సమయమే అతిపెద్ద బహుమతి
సమయమే అతిపెద్ద బహుమతి
గదిలో అలారమ్ మోగుతున్నా పదిహేనేళ్ళ దేవేంద్ర దుప్పటి ముఖానికి కప్పుకుని పడుకున్నాడు. బద్ధకంగా చేత్తో దాన్ని ఆపేసి మళ్లీ గాఢనిద్రలోకి జారుకున్నడు. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి సమయం ఎనిమిది గంటలు దాటి పోయింది. దేవేంద్ర తల్లిదండ్రులు ప్రముఖులు, ధనవంతులు.
తండ్రి పేరు రక్షిత్, తల్లి పేరు సరస్వతి. తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త ఆయనకు పలు వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి. తల్లి ప్రముఖ న్యాయవాది. దేవేంద్ర ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నారు కాని దేవేంద్రకు ఒంటరిగా అనిపించేది.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని అల్పాహారం తిని బడికి బయలుదేరాడు. బడిలో దేవేంద్ర ఒక సాధారణ విద్యార్థి. చదువుపై దృష్టి పెట్టకపోవడంతో వందకు అరవై, డెబ్బై మార్కులు వచ్చేవి. పైగా దేవేంద్ర చాలా అల్లరి పిల్లవాడు.
తరగతి గదిలో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. టీ కెచరు అది గమనించి, తరగతి గదిలో నుండి బయటకు పంపించేశారు. క్లాస్ రూమ్ బయట కారిడార్ లో నిలబడి, లోపల ఉన్న వాళ్లను చూస్తు అతను బాధగా నిట్టూర్చాడు. సాయంత్రం బెల్ మోగగానే, డ్రైవర్ కరుణ్ కారు తీసుకుని గేటు దగ్గర సిద్ధంగా ఉన్నాడు.
దేవేంద్ర మౌనంగా వెళ్ళి కారు ఎక్కాడు. అంతపెద్ద భవనంలోకి అడుగుపెట్టగానే అతనికి ఎప్పటిలాగే ఒక వెలితి, బోసిపోయిన వాతావరణం కనిపించింది. ఆ ఒంటరితనాన్ని మర్చిపోవడానికి పుస్తకాలు పక్కన పడేసి ఫోన్ పట్టుకున్నాడు. కొంతసేపు తరువాత కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్స్ లో మునిగిపోయాడు.
సరిగ్గా అదే సమయానికి తల్లి సరస్వతి అలసటగా ఇంటికి వచ్చింది. ఆమె నిత్యం పనులతో వంట జోలికి వెళ్లదు లోపలికి రాగానే ఆటల్లో మునిగిపోయిన దేవేంద్ర ని చూసి ఆమె మనసులో కొంచెం కోపంతో "ఎంతసేపు ఆటలు, కొద్దిసేపు చదువుకో" అని చెప్పింది.
అప్పుడు దేవేంద్ర హోంవర్క్ రాసి, చదవడం మొదలుపెట్టాడు. భోజనం చేశాక నిద్రపోయాడు. అప్పుడే రక్షిత్ తన ఉద్యోగ భాధ్యతలను ముగించుకుని ఇంటికి వచ్చాడు. సరస్వతికి నిద్ర పట్టడం లేదు.
అప్పుడు రక్షిత్ సరస్వతితో, "ఏంటి శ్రీమతి గారు, ఇంకా నిద్ర పోలేదు?" అని అడిగాడు. అప్పుడు సరస్వతి," శ్రీవారు! మన కొడుకుని మంచి దారిలో నడిపించాలి. వాడు ఎప్పుడూ ఆడుకుంటూనే ఉన్నాడు, ఇంకా బాగా చదవాలి" అంది. అప్పుడు రక్షిత్, "నేను దేవేంద్రను చూసి వస్తాను" అని చెప్పి, దేవేంద్ర గదిలోకి వెళ్ళాడు.
నిద్రపోతున్న కొడుకును చూస్తున్న ఆ తండ్రి కళ్ల నుంచి కన్నీళ్ళు కారాయి. ఎందుకంటే, కొడుకుతో తగినంత సమయం గడపలేకపోతున్నాననే బాధ అతని మనసును తొలిచేస్తుంది. కొడుకు తలపై చేయి పెట్టి, కొద్దిసేపటి తరువాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు రక్షిత్.
