Dilip B

Drama Inspirational

4.8  

Dilip B

Drama Inspirational

అహమస్మి యోధ

అహమస్మి యోధ

5 mins
1.7K



మనం కొనే ప్రతి దానికి ప్రభుత్వం నియంత్రిత ధర ఉంటుంది, ఒక్క భూమి కి తప్ప. ఇక్కడంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా ఎక్కడ చుసిన కొత్త కొట్టడాలు. ఊరిలో చిన్న చితక పని చేసుకునేవారు పనులు మానేసి సిటీ కి రావటం మొదలుపెట్టేరు. అలా వచ్చిన ఒక నిరు పేద కుటుంబానికి చెందినవాడు రాజు.


అప్పటికి రాజు వయసు అయిదు. రాత్రి ఎనిమిది అవ్వటం తో బొగ్గు మీద కుంపటి వేసి అమ్మ అన్నం వండింది. రాజు కి అన్నం పెడుతూ, బాగా చదువుకోవాలని చెప్తూ పక్కనే తయారవుతున్న బిల్డింగ్ వైపు చూపించింది. జీవితం లో అంత ఎత్తు ఎదగాలి అని అన్నది. రాజు బిల్డింగ్ ని కాకుండా బిల్డింగ్ పైన ఆకాశాన్ని చూసాడు. ఎదగాలి అంటే ఆకాశం అంత అని ఆ రోజే ఫిక్స్ అయిపోయాడు. ఆడుకునే వయసు గనక అటు ఇటు తిరుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండేవాడు. ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకి కూలి వాళ్లంతా సూపెర్వైసర్ సత్యం దెగ్గిర క్యూ కడితే ఆ రోజు కూలి ఇచ్చేవాడు. ఎప్పుడు చేతిలో డబ్బులుండేవి, అందరూ నమస్కారం పెట్టేవారు, బాగా చదువుకొని ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్లు కూడా సత్యం గారికి గౌరవం ఇచ్చేవారు. ఆయనే అక్కడ అందరికన్నా గొప్ప అనుకునేవాడు రాజు , పెద్ద అయ్యాక సూపెర్వైసర్ అవ్వాలని అనుకున్నాడు.


ప్రతి రోజు లానే రాజు వాళ్ళ నాన్న మేస్త్రి పనికి పోయాడు. పైన అంతస్తులో పని చేస్తుండగా కాలు జారి కింద పడి చనిపోయాడు. బ్రతకటానికి వేరే మార్గం లేక రాజు ని తీస్కొని వాళ్ళ అమ్మ ఊరు వెళ్లిపోయింది. తన లాగా కొడుకు బతుకు కాకూడదు అని తనకి వచ్చిన కొద్దీ పాటి సంపాదన తోనే రాజు ని స్కూల్ లో చేర్పించింది. చిన్న వయసు అవటం మూలాన స్కూల్ అయిపోయాక మిగతా కుర్రాళ్లతో వీధుల్లో ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. ఆ ఊరికి ఒకటే బస్సు వచ్చేది. ఆ బస్సు కండక్టర్ సత్తి ఎప్పుడు ఇస్త్రీ చేసిన ఖాకి యూనిఫామ్ వేసుకొని, సన్ గ్లాస్సెస్ పెట్టుకొని, ఎప్పుడు చేతిలో ఉన్న బ్యాగ్ లో డబ్బులు పెట్టుకొని హుందాగా ఉండేవాడు. పిల్లలందరి దృష్టిలో సత్తి చాలా గొప్పవాడు. ఊరులోకి బస్సు రాగానే పిల్లలంతా సత్తి...సత్తి... అని అరుస్తూ బస్సు వెనుక పరిగెత్తేవారు. సత్తి అప్పుడప్పుడు పిల్లలకి మిఠాయి బిళ్ళలు కొనిచ్చేవాడు. ఊరిలో ఏ పిల్లవాడిని పెద్దయ్యాక ఏమి అవుతావు అని అడిగినా, బస్సు కండక్టర్ అనే చెప్పేవారు.


