Saamaanyudu

Drama

5.0  

Saamaanyudu

Drama

అభినందన-1

అభినందన-1

10 mins
683


అభినందన-1 


చెంప చెల్లు మనది. సుకుమారమైన నా ఎడమ చెంప పైన ఐదు వేళ్ళూ అచ్చు పడ్డాయి. కొట్టింది ఎవరో కాదు మా అమ్మే. 


'మా కడుపున చెడపుట్టావు కదరా. నిన్ను కాదు... ఇలాంటి కొడుకును కన్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి.' అంటూ అమ్మ ఏడుస్తోంది.


'రేయ్ ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకు. జీవితంలో మళ్లీ మాకు మొఖం చూపించకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో.' ఆవేశంగా అరిచాడు నాన్న. 


వాళ్ళ మాటలను మౌనంగా భరించాను. 


పెళ్లి మండపంలో అందరూ నన్ను చూసి చీదరించుకున్నారు.

'పద పదండి. ఇక్కడి నిలబడితే ఇలాంటి వాళ్లను చూసి మన పిల్లలు కూడా మారతారు.' అంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోతున్నారు. 


'అమ్మో పెళ్లికి ముందే క్యారెక్టర్ తెలిసింది. లేదంటే మా పిల్ల జీవితం నాశనం అయ్యేది.' అన్నది పెళ్లి కూతురు తల్లి.

అప్పటివరకు అతడిపై ఆమెకు ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది.


'చీ నీలాంటి వాడు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.' అన్నది చెల్లి. (విక్రాంత్‌సేన్‌ కూతురు)


అన్నయ్య కాలర్ పట్టుకొని బయటికి లాగేసాడు.


'వీడు ఇలాంటి వాడిని మాకు ముందే తెలియదుగా.. ఇంత కామాంధుడా?. అంటూ చుట్టుపక్కల వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్లను చూసి నవ్వుకున్నాను. బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోయాయి.. వాళ్లను చూసి నేను నవ్వుకున్నాను. బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోయాయి. ఊర్లో ఉన్న వాళ్ళు కాకుండా ఊరికి దూరంగా ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్. వాడే చక్రధర్. ముద్దుగా వాడిన అందరూ చక్రి అని పిలుస్తారు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఊర్లో ఎవరు సహాయం చేయరు. నాకు సాయమంటూ చేస్తే చక్రి మాత్రమే చేయగలరు. వాడు ఉండేది హైదరాబాదులో... వాడికే కాల్ చేద్దామని మొబైల్ తీశాను. 


కాలం కలిసి రానప్పుడు ప్రతిదీ మనల్ని దెబ్బ కొడుతుంది. ఇప్పుడు నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపొయింది. నాన్న పట్టుకొని లాగడం వల్ల నా షర్ట్ కాలర్ చినిగిపోయింది. అమ్మ కొట్టడం వల్ల నా బుగ్గ వాచిపోయింది. ఎడమ చెంప దవడ భాగం అంతా మండుతున్నది. అలా నడుస్తూ మా కాలనీ చివరలోని జండా దిమ్మ వద్దకు వచ్చి కూర్చున్నాను. చిరిగిన కాలర్ సరి చేసుకున్నాను. అమ్మ కొట్టిన చెంపను తడుముతుకుని చూసుకున్నా. 


'హేయ్ సేన్... ఇక్కడున్నావ్ ఏంటి?' ఆ పిలుపు విని తల ఎత్తి చూసాను. ఎదురుగా ఫణి నిల్చొని ఉన్నాడు. చేతిలో బ్యాగ్ ఉంది. అంటే వీడు నా పెళ్లి కి వచ్చాడు... చూసి నవ్వుకున్నాను. 

'ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావ్' అడిగాడు ఫణి.


'పెళ్లి ఆగిపోయింది' అంటూ నవ్వాను. 

'రేయ్ నువ్వు మారవా... పెళ్లి ఆగిపోయింది అంటే నవ్వడం ఏంట్రా' వాడు ఒకింత అసహనంతో అడిగాడనుకుంటా. 


'మామా ఇప్పుడు నువ్వు ప్రశ్నలు వేయకు. నేను చెప్పే మూడ్‌లోనూ లేను. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. పదా' అన్నాను. 


అన్నట్టు ఫణి మా పక్క ఊర్లో ఉంటాడు. వీడు పెళ్లితో పాటు రిసెప్షన్ కూడా ఎంజాయ్ చేసి వెళ్లాలని బ్యాగులో బట్టలు సర్దుకుని మరీ వచ్చాడు. 


