నిజమైన కల
నిజమైన కల
ఆటో నడుపుతూ ఉంటాడు మాధవ్. అతడికి తండ్రి ద్వారా వారసత్వంగా రెండు గదుల రేకుల ఇల్లు వచ్చింది. అతడికి తల్లి రత్నావతి, భార్య సుధ.తొమ్మిది నెలల బాబు కళ్యాణ్. ఇదీ సంసారం. మాధవది కష్టపడే మనస్తత్వం. డబ్బులు కూడ పెట్టుకుని ఈ మధ్యే ఒక గదికి శ్లాబ్ వేయించాడు. వంటగదికి రేకులే ఉన్నాయి. ఆ సిటీలో రెండు గదులు ఉండటమంటే గొప్ప విషయం. అక్కడ అందరూ కాయకష్టం చేసుకొనే జీవులే!
సుధ పిల్లవాడిని చూసుకుంటూ మసాలా పొడులు, పచ్చళ్ళు అమ్ముతూ ఉంటే, తల్లి రత్నావతి అక్కడ ఉండే అపార్ట్మెంట్లలో వంటపనికి వెళ్లి వస్తూ ఉంటుంది.
మాధవుకు మొక్కలంటే ప్రాణం. ఎక్కడ చోటు దొరికితే అక్కడ మొక్కలు పెడుతుంటాడు. ప్లాస్టిక్కు బాటిళ్లలో ఆకు కూరల విత్తనాలు వేసి వేలాడదీశాడు. రేకుల పైన మట్టి పోసి తీగ మొక్కలు పెట్టాడు. కింద ఉన్న కొంచెం చోటులో కూరగాయల కుండీలు, ఆ ప్రక్కన పూల మొక్కలు ఇలా అక్కడా ఇక్కడా అని లేకుండా అంతా పచ్చదనం పరుచుకొన్నట్లుగా ఉంటుంది. ఆఖరికి గదిలో కిటికీలను కూడా వదిలిపెట్టలేదు. అక్కడ కూడా మొక్కలే.
అప్పుడప్పుడూ పక్కింటి వాళ్ళకూ, ఎదురింటి వాళ్ళకూ కూరగాయలు పంచి పెడుతూఉంటుంది సుధ.
ఒకరోజు వరండాలో మంచం మీద కూర్చుని ఉన్నాడు మాధవ్. ఎదురుగ్గా పిల్లవాడికి అన్నం కలిపి పెడుతూ ఉంది సుధ.
దీర్ఘాలోచనలో ఉన్నాడు మాధవ్.అతడికో స్వప్నం ఉంది. కనుచూపు మేరదాకా పచ్చదనంతో నింపెయ్యాలని.... పెద్ద పెద్ద చెట్ల మధ్య తిరగాలని.... పక్షుల కిలకిలా రావాలతో నిద్రలేవాలని..ఈ పెద్ద సిటీలో అది సాధ్యమవుతుందా? ఏదో ఉన్నంతలో చిన్న చిన్న మొక్కల్ని పెంచుకొని తృప్తి పడటమే!.. ఇంకా ఎక్కువ మొక్కల్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవటం సరే!..చోటేది?..
"ఏ విషయం గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు?"అడిగింది సుధ.
"ఎమీ లేదు సుధా!ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుదామని!"అన్నాడు మాధవ్.
"ఇంక చోటెక్కడ ఉంది? ఇల్లంతా పెట్టావు కదా!"
"అదే ఆలోచిస్తున్నా!"అన్నాడు మాధవ్.
కాసేపటికి అతడి దృష్టి ఆటో మీద పడింది.
ఇంకాస్సేపటికి ఎలా చెయ్యాలో కూడా అతడికి తెలిసింది.
వెంటనే కార్యరంగంలోకి దిగిపోయాడు మాధవ్.
ఆటోను తీసికొని ఇనుప సామాన్లు వెల్డింగ్ చేసే షాపుకు వెళ్ళాడు.
