వ్యధా వనితా నైపుణ్యం
వ్యధా వనితా నైపుణ్యం
"జెస్వీ...లేమ్మా..టైం ఏడు అయిపోయింది..స్కూల్ కి వెళ్ళాలి కదా..రెడీ అవుదువు గానీ"
7 ఏళ్ల తన పాప జెశ్విత ని నిద్రలేపి వంటింట్లోకి వెళ్ళింది సృజన.
"గుడ్ మార్నింగ్ బంగారం" అంటూ వచ్చి పాలు వేడి చేస్తున్న సృజనను వెనుక నుండి గట్టిగాకౌగలించుకున్నాడు,ఆమె భర్త శ్రీధర్.
"అబ్బా..వదలండి..రాత్రి చేసిన అల్లరి చాల్లేదా.." విసుక్కుంటూ భర్తను విడిపించుకుని కాఫీ పనిలో నిమగ్నమైపోయింది సృజన..
"అంతేలే..ముద్దొచ్చి హగ్ చేసుకుంటే,తోసేస్తావా" అని గొణుక్కుంటూ ఆఫీస్ కి రెడీ అవడానికి బాత్ రూమ్ లో దూరాడు శ్రీధర్.
శ్రీధర్ ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు..6 అంకెల జీతం,వాళ్ళ ఊరిలో సొంత ఇల్లు..35 ఏళ్లకే ఎంతో మంచి పొజిషన్ లో ఉన్న శ్రీధర్ ని చూసి స్నేహితులు,ఇరుగు పొరుగు అసూయ పడే వాళ్ళు..
ప్రస్తుతం శ్రీధర్ దంపతులు హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
శ్రీధర్ ఫ్రెష్ అయ్యే లోపు పాప ని రెడీ చేసేసింది సృజన.
వచ్చే సరికి భార్య రెడీ చేసిన వేడి వేడి ఇడ్లీలు,కారప్పొడి,నెయ్యితో లాగించేసి,
పాపకి కూడా తన చేత్తోనే తినిపించి..పాపని స్కూల్ లో డ్రాప్ చేసి వచ్చి భార్య చేతి కాఫీ తాగుతూ కూర్చున్నాడు శ్రీధర్.
"ఏమండీ..ఈ నెల రెంట్ ఇవ్వాలి.ఓనర్ గారికి ఇచ్చేసి వస్తారా..నేను ఇవ్వనా.."
"దానికి అంతగా అడగాలా..నీకు 30000 ఇచ్చాను కదా మొన్న..వాటిలోంచి ఇచ్చెయ్యి"
"అంటే అదీ..మొన్న అత్తయ్య వచ్చినప్పుడు,ఉప్పాడ వెళ్ళాం కదా..పట్టు చీర,గాజులు తీసిచ్చాను అత్తయ్య గారి కి"భయపడుతూ చెప్పింది సృజన.
"బుద్ధి ఉందా అసలు..ఎన్ని సార్లు చెప్పినా ఆ చీరలు,నగలు కొంటారు"
"అదేంటండీ..అత్తయ్య గారికే గా తీసుకుంది."సంజాయిషీ చెప్పబోయింది సృజన.
"అత్తయ్యకి అయినా..ఎవరికైనా..వృధా ఖర్చు..సర్లే..నేనే ఇచ్చేస్తా" అంటూ చిరాగ్గా ఆఫీస్ కి బయలు దేరాడు శ్రీధర్.
భర్త అలా చిరాకు పడడంతో మనసుకి కష్టంగా అనిపించింది సృజనకి.
అలా బాధపడుతూనే వంట పని పూర్తిచేసి పాప కి క్యారేజ్ కట్టి స్కూల్ కి బయల్దేరింది.
పాప కి భోజనం పెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా,రోడ్ కి అడ్డంగా ఒక టెంట్ వేస్తున్నారు.
ఏదో పెళ్లి రిసెప్షన్ లా ఉంది.
ఆ ఫంక్షన్ చూడగానే సృజన కి ఒక ఆలోచన ఫ్లాష్ లా మెరిసింది.
వెంటనే ఇంటికి వెళ్లి , ఈ నెలలో ఉన్న ఫంక్షన్ ల తాలూకా రెమైండర్ లను చెక్ చేసుకుంది.
చేతిలో స్మార్ట్ ఫోన్ లు ఉన్నా,సృజన కి అలా వ్రాసుకోవడమే ఇష్టం..
అలా చెక్ చేస్తుండగా,2 రోజుల్లో తన స్నేహితురాలు గృహప్రవేశానికి వెళ్లాలని నోట్ చేసుకోవడం కనపడింది.
వెంటనే తన పథకాన్ని అమలులో పెట్టాలని నిర్ణయించుకుంది.
ఆ తరవాత రోజు ఉదయాన్నే భర్తకి కాఫీ ఇస్తూ " ఏమండీ..హారిక వాళ్ళది ఎల్లుండి గృహప్రవేశం ఉంది..మీరు కూడా వస్తారా" అని అడిగింది.
"ఎల్లుండి అంటే ఆదివారం..ఇబ్బంది ఏముంది.నేను కూడా వస్తాను.సరదాగా బయటకి వెళ్లినట్లు ఉంటుంది"
శ్రీవారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంగా తన పని మొదలు పెట్టేసింది సృజన..
ఆపరేషన్ వనిత స్టార్ట్స్..
ఆదివారం వచ్చేసింది..
శ్రీధర్ కాఫీ తాగుతుండగా,సృజన వచ్చి,
"ఏమండీ..ఉన్న 3 పట్టుచీరలు, డ్రై క్లీనింగ్ వాళ్లకి ఇచ్చాను.ఆ భార్యా భర్తలిద్దరూ, వాళ్ళ మామయ్య చనిపోతే ఊరెళ్లారంట.