ఇద్దరం అలా నడుచుకుంటూ బస్టాండ్‌కు చేరుకున్నాం. వాడి బ్యాక్ పాకెట్లో పర్స్ లాగి డబ్బులు తీసుకున్నాను. 

'రేయ్ మొత్తం తీసుకోకురా' అన్నాడు వాడు. 

మొత్తం లెక్కపెట్టను. 1500 ఉన్నాయి. వాడి చేతిలో నూరు రూపాయలు పెట్టి... 'హైదరాబాద్ వెళ్తున్నారా బై' అంటూ కదులుతున్న హైదరాబాద్ బస్సు ఎక్కేశాను. వాడు అలా నోరెళ్ళబెట్టి అనే చిత్రంగా చూస్తున్నాడు. 


@@@@@@@@@@@@@@@@@@@@@


ఖాళీ ఉన్న వెనక సీట్లో కూర్చున్నాను. పీటల మీద పెళ్లి ఆగిపోతే చాలావరకు అబ్బాయి కుటుంబం లేదంటే... అమ్మాయి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. అబ్బాయి లేదా అమ్మాయి అయితే ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఎందుకంటే ఆ బాధని అందరికన్నా ముందు నేను అనుభవించాను. నాలో నేను ఆ బాధను అనుచుకున్నాను. అందరి ముందు నవ్వుతున్నాను. కొట్టినా సిగ్గు పడలేదు, బాధపడలేదు.


టికెట్ తీసుకున్నాక సీట్లో వెనక్కు వాలాను. కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయాను.


'బాబు లే లే' కండక్టర్ నన్ను తట్టి లేపుతున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. 

'ఏంటి?' అన్నట్టు కండక్టర్ వైపు చూశాను.

'ఎంజీబీఎస్ వచ్చేసింది. ఇదే లాస్ట్ స్టాప్' అన్నాడు. 

బస్సు దిగాను. 

ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చాను. సీబీఎస్‌లోని పటాన్‌చెరు 218 బస్సు ఎక్కి కూర్చున్నాను. 

అప్పుడు టైం 4.45. కూకట్‌పల్లి టికెట్ తీసుకున్నాను. నేరుగా ఫ్రెండ్ రూంకు వచ్చాను. వాడు ఇంకా పడుకున్నట్టున్నాడు. డోర్ దబదబా బాబాను. 

'ఎవడ్రా ఇంత పొద్దునే' అనుకుంటూ చిరాకుగా వచ్చి డోర్ తీశాడు. 

వాడు తన చేతిని తనే గిల్లుకున్నాడు. 

'మామా.. . ఈ రోజు నీ పెళ్లి కదా. ఇలా వచ్చేశావేంటి? అని ప్రశ్నించాడు. 

'ఆగిపోయింది' అన్నాను. 

వాడి నిద్ర మత్తు దెబ్బకు ఎగిరిపోయింది. 

'ఏంట్రా నువ్వనేది? ఎందుకు ఆగిపోయింది. అసలు ఏమైంది.? ' అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపించాడు. 

'రేయ్ మామా తరువాత మాట్లాడుకుందాం.' అంటూ వాడి బెడ్‌రూంలోకి వెళ్లబోయాను. 

'మామా ఆ రూంలో రాధిక పడుకుంది. ఇక్కడే హాల్‌లోనే పడుకో' అంటూ వాడు వేసుకున్న బెడ్‌షీట్ చూపించాడు. 


అన్నట్టు రాధిక వాడి చెల్లి. ప్రయాణంలో నిద్ర సరిగా లేకపోవడం వలన మత్తు ముంచుకొస్తుండడంతో నేను వెంటనే పడుకున్నా. 


'రేయ్ గాడిదా లే' అంటూ ఆడగొంతు వినిపించింది. పక్కలో పొడిచినట్టయింది. నాకు మెలకువ వచ్చింది. దుప్పటి ముసుగు తీసి చూశాను. కాలితో పొడిచిందని అర్థమయింది. నా మొహం చూసి వెంటనే కంగారుగా తన రూంలోకి పరిగెత్తింది. 


నిద్ర ఎగిరిపోయింది. 'రేయ్ చక్రీ' అని అరిచాను. ఎలాంటి స్పందన లేకపోవడంతో మొబైల్ తీసుకొని వాడికి కాల్ చేశాను. 'రేయ్ ఎక్కడ చచ్చావ్ రా' అన్నాను వాడు కాల్ లిఫ్ట్ చేయగానే.