దేవేంద్రకు తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం దేవేంద్రుడు లేచాడు. అల్పాహరం తిని స్కూల్ కు బయలుదేరాడు. దారిలో ఒక పాపను ఆడిస్తున్న నాన్నను చూసి ఒక పక్క సంతోషపడుతున్నా, మరోపక్క తాను అంత సంతోషంగా ఉండలేకపొతున్నాననే బాధ అతనిని వెంటాడుతోంది.
ఇలా ఉండగా, రక్షిత్ ఆఫీసుకు బయలుదేరాడు. సరస్వతి కోర్టుకు బయలుదేరింది. ఎప్పుడైతే రక్షిత్ ఆఫీసుకు బయలుదేరాడో, అప్పుడు తన ధన సంచిలో తన కొడుకు ఫోటో చూసి బాధపడ్డాడు. ఆఫీసులో కూడా నిరుత్సాహంగా ఉన్నాడు.
ఎందుకంటే తన ఒక్కగానొక్క కొడుకుతో సమయం గడపలేక పొతున్నాననే బాధలో ఆఫీసులో పని పొరపాటు చేశాడు. ఇదిలా ఉండగా సరస్వతి కోర్టుకు చేరుకుంది మరియు అక్కడ విడాకుల కేసు వచ్చింది. కేసులో సరస్వతి భర్త తరపున వాదిస్తోంది. అందులో ఉన్న చిక్కు ఒకటే.
వాళ్ళ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి. తండ్రి దగ్గర? తల్లి దగ్గర? దీన్ని చూసి తన పుత్రుడిని గుర్తుచేసుకుంది సరస్వతి. వాదన తరువాత కూడా తన మనసులో అలజడి. అలా పరధ్యానంలో కొడుకు గురించి ఆలోచిస్తుండగా తోటి లాయర్ పిలవడంతో తేరుకుంది సరస్వతి.
దేవేంద్ర ఇంటికి వచ్చాడు. ఫోన్లో ఖరీదైన ఆట బొమ్మ కారు కొన్నాడు. పాపం అదే రోజు అతని ప్రోగ్రెస్ కార్డు వచ్చింది. అప్పుడు 'నాన్న.. నాన్న..' అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు రక్షిత్ చాలా బిజీగా ఉన్నాడు. 'ఏంటి నాన్న?' అని అడిగితే ప్రొగ్రెస్ కార్డు చూస్తే.. ఈసారి 60,70 కాకుండా 50,55లు కనిపించగానే బాగా అరిచి, తిట్టింది సరస్వతి.
దేవేంద్ర ఏడుస్తూ గదిలోకి వెళ్లాడు. కోపంలో బిడ్డను తిట్టానని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తనను తానే తిట్టుకుంటూ బాగా ఏడ్చింది. ఆ తర్వాత ప్రోగ్రెస్ కార్డుపై సంతకం పెట్టి, కొడుకుని తన ఒడిలో నిద్రపుచ్చింది. రక్షిత్ ఈరోజు అసలు ఇంటికి రాలేదు పనిమీద ఢిల్లీకి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఎప్పటిలాగే అల్పాహారం తిని దేవేంద్ర బడికి, సరస్వతి కోర్టుకు బయలుదేరారు. బడిలో దేవేంద్ర రోజులా కాకుండా బాగా అల్లరి చేశాడు. ఈసారి బాగా మాట్లాడాడు. పేపర్ తో రాకెట్ చేసి ఫ్రెండ్ మీదకి వేయబోయి ఉపాధ్యాయురాలికి తగిలింది.
వెంటనే ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. ప్రధానోపాధ్యాయుడు దేవేంద్రుడిని తిట్టి వాళ్ల అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పాడు. దేవేంద్ర కంగారు పడుతున్నాడు. ఇతను బడి ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లాడు. శరీరం మొత్తం చెమట, తన గుండె చప్పుడు చాలా గట్టిగా వినబడింది.
అలా ఉన్న సమయంలో సరస్వతి వచ్చింది. పిల్లాడిని చూసి ఈసారి కోపగించుకోకుండా శాంతంగా ఉంది. రక్షిత్ చాలా కోపంతో ఇంటికి వచ్చాడు. అర్జెంటుగా పనిని ఆపేసి వచ్చిన రక్షిత్ అడుగుల శబ్దం వేగంగా దూసుకొచ్చింది. రక్షిత్ వచ్చి, దేవేంద్ర చెంప చెళ్లుమనిపించాడు.