ఏం చెయ్యాలో తెలీడం లేదు" దిగులుగా అంది.
"ఎప్పుడూ ఇలానే చేస్తావ్ నువ్వు.
ముందు చూసుకోవద్దా..ఏదోకటి కట్టుకుని రా,చేసేదేముంది." చిరాకు పడుతూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు శ్రీధర్.
ఉన్నంతలో మంచి చీర కట్టుకుని,చిన్న చైన్ వేసుకుని రెడీ అయింది సృజన.
శ్రీధర్,సృజన పాపని తీసుకుని గృహప్రవేశానికి బయలుదేరారు.
సృజన స్నేహితురాలు హారిక శ్రీధర్ దంపతులిద్దరినీ ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకు వెళ్ళింది.
అన్ని గదులు తిప్పి చూపిస్తూ వాళ్ళని తన భర్తకు,స్నేహితులకు పరిచయం చేసింది..
వ్రతం అయ్యాక శ్రీధర్ దంపతులు,తాము తెచ్చిన గిఫ్ట్ ను హారిక దంపతులకు ఇచ్చారు..
అది ఓపెన్ చేసి చూసుకున్న హారిక దంపతులు చాలా ఆనందపడ్డారు.
చిన్ని రాధా కృష్ణుల వెండి ప్రతిమ అది..హారిక కి కన్నయ్య అంటే ఇష్టమని తెలిసిన సృజన పట్టుబట్టి,శ్రీధర్ తో ఆ ప్రతిమ ను కొనిపించింది.
వచ్చిన గిఫ్ట్ లు అన్నింటిలో మీదే హైలైట్ అన్న హారిక మాటలకి శ్రీధర్ గర్వంగా ఫీల్ అయ్యాడు..
ఆ తరువాత భోజనానికి కూర్చున్న సమయంలో,పక్కనే చెవులు కొరుక్కుంటున్న హారిక స్నేహితురాళ్ళ మాటలు శ్రీధర్ చెవిని దాటిపోలేదు.
"బయట వాళ్ళకి బంగారాలు,వెండి కొంటారు..భార్యకి మాత్రం ఒక్క పట్టు చీర లేదనుకుంటా.."
ముందు వాళ్ళు ఏదో జెలసీ తో అంటున్నారులే అనుకున్నాడు శ్రీధర్..
కానీ ఆ మాటలు దూరం నుంచి అయినా స్పష్టంగానే వినపడుతున్నాయి..
"లేదంటే చీరలు కొనకుండా దాచి గిఫ్ట్ లు కొంటారేమో"ఇక ఇకలు..
"మెళ్ళో చిన్న చైన్ తప్ప,హారం కూడా లేదు".
"కొనలేక కాదు..పిసినారి తనం."
ఆ మాటలు వింటూ శ్రీధర్ కి భోజనం కూడా సహించలేదు..
ఏదో తిన్నాం అనిపించి, హారిక దంపతుల కి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరారు.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యే సరికి సాయంత్రంఅయ్యింది.
కాఫీ తాగుతూ సృజనని అడిగాడు శ్రీధర్..
"భోజనాల దగ్గర వాళ్ల మాటలు నీకు వినపడలేదా.."
"విన్నాను అండీ.."
"నీకు బాధగా అనిపించిందా.."
"లేదండీ..పది మంది ఉన్న చోటకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడతారు..అవన్నీ పట్టించుకోకూడదు అండీ.."
"అయినా మా ఆడవాళ్లు, పట్టు చీరలు,నగలు కొనుక్కునేది అవసరం కోసమో,అలంకరణ కోసమో మాత్రమే కాదండీ..పదిమందిలో భర్త గౌరవం నిలబెట్టడానికి కూడా..
అయితే పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుంటేనే విలువ ఇస్తారా అంటారేమో.. "
"మీ హోదా కి తగ్గట్టు,మీ భార్య గా నేను కొద్దిగా అయినా డాబు గా ఉండకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది..అయినా నాకు చీరలు,నగలు లేకపోతే ఏమి..బంగారం లాంటి మీరుండగా.." అంటూ భర్త ని అల్లుకుపోయింది సృజన..
దాంతో ఆ మాటల తాలూకు బాధ నుంచి కాస్త బయటపడ్డాడు శ్రీధర్..
ఆ మరుసటి రోజు సాయంత్రం,
కాలింగ్ బెల్ కొట్టిన శబ్దానికి తలుపు తీసిన సృజన ఎదురుగా శ్రీధర్ ఉప్పాడ పట్టుచీర,మల్లెపూలతో నిలబడి ఉన్నాడు.
భోజనాలు అయ్యి పాప ని నిద్రపుచ్చాక,
మల్లెపూలు పెట్టుకుని,తను తెచ్చిన చీరను కట్టుకుని, గదిలోకి వచ్చిన శ్రీధర్ కు, మాటలతో కాక తన కౌగిలితో,అధరాల మధువులతో
కృతజ్ఞతలుచెప్పింది సృజన.
ఆ రాత్రి, సృజన శ్రీధర్ ల ప్రణయ యుద్ధాన్ని కిటికీలో నుంచి తొంగి చూసిన చందమామ సిగ్గు పడి మబ్బుల వెనుక దాక్కున్నాడు..
ముగింపు : అయితే ఆ ముందు రోజు సృజన ,హారిక తో మాట్లాడిందని,భోజనాల దగ్గర మాట్లాడిన వాళ్ళు కూడా సృజన స్నేహితులేనని శ్రీధర్ కి ఇప్పటికీ తెలీదు..
స్వస్తి.
