STORYMIRROR

Sridevi Somanchi

Drama

3.2  

Sridevi Somanchi

Drama

అతనిష్టం

అతనిష్టం

6 mins
23.1K


అతనిష్టం

రచన యస్. శ్రీదేవి / శ్రీదేవి సోమంచి

“కలం పేరు - సాహితి ”

( ఆంధ్రభూమి 20.3.2003, గుండెలోతు స్వీయసంపుటి)

*******************************

నియాండర్తల్ మనిషి ఆధునికుడిగా ఎదిగే క్రమంలో స్త్రీపురుష జీవులుగా విడిపోయాడు. అదొక్కటే కాదు, స్త్రీకి రెండు జీవితాలు ఏర్పడ్డాయి... పెళ్లి అనే ప్రక్రియతో ఆ విభజన మొదలౌతుంది. పెళ్లికి ముందు జీవితం, పెళ్ళి తరువాతి జీవితం. శుక్లపక్షం క్షీణించి కృష్ణపక్షం వృద్ధి చెందినట్టు పెళ్ళితో ఆమెలోని కళలన్నీ లుప్తమౌతాయి.

***

ఆమె చెప్పాలనుకున్నదంతా చెప్పి, చివర్న -

“మీ ఇష్టం" అంది. 

సాధారణంగా అటువంటి మాటలు భార్యాభర్తల మధ్యనే వస్తాయి. వాళ్ళ మధ్య ఉండే అనుబంధంలోని సున్నితత్వం తెగిపోయే ముందు, దాన్ని నిలబెట్టడానికి జరిగే ఆఖరి ప్రయత్నంలా వోటమి అంచున వున్నవారు తప్పనిసరి రాజీ ప్రయత్నంలా అంటారు.

అటువంటి ప్రయత్నం ఆమె వైపు నుంచి జరిగింది. ఇంక మిగిలి ఉన్నదీ జరగాల్సినదీ అతని ఇష్టం మీదే ఆధారపడి ఉంది.

అతను ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలు తుదీ మొదలూ లేకుండా సాగాయి.గజిబిజిగా అల్లుకుపోయాయి. పెళ్ళైనప్పట్నుంచీ ఇప్పటివరకూ తామిద్దరి మధ్యా జరిగినవన్నీ

గుర్తుతెచ్చుకున్నాడు. ఆలోచిస్తున్నకొద్దీ విషయం చాలా చిన్నదనిపిస్తోంది. అంత చిన్నవిషయానికి ఆమె అంత పెద్ద నిర్ణయాన్నెలా తీసుకోగలిగిందో అర్థమవలేదు.

అదే సమయానికి ఆమెకూడా గతాన్ని తవ్వుకుంది. ముల్లు ఎంత చిన్నదైనా, దాన్ని మన శరీరంలో భాగంగా

ఉంచుకోగలమా అనుకుంది.

ఒక్క రెండేళ్ళలో ఎంతమార్పు తన జీవితంలో! ఇరవైమూడేళ్ళ జీవితం ఎలా గడిచిందో తెలీలేదు, అతనితో రెండేళ్ళ జీవితం రెండు యుగాల్లా అనిపించింది. ఇంకా అలాంటి ఎన్ని యుగాలు గడవాలో!

పెళ్ళవకముందు అప్పుడన్నీ నవ్వులూ, వేళాకోళాలే... 

"రాజులూ, దేవుళ్ళూ కిరీటాలెందుకు పెట్టుకునే వాళ్ళో తెలుసా?....బట్టతల, నెరిసిన జుత్తు దాచుకుందుకు" అని తనంటే - 

నాన్న, అమ్మ తలుచుకు తలుచుకు నవ్వలేదూ?

“చీమా, దోమా ఫ్రెండ్సు. రెండూ కలిసి క్రికెట్ మేచి చూడ్డానికి వెళ్ళాయి. లాస్ట్

వికెట్ పడిపోగానే అంపైర్ ఏదో అన్నాడు. ఆ మాట వినగానే దోమ కంగారు కంగారుగా పారిపోయింది... అదేమిటో చెప్పవా ? ప్లీజ్ " అని అన్నయ్య వెంటపడితే నరాలు తెగే వుత్కంఠతో మేచి చూస్తున్నా -

"అమ్మలూ! ఏదో ఒకటి అన్నాడు లేవే! కాసేపయాక చెప్తాను" అని బతిమాలుకున్నాడుగానీ విసుక్కోలేదు.

