బివిడి ప్రసాదరావు .

Drama

3.8  

బివిడి ప్రసాదరావు .

Drama

మిత్ర వ్యాఖ్య (కథ)

మిత్ర వ్యాఖ్య (కథ)

3 mins
520


   "ఇంకా కరోనా భయం పోలేదుగా మేడమ్" అంది గౌరి.

   తికమకయ్యింది శారద.

   "ఇంతకి ముందు ఐదిల్లల్లో పని చేసేదాన్ని. ఇప్పుడు కుదరక మూడిల్లల్లోనే చెయ్యాలనుకుంటున్నాను." చెప్పింది గౌరి.

   "అందుకని ఆ రెండిల్లు జీతాల్నీ ఈ మూడిల్లుకూ సర్ది జీతం పెంచేస్తున్నావా" అడిగింది శారద చిత్రంగా.

   "మరి ఇది వరకటిలా ఎక్కువ ఇల్లకి పోలేం కదా మేడమ్" అంది గౌరి.

   "ఒక్కమారుగా జీతం ఎనిమిది వందలు పెంచేస్తే ఎలా." అంది శారద దిగులుగా. 

   భాస్కర్ అప్పుడే అక్కడకి వచ్చాడు. శారద భర్త భాస్కర్.

   "గౌరి జీతం పెంచేసిందండీ." చెప్పింది భర్తతో శారద.

   "అదేమిటి గౌరి. మా జీతాలే తగ్గాయి కదా." అన్నాడు భాస్కర్.

   "పైగా మా ఆయనకే కాదు ఎందరో ఉద్యోగులకి జీతాల్లో కోతలు చేయబడ్డ రోజులివి" అని చెప్పింది శారద.

   "భలే మేడమ్. అయ్యగారి లాంటి వారు ఇల్లులు కదలనక్కరలేదు. ఇంటిలోనే ఉండి పనులు చేసుకోవచ్చు. మరట్టప్పుడు జీతాలు తగ్గితే నష్టం ఎంత మేడమ్." అనని, "మరి మేము. ఇలాంటి రోజుల్లో ఇల్లు దాటి బయటికి వచ్చి తీరాలి. ఏమైనా ఐతే గీతే మాకు ఎంత నష్టం. ఆఁ. చెప్పండి మేడమ్. మేము పెంచేది ఏపాటిది." అంది గౌరి.

   శారద పరాకయ్యింది.

   "లేదు గౌరి. మేమూ ఇకపై బయటికి వెళ్లాలి. వారంకి తప్పనిసరిగా రెండు రోజులు నేను ఆఫీస్ కెళ్లాలి." చెప్పాడు భాస్కర్.

   "అట్టానా సారూ. అలా మీకు కుదురుతుందేమో కానీ మాకు కాదుగా." అనని, "వారంకి నేను రెండు రోజులు వస్తే మీరు ఒప్పుకుంటారా మరి. చెప్పండి మేడమ్" అంది గౌరి.

   శారద చిరాకయ్యింది.

   "ముందు నుండి మీ ఇంటి పనికి వస్తున్నాను కనుక ముందుగా మిమ్మల్ని అడిగేందుకు వచ్చాను." అనని, "మూడిల్లుకే పనికి పోతా. జీతం పెంచితేనే పనికి తిరిగి కుదురుతాను" చెప్పింది గౌరి.

   భాస్కర్ తల తిప్పి శారదని చూశాడు. "నువ్వే తేల్చుకో" అననేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు.

   శారద చిందరవందరవుతుంది.

   "నా ఫోన్ నెంబర్ ఉందిగా. సాయంకాలానికి చెప్పండి మేడమ్" అననేసి అక్కడ నుండి వెళ్లిపోయింది గౌరి.

   అక్కడికి వస్తూనే, "మమ్మీ మా ఆన్లైన్ క్లాస్ లకి టైమవుతుంది. టిఫిన్ పెట్టు" అంది మిత్ర. 

   మిత్ర ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతుంది.

   భారంగా కిచన్ వైపు కదిలింది శారద.

   అరగంట లోపు - డైనింగ్ టేబుల్ మీద రెండు ఉప్మా ప్లేట్లు పెట్టి మిత్రాని భాస్కర్ ని పిలిచింది శారద.

