సౌభాగ్యమ్మ సుప్రభాతం
సౌభాగ్యమ్మ సుప్రభాతం


కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే |ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్....
రే పింజారీ వెదవ లేవరా తెల్లారి పోయింది....
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ....
సోంబేరి వెధవ, అంట్ల గాడిద త్వరగా లేవరా తెల్లారి పోయింది.....
తెల్లవారుజామున తన రోజును మొదలు పెట్టు కున్న సౌభాగ్యమ్మ గారు పూజా సమయంలో ఆ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం వాపాడుతూ తన మనవడికి కూడా ఇలా తిట్లతో సుప్రభాతం పాడుతూ నిద్ర లేపుతుంది
సౌభాగ్య గారి వయస్సు సుమారు 74 ఏళ్లు... ఆ వయసులో కూడా ఆవిడ తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంట్లో పని మొత్తం చూసుకొని రోజు తులసికోటకు పూజ చేసి అలాగే పూజగది లోని దేవుళ్ళు అందరికీ కూడా సుప్రభాతం పాడి మేల్కొలుపుతుంది.
ఆ దేవుడి తో పాటు ఆమె మనవడు సురేంద్ర కు కూడా ఇలా రోజు తిట్లతో సుప్రభాతం పడుతుంది.
అతనికి కూడా అలవాటే కానీ రోజు తిడుతూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది అతనికి.
ఎలాగైనా ఆవిడతో తిట్లు తప్పించుకోవడానికి త్వరగా నిద్ర లేవాలి అనుకుంటాడు కానీ అతని వల్ల కాదు.
సురేంద్ర కి 13 ఏళ్ల వయసులో అతని తల్లి తండ్రి చనిపోతారు.
బంధువులందరూ రాబందుల్లా అతని ఆస్తిని తన్నుకు పోవాలి అని ప్రయత్నిస్తారు.
కానీ ఆ సమయంలోనే ఏనాడు ఇంట్లోంచి అడుగు బయట పెట్టి ఎరుగని సౌభాగ్యమ్మ గారు...
తన కొడుకు కోడలు పోయిన బాధలో కూడా దిగమింగి మనవడి కోసం మనసును దిటవుచేసుకొని.. అందరికీ ఎదురు తిరుగుతుంది.
ఎంతో కష్టపడి ఉన్న ఆస్తిని... వృద్ధి చేయలేకపోయినా కాపాడుకుంటూ వస్తోంది.
అలాగే అతనికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ అన్ని సవ్యంగా జరిగేలా చూసుకుంటుంది.
దాంతో అతనికి నాయనమ్మ అంటే ఒక రకమైన ఆరాధన భావం ఏర్పడుతుంది.
కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటే ఉదయాన్నే లేవకపోతే ఆవిడ దేవుడికి సుప్రభాతం తో పాటు సురేంద్ర కి కూడా తిట్లతో సుప్రభాతం పాడేస్తుంది
ఎన్నోసార్లు చెప్పి చూశాడు, బ్రతిమాలాడు, బెదిరించాడు, హెచ్చరించాడు, అయినా ఆవిడ తీరు మారదు.....
ఇక ప్రస్తుతానికి వస్తే...
సురేంద్ర తిట్లు వినిపించకుండా మరో దిండును తీసి తలమీద పెట్టుకుంటాడు..
ఆవిడ ఎంత పిలిచినా సురేంద్ర పలక పోయేసరికి వెంటనే దేవుడికి హారతి ఇచ్చేసి గబగబా బెడ్ రూమ్ లోకి వస్తుంది.
అతను పడుకొనే ఉన్నా వాలకం చూసి ఆవిడకి ఒళ్ళు మండిపోతుంది వెంటనే ఒక బకెట్ నీళ్ళు తెచ్చి అతని మీద కుమ్మరిస్తుంది.
దెబ్బకి నిద్ర మత్తు వదిలిపోయి లేచి కూర్చున్న సురేంద్ర...
ఇంత వయసొచ్చినా నీకు ఒంట్లో ఓపిక ఏమాత్రం తగ్గలేదు... ఎందుకే నాయనమ్మ ఇలా కాల్చుకొని తింటావు నిద్ర కూడా పోనివ్వవా...
అంటాడు దీనంగా...
బారెడు పొద్దెక్కినా నిద్ర పోతూ ఉంటే ఇంట్లో అరిష్టం రా అడ్డ గాడిద....
త్వరగా లేచి రెడీ అవ్వు టైం అవుతోంది అంటుంది కోపంగా.
టైం ఏడు గంటలే నేను ఆఫీస్ కి వెళ్లాల్సిందే పది గంటలకి ఇంకా మూడు గంటల టైం ఉంది ఎందుకే ఇలా ప్రాణం తీస్తున్నావు....