"మనిషి మొదట నిప్పుని కనిపెట్టాడు. ఆ తర్వాత వేటంటే ఇష్టంలేని సోమరిపోతుని వెతుక్కుని తెచ్చుకున్నాడు. తను వేటాడి తెచ్చినవి వండి పెట్టడానికి. చుట్టూ పెరిగిపోతున్న ఎముకల గుట్టల్ని చూసి కొంత కాలానికి ఆ సోమరిపోతుకి తిండంటేనే విరక్తి పుట్టి , తప్పించుకు పారిపోయాడు. ఆ తర్వాత మగవాడు పెళ్ళి అనే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాడు."

అని తనంటే కొత్తగా పెళ్లైన అక్క ముసిముసిగా నవ్వుతూ తర్జనితో బెదిరించింది తప్ప తప్పు వెతకలేదు.

చిన్నగా నిట్టూర్చింది సృజన.

అంతా వైరుధ్యం. వర్తమానం, గతం ఒక వైరుధ్యానికి రెండు కొసలు.

ఏమైపోయాయి, ఆనాటి తన నవ్వులు? స్త్రీవాద భావాలు? కాలగర్భంలో కలిసిపోయాయా? పువ్వులై విరిసి ఈ ఇంటి ముంగిట్లో రాలిపడాల్సినవి ముడుచుకుపోయి ఎండి ఏ గాలికో

కొట్టుకుపోయాయి.

భర్త... సునీల్ తో ఏం మాట్లాడాలన్నా భయమే. ముళ్ళకంపతో గీరినట్టుంటుంది అతని ప్రవర్తన. పైగా చెప్పుకుంటాడు అదో పెద్ద క్రెడిట్‌ లా.

“నాదంతా నిర్మొహమాటం పద్ధతి. మనసులో ఒకటుంచుకుని పైకి మరొకలా మాట్లాడటం రాదు. ఉన్నదున్నట్టు అనేస్తాను" అంటాడు.

ఎందుకలా అనెయ్యటం? ఆ అనేది ఎదుటివాళ్ళని బాధ పెట్టేదైనప్పుడు? ముఖ్యమైనది కానప్పుడు? అతననే కాదు. అతని తల్లి, తండ్రి, చెల్లి అంతా అంతే.

"ఈ వేళెందుకో వంట్లో బాగా లేదు" ఉదయం అంటే -

"నీకసలెప్పుడు బావుంది? ఎప్పుడూ ఏడుపు మొహమే!" అనేసాడు.

“ఆఫీసులో మీటింగుంది. సాయంత్రం లేటౌతుందేమో!" అనే అనివార్యతకీ అలాంటి జవాబే.

"అంతేగానీ, ఇంటికి తొందరగా రావాలనే ఆలోచన ఎప్పుడూ రాదు" 

-అని.

అతన్తో మామూలుగా కూడా మాట్లడటానికి ఏమీ వుండదు. 

"వంకాయ కూర బాగా కుదిరింది. కదూ?" అనగానే-

"ఎలాగో....పెళ్ళైన ఇన్నాళ్ళకి "

-అనే జవాబు సిద్ధంగా వుంటుంది.

"సాయంత్రం అమ్మా, చెల్లీ వస్తామని ఫోన్ చేసారు" ఆఫీసుకి వెళ్లే ఆఖరి నిముషంలో చెప్తాడు. తనలో కంగారు. ఇంట్లో అన్నీ వున్నాయో లేదో చూసుకోవద్దూ అనబోయేంతలో అతనే అనేస్తాడు, తన మనసు అతనికి కరతలామలకంలాంటిదనుకుని. 

"వాళ్లొస్తారనగానే ఎందుకలా మొహం మాడ్చుకుంటావు?”

అత్తగారూ, ఆడబడుచూ కూడా అంతే. “నీ జీతం చూసి మావాడికి చేసుకున్నాంగానీ నువ్వేదో పెద్ద అందగత్తెవని కాదు. వాడిపక్కన నిలబడే అర్హతే నీకు లేదు. కాస్త చూసి ఖర్చుపెట్టి, డబ్బేనా మిగల్నివ్వు తల్లీ! మీ పెళ్లై యిప్పటికి రెండేళ్ళు. మరొకరైతే ఈపాటికి రెండంతస్థుల బిల్డింగ్ కట్టేవారు. మరి మీరో? ఇప్పటికింకా ఇంటి స్థలమే కొనుక్కోలేదు" అంటుంది అత్తగారు.

