ఓ ప్రశ్న ఓ నిర్ణయం
ఓ ప్రశ్న ఓ నిర్ణయం


నా ప్రేయసి సరదాగా నన్ను ఓ ప్రశ్న అడిగింది.
నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మంటే ఎక్కువ ఇష్టమా ?
నాకు నువ్వంటే ఇష్టం, మా అమ్మంటే ప్రేమ. అని చెప్పాను.
******************
ఇదే ప్రశ్న మళ్ళీ మా పెళ్ళి అయ్యాకా అడిగింది.
నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది. నా మీదా లేకపోతే మీ అమ్మగారి మీద ?
ఆమె అడిగే ఈ అమాయకమైన ప్రశ్న కి నాకు నవ్వు వచ్చింది. నువ్వు నా ప్రేమ. మా అమ్మ నా ప్రాణం. అని సమాధానం చెప్పాను. నేను సమాధానం చెప్పినప్పుడల్లా ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వేది.
అటువంటి ప్రశ్నే మళ్ళీ నాకు పదేళ్ళ తరువాత ఎదురయింది. ఈసారి సరదా లేదు. నా పెదాల పైన చిరునవ్వు లేదు. ఈ ప్రశ్న భయంకరమైన బాధను నాకు పరిచయం చేసింది. ఈ ప్రశ్నకు ఎదురు పడటం కంటే ఊపిరి విడిచిపెట్టడం మేలు.
******************
నాకు పెళ్ళయ్యి పదేళ్ళు గడిచాయి. నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. అమ్మ,నాన్న, నా భార్య,నా పిల్లలు హైదరాబాద్ లోనే వున్నారు.
అందరినీ విడిచిపెట్టి ఉద్యోగం కోసం దూరంగా వస్తే అక్కడ ప్రేమగా చూసుకోవడానికి భార్య ఉండదు. బాధ కలిగితే ధైర్యం చెప్పడానికి తల్లీ, తండ్రి ఉండరు. ఇదంతా తెలిసి నేను వాళ్లని విడిచిపెట్టి ఎందుకు వచ్చాను? మనం బ్రతికేదే ప్రేమకోసం, బంధాలకోసం అలాంటిది అవేమీ లేని చోట ఏందుకు ఉండాలి. కొన్ని రోజులు గడిచాకా ఇవే ప్రశ్నలు నా మెదడులో మెదులుతున్నాయి. ఇంతలో నా ఫోన్ రింగ్ అవ్వుతుంది.
హల్లో... మా ఆయన ఏమ్ చేస్తున్నారూ... అని మాటను సాగతీస్తూ అడిగింది స్వప్న.
మీ ఆయన వాల్లావిడ గురించి ఆలోచిస్తున్నాడు.
అవునా? ఏమ్ ఆలోచిస్తున్నావోయ్ నా గురించి.
మన పిల్లలిద్దరూ నిన్ను ఎలా చూసుకుంటున్నారా అని.
వాళ్ళు నన్ను చూసుకోవడం ఏంటి. నేనే వాళ్లని చూసుకుంటున్నాను అని చెప్పింది.
అయినా మేడమ్ గారేంటీ అర్ధరాత్రి ఫోన్ చేసారు. నేను గుర్తొస్తున్నానా?
అదేం కాదు. అత్తయ్య గారు నన్ను తిట్టి పిల్లల్ని నా గదిలో నుండి తీసుకుని వెల్లిపోయారు.
ఎందుకు తిట్టింది. ఏ పిచ్చి పని చేసావ్ అని అడిగాను.
నేనేం చేయలేదూ. పిల్లలిద్దరూ మంచం మీద ఎగురుతున్నారూ అత్తయ్య గారు వచ్చి నన్ను తిట్టారు.
దానికే మా అమ్మ నిన్ను తిట్టేసిందా?
అంటే అత్తయ్య గారు వచ్చేసరికి నేను కూడా వాళ్ళ తో కలిసి ఎగురుతున్నా. అని స్వరం తగ్గిస్తూ చెప్పింది.
నేను గట్టిగా నవ్వాను.