ఇంకొక మాట మాట్లాడే నడ్డి విరగకొడతా... అప్రాచ్యపు వెధవ.. త్వరగా తెములు అని అరుస్తుంది.
ఇక చేసేదేమీ లేక తడిసిన దుప్పటి తీసి బతకాల్సిన బట్టల్లో వేసి.. ఫ్రెష్ అవడానికి బాత్రూమ్ లోకి వెళతాడు.
బయటికి వచ్చేసరికి గుమగుమలాడే సువాసనలు వస్తూ ఉంటాయి వంట ఇంట్లోంచి.....
అలాగే కమ్మటి వాసన ను పీల్చుకుంటూ ఏదో మైమరపు లో.. కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి పోతాడు.
గుమ్మం దగ్గర నిల్చొని అలాగే అవసరం అని పీల్చుకుంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటాడు.
రెండు నిమిషాలకి చేతికి చుర్రుమని తగలడంతో అబ్బా అని అరుస్తూ కళ్లు తెరుస్తాడు..
ఎదురుగా సౌభాగ్య గారు పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ ఉంటుంది చేతిలో అట్లకాడతో.
కాలిన చోట ఊదుకుంటూ ఏంటి నాయనమ్మ అలా వాత పెట్టేశావు అంటాడు.
ఎన్ని సార్లు చెప్పాను రా వంటింట్లో కి రాకు అని ఎందుకు వచ్చావ్ అని అరుస్తుంది.
మంచి స్మెల్ వస్తుంది..... అందుకే ఆ స్మెల్ ని ఆస్వాదిస్తూ అలా వచ్చేసాను అంటాడు.
బాత్రూమ్ లో odonil పెట్టాను అక్కడి నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది అక్కడి కీ కూడా ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి...
ఛీ ఛీ అక్కడికి ఎందుకు వెళ్తాను... ఆయన నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుందే అంటాడు.
ఆ మాటకి సౌభాగ్యమ్మ గారు... అది ఏంట్రా అంత మాట అనేసావు.... నీమీద కాకపోతే నాకు ఎవరిమీద ప్రేమ ఉంటుంది రా తింగరి వెధవ అంటూ మొట్టికాయ వేస్తుంది.
ఎంత మాట్లాడినా కూడా తిట్లు మాత్రం మానవే... అంటాడు కోపం గా మొహం పెట్టి
చాల్లే పోరా నీ అభిమానం అంటూ బయటకు తోసేస్తుంది సురేంద్ర ని.
నీకు అలా అర్థమైందా తల్లి అంటూ వెళ్ళి పోతాడు.
సౌభాగ్యమ్మ గారు చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకు వచ్చి టేబుల్ మీద పడుతుంది.
ఎందుకే నాయనమ్మ ఇన్ని ఐటమ్స్ చేస్తావు రోజు నా కోసం అంటాడు.
ఉండే ఒక్కగానొక్క వంకాయ గాడివి రా నీ కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తా అని చెప్పు అంటుంది.
అబ్బా ఎంత ఫ్లో లో మాట్లాడిన గాని ఆ మాటలు నీకు రాకుండా వుండవు కదా నాయనమ్మ....
అవి మానవు నేను మారను అంటూ మూతి మూడు వంకర్లు తిప్పి ప్లేట్లో వడ్డిస్తుంది.
ఇంతలో సురేంద్ర ఫ్రెండ్ నరేష్ వస్తాడు.
అతను రావడంతోనే సౌభాగ్య గారు సరిగ్గా సమయానికి దిగబడ్డాడు అక్కుపక్షి.... కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడిలా ఏం తింటాడో.... వీడి పొట్ట పగిలి పోను..
ఎందుకు నాయనమ్మ వాడిని అలా తిడతావ్ అని అంటాడు సురేంద్ర.
నీకు తెలియదు నువ్వు ఊరుకోరా... ఎప్పుడు చూడు సరిగ్గా నువ్వు తినే టైం కి వస్తాడు... నీ కోసం చేసిన వన్ని నువ్వు పూర్తిగా తినకుండానే సగానికిపైగా వాడు మేసేస్తాడు...
నువ్వు మాత్రం అర్ధాకలితో పోతున్నావ్.. ఏం.. వాడి ఇంట్లో మెక్కి చావచ్చు గా గుడ్లగూబ వెధవ.
అబ్బా తిట్టకే... వాడు వింటే బాధపడతాడు...
వినని... వింటే అన్న బుద్ధి వస్తుందేమో...
అప్పుడే అక్కడికి వచ్చిన నరేష్...
నాకన్నీ వినబడుతున్నాయి..... అని సౌభాగ్యము గారి వైపు చూసి...