తను అందగత్తెకాదు. ఏవరేజిగా ఉంటుంది. నలుపులోకే లెక్క. తనని జీతం, కట్నం చూసే చేసుకున్నారు. అదేమైనా గొప్ప విషయమా, పదేపదే చెప్పుకుందుకు? 

క్వార్టర్స్ ఇచ్చారుగాబట్టి స్వంతింటి ధ్యాస పడలేదు. అదేనా తను బజారుకెళ్ళి కొనుక్కొచ్చి పడేసే వస్తువుకాదు. అతను ఇంట్రెస్టు తీసుకోవాలి. అతనికి ఆసక్తి లేదు. డబ్బు పి.ఎఫ్ లోనూ ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ దాస్తున్నారు. షేర్లలోనూ మ్యూచువల్ ఫండ్లలోనూ కూడా పెడుతున్నాడు. తెలివిగానే మదుపు

చేస్తున్నాడు. ఎప్పుడో కలిసొచ్చినప్పుడు కట్టిన ఇంటినే కొనాలని అతని ఆలోచన. అది వాళ్ళకి

తెలుసు. ఐనా తనే చిన్న ఖర్చు చేసినా ఆక్షేపణ.

ప్రతి నిముషం ముళ్ళమీదున్నట్టే ఉంటుంది వాళ్ళ మధ్య. వాళ్ళలాగే తనూ నిర్మొహమాటంగా ఉండటం నేర్చుకుని మనసులో వున్నవన్నీ అనేస్తే? అలా అనలేకపోటం బలహీనత కాదు, సంస్కారం. 

అక్కడికీ అక్కతో చెప్పి బాధపడింది.

"అమ్మావాళ్ళూ చూసినట్టు ఆడపిల్లని అత్తవారింట్లో చూడరే సుజీ! అలాగని నన్ను వాళ్లు ఇలా అన్నారు, అలా అన్నారని స్కూలు పిల్లల్లా పితూరీలు చెప్పలేం కదా? మరో విషయం. మనింట్లో వుండేలాంటి వాతావరణం అత్తారింట్లో ఎందుకుంటుంది? వాళ్ల తీరూ పద్ధతీ వేరేగా వుంటుంది. మనమే మనకి అనువుగా మార్చుకోవాలి. నువ్వూ కొంచెం మారాలి. మరీ మెతగ్గా, నోట్లో నాలుక లేనట్టు వుండక. నీకు నచ్చనివి నెమ్మదిగా అతనికి నచ్చజెప్పు. వినలేదనుకో, కొంచెం నోరు చేసుకో. మనకి వున్నట్టు వాళ్లకీ బలహీనతలు వుంటాయికదా? అమాయకురాలా , ఇవన్నీ ఎవరూ విడమరిచి చెప్పరే! " అంది.

పెళ్ళి చేసుకునేది అప్పటిదాకా ఉన్న సంతోషాన్ని పెంచుకుని మరింత ఆహ్లాదంగా జీవితంలోని మధురిమని ఒంటరిగా కాకుండా జంటగా పంచుకుని

అనుభవించడానికిగానీ మాటల్తో నొప్పించుకుని కత్తి అంచుమీద నడుస్తున్నట్టు ప్రతిక్షణం

అప్రమత్తంగా ఉండటానికి కాదు. ఎందుకీ జీవితాలిలా సాగుతున్నాయి? ఎలా చెప్పాలతనికి, మల్లెపూలు విచ్చుకున్నంత సౌహారంగా, పారిజాతాలు రాలిపడ్డంత అందంగా, సెలయేరు పారినంత గలగలా కాకపోయినా కనీసం బస్సులోనో, రైల్లోనో తారసపడే తోటి ప్రయాణికుడిపట్ల చూపించినంత కర్టసీయేనా కట్టుకున్న భార్యపట్ల చూపించాలని? 

