Chethana Muppuri

Inspirational

4.2  

Chethana Muppuri

Inspirational

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
564


   సాయంకాలం ఆఫీస్ నుండి వస్తూ అలా కాఫీ షాప్ కనపడగానే కాఫీ తాగుదాం అని అటువైపు అడుగులు వేశాను. వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం మొత్తం నల్లమబ్బులతో కమ్మేసి ఉంది. అలా చూట్టూ ఉన్న పరిసరాలని చూస్తుండగా మేడం అన్న పిలుపు విని తిరిగి చూశాను. ఒక క్యాపిచ్చినో ఆర్డర్ ఇచ్చాను.

              కాఫీ వచ్చింది అది తాగుతూ చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నాను. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయున్నారు. నిజానికి ఎవరి ఫోన్ లో మెస్సేజ్ లు చూసుకునే పనిలో అందరూ మునిగిపోయి ఉన్నారు.ప్రకృతి అందాలను అస్సలు ఆస్వాదించట్లేదు. ఈ గజిబిజి లోకంలో అందరికి స్నేహితులు ఫేస్బుక్, వాట్సాప్ లో తప్పు పక్కనే వుండి మనతో కష్టసుఖాలు పంచుకునేవాళ్ళు చాలా తక్కువ.

             ప్రక్క టేబుల్ దగ్గర ఒక కుటుంబం ఉంది. ఆ చిన్న పిల్లవాడు ఏదో కావాలని గొడవ చేస్తున్నాడు

అప్పుడు నాకు నా బాల్యం గుర్తుకువచ్చింది. చిన్నప్పుడు తమ్ముడు అలాగే గొడవ చేసేవాడు. అప్పుడు నాన్నగారు తమ్ముడు అడిగింది కొనిచ్చారు కానీ రాత్రి పడుకునే ముందు నాకు, తమ్ముడికి ఒక కథ చెప్పారు.

                "ఒకప్పుడు రామాపురం అనే ఊరిలో ఒక కుటుంబం నివసించే వాళ్లు. ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు రాహుల్. రాహుల్ అల్లరి పిల్లవాడు. రోజు ఇంట్లో ఇచ్చే నాన్న ఇచ్చే డబ్బులు ఖర్చుపెట్టేసి అమ్మ దగ్గర అక్క దగ్గర ఇంక డబ్బులు ఇవ్వమని గొడవచేసేవాడు. వాడి అల్లరి భరించలేక వాళ్లు డబ్బులు ఇచ్చేసేవారు. ఇదంతా గమనించిన వాళ్ల నాన్నగారు ఇలాగే ఉంటే భవిష్యత్తు లో రాహుల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ఉపాయం ఆలోచించారు.

   తర్వాత రోజు ఉదయాన్నే రాహుల్ ని పిలిచి. రాహుల్ ఈరోజుటి నుండి నువు డబ్బులు సంపాదించుకొస్తేనే నీకు ఇంట్లో తిండి పెట్టేది. కాబట్టి నువు సాయంత్రానికల్లా డబ్బులు సంపాదించుకుని రా అని చెప్పారు.

రాహుల్ అమ్మ దగ్గరికి వెళ్లి అల్లరి చేసి డబ్బులు తీసుకొని సాయంత్రం వాళ్ల నాన్నగారికి ఇచ్చాడు. అప్పుడు ఇంటి వెనుక ఉన్న బావిలో ఆ డబ్బుని వేయమన్నారు. రాహుల్ అలానే chesadu.జరిగిన విషయం గమనించిన వాళ్ల నాన్నగారు మరుసటి రోజు రాహుల్ వాళ్ల అమ్మగారిని వాళ్ల పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు గడిపి రమ్మని పంపించేశారు. తర్వాత రాహుల్ ని పిలిచి సాయంత్రం లోపు డబ్బులు తీసుకొని రమ్మని లేకపోతే తిండి ఉండదు అని చెప్పారు.

రాహుల్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంట్లో అమ్మ ఎక్కడ కనిపించలేదు. విసిగిపోయిన రాహుల్ అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క దగ్గర డబ్బులు తీసుకొని సాయంత్రం నాన్నగారికి ఇచ్చాడు. మునుపటి లాగానే ఆ డబ్బుని బావిలో వేయమన్నారు. రాహుల్ అలానే చేసాడు. తర్వాత రోజు కూతురిని అత్తగారింటికి పంపించారు. తర్వాత మళ్లీ రాహుల్ ని పిలిచి ముందుసారిలాగే చెప్పారు.

రాహుల్ ఇంటి మొత్తం వెతికాడు. కానీ ఇంట్లో అమ్మ లేదు, అక్క లేదు. ఎప్పుడు డబ్బులు ఎలా వస్తాయ్. డబ్బులు లేకపోతే సాయంత్రం తిండి ఉండదు. రాహుల్ దిగులుతో డీలా పడిపోయాడు. ఏం చేయాలో ఏం అర్ధం కాలేదు . చాలా సేపు అలాగే కూర్చుండిపోయాడు. ఇంక ఇలా ఉంటే లాభం లేదు అనుకొని లేచి బజార్ లోకి వెళ్ళాడు. ఏమైనా పనిచేసి డబ్బులు సంపాదిద్దాం అని. అక్కడ ఒక ముసలి వ్యక్తి రిక్షా లాగలేక లాగలేక లాగుతున్నాడు. రాహుల్ అతని దగ్గరికి వెళ్లి నేను మీ పని చేసి పెడతాను నాకు డబ్బు ఇస్తారా అని అడిగాడు. అతను సరే అన్నాడు. రాహుల్ మునుపెన్నడూ చేయలేదు అలాంటి పనులు. మధ్యాహ్నం కావడంతో ఎండ చాలా ఎక్కువగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. గొంతెండిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఐనా సరే రాహుల్ కష్టం మొత్తం భరించి సాయంత్రం వరకు రిక్షా లాగాడు. సాయంత నామమాత్రపు డబ్బు చేతిలో పెట్టాడు ఆ ముసలి వ్యక్తి. దాన్ని పట్టుకొని ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు రాహుల్. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లి డబ్బు చూయించాడు. వాళ్ల నాన్నగారు మునుపటి లాగే ఆ డబ్బు తీసుకెళ్లి బావిలో వేసిరమ్మన్నారు. రాహుల్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కళ్ళు మొత్తం కన్నీటితో నిండి పోయున్నాయి. నేను సాయంత్రం వరకు ఎండలో కష్టపడి రిక్షా లాగి సంపాదించిన డబ్బు తీసుకెళ్లి బావిలో వేయమంటారా అని బోరున ఏడ్చాడు. వాళ్ల నాన్నగారు మాత్రం కొడుకు డబ్బు విలువ , శ్రమ విలువ తెలుసుకున్నాడు అనుకొని మనసులో చాలా సంతోషించారు. "

ఆ కథ విన్నప్పటి నుండి నేను, తమ్ముడు అప్పుడు ఇవి కావాలి అవి కావలి అని అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టలేదు. మనం చిన్నపుడు విన్న కథలు మన జీవితం మొత్తం ప్రభావితం చేస్తాయి. ఇలా ఆలోచిస్తూ ఉండగా

    బిల్ మేడం అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చాను ఆ చక్కటి జ్ఞాపకం నుండి. బిల్ పే చేసేసి షాప్ నుండి బయటకి నడిచాను.


Rate this content
Log in

Similar telugu story from Inspirational