బామ్మ బేసిగ్గా నాకు సిగ్గు లేదు నువ్వు ఎన్ని అన్నా నేను పట్టించుకోను... ఎందుకంటే నీ చేతి వంట అమృతం అది తింటూ చచ్చిపో వచ్చు....
అలా అయితే రేపు ఎండ్రిన్ కలిపిన హల్వా చేస్తాను రా రా.... నీకోసం రెడీగా పెడతాను తింటూ చచ్చి పో...
అమ్మో వద్దు బామ్మ... నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి నువ్వు చేసిన చేస్తావ్...
మరి ఎందుకు రా... అంత ఓవరాక్షన్ చేస్తావ్ అంటాడు సురేంద్ర.
బామ్మ వంట అమృతం రా తినడానికి ఎన్ని తిట్టినా తింటా ఎన్ని వేషాలైనా వేస్తా అంటాడు....
కంచం తీసుకొని ఆవిడ చేసిన ఐటమ్స్ అన్నీ వడ్డించుకుంటాడు.
పూరి కుర్మా, ఇడ్లీ సాంబార్, నీ కారం దోశ.. ఇంకా కేసరి, హల్వా...
అసలైన ఐటమ్స్ ఏంటి నీకు ఓపిక ఎలా వస్తుంది బామ్మ అంటాడు నరేష్ తింటూ.
నా పిచ్చి సన్నాసి కోసం ఇన్ని ఏమిటి ఎన్నైనా చేస్తాను.... రేపు వాడి పెళ్ళికి చూడు వంటంతా నేనే ఒక్క చేతితో చేసేస్తాను.... అంటుంది గర్వంగా.
నిజమే చేసినా చేస్తావ్ అంటాడు సురేంద్ర నవ్వుకుంటూ.
తినడం పూర్తవగానే....
సురేంద్రకి మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్ కట్టిస్తుంది.
నరేష్ మరి నాకు..... అంటాడు అమాయకంగా.
పెరట్లో బట్టలు ఉతికే బండ ఉంది దాన్ని నాకు... అంటుంది అక్కసుగ....
బామ్మ.... అంటాడు నరేష్ ఏడుపు మొహంతో.
పోరా పిట్ట మొహం నీ కోసం సపరేట్ గా ఇంకొక బాక్స్ పెట్టాలే అది కూడా ఆ బ్యాగ్ లోనే ఉంది అంటుంది.
మా మంచి బామ్మ అంటూ సౌభాగ్యమ్మ ని ఒకసారి కౌగిలించుకుని వెళ్ళిపోతాడు నరేష్.
సౌభాగ్యమ్మ గారు బండి మీద వెళుతున్న తన మనవడిని మురిపెంగా చూసుకుంటుంది.
ఒక నెల రోజులకి పెళ్లిళ్ల పేరయ్య సురేంద్ర కి పెళ్లి సంబంధాలు తీసుకువస్తాడు.
సౌభాగ్యమ్మ గారు ప్రతి ఒక్క ఫోటో ని శల్యపరీక్ష చేసి ఒక ఐదుగురు అమ్మాయిల ని సెలెక్ట్ చేస్తుంది.
ఇక వరుసగా ప్రతివారం ఒకొక్క ఇంటికి పెళ్లిచూపులు కి పోవాలి అని నిర్ణయిస్తుంది.
ఒక ఆదివారం మొదటి అమ్మాయి ఇంటికి వెళుతుంది.
అమ్మాయి వాళ్ళ ఇంట్లో అందరూ సౌభాగ్య గారిని సురేంద్ర ను సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి అమ్మాయి ని తీసుకువచ్చి కూర్చో పెడతారు.
సురేంద్ర అమ్మాయిని చూసి పరవాలేదు బాగానే ఉంది అనుకుంటాడు.
అదే విషయాన్ని సౌభాగ్యమ్మ గారికి చెప్తాడు.
కానీ ఆవిడ ఏ విషయమైనా సరే మనవడికి ద బెస్ట్ కావాలి అనుకునే రకం.
అందుకే తనకంటూ కొన్ని పరీక్షలు ఉన్నాయి అవన్నీ నెగ్గితేనే అమ్మాయి ఓకే అని అంటుంది..
అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ... ఆవిడ ఆ మాట అనగానే ఆశ్చర్యంగా చూస్తారు ఏమిటో ఆ పరీక్షలు అని.
ముందుగా ఆవిడ వంటిల్లు ఎక్కడ అని అడుగుతుంది.
చూపించాక నేరుగా అమ్మాయిని తీసుకుని వంటింట్లోకి వెళ్లి.......
నీకు ఏమేమి వంటలు వచ్చో... అవన్నీ ఎంతసేపట్లో చేయగలవు చెప్పమ్మాయ్ అంటుంది.