"వావ్! సృజనా! ఈ సిమెంట్ కలర్ శారీ నీకు బలే సూటైంది.... ఇంతందంగా

చీర కట్టుకోవటం ఎక్కడ నేర్చుకున్నావే? స్టార్ట్ చేసిన కాటన్ చీర, బిగుతుగా వేసుకునే పొడవైన జడ... ఈ రెండూ చూసే మీ సునీల్ ఫ్లాటైపోయాడా?" అని వేళాకోళం చేస్తారు స్నేహితులు

"ఆ క్రీమే

దో తీసుకొచ్చాను. మొహానికి రోజూ రాసుకోకూడదూ? కాస్త

తెల్లబడతావేమో! నీతో బైటికి వెళ్తే నా పక్కని పనిమనిషిలా వున్నావు" అంటుంది ఆడపడుచు.

"ఓహ్! సృజనా! టైపులో మీ స్పీడెంత? నిముషానికి వందా? రెండు వందలా?

స్ప్రింగ్ యాక్షనుందా మీ వేళ్ళలో? జీయంగారు మీ గురించి తెలిసి చంపేస్తున్నారు, తన బ్రాంచికి ట్రాన్స్ఫర్ చెయ్యమని" ఆఫీసులో తన బాస్ మెచ్చుకోలు.

“బ్యూటీ పార్లర్ కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకోవచ్చు కదా, వదినా నువ్వు?" ఆడపడుచు ఎత్తిపొడుపు.

తను రెండుగా చీలిపోవాలా? అక్కడ తనంటే అందరికీ ఇష్టం. నువ్వందంగా ఉండవనరు. సహోద్యోగులకి తన హెల్పింగ్ నేచర్ నచ్చుతుంది. ఆఫీసర్స్ కి తన పని నచ్చుతుంది. తనని పియ్యగా తీసుకోవడంకోసం ఎండీలు పోటీ పడతారు. ఇంట్లోవాళ్ళకి మాత్రం తనలో ఉన్నవేవీ కనిపించవు. లేని ఆ

ఒక్కటీ కనిపిస్తుంది.

"నువ్వు అందంగా ఉండవు. నల్లగా ఉంటావు" ఎదురుగా వున్న ప్రతి క్షణం అదే గొడవ. ఏవేవో చేసేసి తెల్లబడిపోవాలని కోరుకుంటాడు. పట్టనట్లు తనుండటం అతనికి నచ్చదు. నల్లగా వుందని కుంగిపోవాలి. అతని పక్కని తను తీసికట్టని న్యూనతపడాలి. అతనిదెంతో వుదారహృదయమని ప్రశంసించాలి. అవేవీ తను చెయ్యదు. నల్లగా వున్నందుకు నో రిగ్రెట్స్. 

అసలేమిటి, అందమంటే? దానికి నిర్వచనం ఎవరు చెప్తారు? తెల్లటి రంగొకటేనా, అందానికి నిర్వచనం? అందం ఒకటేనా, మనిషికి క్వాలిఫికేషన్? సృజన కళ్ళలో నీళ్ళు.

ఆనందం నుంచి నిర్లిప్తతకి, నిర్లిప్తత నుంచీ దుఃఖానికి, అక్కడినుంచీ ఇంకెక్కడికి వెళ్లబోతోంది?

"అంతా మనల్నే చూసి నవ్వుకుంటున్నారు" అతను బాహాటంగా అంటే -

"మనల్ని చూసి నవ్వుకునేంత తీరిక ఎవరికీ లేదు. అది నీలోని కాంప్లెక్స్" అని ఘోషిస్తుంది అంతరంగం.

"డబ్బు చూసి ఏపనీ చెయ్యకూడదు. ఛ..ఛ.... పెళ్ళి విషయంలో తొందరపడ్డాను"

"పోనీ, ఇప్పుడు సరిదిద్దుకుందామా, ఇద్దరం హాయిగా బతకొచ్చు" అనేస్తే?

సృజనకి ఏడుపొస్తోంది. అతను అనే మాటలకి తిరగబడి ఎన్నో అనాలనుకుటుంది. ఆ ఉక్రోషం తప్ప ఒక్క మాట కూడా పెదవిదాటి రాదు. ఆలోచనల్లో డీసెన్సీ తొలగిపోయింది.

మాటల్లోంచి కూడా అది తప్పుకుని అతన్నించీ రక్షణ ఇవ్వటానికింకా ఎంతకాలం పడుతుంది? 

అతన్ని అసంతృప్తికీ తననింత క్షోభకీ గురి చేస్తున్న అందం.... ఏమిటీ అందం?