ఎందుకు నవ్వుతున్నారు?
పాపం మా అమ్మ ముగ్గురు అల్లరి పిల్లల్ని ఎలా భరిస్తుందా అని నవ్వొచ్చింది.
నేనేం అల్లరిపిల్లని కాదు.
సరే పిల్లలు ఏమ్ చేస్తున్నారు?
వాళ్ళు మామయ్య గారి దగ్గర పడుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి అత్తయ్య గారి దగ్గర పడుకోవాలి.
సరే ఎల్లుండ మన పెళ్ళిరోజు గుర్తుందా?
ఆరోజే మీ పుట్టిన రోజు గుర్తుందా? అని అడిగింది.
గుర్తుంది. ఇంటికి వచ్చేద్ధాం అనుకుంటున్నా.
తను ఆనందంతో ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది.
ఒక నెలలో ఉద్యోగం మానేసి వచ్చేద్ధాం అనుకుంటున్నా అని చెప్పాను. తను ఎందుకు? అని అడగలేదు.
ఆమె మాటల్లో ఆశ్చర్యం కనబడలేదు వచ్చేయండి అని ఆనందంగా అంది.
ఎందుకు అని అడగవా? అని అడిగాను.
నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. మీతోనే ఉండాలని ఉంది. అక్కడకి మీతో వస్తానంటే వద్దన్నారు. త్వరగా వచ్చేయండి అని చెప్పింది.
నువ్వు ఇక్కడకి వస్తే ఒంటరిగా పిల్లలిద్దరినీ చూసుకోలేవనే వద్దన్నాను.
నాకు తెలుసు. అత్తయ్యగారు పిలుస్తున్నారు ఉంటానూ అని ఫోన్ పెట్టేసింది.
వెంటనే మళ్ళీ ఫోన్ చేసింది.
ఏంటోయ్ మళ్లీ చేసావ్? అని అడిగాను.
ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఐ లవ్ యూ.. అని చెప్పింది.
ఐ లవ్ యూ టూ.
ఓ చిన్న ముద్దుపెట్టి ఫోన్ పెట్టేసింది.
తరువాత రోజు ఉదయం అమ్మ నాకు ఫోన్ చేసింది.
ఏరా ఎలా ఉన్నావ్?
బానే ఉన్నానమ్మ.నీ ఆరోగ్యం ఎలా ఉంది.
బానే ఉందిరా. టిఫిన్ చేసావా.
హా చేసానమ్మా. నాన్నగారు ఏమ్ చేస్తున్నారు.
మీ నాన్న గారు ఇక్కడ హడావుడి చేసేస్తున్నారు. పిల్లల్ని స్కూల్ మానిపించేసి పిక్నిక్ కి వెళ్దాం రెడీ అవ్వమంటున్నారు.
చిన్నగా నవ్వు వచ్చింది. సరే అమ్మ ఆఫీస్ కి టైమ్ అవుతుంది. నేను సాయంత్రం చేస్తానూ అని ఫోన్ పెట్టేసాను.
****************
ఆఫీస్ లో రేపు నా పుట్టినరోజని నేను ఎవరితోను చెప్పలేదు. కాని ఒక అమ్మాయి రేపు నా పుట్టిన రోజని తెలుసుకుంది.నేను కాలేజ్ లో చదువుకునేటప్పుడు తను నా జూనియర్. ఇప్పుడు నా కొలీగ్. తన పేరు నయన.
నాకు పార్టీ కావాలి అని అడిగింది.
రేపు అందరికీ ఇస్తాను అని చెప్పాను.
నాకు అందరితో కలిపి వద్దు సెపరేట్ గా కావాలి.
సరే సాయంత్రం రెస్టారెంట్ కి వెళ్దాం.
వద్దు. మీ ఇంటి దగ్గర డిన్నర్ చేద్దాం.
సరే అని చెప్పాను.
*****************
ఏంటి మీ ఆయనతో కలిసి వస్తావనుకుంటే ఒక్కదానివే వచ్చావ్.
ఆయనికి పని ఉందని నన్ను దింపేసి వెళ్ళిపోయారు.