ఆ అమ్మాయి బిత్తర చూపులు చూస్తూ దిక్కులు చూస్తుంది.
ఏమేమి వంటలు వచ్చు చెప్పమంటే దేబ్యపు మొహం వేసుకొని చూస్తావ్ ఏంటి... మాట్లాడు అని గదమాయిస్తుంది.
ఆవిడ అలా అనేసరికి ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడుస్తుంది.
అమ్మాయి గొంతు వినగానే ఆ అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వస్తారు.
ఏం జరిగింది అడుగుతారు ఆ అమ్మాయి ఏడుస్తూ నన్ను వంట చేయమని అడుగుతున్నారు అంటుంది.
దానికి వాళ్ల అమ్మ అమ్మాయి కి అప్పుడే వంట రాదండి... ఒక్కసారి పెళ్లి నిశ్చయించాక నేర్చుకుంటుంది అంటుంది.
దానికి సౌభాగ్యము గారు ఏమిటి.... వంట రాదా... పెళ్లి నిశ్చయించాక నేర్పిస్తావా.... అంటే తర్వాత మొదటి ప్రయోగం మా మీద నేనా.... అంటుంది కాస్త గట్టిగా.
దానికి అమ్మాయి వాళ్ళ అమ్మ... అయ్యో అదేమీ లేదండి మా అమ్మాయి చాలా త్వరగా నేర్చుకుంటుంది అని ఇంకా ఏదో చెప్పబోయి లోపు..
చాలు తల్లి మంట రాకుండా మధ్యలో నేర్చుకొని అమ్మాయికి ఇక ఎప్పటికీ వంట సరిగా రాదు మాకు మీ సంబంధం వద్దు అంటూ సురేంద్ర చేయి పట్టుకొని వచ్చేస్తుంది.
ఇంటికి వచ్చాక సురేంద్ర ధుమధుమలాడతాడు సౌభాగ్యమ్మ గారి మీద.
నేనేం చేశాను రా అంటుంది సౌభాగ్యమ్మ గారు.
ఏంటి ఏం చేసేది.... నాకు నచ్చింది అని చెప్పాను కదా అమ్మాయి కి వంట వస్తే ఏంటి రాకపోతే ఏంటి... అంతగా అవసరమైతే ఒక పని మనిషిని పెట్టుకుంటాము... అంతేగాని ఎల్లకాలం వంటలు చేస్తూ కూర్చుంటారా ఏంటి అమ్మాయిలు అంటాడు.
సరిపోయింది ఆడపిల్ల అన్నాక కాస్త కూడా వంటావార్పు రాకపోతే ఎలాగా అంటుంది సౌభాగ్యమ్మ.
సురేంద్రకి చిరాకేసి బయటికి వెళ్ళిపోతాడు.
అలా మరొక వారం గడిచిపోతుంది రెండవ ఆదివారం రాగానే... మరొకరి ఇంటికి పెళ్లిచూపులు కి వెళ్ళాలి అంటుంది.
సురేంద్ర క్రితంసారి లాగా పెంట చేయకు నాయనమ్మ అంటాడు.
సౌభాగ్య గారు నీకు ఎందుకురా తొందర నువ్వు పద అక్కడ చూసుకుందాం అంటూ అతన్ని మాట్లాడినివ్వకుండా తీసుకెళ్ళి పోతుంది.
**********************************************
ఇంటికి వచ్చిన సురేంద్ర సౌభాగ్యమ్మ గారి మీద అంతెత్తున లేస్తాడు....
క్రితం సారి చెప్పాను నీకు పిచ్చి వేషాలు వేయకు అని... మళ్లీ నీ మాట నీ మాటే గాని నా మాట వినవు కదా ఇప్పుడు చూడు కర్ర తీసుకుని కొట్టి తరమ లేదు అందుకు సంతోషపడు...
నేనేం చేశాను రా అంటూ రాగం తీస్తుంది సౌభాగ్యమ్మ.
ఇంకా ఏం చేయాలి ఫ్లోర్ ఎలా క్లీన్ చేస్తారో క్లీన్ చేసి చూపించాలా.... బాత్రూం ఎలా కడుతారు కడికి చూపించాలా.... ఎలా వస్తాయి నాయనమ్మ ఇలాంటి ఐడియాలు నీకు....
అదేమిట్రా కాస్త కూడా పని రాకపోతే ఎలాగా... వచ్చో రాదో పరీక్షించి చూడడం తప్పా.... ఇప్పుడు వచ్చి ఉంటారు తర్వాత రాదని... మేము చేయము అని మొండి కేస్తారు...
