Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

గోవుమహాలక్ష్మి

గోవుమహాలక్ష్మి

3 mins
394



సందె వేళ పొలము నుంచి పశువులను తోలుకొని ఇంటికి బయలు దేరాడు కామయ్య.

కామయ్య రైతు. రెండెకరాల పొలము, రెండు ఎడ్లు, నాలుగావులు పెట్టుకొని గుట్టుగా సంసారము నెట్టుకొచ్చే చిన్న రైతు. భార్య సుందరి, ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి. ఇదీ సంసారము. పొలములో కూరగాయలు పండించి పక్కనున్న టౌన్ కి పంపించడము, ఆవు పాలు తీసికెళ్లి డైరీలో పొయ్యటము. వచ్చే ఆదాయము సంసారం నెట్టటానికి బొటాబొటిగా సరిపోతుంది.

అప్పులేకుండా ఎలాగోల సరిపెట్టుకునే భార్య సుందరి అంటే కామయ్యకి వల్లమాలిన ప్రేమ.

ఎప్పటినుంచో సుందరి రెండు జతల పెద్ద కమ్మలు చేయించమని అడుగుతోంది. ఎప్పటి కప్పుడు ఇంట్లో ఖర్చు సరిపోతుంది. పాత కమ్మలు ఇచ్చి కొత్త కమ్మలు చేయించాలన్నా అంతా కలిపి ఒక ఇరవై వేలు అవుతుంది.మొన్న పండక్కి చేయిద్దామంటే వున్న నాలుగావుల్లో ఒకటి వట్టి పోయింది. రెండో ఆవును కొనాలని

వెళ్తే సంతలో మంచి ఆవు, దూడ ఖరీదు డెబ్భయి వేల పైనే వుంది . అన్ని డబ్బులు పోసి ఆవును ఇంటికి తెచ్చేసరికి కాస్త వానపడి పొలంలో పూతకి తెగులు పట్టింది. ఈసారి ఆదాయము ఫర్వాలేదని పించినా డబ్బులు చేతిలో మిగల్లేదు కామయ్యకి.

సుందరికి వచ్చే

పండక్కన్నా కమ్మలు కొనాలను కుంటూ లెక్కలు వేసుకుంటూ నడుస్తున్నాడు కామయ్య. "ఒరేయ్!

కావుడూ!ఆగరా!"

అంటూ వచ్చాడు పోలయ్య. పోలయ్య సంతలో ఆవులను అమ్ముతుంటాడు.

"ఎలా ఉందిరా కొత్త ఆవు?"

బాగానే వుంది. ఈ ఏడు గడ్డి ధరే పెరిగిపోయింది. చేతిలో ఏమీ మిగిలేట్టులేదు మావా!"

నీకేంటి!నువ్వే ఇట్టాగంటే నే చెప్పే దేంటి? "

"నీకు మాత్రం ఏం తక్కువ. చేతిలో పాతిక వేలన్నా లేవు యింటి దానికి సరుకు చేయించాలంటే. ఎప్పుడో పదేళ్లయింది పాపం!సరుకు చేయించి, బంగారం ధర చూస్తే కొనేట్టుగా లేదు."

తన బాధ చెప్పుకొన్నాడు కామయ్య.

"పాతిక వేలే కదా!నీ వట్టి పశువునమ్మ రాదే "

అన్నాడు పోలయ్య.


"వద్దులే!నా యింట్లో పుట్టింది. మహాలక్ష్మి పెయ్య దూడప్పటినుండి సాకుతున్నా. వద్దులే."


 అయిష్టంగా అన్నాడు కామయ్య.


" బాగా ఆలోచించు. వట్టి గొడ్డు . గడ్డి దండగ. నీకు ఇరవైవేలొస్తాయి. "

ఆశ పెట్టాడు పోలయ్య.


పోలయ్య మాటలు వినగా వినగా కాస్త సబబుగానే అనిపించింది.


కానీ సుందరి, అమ్మ, అయ్య ఏమంటారో..

కమ్మలు చూపిస్తే సుందరి ఒప్పుకుంటుందిలే. అమ్మ, అయ్య ఒప్పుకోరేమో. చెప్పకుండా చేస్తే సర్దుకుంటారులే. ఏదో తేల్చుకోలేక సతమతమాయ్యాడు.


రెండో రోజు కూడా పోలయ్య బలవంతం చేశాడు.

"రెండు రోజులు బాధ పడ్డా మీ నాయన సర్దుకుంటాడులే "

పోలయ్య సముదాయించాడు.

పోలయ్య రోజూ సతాయించడముతో ఆవుని అమ్ముతానన్నాడు కామయ్య.