బోజనం చేసి కూర్చున్నాం. తను నా ఫ్యామిలీ ఫోటో చూస్తుంది.
మీ అమ్మగారు చాలా అందంగా వున్నారు. మీ పిల్లలు అచ్చం మీ వైఫ్ లానే వున్నారు. మీది లవ్ మ్యారేజ్ కదా మీ లవ్ స్టోరీ నాకు తెలుసూ కానీ మీ అమ్మగారి గురించి నాకు తెలియదు. చెప్పవా.
అమ్మ గురించి చెప్పడానికి ఏముంటుంది. పెద్దగా చదువుకోలేదు. నేను పుట్టిన తరువాత నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. తరువాత నా భార్యను ప్రేమించింది. ఇప్పుడు నా పిల్లల్ని ప్రేమిస్తుంది. అమ్మలకి ప్రేమించడమే కదా తెలుసు.
నీకు మీ అమ్మగారంటేనే ఎక్కువ ఇష్టం అనుకుంట?
లేదు. నాకు నా భార్యంటేనే ఎక్కువ ఇష్టం.
అదేంటీ?
నీకు తెలుసా ? మనకి తెలియకుండా మన జీవితంలో ప్రేమ మూడు దశలుగా ప్రయానిస్తుంది. మనం పుట్టినప్పుడు తల్లి మనల్ని ప్రేమిస్తుంది. తర్వాత భార్య ఆ తర్వాత వయస్సు అయిపోయాకా పిల్లలు. ఆ దశలలో వాల్లు చూపించే ప్రేమ మాత్రమే బలంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు గుండెల మీద చెయ్యి వేసుకుంటే ఆ విషయం తెలుస్తుంది.
అయితే భార్య ఉన్నప్పుడు అమ్మ మీద ప్రేమ ఉండదా?
అమ్మ వైపు నుంచి చూడు ఉంటుంది. అమ్మ ప్రేమ మన పుట్టుకతో మొదలవుతుంది. భార్య ప్రేమ మరణం వరకూ తోడుంటుంది.
చాలా బా చెప్పావ్. అని తను అంది.
టైమ్ 11 అయింది. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా.
వద్దు. మా హస్బెండ్ కేక్ తీసుకుని వస్తానన్నారు. కట్ చేసాకా వెల్తాం.
11:45 అయినా ఆమె హస్బెండ్ రాలేదు. నయన అతనికి ఫోన్ చేస్తూనే ఉంది. 12:00 కి డోర్ కొట్టిన శబ్దం వినపడింది. అదే సమయం లో నాకు ఓ అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
హల్లో... TS10 BK ***9 కార్ మీదేనా? అని అడిగారు
అవును మాదే.
మీ కార్ కి వైజాగ్ అవుట్ కట్స్ లో ఆక్సిడెంట్ అయింది. అందులో వున్న వాళ్లని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
నేను వెంటనే స్వప్న కి కాల్ చేసాను. లిఫ్ట్ చేయలేదు. అందరికీ చేసాను ఎవరూ లిఫ్ట్ చేయలేదు. నాకు చెమటలు పట్టేసాయి కాళ్ళు, చేతులు వనుకుతున్నాయి.
ఏమయింది అని నయన అడుగుతుంది. తనకి విషయం చెప్పి ముగ్గురం హస్పిటల్ కి బయల్దేరాం.
వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పుట్టిన రోజుకి సర్ ప్రైజ్ ఇవ్వడానికి వచ్చార? ఎవ్వరికీ ఏమీ కాలేదుగా? హాస్పిటల్ కి వెల్లే వరకూ ఇవే ఆలోచనలు నా మెదడులో మెదులుతున్నాయి. హాస్పిటల్ భయట పోలీస్ లు వున్నారు.నేను వేగంగా లోపలకి వెళ్ళాను. నేను లోపలకి వెళ్తుంటే పోలీస్ లు నన్ను ఆపారు.
ఏవరు నువ్వు?