అలాగని ప్రతి పని వచ్చో రాదో టెస్ట్ చేసుకుంటూ చూస్తారా.... అది కూడా పెళ్లి చూపుల్లో... అని
అరుస్తాడు....
అదికాదురా అంటూ ఆవిడ ఏదో చెప్పే లోపు....
ఇక ఎక్కువ మాట్లాడావంటే మళ్లీ పెళ్లి చూపులకు కూడా రాను... ముందే చెప్తున్నా ఈ సారి పెళ్లి చూపులు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు... పిచ్చి పరీక్షలు లాంటివి పెట్టావ్ అంటే మాత్రం... నేను ఊరుకోను అంటూ వెళ్ళి పోతాడు.
సౌభాగ్యమ్మగారు.. ఏమిటో ఈ కాలం పిల్లలు... అన్నిటికీ అరుపులు ఏడుపులే అంటూ లోపలికి వెళ్లి పోతుంది.
తర్వాతి వారం కూడా పెళ్లిచూపులు కి వెళ్తారు.
దారిలో సురేంద్ర.. నాయనమ్మ ఇప్పటికి తమరి తెలివితేటల వల్ల రెండు చెడిపోయాయి... ఇక ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా మిగతా రెండు పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ ముందే చెప్తున్నా అంటాడు.
సౌభాగ్యమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పక్కకి చూస్తూ ఉంటారు.
సురేంద్ర మనసులో ఈ ముసల్ది ఇంకేం తలకాయనొప్పి తీసుకు వస్తుందో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైనా అనుకుంటాడు.
**********************************************
అప్పటికి సురేంద్ర సౌభాగ్యమ్మ గారితో మాట్లాడి రెండు రోజులు....
అప్పుడే ఇంటికి వచ్చిన నరేష్.. సురేంద్ర ఇంకా సౌభాగ్యమ్మ గారు ఎవరికి వారే ఎడమొహం పెడమొహంగా కూర్చుని ఉండడం చూసి....
ఏంటి వాళ్ళ ఇల్లు ఎంత సైలెంట్ గా ఉంది.... అలాగే ఎలాంటి సువాసన రావట్లేదు... ఏంటి బామ్మ... ఇంకా టిఫిన్ చేయలేదా.... క్రితంసారీ నాకోసం హల్వా చేస్తాను అన్నావ్ అంటాడు.
ఇంకొక మాట మాట్లాడవంటే గొంతులో పురుగుల మందు పోసి చంపేస్తాను వెధవ.. అంటూ అరుస్తోంది.
దెబ్బకు దడుచుకున్న నరేష్ ఏం జరిగింది బావ అంటాడు సురేంద్ర దగ్గరికి వచ్చి.
సురేంద్ర కోపంగా సౌభాగ్య గారి వైపు చూస్తూ అంతకుముందు జరిగిన రెండు పెళ్ళిచూపుల గురించి చెప్తాడు..
హా.. పోతే పోయాయి రెండు సంబంధాలు మరి నిన్న పెళ్లి సంబంధం ఏమైంది అంటాడు....
ఆ విషయం తలచుకోగానే సురేంద్ర కి ఒళ్ళు మండిపోతుంది... కోపంగా సౌభాగ్యమ్మ గారి వైపు చూస్తాడు
ఏంటి బావ.... బాగా కాల్చిన అట్లకాడ మాదిరి ఎర్రగా అయిపోయావు... ఏం జరిగింది ఏంటి అంటాడు....
ముందు రెండు సంబంధాలు సరే రా కేవలం వంట, బాత్ రూమ్ దగ్గరే ఆగిపోయింది...
నిన్న వెళ్లిన పెళ్లి సంబంధం అయితే ఇక జన్మలో ఎలాంటి పెళ్లి చూపులకు వెళ్ళకూడదు అని విరక్తి వచ్చింది.
అంతగా ఏం జరిగింది అక్కడ అంటాడు నరేష్.
దానికి సౌభాగ్యమ్మ గారు... దానికి నేను చెప్తాను రా అక్కుపక్షి అంటుంది.
ఏమిటి అన్నట్లు గా చూస్తాడు నరేష్ ఆవిడ వైపు తిరిగి.
ఈసారి పెళ్లి కూతురుకు అయితే... అన్ని పనులు వచ్చు అలాగే బారెడు పొడుగు జడ ఉంది. అమ్మ గారి ఇంట్లో కాబట్టి అంత జుట్టు ను మెయింటైన్ చేసింది మరి అత్తగారి ఇంటికి వచ్చాక ఉద్యోగం ఇంటి పని వంట పని అంటూ అంత జుట్టు ను మెయింటైన్ చేయగలదో లేదు అని డౌట్ వచ్చింది...
దాంతో అసలు ఎలా తలంటు పోసుకుంటారు ఒకసారి పోసుకుని చూపించమని అడిగాను అంతే....
