అర్థం చేసుకో!
అర్థం చేసుకో!


తెల్లారింది మొదలు వంటింట్లో అంట్లగిన్నెలతో కుస్తీ
ఆపై ఓ కప్పు వేణ్ణీళ్ళు అదేనండి కాఫీ గుటగుట తాగి
నాలుగు క్యారేజీల బ్యాగులు సిద్ధం చేసి
చెమట చుక్కల అత్తరను తుడుచుకుంటూ
ఓ బొట్టు బిళ్ళను అతికించేసి
చీర కుచ్చిళ్ళు సవరించుకుంటూనే
చేతికి కట్టాల్సిన గడియారం...ఎక్కడుందో
ఓ వైపు వెతుక్కుంటూ...
అమ్మా నా సాక్స్ ....అదిగో చిన్నోడి పిలుపు
అమ్మా నా స్కూల్ ...ప్రాజెక్ట్ పెద్దమ్మాయి నీలు అరుపు
నా బైక్ కీస్ ఇక్కడ లేవే శ్రీవారి గొంతు...
ఇదిగో వస్తున్నా ....తెస్తున్నా... నా గొంతు పెగలడం లేదే..
మనసులోనే అనేసుకున్నా మరి...
చెప్పేంత సమయం లేదు మరి...
చిన్ను నీ సాక్స్ తీసుకుని షూ వేసుకో
నీలు నీ ప్రాజెక్ట్ వర్క్ ఇదిగో కదిలించకు జాగ్రత్తగా తీసుకెళ్ళు.
గోడకు వేలాడుతున్న బైక్ కీస్ అయోమయంగా చూస్త్తోంది,"నేనిక్కడే వున్నాను , నన్ను ఎవ్వరూ పిలవలేదని". 'పిచ్చిమొహమా నేనే వచ్చి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి' అదీ రూల్ అర్థమయ్యిందా అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఓ చేత్తో పట్టుకువెళ్ళాను.
సిరి ,అమ్మకు అన్నీ రెడి చేసి దగ్గరగా ఉంచావా,
మందులు మరచిపోకుండా వేసుకోమని చెప్పు.
అలారమ్ పెట్టి వెళ్ళు .తను లేచినపుడు పడిపోకుండా వాకర్ ను కాస్త దగ్గరగా జరిపి వుంచు పట్టుకోవడానికి వీలుగా వుంటుంది.
అన్నీ సిద్ధంగా వున్నాయి ,ఆలస్యమవుతోంది ఈ ఒక్కరోజు ఏం అవాంతరాలు జరగకుండా వుంటే బాగుండు.
నన్ను బస్టాప్ లో డ్రాప్ చేసి మీరు ఆఫీస్ కు అటు వెళ్ళండి.
...........
నెలక్రితం వరకు అత్తగారి ఆరోగ్యం బాగానే వుండేది. ఇంటి పనుల్లో ఎంతో సహాయంగా వుండేవారు.
అలాంటి మనిషి ,ఎప్పుడు ఎలా మారుతుందో తెలీయటం లేదు. మానసికంగా డిప్రెషన్లో వుండి
తినడం తాగటం లాంటివి కూడా మరచిపోతోంది.
ఇంట్లో మనుషులను కూడా గుర్తు పట్టడం లేదు
బయటి వాళ్ళను ఎవ్వరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు
కన్నకొడుకులు ,కూతుళ్ళు వచ్చినా వెళ్ళిపోండి అంటూ కేకలు పెడుతుంది. తనను మాత్రం దగ్గరగా కూర్చోమంటూ నవ్వుతూ పలకరిస్తుంది.