ఇంక ఆటోను మొక్కలు పెంచటానికి అనువుగా తయారు చెయ్యటం మొదలు పెట్టాడు.
ఆటో పైన గట్టి ప్లాస్టికు షీటు వేయించాడు. ఆటోకు అటూ ఇటూ కమ్మీలతో చిన్న కుండీలు పెట్టుకోవటానికి అనువుగా అరలు అరలు పెట్టించాడు. పైన షీటు పైన జనపనార బస్తాలు పరిచాడు. దానిమీద మందంగా మట్టి పోశాడు. పైన నారు పోశాడు. పైన పోసిన నీళ్లు క్రిందకు కారటానికి చెరో ప్రక్క పైపులు పెట్టి వాటిని రేకు అరల్లో ఉండే కుండీలకు కలిపాడు. కుండీల్లో చిన్న చిన్న మొక్కలు పెట్టాడు. ఎండలో ఆటోను తిప్పుతాడు కాబట్టి పొద్దున సాయంత్రం మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. మాధవ్ చేస్తున్న పని చుట్టుప్రక్కల వాళ్ళకు కొంచెం విడ్డూరంగా అనిపించింది.
నవ్విన వాళ్ళు నవ్వారు. మాధవ్ ఎవరినీ లెక్క పెట్టే రకంకాదు.
ఆటో వెనకాల 'హరితశకటం'అని చిన్న బోర్డు పెట్టాడు. ఆ ఆటోలో మొక్కలు కాస్త పెద్ద వయ్యాయి. ఆ ఆటోలో ప్రయాణించటం చాలా మందికి సరదాగా ఉంటోంది. ఎవరో మాధవ్ ఆటోను వీడియో తీసి యుట్యూబులో పెట్టారు. మాధవ్ ఆటోకు బోలెడు పబ్లిసిటీ వచ్చింది.అలా 'హరిత శకటం' గురించి ఆనోటా ఈ నోటా పాకి పాకి కలెక్టర్ కు చేరింది.
మాధవును పిలిపించాడు కలెక్టర్ సురేంద్ర.
"నీకు మొక్కలు పెంచటం ఇష్టమా!"అడిగాడు సురేంద్ర.
"అవును సార్!"వినయంగా బదులిచ్చాడు మాధవ్.
"సిటీ దాటాక గ్రీన్ పార్కులు ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నాము. ఒక్కో పార్కు వంద ఎకరాలు ఉంటుంది. ఒక పార్కుకు నిన్ను ఇన్ఛార్జ్ గా పెడతాను. జీతం కూడా ఇస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం. నీకు వీలవుతుందా? చెప్పు!"అన్నాడు సురేంద్ర.
సంతోషంతో నోటమాట రాలేదు మాధవకు.
"సార్!.... సార్!.."అంటూ చేతులెత్తి సురేంద్రకు దణ్ణం పెట్టాడు మాధవ్.
కొన్నిరోజుల తర్వాత ఆటోతో సహా కుటుంబాన్ని తీసికొని గ్రీన్ పార్కు దగ్గరికి చేరాడు మాధవ్. అతడి ఆధ్వర్యంలో అక్కడ పార్కు ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడుతోంది.పార్కులో పెద్ద పెద్ద చెట్లు. రోజూ ఆ చెట్ల మధ్యే నడుస్తున్నాడు మాధవ్. అతడికి అక్కడ ఒక వెదురుతో కట్టిన ఇల్లు కూడా ఉంది. టూరిస్టులకు రెస్టారెంట్, కాటేజీలు కూడా వెలిశాయి. మాధవ్ ఎంతో శ్రద్ధగా, ప్రాణంగా ఆ పార్కును చూసుకుంటున్నాడు. అతడికి స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది.అతని కల నిజమైంది.//
(సమాప్తం)
*************************************************