ఆ మాట అనగానే నరేష్ గుడ్లు తేలేసాడు...
సురేంద్ర ఇలాంటి విచిత్రమైన పనులు చేయమని అడిగితే ఎవరైనా తరిమి తరిమి కొడతారు...
నరేష్.....పెళ్లి చూపులకు వెళితే అమ్మాయి ఎంత వరకు చదువుకున్నావు వంట వచ్చా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు...
నువ్వేంటి బామ్మ... నీ చిత్రవిచిత్రమైన పరీక్షలతో అందరినీ భయపెట్టేస్తున్నావు అంటాడు.
సౌభాగ్యమ్మ గారు ఏం మాట్లాడితే సురేంద్ర మళ్ళీ ఏమని అరుస్తాడు అని సైలెంట్ గా ఉంటుంది
నరేష్... ఇవన్నీ సరే ఇక్కడితో మర్చిపోండి గాని అని సురేంద్ర వైపు తిరిగి....
రేయ్ బావ అ రేపు సాయంత్రం మన ఏమిటి పార్టీ ఇస్తున్నాడు అందరు ఫ్యామిలీతో రావాలి అని చెప్పాడు నీకు ఉన్నది మీ నాయనమ్మ కాబట్టి తప్పకుండా తీసుకురా అంటాడు.
సురేంద్ర ఎందుకు రా అక్కడికి వచ్చి ఎవరికి అక్షింతలు వేయాలి... ఏమీ అవసరం లేదు అంటాడు చిరాగ్గా.
నరేష్ అలా అంటే ఎలా రా ఇప్పటి వరకు నిన్ను బాధ్యతగా ఏ లోటు రాకుండా చూస్కుంది... కాస్తయినా సరదాగా బయటకు తీసుకు వెళ్తే కదరా ఆవిడ కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు.
ఆ మాటకు సురేంద్ర సరే అలాగే కానీ అంటూ లోపలికి వెళ్ళి పోతాడు.
సౌభాగ్యమ్మగారు.. అక్కడికి నేను ఎందుకు రా వెధవ అంటుంది...
అబ్బా బామ్మ నువ్వు ఎక్కువగా మాట్లాడి చెడగొట్టకు.... అసలే అది ఆఫీస్ కి సంబంధించిన పార్టీ... అక్కడికి చాలా మంది ఉన్నారు వాళ్ళలో చాలామంది అమ్మాయిలు ఉంటారు..
అమ్మాయిల్లో చాలా మందికి పెళ్లి కాకుండా ఉంటుంది... వాళ్లల్లో నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేయవచ్చు..
అలా సెలెక్ట్ చేసిన అమ్మాయి గురించి నాకు చెప్పు నేను డీటెయిల్స్ తీసుకు వస్తాను ముందుగా మనిద్దరం వెళ్లి ఇంట్లో మాట్లాడి నీకు నచ్చిన పరీక్షలన్నీ పెట్టుకొని ఓకే అయిన తర్వాత అప్పుడు సురేంద్ర కి చెప్పి తీసుకు పోదాం ఎలా ఉంది నా ఐడియా అంటాడు.
సౌభాగ్యమ్మ గారికి ఆ మాటలు వినగానే మొహం చాటంత అవుతుంది.
అవునురా ఆత్రపుపక్షి నువ్వు చెప్పింది నిజమే... అలాగే కానివ్వు అంటుంది హుషారుగా...
అనుకున్నట్లుగానే తర్వాతి రోజు సాయంత్రం సురేంద్ర త్వరగా ఇంటికి వచ్చి నాయనమ్మ త్వరగా రెడీ అవ్వమని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు.
సౌభాగ్యమ్మగారు.. ముందుగానే అన్ని సిద్ధంగా పెట్టుకోవడం వల్ల త్వరగా రెడీ అయిపోతారు.
ఆవిడ మనసులో నరేష్ చెప్పిన మాటలు తిరుగుతూ ఉంటాయి.
అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్లకి ఎలాంటి పరీక్షలు పెట్టాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది.
సురేంద్ర గదిలోంచి బయటకు వచ్చాక సౌభాగ్యమ్మగారు ఆలోచనలో ఉండడం చూసి....
బయట వేషాలు వేసినట్లు అక్కడ గాని ఎలాంటి పిచ్చి వేషాలు వేసే మాత్రం ఊరుకోను నానమ్మా... అసలే అది ఆఫీస్ పార్టీ అంటాడు వార్నింగ్ ఇచ్చినట్లు.
సౌభాగ్యమ్మ గారు అలాగే అన్నట్లుగా తలుపు తారు కానీ మనసులో మాత్రం సంబరపడుతూ ఉంటారు మంచి అవకాశం వచ్చినందుకు.