ఎస్ యూనివర్స లూ, మిస్ వరల్డ్ లూ అందంగా ఉన్నారని ఎంతమంది ఒప్పుకుంటారు? కంటికి ఇంపుగా కనిపించేది కాక, కొన్ని కొలతల మూసల్లో చెక్కబడి వచ్చేది అందమా?

ఆడతనమే స్త్రీకి అందమనేది బామ్మ. ఆవిడ ప్రభావం తనమీద బాగానే ఉంది.

హూందాతనం, వ్యక్తిత్వం ఈ రెండే స్త్రీకైనా, పురుషుడికైనా అందాన్నిచ్చేది

అంటుంది తల్లి. అలాగే తనని మలచింది. దేవుడివ్వని శారీరక సౌందర్యంకన్నా, తనకి తాను సంపాదించుకున్న క్వాలిఫికేషన్సే అందమని తననుకుంటుంది.

ఇన్ని రకాల అందాలు ఉన్నా తనతనికి అందంగా కనిపించకపోవటమేమిటి?

లేనప్పుడు దానికి లేని ప్రాధాన్యత ఇప్పుడెందుకు?

***

ఉదయం వంట్లో బాగా లేదని అతన్తో అంటే ఏదో ఎద్దేవా చేసాడు. మళ్ళీ సాయంత్రం గుర్తు పెట్టుకుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాడు.

 "కంగ్రాట్స్ మూడో వెల" ప్రెగ్నెన్సీ నిర్ధారిస్తూ అంది డాక్టరు.

సునీల్ ముఖంలో విభ్రాంతి..... సంతోషం. అక్కడికక్కడే సృజనని రెండు చేతుల్తోఎత్తి గిర్రుమని తిప్పెయ్యాలన్న కోరికని బలవంతంగా దాచుకున్నాడు. ఎంత ఎదురుచూపు, ఈ క్షణం కోసం? ఇంటికొచ్చాక చూస్తే సృజనలో అలాంటి సంతోషం కనిపించలేదు.

"అమ్మా! నువ్వు చెప్పు. నీకు మనవడు కావాలా? మనవరాలా?" తల్లిని అడిగాడు

“ఎవరైతేనేం? నీ పోలికొస్తే చాలు" అనేసిందావిడ చాలా మామూలుగా. సృజన దిగ్గున కళ్ళెత్తి సూటిగా చూసింది. 

“ఏమిటంత ఆలోచన?" బెడ్రూమ్ లోకి వచ్చాక అడిగాడు.

అప్పటికీ ఆమెలో ఆలోచనే. అడగడానికి సందిగ్ధత.

“ఏయ్! ఏమైంది?...." అతన్లో ఎప్పుడూ లేనంత ఆర్ద్రత. అతన్లో మార్పొచ్చిందా?

ఇంత సడెన్‌గా? ..... హు.... అలా అనిపించలేదు ఆమెకి.

“పిల్లలెందుకు మనకి? బాబో.... పాపో.... మీలా కాకుండా నా పోలికలో పుడితే మీరు సరిగ్గా చూస్తారా? అంతేకాదు. ఇద్దరు పిల్లల్ని మనం కనబోయేటప్పుడు ఒకరికి మీ

పోలికలూ మరొకరికి నా పోలికలూ వస్తే? నాలాగా మరో ప్రాణి ఇంట్లో క్షోభపడటం దేనికి?" మాటలు పేర్చుకుంటూ అడిగింది.

“సృజనా!” తెల్లబోయాడు.

 “నువ్వు బావుండవు. నీ జీతం, కట్నం వీటి కోసమే చేసుకున్నాం. ఇలాంటి మాటలు నన్నెంతో బాధ పెడ్తాయని మీరెప్పుడేనా ఆలోచించారా? నన్నే చేసుకొమ్మని మిమ్మల్ని బలవంత

పెట్టలేదు. ప్రేమించుకునీ తొందరపడి చేసుకోలేదు. ఒకరినొకరు చూసుకుని, ఆలోచించుకుని, ఇష్టపడి చేసుకున్నాం. నన్ను చేసుకోవటం చేసుకోకపోవటం రెండూ మీ చేతుల్లోనే ఉన్నా నన్ను కోరుకుని చేసుకున్నాక మీలో అసంతృప్తి. ఎలాంటి పిల్లలు కావాలో కోరుకోగలిగే టెక్నాలజీ మనకింకా రాలేదు. నల్లటి బాబో పాపో పుడితే? అందుకే నేను ఎబార్షన్