ఎదుగుతున్న కొద్దీ రాజు పుస్తకాలతో పాటు మనుషులని చదవటం మొదలుపెట్టాడు. సైకిల్ మీద వచ్చే మాస్టారు, బైక్ మీద తిరుగుతూ పదో తరగతి కూడా పాస్ కాని వడ్డీ వ్యాపారికి నమస్కారం పెట్టేవారు. బైక్ మీద తిరిగే వడ్డీ వ్యాపారి అసలు ఏ రోజు బడి కి కూడా వెళ్లని కార్ మీద తిరిగే ఎమ్మెల్యే కి నమస్కరించేవాడు. ఇక్కడ చదువు కన్నా విలువైనది డబ్బు, డబ్బు కన్నా విలువైంది దానితో వచ్చే పవర్ అని తెలుసుకున్నాడు. ఎపుడైనా ఎమ్మెల్యే గారు ఊరికి వస్తే, కార్ నుండి అతని తో పాటు నలుగురు దిగేవారు, చుట్టూ పది మంది జనం చేరి వారి గోడు చెప్పుకునేవారు. రాజు ఎలా అయిన ఆయన్ని ఒక్కసారి కలవాలి అనుకున్నాడు. 


తండ్రి లేని కుర్రవాడని కొంత మంది జాలి చూపించేవారు, మరి కొంత మంది ఎగతాలి చేసేవారు, అవమానించేవారు. తన చిరిగిన దుస్తులు, వేషాధారణ చూసి నవ్వే వారు, హీనం గా చూసేవారు. అతి చిన్న వయసులోనే చేదు అనుభవాలు ఎదురుకున్న రాజు మనసు గాయపడింది. ప్రశాంతత కావాలంటే ఈ సమాజానికి దూరంగా బతకాలి, గెలవాలి అంటే మాత్రం యుద్ధం చేయాలి అని తెలుసుకున్నాడు. తల్లి చేసే కూలి మీదే ఆధార పడిన కుటుంబం, డబ్బులు లేక సతమతమయ్యేది. తాను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి తన కన్నా చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్ లు చెప్పటం మొదలుపెట్టాడు. అలలు లేనిదే కెరటం లేదు, కష్టాలు లేనిదే గెలుపు లేదని అర్ధం చేసుకున్నాడు. జనం లో గౌరవం సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాడు. 


ఊరిలో సాయంత్రం అవగానే వ్యవసాయం పనులు పూర్తి చేసుకొని మగవాళ్ళంతా ఉరి మధ్యలో ఉన్న మర్రి చెట్టుకి చేరుకునేవారు. వారందరిలో పన్నెండో తరగతి చదువుకున్న పరంధామయ్య గారు న్యూసుపేపెర్ తీస్కొని ఆ రోజు వార్తలు చదివి వినిపించేవారు.మిగతా వారికీ చదవటం, రాయటం రాకపోవటం మూలాన ఆయనకి చాలా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఒక రోజు ఆయనకి గుండె పోటు వచ్చి హఠాత్మరణం చెందారు. 


ఎనిమిది మంది మాత్రమే ఉన్న ఏడో తరగతి క్లాసు పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చింది రాజు కి. ఈ విషయం తెలుసుకున్న మర్రి చెట్టు దగ్గర కూర్చునే పెద్దవాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి అదే దారిలో వెళ్లే రాజు ని ఆపి రోజు వార్తలు చదివించుకునేవారు. మెల్ల మెల్లగా రాజు అందరికి దగ్గరవటం మొదలైంది. 