'ఎందుకు అరుస్తున్నావు రా కాకి లాగా.. పక్కనే ఉన్నా.. వస్తున్నా ఉండు' అంటూ వాడు కాల్ కట్ చేశాడు. ఐదు నిమిషాల తర్వాత ఇంట్లోకి వస్తూ కనిపించాడు. 

'రేయ్ మీ చెల్లి రోజూ పొద్దున్నే ఇంత మర్యాద పూర్వకంగా నిద్రలేపుతుందా' అన్నాను కాస్త చిరాకుగా.

'రేయ్ తన్ని లేపింది కదూ.' అన్నాడు చక్రి అనుమానంగా చూస్తూ...


కాలితో తన్నిందని చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. 'ఆహా చీపురుతో నిద్రలేపిందిలే.' అన్నాను. 

'రేయ్ అది మరీ అంత మర్యాదస్తురాలు కాదురా.. నిజం చెప్పు' అన్నాడు చక్రి.

'రేయ్ నిజంరా చీపురుతో కొట్టింది' అన్నాడు.

'సారీ రా మామా' అన్నాడు చక్రి. 

'హేయ్ ఈ చిన్న విషయానికి సారీ ఎందుకు రా' అన్నాను.


'రాధిక అల్లరి పిల్ల. ఎప్పుడూ చలాకీగా, హుషారుగా ఉండేది. అది వద్దు వద్దు అంటున్నా వినకుండా మా ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. తీరా పెళ్లి పీటల మీద వచ్చే సరికి ఆగిపోయింది. దాంతో కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయింది. ఊర్లో ఉంటే అవే ఆలోచనలతో ఇబ్బంది పడుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విషయం తర్వాత చెబుతా. నీ వేంట్రా నిన్న పెళ్లి పెట్టుకుని ఇలా వచ్చావు. అడిగాడు చక్రి అయోమయంగా.


ఒక నవ్వు నవ్వి... 'ఆగిపోయింది రా' అన్నాను.

'పెళ్లి ఆగిపోవడం ఏంట్రా. అందులో నువ్వు ఇష్టపడిన ఒప్పుకున్న పెళ్లి కదా. పొద్దున్నే వచ్చి షాక్ ఇస్తున్నావ్ ఏంట్రా? అసలు ఏం జరిగింది? అంటూ కంగారుగా అడిగాడు చక్రి.


'నేను చెబుతున్నది నిజం రా. పెళ్లి పెట్టుకుని ఎవడైనా నీ దగ్గరకు వస్తాడా? ఆమె అంటే నాకు ఇష్టమే కానీ ఆమెకు నేను ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. అదే విషయం ఆమె నాతో చెప్పింది. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే... చావనైనా చస్తాను. నీతో మాత్రం కాపురం చేయను అన్నది. అంతేకాదు తనకు ఇప్పుడు రెండో నెల అంట. ఈ విషయం ఇంట్లో చెప్పి ఆ అమ్మాయిని బ్లేమ్ చేయలేను. కానీ పెళ్లి ఆపాల్సిందే. అందుకే ఆగిపోయింది.' అని ముగించాను.


అప్పుడే రాధికా అక్కడికి వచ్చింది.


'బాబోయ్ ఇక్కడే ఉన్నాడేంటి?' అనుకుంటూ ‌ చక్రి తెచ్చిన పాల ప్యాకెట్‌ను తీసుకుంది రాధిక.

తలవంచుకొని తెచ్చిన పాల ప్యాకెట్ల తీసుకొని కిచెన్ లోకి పరిగెత్తింది.


'రేయ్ మీ చెల్లి సిగ్గు పడుతుంది రా కాకపోతే అబ్బాయిలా' అన్నాను నవ్వుతూ. 

'రేయ్ ఫ్రెషప్ అయి రా పో కాఫీ తాగుదాం' అన్నాడు చక్రి. 


నేను బ్రష్ చేసి వచ్చేసరికి కప్పులో కాఫీ పొగలు కక్కుతోంది. నేను చక్రి పక్కన కూర్చున్నాను. ఒక కప్పు అందుకున్నాను. మాకు ఎదురుగా వచ్చి రాధిక కూర్చున్నది. 


'బుజ్జి వీడు నా ఫ్రెండ్ సేన్. ఇక్కడ వీడు రెండు రోజులు ఉంటాడు' అని చెప్పాడు. 


'రేయ్ రెండు రోజుల తర్వాత ఎక్కడికి వెళ్లాలి రా?. ఇక్కడ నాకు ఎవరూ తెలీదు. నేను ఎక్కడికీ వెళ్ళను. నీ ఇష్టం.' అన్నాను.


చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అయ్యాడు. 