   ఆ పిమ్మట తను తన గది లోకి వెళ్లింది. తన అపార్టుమెంట్ లో గౌరి పని చేసిన వాళ్లిల్లకి ఫోన్ లు చేసింది.

   వాళ్లూ చెప్పారు - గౌరి జీతం పెంచమని కచ్చితంగా చెప్పి పోయిందని.

   శారద గింజుకుంటుంది. ఆ సొదతోనే యాంత్రికంగా మిగతా పనులు చేసుకు పోతుంది.

   లంచ్ టైం లో -

   "గౌరి విషయం ఏమంటారండీ" అని అడిగింది శారద భర్తని.

   "నువ్వే తేల్చుకో" అన్నాడు భాస్కర్.

   "అరె. అలా అంటే ఎలా. సర్దవలసింది మీరేగా. మీరే చెప్పాలి" అంది శారద కోపంగా.

   "ఎనిమిది వందలంటే మాటలా" అనని, "తగ్గుతుందేమో చూడు" అన్నాడు భాస్కర్.

   "అబ్బే. తను తగ్గేలా లేదు. మిగతా వారిని అడిగాను. వాళ్లనీ ఎనిమిది వందల చొప్పున పెంచమనే కచ్చితంగా చెప్పిందట" చెప్పింది శారద.

   "నువ్వు తగ్గించి అడుగు. నా జీతం సరయ్యితే పెంచగలమని చెప్పి చూడు" చెప్పాడు భాస్కర్.

   ఆ వెంటనే ఎడమ చేతితో ఫోన్ అందుకొని గౌరీకి ఫోన్ చేసింది శారద. 

   గౌరి ఫోన్ ఎత్తగానే భాస్కర్ చెప్పిందే చెప్పి, "అంతవరకు రెండు వందలు పెంచగలను" అని చెప్పింది.

   గౌరి ససేమిరా కాదనేసింది.

   శారద విసురుగా ఫోన్ కట్ చేసేసింది.

   "ఏమంది" అడిగాడు భాస్కర్.

   "పొగరు. పైసా తగ్గించేది లేదనేసింది" చెప్పింది శారద.

   భాస్కర్ ఏమీ అనలేదు. అన్నంలో రసం వేసుకొని కలుపుకుంటున్నాడు.

   శారద రుసరుసలాడుతుంది.

   అప్పుడే, "గత మూడు నెలలుగా గౌరి రాకపోతే నువ్వే కదా మమ్మీ అన్ని పనులు చేసుకున్నది. మరి అలా చేసుకోవచ్చుగా" అననేసింది మిత్ర అమాయకంగా.

   శారద గబుక్కున తల తిప్పి మిత్రని చూసింది. పళ్లు నూరుతుంది.

   భాస్కర్ అది గమనించి, "మిత్రా ఊరుకో." అనని, "శారదా. తను చిన్నపిల్ల. తనకి ఏం తెలుసు. కూలవ్వు" అన్నాడు.

   "ఆఁ. వెనుకేసుకు రండి. మీకేం పట్టదు. చాకిరీలన్నీ నాకే. కర్మ" అంది శారద గట్టిగానే.

   ఆ వెంబడి - శారద రగిలిపోతుంది.

   మిత్ర బిత్తరయ్యింది.

   భాస్కర కలగచేసుకోలేకపోతున్నాడు.

   ఆ తోవన మిత్ర, "ఆగు మమ్మీ. గౌరి జీతం పెంచమందనేగా గోల." అనని, "గౌరి పాత జీతంకి చేయలేకపోతే మమ్మీ ఇన్నాళ్లు ఆ పనినేగా చేసింది. మమ్మీకి అదే జీతం ఇచ్చేయ్ డాడీ. మమ్మీ ఇకపై కూడా చేస్తుంది. ఇక గౌరీ రాకపోతే ఏం" అని చెప్పింది మిత్ర.

   భర్త వైపుకి గమ్మున తల తిప్పింది శారద.

   భాస్కర్ తంటా పడుతున్నాడు.

   "మిత్రా చెప్పింది కరెక్టు. ఏమంటారు" అంది శారద ఆబగా.

   భాస్కర్, "అవునా. అలానా. నీకయితే అంత ఎందుకు. కాస్తా తగ్గించుకో" అన్నాడు నంగిరిగా.

   శారద బుసలు కొట్టింది.

   మిత్ర జారుకుంది.

                                                                    ***


Rate this content
Log in

Similar telugu story from Drama