తన ఫ్యామిలీకి ఏక్సిడెంట్ అయింది. ఇక్కడే జాయిన్ చేసారు. అని నయన చెప్పింది. ఓ పేపర్ మీద సంతకం తీసుకుని వెంటనే లోపలకి పంపించారు. హస్పిటల్ మొత్తం గందరగోళంగా ఉంది. మేము ICU దగ్గరకి వెల్లాము. నాకు కంగారు వచ్చేస్తుంది. ఓ డాక్టర్ బయటకి వచ్చారు.
డాక్టర్ వాళ్ళకి ఎలా ఉంది అని అడిగాను.
మీరు వాళ్ళకి ఏమవుతారు?
మా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు.
మీ అబ్బాయికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. ప్రమాదం ఏమీ లేదు. మీ నాన్న గారికి రెండు ఆపరేషన్లు చేసాం. ఆయన కోమాలో వున్నారు. మీ భార్యకి, అమ్మగారికి ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడే ఏం చెప్పలేం.
మరి నా కూతురు?
మీ అమ్మాయి అద్రుష్టవంతురాలు. చిన్న చిన్న గాయాలతో భయటపడింది. అని చెప్పాడు.
ఇంతలో నర్స్ నా కూతురిని ఎత్తుకుని తీసుకొచ్చింది.
తను అమ్మా... అమ్మా.. అని ఏడుస్తుంటే నా గుండె బద్ధలయిపోతుంది. తనని ఎత్తుకుని ఓధార్చటానికి ప్రయత్నిస్తున్నా తను ఊరుకోవడం లేదు. నా కంటి నుండి దార ఆగట్లేదు. చుట్టూ వున్న వాళ్ళు జాలిగా నన్నే చూస్తున్నారు. నయన పాపను తీసుకుని భయటకు వెల్లింది. ఆమె భర్త నాకు ధైర్యం చెప్తున్నాడు. కొంత సమయం తరువాత పాప పడుకుంది. డాక్టర్స్ ICU
నుండి భయటకు వచ్చారు.
డాక్టర్ వాళ్ళకి ఎలా వుంది.
మీ అమ్మగారికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. రెండు కిడ్నీలు అమర్చాలి. మీ భార్యకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి.
మరి చేయండి డాక్టర్.
అవయవాలు హైదరాబాద్ నుంచి రావాలి కానీ మనకి అంత సమయం లేదు. ఓ అర్ధగంటలో ఆపరేషన్ మొదలు పెట్టాలి.
నా గొంతు బాధతో పూడుకుపోయింది.మరి ఏం చేయాలి డాక్టర్ అని అడిగాను.
వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తూ నా ముందు ఓ ప్రశ్నను పెట్టారు. ధాని సమాధానం ఏదైనా నాకు బాధనే మిగులుస్తుంది.
వాల్లిద్దరిదీ ఒక్కటే బ్లడ్ గ్రూప్. మీ అమ్మగారి గుండెని మీ భార్యకి పెడితే ఆమె బ్రతుకుతుంది. మీ భార్య కిడ్నీలు మీ అమ్మగారికి పెడితే ఆవిడ బ్రతుకుతారు.ఎవ్వరో ఒకల్లే బ్రతుకుతారు. వీటిలో ఏదో ఒకటి చేయకపోతే ఎవరూ దక్కరు. ఇక ముందు జరగబోయేది మీ నిర్ణయం మీదే ఆదారపడి ఉంటుంది. అని చెప్పి డాక్టర్స్ వెల్లిపోయారు.
నా మెదడు పని చేయటం ఆగిపోయింది. బాధ నా గుండెల్ని తొలిచేస్తుంది.తొమ్మిది నెలలు మోసిన తల్లిని బ్రతికించుకోవాలా. లేకపోతే ఏడడుగులూ వేసి కష్టాల్లో కూడా తోడుంటా అని ప్రమాణం చేసిన భార్యను బ్రతికించుకోవాలా. ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. ఆరుస్తూ గోడని గుద్ధుతూ ఏడుస్తున్నాను. నా అరుపులకి నా కూతురు నిద్రలోనుంచి లేచి ఏడుస్తుంది. నేను కళ్ళు తుడుచుకుని ఆమెను ఎత్తుకుని ఊరుకోపెడుతున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకుంటానా అని అందరూ నా వైపే చూస్తున్నారు. నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను.
