన్న విషయం తెలియక పోవటం నా దురదృష్టం. ఇప్పటికైనా విషయం తెలిసింది. ఇవాళ్టి నుంచీ డైటింగ్ చేసే ప్రతీ రోజూ ఏ పీట్జానో, సాండ్విచో తినాలనిపించినప్పుడల్లా అదే ఐటమ్ కనీసం ఓ పాతిక ప్యాక్ చేయించి పేద పిల్లలకు పంచాలి, మంత్లీ ఇన్కమ్ లోంచి ఫిక్స్డ్ గా కొంత డబ్బు పక్కన బెట్టి పేదవారికి ఎలా సాయం చేయాలో చూడాలి. ఇంకా ఏదో ఆలోచిస్తూండగా కేబిన్ డోర్ నాక్ చేసి లోపలకు వచ్చాడు వేణు.

“సర్ మీ టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ఇంకో రెండ్రోజులే టైముంది. ఆడిటర్ గుర్తు చేయమన్నారు”

“చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్ వేణు. ఆల్రెడీ ఫైనల్ చేసాను.” చెప్పాను చిరునవ్వుతో.

“ఎందులో సర్?” ఆసక్తిగా అడిగాడు.

“లక్షా ఏభై వేలు ఓ అనాధాశ్రమానికి విరాళంగా ఇస్తున్నాను.”

***

“ఏరా బరువు బాగా తగ్గినట్టున్నావ్? మొహం కూడా వెలిగిపోతుంది. ” సంతోషంగా అడిగాడు కృష్ణ నన్ను చూస్తూనే. చాలా రోజుల తరువాత కలిసాను.

“అవున్రా. నువ్వు చెప్పినట్టు తినటానికి మించి తృప్తినిచ్చే విషయం తెలుసుకున్నాను.”

“ఏంట్రా అది? సినిమాలా? పుస్తకాలా?” ఆసక్తిగా అడిగాడు.

“అంతకు మించి.” చిరువ్వుతో జరిగిందేంటో చెప్పాను.

***


Rate this content
Log in

Similar telugu story from Drama