రాజు ప్రతి ఒక్కరికి చేతనయినంత సహాయం చేసేవాడు. ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీస్కొని వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టటం, పెద్ద వాళ్ళకి పక్క ఊరుకి వెళ్లి మందులు తేవటం లాంటివి చేసేవాడు. ఊర్లో అందరిని వరుసలతో పిలిచేవాడు. కొన్నాళ్లకి ఊర్లో రాజు అంటే తెలియని వారు లేరు అన్నట్టు తయారయ్యింది. రాజు కష్టపడి, ఊరి బడిలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు, ఆ తర్వాత ఇక ఊరిలో కాలేజీ లేకపోవటం వల్ల చదువుకోడానికి డబ్బులు లేక, కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. పోస్ట్ లు పడ్డాయని తెలుసుకొని బస్సు కండక్టర్ ఉద్యోగానికి అప్లై చేసాడు. పదవ తరగతిలో మంచి మార్కులు రావటం మూలాన,వెంటనే ఉద్యోగం వచ్చింది. 


చేసే పని ఏదైనా, తన ఆలోచన మాత్రం ఎమ్మెల్యే కి ఎలా దగ్గరవ్వాలనే దాంట్లొన్ ఉండేది. ఎమ్మెల్యే డ్రైవర్ తన పక్క ఊరి వాడే అని తెలుసుకొని, విశ్వ ప్రయత్నాలు చేసి అతన్ని స్నేహితుడ్ని చేసుకున్నాడు. మాటల మధ్య ఎమ్మెల్యే గారి గురించి అన్ని సంగతులు అడిగి తెలుసుకునేవాడు. ఇది ఇలా ఉండగా, ఊరిలో ఒకతను ఎరువులు షాప్ పెట్టాలనుకున్నాడు. రాజు కి ఈ విషయం తెలిసి అతని దగ్గరికి వెళ్ళాడు. ఎమ్మెల్యే గారు తనకి బాగా తెలుసు అని, షాప్ ఓపెనింగ్ కి అతన్ని ముఖ్య అతిథి గా పిలిస్తే జనం లో నమ్మకం ఏర్పడి అందరు తప్పక తన దగ్గరే ఎరువులు కొంటారని పెద్దాయనని తీసుకు వచ్చే బాధ్యత తనది అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. డ్రైవర్ సహాయం తో అతి కష్టం మీద మొత్తానికి ఆయనని కలవగలిగేడు. షాప్ ఓపెనింగ్ కి వస్తే ప్రజలకి ఆయన మీదున్న గౌరవం పెరుగుతుందని, విపరీతమైన ఆదరణ వస్తుంది అని తప్పక రావాలని ఒప్పించాడు. ఎలెక్షన్లు దగ్గరలో ఉండటం మూలాన ఇది అతనికి ఉపయోగపడతాది అని గ్రహించి ఒప్పుకున్నాడు. 


షాప్ ఓపెనింగ్ రోజు వచ్చింది. ఉదయానే ఆయన ఇంటికి వెళ్లి, దగ్గరుండి ఊరుకి తీసుకొచ్చాడు. పెద్దాయన పక్కన రాజు ని చూసి ఊర్లో అంతా అవాక్కయ్యారు. రాజు పేరు పేరు న ప్రతి ఒక్కరిని పరిచయం చేసి, పెద్దాయన కి శాలువా కప్పి సత్కరించాడు. రాజు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవటం చూసి వీరంతా తనకి ఎలా పరిచయం అని అడిగాడు. తాను చిన్నప్పటి నించి అదే ఊరిలో పెరిగా అని, తండ్రి లేని కుర్రాడు అవటం మూలాన, ఊర్లో అందరు తనని కన్న బిడ్డలా చూసుకునేవారని, కృతజ్ఞత తో ఊర్లో అందరికి తనకి చేతనయినంత సహాయం చేస్తు ఉంటా అని చెప్పాడు. సుమారుగా రెండు వేలు దాకా ఓటర్లు ఉన్న ఊరిలో, ఇంతటి ప్రజాదరణ ఉన్నవాడు తన పక్కన ఉండాలని రాజు ని తనతో పాటు రమ్మన్నాడు. తాను కండక్టర్ గ చేస్తే వచ్చే జీతం తోనే తన కుటుంబం బతకాలి అని చెప్పి పెద్దాయన మనోభావాలు దెబ్బ తినకుండా సున్నితంగా తిరస్కరించాడు. దానికి పెద్దాయన తాను కొత్త వ్యాపారాలు చూసుకోవడానికి తరచూ సిటీ కి వెళ్లి వస్తూ ఉండటం వల్ల, ఊరిలో రైస్ మిల్, గొడౌన్ చూసుకోవడానికి ఒక సూపెర్వైసర్ కావాలని, వెంటనే చేరవచ్చు అని చెప్పాడు. సూపెర్వైసర్ అనే మాట వినగానే తన చిన్న నాటి సత్యం గారు గుర్తొచ్చి వెంటనే సరే అన్నాడు. 


