తన దాకా వస్తే!
తన దాకా వస్తే!


ఏమిటండీ ! ఏదో పరధ్యానం
పిలిస్తే ఉలకరు పలకరంటూ నిష్ఠూరంగా రమణి అడిగేసరికి....
ఆలోచనల్లోంచి బయటపడ్డట్టు సుదర్శన్ రావు నవ్వుతూ ..
"అదేం లేదే".. కాస్త ఆఫీసులో పని ఒత్తిడి అంతేమరి..
"అవునవును" ఈరోజే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు కదూ!
అందుకే ఇలా మౌన పోరాటం..అయ్యగారు
అంటూ ముసిముసిగా నవ్వుకుంది రమణి.
' అబ్బ' చాల్లే నీ వెటకారపు మాటలు.
'అదికాదండీ' , మీ ముప్పై యేళ్ళ సర్వీసులో ఏనాడు ఇలా పని ఒత్తిడని దిగాలుగా కనిపించంది. ఈరోజు కొత్తగా చెపుతుంటే ఇంకెలా మాట్లాడమంటారు ,భర్త ముఖంలోని ఆందోళనను గమనించి తన ప్రక్కగా కూర్చుంటూ...అంది రమణి
తమ జీవిత భాగస్వామ్యం మొదలయినప్పటి నుండీ దాపరికం లేని సంసారిక జీవనాన్ని అనుభవిస్తున్న తనను భలే కనిపెట్టేసింది. తనకు తప్పేలా లేదు చెప్పడం అనుకుంటూ...
రెండు రోజుల క్రితం ఆఫీసులో జరిగిన
ఆడిటింగ్ లో కొంత లెక్కలు తేడాగా వున్నాయి. అవన్నీ నేనే చూసేవాణ్ణి ,
నాకు తెలియకుండా తప్పెలా వచ్చిందో తెలియదు , కానీ అకౌంట్సన్నీ సర్దుబాటు చేసేంత చిన్న పొరబాట్లు అంతే.
అయినా నా పై అధికారి ఆఫీసులో అందరి ముందు నన్నొక దోషిలా చేసి సస్పెండ్ చేయిస్తానని చెప్పి వెళ్ళాడు.
నేను దానికి బాధ పడటం లేదు.తప్పుచేయనపుడు ఎవరికైనా సంజాయిషీ
ఇచ్చుకోనవసరం లేదంటాను.
కానీ , ఇన్నాళ్ళ నా సర్వీసులో నాక్రింది ఉద్యోగులు తెలిసో తెలియక పొరబాటు చేస్తే చాలాసార్లు నిర్మొహమాటంగా చీవాట్లేసి ,పని చేత కాకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలని, వారిని పర్సనల్ గా కుటుంబాలను సైతం కించపరిచే విధంగా అవమానపరిచాను.
నాకపుడు తెలియలేదు వారెంత నరకయాతన అనుభవించింది, మానసికంగా ఎంతగా కుమిలిపోయేవారో.
ఆఫీసు పనిలో నేనెంత నిజాయితీగా నిబద్ధతగా వుంటానో వారికీ తెలుసు కాబట్టి
నాపై ఏ ఒక్కరూ అమర్యాదగా ఎపుడూ ప్రవర్తించలేదు.వారు చనువుగా మాట్లాడాలని దగ్గరవ్వాలని చూసినా దూరం పెట్టాను.
ఈ రోజు చేయని తప్పుకు నాపై అధికారి దురుసుగా మాటలంటున్నపుడూ
నా మనసెంత క్షోభ పడిందో నాకు అంటూ
కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న భర్తను చూస్తే
తనమాటే నెగ్గాలనే తపన , తప్పు చేయననే అహంభావం ,ఆత్మాభిమానం అన్నీ నిండివున్న తన భర్తలో పశ్చాత్తాపానికి తగ్గ ప్రాయశ్చితం కనిపిస్తోంది.
ఏదైనా 'తనదాకా వస్తేనే' దాని విలువ
తెలుస్తుందనే గట్టిగా నమ్ముతుంది రమణి.
సమాప్తం
***************************************