'నాకైతే వంట చేయడం రాదు. ఇంట్లో ఎవరు వండినా నాకేమీ అభ్యంతరం లేదు' అన్నది రాధిక.

'మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్‌రా ఇక్కడ ఉండి' అడిగాడు చక్రి. 

'ఏదైనా జాబ్ చేద్దామనుకుంటున్నా. ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పు వెళ్లిపోతా' అన్నాను కోపంగా.

'బుజ్జి నువ్వు లోపలికి వెళ్ళు' అన్నాడు. 

రాధిక తన రూంలోకి వెళ్లిపోయింది. 


'అంటే ఇక ఇంటికి వెళ్ళకూడదనుకున్నావా?'అంటూ నన్ను చూశాడు చక్రి. 

నేను ఏమీ మాట్లాడకుండా పైకి లేచాను. 'సరేరా వెళ్తున్నా' అని బయటకు వచ్చాను. చక్రి వేగంగా వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. 

'రేయ్ నేను చెప్పేది వినురా ముందు' అన్నాడు చక్రి. 

'సరే మామా నీ పరిస్థితి నాకు అర్థమైంది. వదిలేయ్ ఈ విషయాన్ని ఇక్కడితో. ఎప్పుడు రాను.' అన్నాను. 


'రేయ్ అలా మాట్లాడకు రా. మా చెల్లి ఒక్కోసారి తను ఏం చేస్తుందో అర్థం కాకుండా చేస్తుంది. చెప్పాను కదా రా మెంటల్‌గా డిస్టర్బ్ అయిందని. ఏదైనా జరిగింది అనుకో నీవు నేను ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. అందుకే అలా అన్నాను. సారీ మామా. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఉండొచ్చు.' అన్నాడు. 


'సరే ఈ విషయం వదిలి అన్నాను కదా ఓకే బై' అంటూ ముందుకు కదిలాను. 

'రేయ్ నా మాట విను రా' అంటున్నా పట్టించుకోకుండా వేగంగా వచ్చేసాను. 


ఈ హైదరాబాద్ మహానగరంలో నాకు ఎవరూ తెలీదు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్ వీడొక్కడే. చేతిలో డబ్బులు వేయి రూపాయలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. నా కాళ్ళు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. మనసు స్థిరంగా లేదు. ఇప్పుడు ఎటు వెళ్లాలి. ఏంటి ఉన్నట్టుండి నా జీవితం ఇలా మారిపోయింది. అలా నడుస్తూనే ఉన్నాను. 


ఉన్నట్టుండి ఒక చిన్న పాప ఏడుస్తూ వచ్చిన కాళ్లు పట్టుకున్నది. 'అంకుల్ వాళ్ళు కొడుతున్నారు' అంటూ అటుగా వస్తున్న ఇద్దరు యువకులను చూపించింది. ఆ చిన్నారిని ఎత్తుకొని 'ఏమైంది చిట్టీ' అని అడిగాను. పాప ఏడుస్తూనే ఉంది. ఆ యువకులను చూసి నా గొంతు చుట్టూ చేతులు వేసి బిగుసుకుపోయింది. 


ఇద్దరిలో ఒకడు నా దగ్గరకు వస్తూ... 'ఆ పాపను ఇచ్చేసి నీ దారిన నీవు వెళ్ళు. లేదంటే అనవసరంగా కష్టాల్లో ఇరుక్కుంటావు. మర్యాదగా ఇచ్చి ఇక్కడినుంచి తప్పుకో' అంటూ అరిచాడు. 


చుట్టూ చూశాను. దాదాపు అది నిర్మానుష్య ప్రదేశం. అక్కడ జనాలు కూడా ఎవరు తిరగడం లేదు. 

ఇంకో యువకుడు కూడా నా దగ్గరికొస్తూ... 'ఎవడ్రా నువ్వు. ఆ పాపను మాకు ఇచ్చేసి మర్యాదగా నీ దారిన నీవు వెళ్ళిపో' అన్నాడు కోపంగా. 


'ముందు మీరు ఎవరో చెప్పండి. ఈ పాప ఎందుకు ఏడుస్తుంది? మీ పాప అయితే మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతుంది.? అన్నాను.

'అది నీకు అనవసరం. ఈ విషయం నీకు సంబంధించినది కాదు మర్యాదగా ఆ పాపను మాకు ఇచ్చేసేయ్.' అన్నాడు ఒకడు. 