******

నాలుగు రోజుల తర్వాత ఆవులను తీసికొని పొలానికి వచ్చాడు కామయ్య.ఇరవై వేలు కామయ్య కిచ్చి మహాలక్ష్మిని తోలుకు పోయాడు పోలయ్య.

డబ్బు జేబులో పెట్టుకుంటూ ఆవును చూసిన కామయ్యకి చాలా దిగులేసింది. దాని మొహం చూడలేక పోయాడు. దీనితో నా ఋణము ఇంతేనా అనిపించింది. ఒక పక్క బాధ, బెంగ చుట్టు ముట్టాయి.

అలాగే యింటి కొచ్చాడు.

అన్ని పశువులకు గడ్డి వేస్తూ సుందరి


"మహాలక్ష్మి ఏది?"


భార్య మాటలు విని తల వంచుకొని నులక మంచము మీద కూలబడ్డాడు.


"నిన్నే అడిగేది."

అర్ధము కాక

రెట్టించింది సుందరి. 

"ఈ పండక్కి నీకు కమ్మలు కొందామని....దాన్ని..."అంటూ జోబులోంచి డబ్బు తీశాడు. నోట్ల కట్టలు చూస్తూ కళ్ళు పెద్దవి చేసి సుందరి 

"అంటే...

"మహాలక్ష్మి ని అమ్మేశావా?"

అరిచినట్లుగా కేక పెట్టింది.

తలవంచుకొన్నాడు 

" గడ్డి కూడా పెరిగింది కదే!..

కామయ్య మాట పూర్తి కాలేదు 

సివంగిలా చూస్తూ నిప్పులు కురిపించే కళ్ళతో ఊగి పోతున్నది సుందరి.

"వట్టి గొడ్డు కదా గడ్డి ఖరుచు ఎక్కువని... "


"ఓయమ్మో!ఓ నాయనో!నా మహాలక్ష్మి ని అమ్మేశాడురో!అత్తా!మావా!నేను కమ్మలు కావాలని నిన్ను సాధించానా!చెప్పు.సాధించానా ఎప్పుడైనా!నా యింటి గొడ్డుని అమ్మేస్తావా!.."

సుందరి కేకలకి కామయ్య తల్లీ తండ్రి లోపలినుంచి వచ్చారు.

"ఏందిరా!నువ్వు చేసిన పని."

అంటూ.

అప్పటికే సుందరి నెత్తి నోరు బాదుకొంటున్నది.

"రేప్పొద్దున నీ కొడుకు నిన్ను మావని కూడా అమ్మేస్తాడత్తా!"

తల్లి వెంకమ్మ కూడా ఏడుస్తూ అరుస్తుంటే 

ఈ గొడవకి అదిరి పోయాడుకామయ్య. తండ్రి నరసయ్య చెప్పులు తొడుక్కొని కఱ్ఱ తీసికొని

"నేను తెచ్చి పెడతాలే తల్లీ!ఏడవ మాక!

పదరా!ఎవడి కమ్మావో చూపించు!దానికి నాలుగు గడ్డి పరకలు పెట్టలేమా! మన బతుక్కి గొడ్డునమ్ముకుంటే బువ్వ పుట్టదు.ఆ మాత్రం తెలవదా!"


తండ్రీ కొడుకు సంతకెళ్లే సరికి పోలయ్య వట్టి గొడ్లని కాబేళాకు తోలు కెళ్లే లారీలో ఎక్కిస్తున్నాడు.

పోలయ్యతో మాట్లాడి ఇంకో రెండు వేలు ఎక్కువిస్తానని చెప్పి మహాలక్ష్మిని కిందికి దింపించాడు నరసయ్య.


ఆవును తోలుకొని తండ్రీ కొడుకు యింటి కొచ్చారు 

 సుందరి, పిల్లలు ఆవుకు గడ్డి వేసి నీళ్లు తాపిస్తుంటే దానికి వెంకమ్మ టెంకాయ తెచ్చి దిష్టి తీసింది.


ఆరోజు రాత్రి భర్త దగ్గరికొచ్చి సుందరి

"నా కమ్మల కోసం మన పిల్లకాయల్లాంటి గొడ్లని అమ్ముకుంటామా!నాకు ఒట్టు పెట్టు. మన గొడ్లే బంగారం. ఇట్టాంటి పనులు చెయ్య మాక!"

భార్య చేతిలో చెయ్యి వేసాడు కామయ్య.

పైన చందమామ చల్లగా నవ్వుతున్నాడు.

---------------------------



Rate this content
Log in

Similar telugu story from Inspirational