ఇదివరకెపుడూ వినని విషయాలను గురించి తనకే చెబుతుంది. తన మానసిక పరిస్థితి గురించి మేము అర్థం చేసుకునేలోపు 'అల్జీమర్స్' లాస్ట్ స్టేజ్ లో వుంది
మీరు జాగ్రత్తగా చూసుకోండని డాక్టర్ చెప్పడంతో
తనకు కావల్సినవి అన్నీ అందుబాటులో వుంచి వెళుతున్నాం. నిన్నటికి నిన్న మంచినీళ్ళకోసమని వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి
గ్యాస్ వెలిగించడం మరచిపోయింది. పక్కింటి వారు
గ్యాస్ లీక్ అవుతుందని గమనించి ఇంటికి వచ్చి చూసి సిలిండర్ ఆఫ్ చేసి వెళ్ళారు. తృటిలో ప్రమాదం తప్పిందన్నారు , ఆవేళలో కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేదంటూ జాగ్రత్త చెప్పి వెళ్ళారు. బాత్రూం లోను నీళ్ళు తిప్పేసి ట్యాప్ ఆఫ్ చేయడం మరచిపోతుండడం,స్నానం చేస్తూ అలాగే రావడం ఇలా ఏదో ఒక సమస్యతో సతమతవుతూ వున్నాను.
మొదట్లో తన అనారోగ్యం వల్ల నాకు చాలా కోపం ,అసహనం వచ్చేది. ఇటు పిల్లలు ,ఆఫీస్ పని ఒత్తిడి లో తనను చూసుకోవడం కష్టమై విసుగొచ్చేది.
కానీ మా వారు చెప్పిన ఒక్కమాట...
"రేపు నీకూ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా వుంటుంది ,
అమ్మ మనసు మరో అమ్మకే తెలుస్తుంది అంటారు"
నువ్వు ఆడదానివే , అమ్మవే చదువుకున్న దానివి అర్థం చేసుకుని అమ్మను చూసుకుంటావనుకుంటాను
అమ్మకు చదువు విలువ తెలుసు కాబట్టి ,తను చదువుకోకపోయినా మన పెళ్ళైనా నిన్ను బాగా చదువుకోమని ,మంచి ఉద్యోగం చేసుకుని పిల్లలకు మంచి చదువు,సంస్కారాలు నేర్పించగలవని మా అమ్మ నమ్మకం. ఆ నమ్మకంతోనే
మా మామయ్యను కాదని నీతో వివాహం చేసింది. ఆ సంస్కారంతోనే తనని ఓ అత్తగా కాక అమ్మలా చూసుకోమని చెబుతున్నాను"
అదృష్టవశాత్తు అమ్మ నిన్ను ఒక్కదాన్నే దగ్గరకు రానిస్తోంది. తన రక్తం పంచుకు పుట్టిన మా అన్నదమ్ములను ,అక్కను చెల్లిని ఎవ్వరినీ గుర్తు పట్టటం లేదు. తనకు నువ్వంటె ఎంత ఇష్టమో చూడు సిరి. నువ్వేం చెబితే అలా చేస్తుంది చిన్నపిల్లలా అమ్మ.
అమ్మను అలా చూస్తుంటే నాకు కన్నీరు ఆగటం లేదు
కానీ నేను అసహాయుడను. నీకు కావాల్సినంత ఓర్పు భగవంతడిచ్చాడు. దాన్ని నాకోసం మా అమ్మకు కేటాయించు
ఆ తర్వాత నీ ఇష్టం సిరి అంటూ వెళ్ళిపోయారు.
నా గుండె కొట్టుకోవడం ఆగిపోయిందేమో అనుకున్నా
మానవత్వం చూపండని రోజూ చదవడమే కానీ ఇంట్లో మనిషిని కాస్త ప్రేమగ పలకరించి ,ఆత్మీయంగ అక్కున చేర్చుకున్న దాఖలాలు లేవు.
మొద్దుబారుతున్న మనసును దారిలోకి మళ్ళిస్తూ
ప్రతికూలతలన్నీ పటాపంచలు చేసి అమ్మ మనసును అర్థం చేసుకోవడంతో ఆమెకు మరింత చేరువైపోయి
నా కంటిపాపలా చూసుకోవాలని
నేటితో ఆఫీస్ కు శెలవు తీసుకుని
రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ తో
ప్రారంభించాలని
బయలు దేరుతున్నాను.
***************************************
సమాప్తం