'కొంచెం ఆగు స్నేహితుడా ఈ పాపతో మాట్లాడనీయ్ నన్ను. ఆ పాప చెప్పిన దాన్ని బట్టి ఇవ్వాలా వద్దా అని నేను నిర్ణయించుకుంటాను.' అన్నాను. 'చిట్టీ.. ఏడవకమ్మా. నేను ఉన్నా కదా. నన్ను చూడు.' అంటూ చిన్నారి కళ్ల నుంచి వస్తున్న నీటిని తుడిచాను.


'నీ పేరేంటి చిట్టీ?' 

ఏడుస్తూనే 'వెన్నెల' అన్నది. 

వీళ్ళు నీకు తెలుసా వెన్నెలా?

'తెలీదు అంకుల్ ఐస్ క్రీమ్ ఇస్తామని ఇక్కడికి తీసుకు వచ్చారు'

నేను అటు తిరిగి 'ఇక మీ పని అయిపోయింది. మీరు దయచేయొచ్చు' అన్నాను. 

'నీతో మాటలు ఏంటిరా' అంటూ ఒకడు నా మీదికి వచ్చాడు. ఇంకొకడు పాపను పట్టుకునేందుకు వచ్చాడు. నేను వెంటనే లాగిపెట్టి నా మీదికి వచ్చిన వాడి ముఖంపై పిడికిలి బిగించి ఒక పంచ్ ఇచ్చాను. 


నేను అలా రియాక్ట్ అవుతానని వారు ఊహించలేదు ఏమో. బ్యాలెన్స్ తప్పి వెనక్కి తూలి పడిపోయాడు. పాపని పట్టుకోబోతున్న ఇంకొకడిని వెనుకనుంచి పట్టుకొని పక్కకు లాగేసాను విసురుగా. ఇప్పుడు ఇద్దరూ కింద పడి ఉన్నారు. వాళ్లు లేచే లోగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వెంటనే పాపని ఎత్తుకొని.. పి.టి.ఉషను తలచుకున్నాను. అక్కడినుంచి బయటపడాలని పరుగు పెట్టాను.


ఆ నిర్మానుష్య ప్రదేశం నుంచి మెయిన్ రోడ్డు కొచ్చాను. పాపలో ఎలాంటి చలనం లేకపోయేసరికి... దగ్గరలో హోటల్ కనిపించేసరికి అక్కడికి వెళ్లాను. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని... వెన్నెల ముఖంపై చల్లగాను. ప్యాకెట్‌లోని ఖర్చీఫ్ తీసి ముఖాన్ని తుడిచాను. 

పాప కళ్ళు తెరిచి నన్ను చూసి గట్టిగా పట్టుకున్నది. 


'నీళ్లు తాగు వెన్నెలా' అంటూ గ్లాస్‌ను నోటికి అందించాను. 

'అంకుల్ ఆకలేస్తోంది'. అన్నది వెన్నెల. పసి పిల్ల ముఖాన్ని చూసేసరికి నాకు బాధగా అనిపించింది. బాగా ఏడ్చినట్టుంది. ముఖంలో కళ పోయింది. ఆకలవుతుందని పాప అడిగేటప్పటికి గాని నాకు గుర్తు రాలేదు . టైం పదకొండు అవుతుంది. 


'నీకు ఏం కావాలి వెన్నెలా'?

'అంకుల్ నాకు పూరి' అన్నది కొంచెం ఉత్సాహంగా. 

ప్లేట్ పూరి, ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను.


'మీ ఇల్లు ఎక్కడ వెన్నెలా?'

'జూబ్లీహిల్స్‌లో అంకుల్'

'అక్కడికి వెళ్తే మీ ఇంటికి వెళ్లొచ్చా' 

'ఆ వెళ్లొచ్చు అంకుల్' అంటూ తల ఊపింది‌.

హోటల్ బాయ్ ఇడ్లీ, పూరి తెచ్చి పెట్టాడు. 

వెన్నెల ముందు పూరి ప్లేట్ పెట్టాను.

'తిను చిట్టీ' అంటూ ఇడ్లీ తినడం మొదలు పెట్టాను. 


'తినకుండా నన్ను చూస్తావేంటి వెన్నెలా తిను' 

'నాకు తినడం రాదు రోజు అమ్మనే తినిపిస్తుంది'

'ఓహ్ ఇదొకటి ఉందా' అనుకుంటూ పూరి ప్లేట్లు దగ్గరకు తీసుకున్నాను. పాపకు తినిపిస్తూ నేను తినేశాను. అమ్మయ్య ఒక పని అయిపోయింది. ఆకలి తీరింది. పాప కూడా తిన్నాక రిలీఫ్ కనిపించింది.


