Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

అభిలాష (కథానిక )

అభిలాష (కథానిక )

4 mins
251



రాధిక ఇంటి ముందు కూరలు కొంటోంది. అప్పుడే పాత పేపర్లు తీసికెళ్లే ప్రకాశం రిక్షా నడుపుకుంటూ వచ్చాడు.


"అమ్మగారూ!పాత పేపర్లు వేస్తారా!"


"పోయిన నెలేగా వేసాను. ఇంకో నెల అయ్యాక రా!"


అంటూ వాడికి సమాధానము చెప్పిన రాధిక వాడి రిక్షాలో పుస్తకాలు చూడగానే ఆసక్తి కలిగింది. అవి తెలుగు నవలల లాగా వున్నాయి. బండిళ్ళు బండిళ్ళు కట్టి వున్నాయి.



"ఇవేమిటి? "


"వెనకింటి వనజమ్మ గారిచ్చారమ్మా!పాత పుస్తకాలు. తూకానికి కొనుక్కున్నాను."అన్నాడు ప్రకాశం.


 రాధికకు పుస్తకాలంటే ప్రాణం. వాడి చేత బండిళ్ళు విప్పదీయించి చూస్తే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.

అన్నీ మంచి మంచి నవలలు. విశ్వనాధ వారివి, శ్రీపాద వారివి, గురజాడ వారివి, వీరేశలింగం గారివి ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు, కావ్యాల దగ్గర్నుంచి చాలానే వున్నాయి.

రాధిక వాడిని నిలబెట్టి వాడికి అడిగినంత డబ్బులిచ్చి పుస్తకాలు ఇంట్లోకి చేర్చింది.



"మన ఇంట్లోనే చాలా పుస్తకాలు వున్నాయి. ఇప్పుడు ఇవెందుకు? చోటు కూడా లేదుకదా!"విసుక్కున్నాడు భర్త రాఘవ.



"ఇంట్లో ఎక్కడైనా సర్దుతాను. చాలా విలువైనవి. అలా రోడ్డు మీద తూకానికి పడి ఉంటే బాధ వేస్తుంది."అంటూ పుస్తకాలు సర్దడం మొదలు పెట్టింది.

నిజానికి ఆమె దగ్గర పెద్ద కలెక్షనే వుంది.

రాత్రి రాధికకు ఒక ఆలోచన వచ్చింది.


"ఏమండీ!మనము గ్రంథాలయము పెట్టుకుందామా?"


"నీకేమైనా పిచ్చా? గ్రంథాలయము ఏమిటి? ఎక్కడ పెట్టుకుంటావు?"


రాఘవకి చికాగ్గా వుంది.

అల్మరాల నిండా పుస్తకాలు, మంచాల క్రింద పెట్టెల్లో పుస్తకాలు, అటకల మీద పుస్తకాలు, ఆఖరికి వంటింట్లో కప్బోర్డు మీద పుస్తకాలు, ఇంట్లో కొంచెము సందు లేకుండా పుస్తకాలు నిండిపోయి

వుంటాయి. ఏదోలే పుస్తకాల పురుగు అంటూ భార్యకు ఎదురు చెప్పడు రాఘవ. ఇప్పుడు బుర్రలో గ్రంథాలయము అనే ఆలోచన ఒకటి.


మంచం మీద పద్మాసనము వేసుక్కూర్చొని "పిల్లలా మన దగ్గర లేరు. మనమిద్దరమే కదా!రెండు ర్యాకులు కొని హాల్లో పెట్టుకుందాము. మన దగ్గర వున్న పుస్తకాలు ఎవరైనా వచ్చి చదువుతారు."


భర్త అభిప్రాయం కోసం ఆశగా చూసింది రాధిక.


దీనికి తిక్క అనుకుంటూ,


 'గ్రంథాలయము ఏమిటి? హాల్లో ర్యాకులు వుంటే పరమ చికాగ్గా ఉంటుంది.ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ వుంటే అసలు బాగుండదు.ఇల్లు పరమ ఛండాలంగా ఉంటుంది పిల్లలు వస్తే ఎంత ఇరుకు? చివరకు మనిద్దరికీ ప్రైవసీ ఉంటుందా? హాయిగా ఉండక ఈ వెఱ్ఱి మొఱ్ఱి ఆలోచనలు ఏమిటి !"

అంటూ విసుక్కున్నాడు రాఘవ.

కళ్ళనీళ్లు తిరిగాయి రాధికకు.



రాధిక పుట్టింట్లో అందరికీ పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. వాళ్ళ పెద్దనాన్న గారు స్వయంగా కవి. పద్యాలు వ్రాయటమే కాకుండా ఆయన గొంతెత్తి పాడేవాడు. పెద్దనాన్న దగ్గర సాహిత్యము గురించి మాట్లాడటం రాధికకు అలవాటు.తల్లి, తండ్రి, తమ్ముడు పుస్తకాలు బాగా చదివే వాళ్ళు. ఇంట్లో ఒక రూమ్ పుస్తకాలకు కేటాయించి ఉండేది.



పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చింది రాధిక.

అక్కడ వాతావరణం కొంచెము భిన్నంగా ఉండేది. అప్పటికే ఇంటింట టివి వచ్చింది. అత్తగారింట్లో అందరూ టివీ కి అలవాటు పడ్డారు.

రాధిక, రాఘవ హైదరాబాద్ లో కాపురము పెట్టారు. విడి కాపురము కాబట్టి రాధిక పుస్తకాల అలవాటు అలాగే కొనసాగింది. రాఘవ పుస్తకాలు అంతగా చదవకపోయినా భార్యను మాత్రము ఏమీ అనడు.రాధికను చాలా ప్రేమగా చూసుకుంటాడు.

పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడము, వాళ్ళ చదువులు శ్రద్ధగా చూసుకోవటము, అత్తగారింట్లో అందరితో కలుపుగోలుగా ఉండటంతో రాఘవకు రాధిక అంటే రాఘవకు చాలా ఇష్టము.

ఇద్దరూ అన్యోన్యంగా వుంటూ బాధ్యతలు నెరవేర్చారు.


రెండు రోజులు గడిచాయి. రాధిక ముఖము చిన్నబుచ్చుకొని వుంది. భార్యను చూచి ఆలోచనలో పడ్డాడు.

పెళ్లయిన దగ్గర్నుండి భార్య తనని ఏమి అడిగింది గనక?


 ఎప్పుడూ పిల్లలు, వాళ్ళ పెంపకము అంతే.తన సంతోషము కోసము నగలు, నాణ్యాలు ఎప్పుడూ కోరలేదు. చీర కొనుక్కోమని డబ్బులిస్తే పుస్తకాలు కొనుక్కునేది. ఉత్త పిచ్చిది.

ఒక వేళ ఇంట్లో గ్రంథాలయము పెడితే వచ్చే నష్టము ఏముంది?

ఒక వేళ ఇబ్బందిగా వుంటే రాధిక అర్థము చేసుకుంటుంది. అప్పుడు మానేయొచ్చు.



నాలుగో రోజు ఇబ్బందులు చికాకులు వస్తే తీసివేద్దాము అనే షరతు మీద రాఘవ గ్రంథాలయానికి ఒప్పుకున్నాడు.రాధిక చిన్న పిల్లలా సంబరపడింది.


************


 ఒక మంచి రోజు చూసి గ్రంథాలయానికి శ్రీకారము చుట్టింది రాధిక.

హాల్లో సోఫాలు తీసి రెండు పెద్ద ర్యాకులు కొనిపెట్టింది. వాటిలో పేర్ల వారీగా పుస్తకాలు సర్దింది. ఇంటి ముందు గోడకు 'తెలుగు లైబ్రరీ 'అని ఇంగ్లీషులో, తెలుగులో 'గ్రంధాలయము 'అని ఒక రేకు మీద వ్రాయించి మేకు కొట్టి తగిలించింది. ఇప్పుడు రాధికకు పాత పేపర్లు, పుస్తకాలు అమ్మే వాళ్ళకు చెప్పి వాటిని కొనటం, అట్టలు వేసి ర్యాకుల్లో సర్దడం, ఒక క్యాటలాగు తయారు చేసుకొని దానిలో అన్ని పుస్తకాల పేర్లు ఎక్కించడము శ్రద్ధగా చేయసాగింది.

ఆకాలనీలో అందరూ రాధికకు తెలిసిన వాళ్ళే కాబట్టి అందరికీ తమ గ్రంథాలయము గురించి చెప్పి, సాయంత్రము నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా తెరిచి వుంటుందని చెప్పింది.





రాఘవకు మాత్రము ఇల్లు ఇరకాటకంగా వుంది . హాల్లో వుండే టి. వి. చిన్న బెడ్ రూమ్ లోకి మారింది. సోఫాలు రెండో బెడ్ రూమ్ లో ఇరుక్కున్నాయి. డైనింగ్ టేబుల్ వెనుక వసారాలో చేరింది. సాయంత్రం నాలుగింటి నుండి ఎనిమిదింటి దాకా రాధిక ఎక్కడికీ రాదు. అంతకు ముందు భార్యతో రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లేవాడు. రిటైర్ అయ్యాక కాస్త సరదాగా కాలక్షేపము చేద్దా మంటే కొంపలో గ్రంథాలయము ఒకటి. అతడు తన చికాకును అప్పుడప్పుడు బయటికి చెప్పినా రాధిక సర్ది చెప్తూ ఉండేది.



 



వారము రోజులు గడిచాయి. మెల్లిగా అకాలనీలో వాళ్ళే ఒకరూ ఐద్దరూ రావటము, పుస్తకాలు చూడటం, కాసేపు కూర్చుని చదువుకొని వెళ్ళడము జరుగుతోంది.