ఫంక్షన్ హాల్ కి వెళ్ళగానే అక్కడ అంతా రకరకాలుగా బట్టలు వేసుకున్న జనాలతో కోలాహలంగా ఉంటుంది.
పెద్దావిడ కావడంతో పైగా అసలు ఎప్పుడూ బయటికి రాకపోవడం వల్ల సౌభాగ్యమ్మగారికి అలాంటివన్నీ కొత్తగా ఉంటాయి...
అక్కడికి చేరుకోగానే సురేంద్ర ఫ్రెండ్స్ అందరూ అతని దగ్గరికి వచ్చి అతని పక్కనే ఉన్న సౌభాగ్యమ్మ గారికి నమస్కారం చేస్తారు.
దానికి ప్రతిగా ఆవిడ నవ్వి మనసులో పర్వాలేదు సంస్కారం తెలిసిన బడుధ్ధాయిలే అనుకుంటుంది.
సురేంద్ర ఆవిడని తీసుకెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.... నాయనమ్మ నువ్వు ఇక్కడే కూర్చో నీకు కావాల్సిన నేను పంపిస్తాను ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
సౌభాగ్యమ్మగారు... అలాగేనని అక్కడే కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటారు.
ఆ వాతావరణం ఆవిడకి కొత్తగా ఎబ్బెట్టుగా ఊపిరి ఆడనట్లు గా అనిపిస్తుంది.
అబ్బాయిలు అందరూ అమ్మాయిలకి సైట్ కోడుతున్నట్లుగా నిల్చుని... అమ్మాయిలని ఆకర్షించడానికి అన్నట్లుగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు.
ఇక అమ్మాయిల విషయానికి వస్తే కొందరు కురచ దుస్తులు వేసుకుని వస్తే.. మరి కొందరు నిండుగా చీర కట్టుకున్నారు.. మరి కొందరు మంచి డిజైనర్ వేర్లో డ్రెస్సులు చీరలు కట్టుకొని ఉన్నారు.
అందరిలో కెల్లా సౌభాగ్యమ్మ గారిని ఆకర్షించింది ఒక అమ్మాయి మాత్రమే.
పద్ధతిగా చీర కట్టుకొని ప్రవర్తన కూడా చాలా అందంగా మప్పితంగా అనిపించింది.
ఇలాంటి అమ్మాయి అయితే మా బడుద్దాయి కి సరిపోతుంది అనుకుంటుంది మనసులో.
వెంటనే నరేష్ కోసం చూస్తుంది ఎక్కడ చచ్చాడు ఈ అడ్డగాడిద కనపడి చావట్లేదు గాలివెధవ అనుకొని చుట్టూ చూస్తుంది..
ఒక చోట ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు వెంటనే నరేష్ దగ్గరికి వెళ్ళాలి అనుకొని లేచి అటువైపుగా వెళ్తుంది.
ఇక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్న సురేంద్ర కి.... ఉన్నట్టుండి పార్టీలో కలకలం రేగడం వినిపిస్తుంది.
ఏమిటా అని హడావిడిగా అక్కడికి వెళ్లి చూసేసరికి...
సౌభాగ్యమ్మగారు ఒక్కడిని పట్టుకుని ఏకేస్తుంటారు...
ఒరేయ్ అడ్డ గాడిద నీలాంటి వెధవలు ఎందుకురా వచ్చేది.... ఇలాంటి పింజారి పనులు చేయడానికా.... సల సల కాగే నూనె నీ నవరంధ్రాలు పోయాలి రా పుచ్చు మొహమోడా... నీ ఇంట్లో నిప్పు లు ఆరి పోను
నీ పిండం పురుగులకు పెట్టా... నిన్ను కాకులు గదులు పొడుచుకుని తిన.... నీ జుట్టంతా ఊడిపోయి బోడిగుండు కావాలి రా బుద్ధిలేని వెధవా... చాటడు నిప్పులు తెచ్చి నీ నెత్తిన కుమ్మరించాలి రా కోడి పెట్ట మొహం....
ఇంకా ఏదో అనే లోపు సురేంద్ర ఆవిడని పట్టుకుని పక్కకి లాక్కుని వస్తాడు.
నాయనమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతను ఎవరో తెలుసా... మా మేనేజర్... ఆయన పట్టుకుని తిడతావ్ ఏంటి...అంటూ అరుస్తాడు.
ఎవరైతే నాకేంటి రా వాడు చేసిన వెధవ పని తెలుసా నీకు అంటుంది.
ఏమైనా కానీ నువ్వు ఇలా మాట్లాడకూడదు చాలా తప్పు...
ఏమిట్రా తప్పు... అంటూ ఇంకా ఏదో మాట్లాడ పోయే లోపు....