'వెన్నెల మీ ఇంటికి వెళదామా'

వెళ్దాం అంకుల్ అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది' 

'ఎలా వెళ్దాం వెన్నెల ఆటలోనా.. బస్సులోనా'

'నాకు తెలీదు నేను ఎప్పుడూ కార్లోనే వెళ్తాను' 

'సరే నేను తీసుకెళ్తా మీ ఇంటికి ఓకేనా'

'ఓకే అంకుల్'

@@@@@@@@@@@@@@@@


'వందనా కొంచెం తినమ్మా. నిన్నటి నుంచి ముద్ద కూడా ముట్టుకోలేదు' అంది సుగుణ.


'నాకొద్దు అత్తయ్య. ఆకలిగా లేదు.' అన్నది వందనా. 

'పాప ఇంటికి వస్తుంది లేమ్మా కొంచెం తిను నా మాట విను వందనా' అంది. 

అయినా ఆమె తినడానికి నిరాకరించింది. బిడ్డ తినలేదనని తల్లి మనసు తల్లడిల్లింది. ఇంటి ముందు గార్డెన్‌లో ఆడుకుంటున్న కూతురు కన్పించకపోవడంతో.. ఏడుస్తూ చుట్టుపక్కలంతా వెతికింది... నిన్నటి నుంచి ఎడ్వడంతో ఆమె కళ్ళలో నీళ్ళు రావడం లేదు. కానీ మనసు మాత్రం రోదిస్తోంది. 

నిన్నటి నుంచి తన బిడ్డ కనిపించకపోవడంతో గుండె పగిలేలా ఏడ్చింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో భర్త చంద్రకాంత్‌కు కాల్ చేసి విషయం చెప్పింది. ఢిల్లీలో బిజినెస్ మీటింగ్‌లో ఉన్న చంద్రకాంత్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే హైదరాబాద్ బయల్దేరాడు.


ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారికి విషయం వివరించాడు చంద్రకాంత్. 24 గంటలు గడిచినా పాప కనిపించకపోవడంతో వాళ్ళలో బాగా టెన్షన్ మొదలైంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఆడుకుంటూ వెళ్లిపోయిందా అనేది వాళ్ల అనుమానం. ఎలాంటి డిమాండ్స్ రాకపోవడంతో కిడ్నాప్ కాదనుకున్నారు. ఇది ఆలోచించే చంద్రకాంత్ స్థిరంగా ఉన్నాడు. 

స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు చంద్రకాంత్.


'వందనా కాస్తయినా తిను. పాపా వస్తుంది లే. ఇలా తినకుండా ఏడిస్తే ఎలా చెప్పు. ఎప్పుడు ధైర్యంగా ఉండే నీవే ఇలా ఏడుస్తూ కూర్చుంటే మాకు ధైర్యం ఎవరు చెప్తారు' అనునయంగా అన్నాడు చంద్రకాంత్. 


'నేను తినలేను చంద్రా. నాకు పాప కావాలి. ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేను ప్లీజ్.'

'వందనా వచ్చేస్తుంది పాపా. నువ్వు ఏడవకు. ధైర్యంగా ఉండు. నేను కమిషనర్‌తో మాట్లాడాను. ఎక్కడికక్కడ సీసీ టీవీల ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. పాప ఎక్కడికెళ్ళిందో? ఈజీగా తెలిసిపోతుంది. నువ్వు టెన్షన్ పడకుండా ముందు తిను. నా మాట విను వందనా'


@@@@@@@@@@@@@@@@@@@


అటుగా వచ్చిన ఒక ఆటోను మాట్లాడుకుని పాపతో జూబ్లీహిల్స్‌కు బయలుదేరాను. 

'వెన్నెల మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు నీవే చెప్పాలి.'

'నేను చెప్తాను అంకుల్'

'ఎందుకు వాళ్ళు నిన్ను తీసుకొచ్చారు'

'తెలియదు అంకుల్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తామన్నారు'

'అలా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే రాకూడదు అమ్మ'

'వాళ్లు దొంగలా అంకుల్'

'కాదు వెధవలు'

'వెదవలు అంటే'

'చిన్నపిల్లల్ని ఏడిపించేవాళ్ళు అన్నమాట'

'ఓహో'


'బాబు మనం జూబ్లీహిల్స్‌లో ఉన్నాం ఇప్పుడు' అన్నాడు ఆటో డ్రైవర్.


'వెన్నెల చూడు మీ ఇంటి కి ఎలా వెళ్లాలి ఇక్కడినుంచి' అన్నాను.

