పయనం
పయనం


20 సంవత్సరాల క్రితం,1992 వయసు: 6యేండ్లు
"అమ్మా, ఈ ఊరికి ఇంకెప్పుడూ రానమ్మా. మీరు కావాలంటే రండి కాని, నన్నెప్పుడూ తీసుకురావద్దు. ఇక్కడ బాత్రూంలు లేవు, అంతా బయటకు వెళ్తున్నారు. అసలు నాకు కూరన్నం పెట్టారా ఈ మూడు రోజుళ్ళో? తాగే నీళ్ళు బాగలేదు, బియ్యం కూడ ఏంటోలా వున్నాయి, మంచి రోడ్డు లేదు, ఒక్క ఇల్లు కూడ బాగలేదు. ఈ ఊరికి నేను ఇంకెప్పుడూ రాను"
హారిక ఇలా అని ఊరుకోలేదు, నిజంగానే వాళ్ళ నాన్నగారి ఊరికి ఎప్పుడూ వెళ్ళలేదు, పైగా అదేదో గొప్పలా చెప్పుకునేది అందరికి, నేనెప్పుడూ రానని చెప్పాను ఆ ఊరికి అని.
కానీ....
20 సంవత్సరాల తరువాత, ఆగస్టు, 2012 ప్రస్తుతం....
మళ్ళీ హారిక ఆ ఊరికి వెళ్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఆ ఊరి గ్రామదేవత గుడి పునహ్ప్రతిష్ట కారణంగా, పైగా వాళ్ళ నాన్నగారి కుటుంబం నిర్వహించాల్సిన పండుగ కాన, ఆ ఇంటి ఆడపడుచులుగా తామంతా వెళ్ళడం తప్పనిసరి అయింది. అయితే, ఈ సారి అమ్మానాన్నలతో కాదు, తన శ్రీవారితో. మరి వాళ్ళతో ఆ ఊరు ఎప్పుడూ రానని చెప్పింది కదా!.
చెన్నై నుండి బయలుదేరి పామూరు బస్టాండ్ లో దిగారు దంపతులు. అక్కడ నుండి వాళ్ళ నాన్నగారి ఊరికి వెళ్ళే బస్సులు వున్నాయి కాని, అ రోజు శనివారం కారణంగా, మాలకొండ పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తుల రద్దీతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. సరే, షేర్ ఆటో ఎక్కి వెల్దాం అంటే, లేదు మనం విడిగా ఒక ఆటో మాట్లాడుకుందాం అని హారిక వాళ్ళాయన, మోహన్ ఆ పనిలో పడ్డారు. చాలా సేపటి బేరసారాల పిదప, ఒకటి కుదిరింది. బొట్లగూడూరు వరకు బాగానే సాగింది ప్రయాణం. అక్కడ ఎడమ వైపు మలుపు
తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళే దారి మొదలైనప్పడి నుండి మొదలైంది, వాళ్ళకి అసలు పయనం. దానిని రోడ్డు అని అనడం కన్నా, బండరాళ్ళు మనుషుల్ని కనికరించి తమంతట తాము పరిచిన బాట అనవచ్చు!. ఆ దారిలో ప్రభుత్వ బస్సులు కూడ వెళ్తున్నాయి అంటే ఆశ్చర్యం వేసింది, వాళ్ళకి. అందులో చోటు దొరకని వాళ్ళు షేర్ ఆటో ఎక్కుతున్నారు. 8 మంది పట్టే దానిలో 14 మందిని తీసుకువెళ్తున్నాడు అని వేరుగా ఆటో మాట్లడుకున్నారు కాని, ఆ దారిలో వెళ్తుంటే అర్ధం అయింది, ఆ 14 మందిలో ఇద్దరిగా వెళ్ళుంటే ఈ కుదుపులు తప్పేవి కదా అని. ఒక సమయoలో అసలు సరైన దారిలో వెళ్తున్నామా, ఈ చోటు దాటితే ఒక ఊరు వస్తుందా అనే అనుమానం కూడా వచ్చింది, ఆ ఇద్దరికి. వెళ్ళే దారి దాదాపు పాడుబడిన అడవిలా, అప్పుడే అవతరిస్తున్న ఎడారిలా వుంది. ఖలేజా చిత్రంలో 'పాలీ’ అనే ఊరులా చూపించిన ప్రదేశం ఇదేనా అనిపించింది. మొత్తానికి ఊరు చేరారు ఎలాగో.
రెండు దశబ్దాలు దాటినా మారని లోకం అంటే ఇదేనేమో, ఇంకా అలానే వుంది, అంది హారిక.
ఎక్కడో ఒకటి రెండు ఇళ్ళకి మాత్రం వున్నాయి బాత్రూంలు. అయితే వెళ్ళింది జాతరకి కాబట్టి, వున్న మూడు రోజులు పెళ్ళిభోజనంలా పెట్టారు ఊరంతటికి. మరి మిగిలిన రోజుళ్ళో ఎప్పటిలా పచ్చడి మెతుకులే తింటున్నారని అనుకుంది హారిక. కాని ఈ సారెందుకో ఆ ఊరు బాగా నచ్చింది, తనకి.
ప్రశాంత వాతావరణంతో నిండిన ప్రాంతంలా అనిపించింది, ఆ పల్లె వాతావరణం పోకుండా, అక్కడవారి కనీస అవసరాలు తీర్చేలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ సారి ఊరు మీద ఏ కారణాలు చూపలేదు, చాడీలు చెప్పలేదు.
కాని ఆలోచిస్తే అనిపించింది, మన నాయకులు పాదయాత్రలకని, ఓదార్పు యాత్రలకని, పల్లెబాటలని, రచ్చబండలని ఏమన్నా చేపట్టదలుచుకుంటే, A/C కార్లు, రైళ్ళల్లో, ఎగిరే రెక్కల వాహనాల్లో, కనీస సదుపాయాలుండే ఊర్లకి కాకుండా, ఒక ఆటోనో లేదంటే, వారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బస్సులలో నో, ఆ ఊరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అని!.
ఈ ఊరు ఒక్కటే కాదు, ఇలాంటి ఊర్లు మన రాష్ట్ర్రంలో ఇంకా ఎన్నో?అనుకుని, వున్న మూడు రోజులు రణగొణ ధ్వనుల నుండి దూరంగా హాయిగా ఆ ఊరిలో వుంది.