వాళ్ళతో మాట్లాడటం రాఘవకు కూడా కాస్త కాలక్షేపంగా మారింది . మెల్లిగా గ్రంథాలయముకు వచ్చే వారి సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. రోజుకు కనీసం పది పన్నెండు మంది రావటం మొదలయ్యింది. పైగా వాళ్ళ ఇళ్లల్లో వున్న పాత పుస్తకాలు కూడా తెచ్చి ఇవ్వటంతో మిగిలిన వాళ్ళు కొంత మంది న్యూస్ పేపర్లకు చందా కట్టారు. అలా రాధిక గ్రంథాలయము ఆ కాలనీ వాసుల్లో చైతన్యము తెచ్చింది.



కొంత కాలము గడిచింది. మెల్లిగా రాఘవలో మార్పు వచ్చింది. గ్రంథాలయము పెట్టాక కాలానీలో గుర్తింపు పెరిగింది. సాయంత్రము అయ్యేసరికి ఇంటినిండా పుస్తకప్రియులు చేరి పోతున్నారు.కొంతమంది తమ ఇళ్లల్లో వున్న పుస్తకాలు తెచ్చి ఇస్తున్నారు.




 రాఘవ వీధిలోకి వస్తే చాలు యువకులు కూడా చాలా గౌరవంగా పలకరిస్తున్నారు.

గ్రంథాలయము పెట్టి సమాజానికి సేవ చేస్తున్నారని అతనిని పొగుడుతుంటే అతను మనసులో చాలా ఆనందించేవాడు. ఒకింత గర్వం కూడా కలిగేది. ఇప్పుడు అతనే వెళ్లి పుస్తకాలు సేకరించి పట్టుకొచ్చి సర్దిపెట్టడం అలవాటు చేసుకున్నాడు. పుస్తకాలను బౌండ్ చేయించడం, పేర్లు వ్రాసి క్యాటలాగు తయారు చెయ్యడం శ్రద్ధగా చేస్తున్నాడు. భర్త సహకరించటంతో రాధికకు చాలా ఆనందంగా వుంది.





ఒక సంవత్సరం గడిచింది.గ్రంథాలయము పెట్టి ఏడాది అయిన సందర్భముగా ఏదైనా ఫంక్షన్ జరపాలని కాలనీ వాసులు కోరడంతో సరే నన్నారు రాఘవ దంపతులు. కానీ ఖర్చు గురించి ఎక్కువ పెట్టుకోలేమని చెప్పాడు రాఘవ. ఎదురింట్లో సుందరరావుకు పలుకుబడి ఎక్కువ. రాఘవ పైసా ఖర్చు పెట్టుకోనవసరము లేదని, అంతా కాలనీలో అందరమూ చూసుకుంటామని చెప్పాడు సుందరరావు. సరే 'అన్నాడు రాఘవ.




కాలనీ వాసులు ఉషారుగా ఆనివర్సరీ పనులు చేయటం మొదలు పెట్టారు.

ఒక మంచి రోజు నిర్ణయించారు. ఇంటి ముందు షామియానా వేశారు. ఆరోజుకు గెస్టుగా మేయర్ ని పిలుచుకొచ్చారు. ఆ వీధిలో పిల్లల చేత కల్చరల్ పోగ్రామ్స్ పెట్టించారు. మొత్తానికి అనుకున్నదానికంటే వైభవంగా

గ్రంథాలయము ఆనివెర్సరీ జరిగింది.




 రెండో రోజు పేపర్లో రాధిక, రాఘవ ఫోటోలు కూడా వచ్చాయి. వారి గ్రంథాలయము గురించిన ఆర్టికల్ పేపర్లో చదివిన రాఘవ కొలిగ్స్, తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు రాఘవకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. రాఘవకు ఇదంతా ఒక కలలో లాగా వుంది.






రాత్రయింది చందమామ ప్రకాశిస్తున్నాడు. రాఘవ కొత్త పుస్తకాల పేర్లు క్యాటలాగు లోకి ఎక్కిస్తున్నాడు. రాధిక అతడి దగ్గరి కొచ్చింది.

"రాత్రయ్యింది. ఇంక పడుకోండి. అలసటగా లేదూ "అంది అతని తల నిమురుతూ.

"లేదు రాధికా!చాలా సంతోషముగా వుంది. నువ్వు ఈ పని మొదలు పెట్టి నప్పుడు నీకు తిక్క అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. మన జీవితాలకు ఇది చాలు. రిటైర్ అయ్యాక ఏమీ తోచకుండా గడిపేకంటే ఇలాటి పని చెయ్యటం మనసుకు ఎంతో హాయిగా వుంది."అంటూ భార్యను ప్రేమగా దగ్గరికి తీసికొన్నాడు రాఘవ.


(సమాప్తం )



Rate this content
Log in

Similar telugu story from Inspirational