'ఇక్కడినుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి'

'నీకు బాగా తెలుసా మీ ఇల్లు'

'అమ్మ రోజు నన్ను ఈ దారిలోనే స్కూల్‌కు తీసుకెళ్తుంది.'

'సరే నువ్వు చెప్తూ ఉండు ఆటో అంకుల్ వెళ్తాడు'

'సరే అంకుల్'


వెన్నెల చెప్పిన డైరెక్షన్లో ఆటో వెళుతుంది. 

'అంకుల్ అదే మా ఇల్లు' అంటూ ముందు కనపడుతున్న ఓ పెద్ద భవంతిని చూపించింది వెన్నెల.

ఇంటి గేటు తెరిచే ఉంది. ఆటోను సరాసరి ఇంటి ఎదుటకు తీసుకుపోయి నిలిపాడు డ్రైవర్.


డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చేసి ఆటోను పంపించేసాను.

'ఒకే వెన్నెల ఇంటికొచ్చేసావుగా. నువ్వు లోపలికి వెళ్ళు. ఇంకా నేను వెళ్ళనా? అన్నాను.


ఆటో శబ్దం విని ఇంట్లో ఉన్న చంద్రకాంత్ బయటకు వచ్చాడు. చంద్రకాంత్‌ను చూసిన వెన్నెల 'నాన్నా' అంటూ పరుగెత్తింది. 

వెన్నెల గొంతు విన్న వందన కూడా శక్తి లేకపోయినా... ఎక్కడ లేని ఉత్సాహంతో బయటకు పరిగెత్తుకొచ్చింది.


పాప బాగా నీరసించిపోయింది. మొఖం వాడిపోయింది. వందన వెన్నెల ని చూడగానే ఏడుపు ముంచుకొచ్చేసింది. తల్లి హృదయం కదా పాపని ముద్దు పెట్టుకుంటూ గుండెకు హత్తుకున్నది. 


నేను వచ్చిన పని అయిపోయిందని అక్కడినుంచి వెనుదిరిగాను. 


చంద్రకాంత్ పోలీసులకు ఫోన్ చేసి పాప వచ్చిందని తెలిపాడు. కాల్ కట్ చేస్తూ వెళ్ళిపోతున్న నన్ను చూశాడు. ఎవరితను ఎక్కడో చూసినట్టున్నానే. 

అనుకుంటూ 'హలో బాస్' గట్టిగా అరిచాడు చంద్రకాంత్.


ముందుకు పడుతున్న అడుగులకు పిలుపు బ్రేక్ వేసింది. నేను చంద్రకాంత్ వైపు తిరిగాను. 

'మిమ్మల్ని ఎక్కడో చూసాను కానీ గుర్తు రావట్లేదు' నుదుటిని తడుముకుంటూ.


ఇందాక ఇక్కడే చూశారు సార్. 

'జోక్ వేశావా.. అని నవ్వుతూ 'ఐ యామ్ చంద్రకాంత్' అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

'ఐ యాం సేన్ సేనాపతి'. అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. 

'మీకు థాంక్స్. మా ఇంటి సంతోషాన్ని తిరిగి తెచ్చారు'

'అందులో ఏముంది సార్ ఒక పౌరుడిగా నా బాధ్యత. చిన్న పాపా ఏడుస్తూ వచ్చి కాళ్లు పట్టేసుకుంది. ఆ పాలబుగ్గల చిన్నారి ఏడుస్తూ ఉంటే ఎలా చూడగలను.'

'వందనా తను సేన్. పాపను కాపాడింది ఇతనే.'


'చాలా థ్యాంక్స్ అండి మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము నా బిడ్డను క్షేమంగా నా దగ్గరికి చేర్చారు.' అన్నది వందన. 

'అయ్యో దాందేముంది అండి నాకు అనిపించింది కదా అందుకే తీసుకొచ్చాను.' అన్నా నేను

'ఈ రోజుల్లో లో దానిని పోయే సమస్యలు ఎవరు మీద వేసుకుంటారండి' అన్నాడు చంద్రకాంత్.

'సరేనండి నేను వెళ్తాను' అన్నాను. 

'ఎక్కడికి వెళ్లాలి నేను డ్రాప్ చేస్తాను' అన్నాడు చంద్రకాంత్.

'మీరు ఆగండి కనీసం కాఫీ కూడా తాగకుండా పంపించే వస్తారా ఏంటి?' అన్నది నవ్వుతూ వందన.

'వద్దండి ఇందాకే నేను, పాప టిఫిన్ చేశాము. నేను కాఫీ కూడా తాగేశాను' అన్నాను నేను.