చేయించుకుంటాను. సైన్సు, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనకి కావాల్సినట్టు

పిల్లల్ని కనే రోజు త్వరలోనే వస్తుందనుకుంటాను. అప్పటిదాకా ఆగుదాం. అలా కాకపోతే

మనం విడిపోదాం. పుట్టే పాప ఎలాంటిదైనా నాకే ఆక్షేపణా లేదు. నాకు జీవితమంటే అందం ఒక్కటే కాదు. ఫేస్ క్రీమ్ లు రాసుకుంటూ పార్లర్ల చుట్టూ తిరగడం కాదు. నేను నా పాపాయిని

గ్లామర్ డాల్ లా కాకుండా వ్యక్తిత్వంగలదానిగా తీర్చిదిద్దుకోగలను, మీరు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఉంటే. ఆలోచించుకోండి. మీ ఇష్టం” అంది. అలా అడగటంలో

ఆమెకి గుండెల్ని మెలిపెట్టేసేంత బాధ కలిగినా అతని నిర్ణయం ముఖ్యం. అతని ఆంతర్యం తెలుసుకోవటం ముఖ్యం.

అతనికి అర్థమైంది, తను కేవలం డబ్బుమనిషి మాత్రమే కాదు, పిల్లలకోసం ఆమెనో, ఆమె చెప్పిన కారణాలకోసం పిల్లలు వద్దనుకునేంత మూర్ఖుడు కాడని .ఆమెకి

తెలియజెప్పాల్సిన అవసరం ఉందని. కానీ నిర్మాహమాటమనేది ఒక అతని చుట్టూ కంచుకోట కట్టేసింది.

"చూడు అందం దేవుడిచ్చేది, మన చేతుల్లో లేనిదని అంటునే దానికోసం

ఎందుకింత బాధపడ్తున్నావు? నువ్వు నాకు నచ్చలేదని కాదు, ఆ కొద్దిపాటి లోపం కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండేదని.... నాకన్నీ ఫ్రాంక్ గా చెప్పడం అలవాటు. అంత

మాత్రంచేత ఇలా ఎలా అనుకోగలిగావు?.... ఐనా కుంకుమపువ్వు తింటే పిల్లలు

రంగుగానే పుడతారట" అన్నాడు.

ఆమె సుదీర్ఘంగా విశ్వసించింది. అతని ఆంతర్యం తెలిసినందుకు సంతోషము

కలగలేదు. బాధా కలగలేదు. అతనికి తనూ కావాలి, తన ద్వారా పుట్టిన పిల్లలూ కావాలి. కానీ ఈ అసంతృప్తి మాత్రం వదలదు. అదొక ముల్లు, దాన్ని తను విరచలేదు. దాన్నుంచి

రక్షణ కావాలంటే తనే ఒక ముళ్ళ కవచాన్ని రక్షణగా ధరించాలనేది అర్థమైంది. ఆమెలో ఒక నిర్దుష్టమైన మార్పు. ఇంకా ఏ మూలో కొన ప్రాణంతో కొట్టుకుంటున్న డీసెన్సీ అనేది

పూర్తిగా చచ్చిపోయింది.

“ఔనూ, మీరు డబ్బుకోసమే నన్ను చేసుకున్నానని అంటుంటారుకదా, ఇంకా డబ్బున్న కురూపి నా కన్నా ముందే తటస్తించి ఉంటే ఆమెనే చేసుకుని ఉండేవారా? అంతేలేండి.

డబ్బు మనుషులకి అంతకంటే ఆలోచనేం ఉంటుంది?”

చాలా సేపటి తర్వాత ఆమె గొంతు వినిపించింది. అతనికి కమ్చీ దెబ్బ తగిలినట్టైంది. ఆమె గొంతు వికృతంగా వినిపించింది. అచ్చం ఆమెకి అతని గొంతు వినిపించినట్టే. అతని

మీద తిరుగుదాడి చెయ్యటానికి ఆమె దగ్గర ఇప్పుడు అనేక అస్త్రాలున్నాయి. ఇంకా కూడా తను నిర్మొహమాటంగా ఉండాలా వద్దా అనేది పూర్తిగా అతనిష్టం.


 

   

   

   



Rate this content
Log in

Similar telugu story from Drama