డాక్టర్స్ భయటకు వచ్చి సర్ ఏమ్ నిర్ణయం తీసుకున్నారు అని అడిగారు. నా నుండి సమాధానం లేదు. నేను పాపను ఎత్తుకుని నేలను చూస్తూ కుర్చుండిపోయాను. వాళ్ళు మళ్ళీ అడిగారు.
ఆయన భార్యని బ్రతికించండి. అని నయన చెప్పింది. నేనేమైనా చెప్తానేమో అని డాక్టర్స్ నా వైపు చూసుకుంటూ వెల్లిపోయారు.
తను చెప్పిన మాట నాకు వినపడింది. కాని నేను స్పందించలేదు. బహూసా అదే సరైన నిర్ణయం అయ్యిఉంటుంది. కాని నాకు ఆ సమాధానం నచ్చలేదు. అలాగని నా మనస్సు ఆ సమాధానానికి అడ్డు చెప్పలేదు. తను నా పక్కన కూర్చుని నాకు ధైర్యం చెప్పింది.
***************************
నాలుగు నెలలు గడిచాయి.
మీ నాన్న గారు కోమాలో నుంచి కోలుకున్నారు అని హస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నేనూ స్వప్న కలిసి హాస్పిటల్ కి వెళ్ళాం. మేము వెళ్ళకముందే డాక్టర్స్ జరిగినదంతా నాన్నకి చెప్పారు. మేము నాన్న దగ్గరికి వెళ్ళాక ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న ! మీ అమ్మ ఏక్కడ ఉందిరా అని. ఆయన కళ్ళు దుఃఖం తో నిండిపోయాయి.
నా నుంచి ఎటువంటి సమాధానం లేదు.
నీకు తొమ్మిది నెలలు పెంచిన తల్లికంటే భార్యే ముక్యమనిపించిందేరా అని అడిగారు.
మీరు నన్ను ప్రశ్నిస్తున్నారనుకోను. నా ఉద్దేశం తెలుసుకుంటానికే అడుగుతున్నారనుకుంటాను. నేను ఆ రోజు నా భార్య గురించి ఆలోచించలేదండి. నా పిల్లలకి తల్లి గురించి ఆలోచించాను. వాళ్ళకి ఇంకా ఊహ తెలియదండి. అమ్మా అనే పదం తప్ప వాల్లకి ఏమీ తెలియదు. వాళ్ళకి అమ్మని దూరం చేసేస్తే వాళ్ళకి ఊహ తెలిసాక మా అమ్మకి ఏమయింది అని అడిగితే వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? నేను అమ్మను కాపాడుకోవడానికి వాల్లకి అమ్మను దూరం చేయడం ఏ మాత్రం న్యాయం కాదండి.అమ్మ నా నుంచి దూరం అయిపోయిందని నేను అనుకోవట్లేదు. తన గుండె చప్పుడులో ఎప్పుడూ నా తోనే ఉంటుంది.
మా పిల్లలిద్దరూ నాన్న దగ్గరకి వచ్చారు. వాళ్ళకి వచ్చీ రాని మాటలతో తాతగారు ఎలా ఉంది అని అడిగారు. వాళ్ళ అమాయకమైన చిరునవ్వు చూసి మా నాన్న పెదాల పైన చిరునవ్వు విరిసింది.
నన్ను క్షమించరా నీ నిర్ణయాన్ని తప్పు పట్టినందుకు అని నాన్న అడిగారు.
లేదు నాన్న పరిస్థితి మనల్ని నిలదీసే వరకూ మన మెదడు కొన్ని నిర్ణయాలను తీసుకోలేదు. మీ తప్పేం లేదు.
ఇది నా కథ.
ఇప్పుడు మా అమ్మ, నా భార్యా వేర్వేరు కాదు. ఒకరిది రూపం మరొకరిది ప్రాణం.
***************