రోజులు గడుస్తున్నా కొద్దీ మిల్ లో పని చేసే వాళ్ళకి,పెద్దాయన పక్కన ఉండేవాళ్ళకి రాజు నచ్చట్లేదు. పెద్దాయనతో తనకున్న పరిచయము అదును గ తీసుకొని అవకాశం చేజిక్కించుకున్నాడని అందరు దూరం పెట్టేవారు. బాగా కాల్చిన ఇనుము ని కష్టం, నష్టం, దుఃఖం, ఓటమి, అవమానం అనే సుత్తి తో కొట్టి కొట్టి వదిలితే చివరికి మనిషి అవుతాడు. చిన్న నాటి నించి ఎన్నో అడ్డంకులని అవకాశాలు గా మార్చుకొని ఎదిగినవాడు రాజు. తనకి అనిపించింది కాకుండా ఎదుటి వాడు వినాలనుకునేది చెప్పి అందరిని కలుపుకొని పోవటం మొదలుపెట్టాడు. పెద్దాయన సహకారం తో మెల్లగా సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. రాజు తన కింద పనిచేసే వాళ్ళ దెగ్గర టఫ్ గ ఉండేవాడు, తన కన్నా పెద్ద వాళ్ళ దెగ్గర వినయం గ ఉండేవాడు. మధ్యలో వ్యాపారం లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కింద నించి వచ్చిన వాడు అవటం మూలాన, కష్టం విలువ తెలిసినవాడు గనక, బాధల లోతు ని చూసినవాడు గనక, పరిస్థితి ఏదైనా ధైర్యం గా ఎదురుకోవటం అలవాటు చేసుకున్నాడు. రోజు రోజుకి పెద్దాయన కి దెగ్గరవుతూ పోతున్నాడు. ఎదుగుతున్న కొద్దీ ఇబ్బందులు పెరిగాయి, తన చుట్టూ ఉన్న వాళ్ళు సగం మంది ఎప్పుడు కింద పడతాడా అని ఎదురు చుస్తునారు, మిగతా వారు ఎలా కిందకి లాగాలి అని ఆలోచిస్తున్నారు.


పరిచయాలు పెరగటం తో కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు రాజు. పెద్దాయన సహకారం తో కొంత భూమి కొని అందులో పత్తి పండించేడు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడి మొత్తం పంట పోయి మళ్ళి మొదటికి వచ్చాడు. రూపాయి ఆదా చేయటం అంటె రూపాయి సంపాదించటమే అని సంపాదించే ప్రతి రూపాయిని ఆదా చేస్తూ తన కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో కలిసి వ్యాపారాలు మొదలుపెట్టి రోజుకి పదహారు గంటలు పని చేసేవాడు. పడ్డాక లేవటం లో ఉన్న కిక్ సిగిరెట్ లో లేదు, ఎదురుదెబ్బ తగిలినా ముందుకెళ్లటం లో ఆనందం మందు లో లేదని గ్రహించాడు. 


ఎం చేసినా ఎంత ఎదుగుతున్నా, తన కన్నా గొప్ప వారికి పోటీ అనిపించకుండా చూస్కునేవాడు. రాజకీయ సంబంధాలు పెరుగుతున్నాయి, ప్రజల తో మరింత సన్నిహితంగా మెలుగుతున్నాడు. అతి తక్కువ కాలం లోనే ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ గ మారాడు, మండల యూత్ వింగ్ ప్రెసిడెంట్ గ బాద్యతలు చేపట్టాడు. 


Rate this content
Log in

Similar telugu story from Drama