'సరే రండి మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి డ్రాప్ చేస్తాను' అంటూ చొరవగా చంద్రకాంత్ నా చేతిని పట్టుకున్నాడు. 

'సార్ నేను ఎక్కడికి వెళ్లాలో నాకే తెలియదు ఎక్కడ డ్రాప్ చేస్తారు?' అన్నాను. 

'అదేంటి అలా అన్నారు' అశ్చర్యంగా అడిగాడు చంద్రకాంత్.

'ఒక ఫ్రెండ్‌ను నమ్ముకొని వచ్చాను. అతడి పరిస్థితి చూసి అక్కడ ఉండలేక ఎక్కడికి వెళ్లాలో తెలియక అలా వస్తుంటే ఈ పాప కనిపించింది.'


'అయితే మీరు మా ఇంటి వాడే మా ఇంట్లోనే ఉండొచ్చు. ఏమంటారు' అంటూ వందన చంద్రకాంత్ ముఖాన్ని చూసింది. 

'నా మనసులో మాట అదే మీరు మాతో ఉండొచ్చు మాకెలాంటి అభ్యంతరం లేదు.'

'మీ అభిమానానికి థాంక్స్ సార్. నావల్ల నీకు ఎందుకు ఇబ్బంది. పర్లేదు నేను వెళ్ళిపోతాను' అన్నాను.

'అంకుల్ మీరు వెళ్లొద్దు మా ఇంట్లోనే ఉండండి.' అంటూ వెన్నెల వచ్చి నా చెయ్యి పట్టుకుంది. 

నా చేతిని పట్టుకొని లాగుతూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. 

'సేన్ కింద ఒకటి ఉంది. పైన ఒకటి గదులు ఖాళీ ఉన్నాయి. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు.' అన్నాడు చంద్రకాంత్. 


'చంద్రా ఒకసారి ఇటు రారా' అంటూ వాళ్ల అమ్మ సుగుణ పిలిచింది. 

'ఏంటమ్మా' అంటూ చంద్రకాంత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లాడు.

'ఏంట్రా ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో పెట్టుకుంటారా' అన్నది కోపంగా. 

'అమ్మ చిన్న పాప ఏడుస్తూ ఉంటే నాకెందుకులే అని వదిలేయకుండా, తన దారిన తను పోకుండా ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాడు అంటే... అతను ఎలాంటి వాడనేది అర్థం కావట్లేదా నీకు' అన్నాడు కూల్‌గానే. 

'అందరినీ గుడ్డిగా నమ్మకురా సాయం చేసాడు కదా ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపించే సేయ్.'

'అమ్మా' ప్రతి పనికి డబ్బుతోనే ముడిపెట్టలేం. మన ఇంటి సంతోషాన్ని తిరిగి తెచ్చిన అతనికి ఎంత డబ్బు ఇచ్చినా సరిపోతుందా చెప్పమ్మా' అన్నాడు చంద్రకాంత్.


'పైగా వెన్నెల ఎవరితోనూ కలవడానికి ఇష్టపడదు. తక్కువ టైంలోనే అతనితో కలిసి పోయి ఇంత బాగా ఆడుకుంటుందో చూడు.' అన్నాడు చంద్రకాంత్ వెన్నెలను చూపిస్తూ. 

'సరే నీ ఇష్టమే. ఎన్ని చెప్పినా ఎవరి మాట వినవవు కదా తగలడు పో' అన్నది సుగుణ.


సుగుణ కోపంగా రావడం చూసిన వందన... చంద్రకాంత్ దగ్గరికి వెళ్లి 'ఏమైంది అత్తమ్మ కోపంగా వెళ్తుంది' అని అడిగింది. 

'ఏం లేదులే సేన్‌కు రూమ్ ‌ను సిద్ధం చేయించు.. నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి వస్తాను' అంటూ బయటకు వెళ్ళిపోయాడు చంద్రకాంత్.


(ఇంకా ఉంది)


@@@@@@@@@@@@@@@@@


పాఠక మిత్రులకు నమస్కారం. నా కథను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తప్పులుంటే మన్నించండి. నా ఈ కథకు మీ అమూల్యమైన రేటింగ్, రివ్యూ లతో ఎలా ఉందో తెలియజేయగలరు. అవే భవిష్యత్తు నా కథలకు పునాది, ఊపిరులను ఊదగలవు. మరచిపోకుండా రేటింగ్, రివ్యూలను ఇవ్వగలరని మనవి.

- సామాన్యుడు


Rate this content
Log in

More telugu story from Saamaanyudu

Similar telugu story from Drama