ఇంక చాలు నాయనమ్మ... ఇప్పటివరకు భరించాను ఇక నిన్ను మాత్రం భరించలేను అంటూ నేరుగా ఆవిడని తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు నీ ప్రవర్తన మారిన రోజు వస్తాను అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
సౌభాగ్యమ్మ గారు సురేంద్ర వెళ్లిన వైపు చూస్తూ ఉండిపోతారు.
సురేంద్ర చిరాగ్గా ఉండటంతో బండి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ ఒక చోటికి వెళ్ళి ఆగుతాడు.
కాసేపు అక్కడే కూర్చుని జరిగిందంతా తలుచుకొని ఆవిడ ప్రవర్తనకి ఆవిడ మాటలకి విసుగెత్తి పోయినట్టు అనిపిస్తుంది అతనికి.
ఇక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నేరుగా నరేష్ రూమ్ కి వెళ్తాడు.
నరేష్ అప్పుడే ఇంటికి రావడంతో సురేంద్ర తన ఇంట్లో కనిపించే సరికి ప్రాణం లేచి వచ్చినట్టు కనిపిస్తుంది.
గబగబా సురేంద్ర దగ్గరికి వెళ్లి ట్రై బామ్మ ఏది రా...... నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్...
సురేంద్ర ఇక ఆవిడ గురించి మాట్లాడకు ఆవిడ మా ఆవిడ దగ్గరికి వెళ్తాను అన్నాడు కోపంగా.
పిచ్చి పట్టినట్టు మాట్లాడకు సురేంద్ర.... అసలు ఈ రోజు ఆవిడ ఏం చేశారో తెలుసా నీకు ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు....
ఏమిటన్నట్లు గా చూస్తాడు సురేంద్ర.
మన కొలీగ్ సుహాసిని...... అదేరా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన అమ్మాయి....... బామ్మ కి ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. తన గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చింది.
తన గురించి వివరాలు అడిగి తెలుసుకొని అప్పటికి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఎలాగైనా ఈ సంబంధం కాయం చేయాలి అనుకుంటుండగా...
తనని మన మేనేజర్ ఏడిపిస్తూ కనిపించాడు. అప్పటికే బామ్మ సుహాసిని ని తన మనవరాలిగా ఫిక్స్ అయిపోయింది... దాంతో ఆవిడ కోపంగా వెళ్లి మేనేజర్ ని పట్టుకొని కొట్టి వాడికి బుద్ధి చెప్పింది..
విషయం తెలిసి మన ఎండి కూడా మేనేజర్ ని పనిలోంచి తీసేస్తాడు రా... నీకు విషయం చెబుదామని చూసే సరికి అప్పటికే నువ్వు బామ్మని తీసుకెళ్లి పోయావు అంటాడు.
సురేంద్ర విషయం తెలుసుకొని బాధపడి గబగబా తన ఇంటికి వెళ్తాడు నాయనమ్మ ఎలా ఉందో చూడాలి అని.
ఇంటికి వెళ్లేసరికి సౌభాగ్యమ్మగారు సోఫాలో దిగాలుగా కూర్చుని ఉంటారు.
సురేంద్ర గబగబా వెళ్లి ఆవిడ దగ్గర కూర్చుని తల పెట్టుకుని నన్ను క్షమించు నాయనమ్మ అంటాడు.
సౌభాగ్యమ్మ గారు నవ్వి.. సురేంద్ర తల మీద ప్రేమగా చేయి వేసి... నిమురుతూ...
పిచ్చి సన్నాసి.... నాకేం అవుతుంది రా వెర్రి వెదవ.... నిక్షేపాల గుండ్రాయిలా ఉంటా నీ పిల్లల్ని ఎత్తుకుంటనూ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటాను...
అంటూ ఇంకా ఏవేవో అంటూ ఉంటుంది.
ఈసారి సురేంద్రకి ఆవిడ తిట్లు తిట్లు గా అనిపించవు దీవెనలుగా అనిపిస్తాయి.
ఆవిడ అనుకున్నట్లుగానే ఆ తరువాతి నెలలో మంచి ముహూర్తం చూసి సుహాసినికి సురేంద్రకి ఘనంగా పెళ్ళి జరిపిస్తుంది.
ఆవిడ పట్టిన పంతం నెరవేర్చుకోవడానికి అన్నట్లుగా సురేంద్ర పెళ్లిలో వంటలన్నీ ఆవిడే చేస్తుంది...
పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఆవిడ హడావిడికి మనస్ఫూర్తిగా సంతోష పడతారు అంత మంచి పెద్దావిడ సుహాసినికి దొరికినందుకు...
**********************************************
సమాప్తం....
**********************************************