దేవేంద్ర ఏంటి నీ ప్రాబ్లమ్? ఎందుకు స్కూల్లో అల్లరి చేశావు? నీ మార్కులు సరిగ్గా రావడం లేదు. ప్రశాంతంగా ఉండవు. నీవల్లే నాకు అవమానం జరిగింది' అని దేవేంద్రను బాగా కొట్టాడు. ఆ పిల్లవాడు "నాన్న..నాన్న.. కొట్టొద్దు నాన్న, నన్ను క్షమించు నాన్నా" అని ఏడుస్తూ ఉన్నాడు.
ఇంతలో సరస్వతి అడ్డుపడి, "ఆపండి, ఇక నుంచి మన కొడుకు తప్పు చేయడు" అని చెప్పింది. రక్షిత్ శాంతించాడు. కానీ, తన కొడుకు కొన్ని రోజుల ముందు ఒక ఆట వస్తువును కొన్నాడు కదా, అది ఇంటికి వచ్చింది. ఆ వస్తువును తీసుకుని నేలకేసి పగ లగొట్టాడు రక్షిత్.
తన కళ్లు ఎర్రబడ్డాయి. కోపంగా దేవేంద్ర వైపు చూసి, "చదవడం చేతకాదు, నీకు ఆటలు ఎందుకు పనికిమాలిన వెధవ" అని తిట్టి వెళ్ళిపోయాడు. పాపం సరస్వతి ఎంత ఓదార్చినా దేవా బాధ తగ్గలేదు. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. దేవేంద్ర తల్లిదండ్రులకు తెలియకుండా ఒక తప్పు చేశాడు.
కొన్ని చెడు స్నేహాల కారణంగా మద్యపానం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్థితికి చేరుకున్నాడు దేవా. తల్లిదండ్రులకు తెలియకూడదని చాలా కష్టపడ్డాడు. కానీ దేవాకి కూడా ఆ వ్యసనం ఇష్టం లేదు. కానీ తనవల్ల ఆపడం కుదరలేదు పాపం.
ఒకనాడు తన వ్యసనం గురించి రక్షిత్, సరస్వతికి తెలిసిపోయింది. ఈసారి ఇద్దరి కోపం కట్టలు తెంచుకుంది. వాళ్లిద్దరూ కలిసి ఆ పిల్లాడిని బాగా కొట్టారు మరియు తిట్టారు.ఇంతలో రక్షిత్ నాన్న సుధాకర్ అడ్డుపెట్టాడు.
ఇదంతా చూసి, "ఏం చేస్తున్నారు నా మనవడిని" అని చెప్పి, మనవడిని కౌగిలించుకొని, "ఏం జరిగింది?" అని శాంతంగా అడిగాడు.అప్పుడు సరస్వతి అంతా చెప్పింది. ఇప్పుడు సుధాకర్, రక్షిత్, సరస్వతులను చూస్తూ ఒక మాట చెప్పాడు. "నేను చెప్పేది కోపం తెచ్చుకోకుండా వినండి. దేవా తప్పు చేయడానికి కారణం మీరిద్దరూ.
"అప్పుడు సరస్వతి, "మావయ్యా! మేమేం చేశాం? వాడిని బాగా చూసుకోవడం తప్పా? వాడికి అడిగింది కొనివ్వడం తప్పా? ఏది తప్పు?" అని అడిగింది. అప్పుడు సుధాకర్ శాంతంగా, "అమ్మా సరస్వతి! మీరు చేస్తున్న తప్పు ఏమిటంటే... దేవాకు సమయం ఇవ్వకపోవడం.
అప్పుడు రక్షిత్, సరస్వతి, "మేము బిజీగా ఉండడం వల్ల సమయం ఇవ్వడం కుదరలేదు, అంతే ఈ గొడవ అంతా! కానీ వాడి మీద ప్రేమ లేక కాదు" అన్నారు. "సరేనమ్మా! మీకు ప్రేమ ఉంది, కానీ దానిని చూపించడానికి మీకు సమయం ఎక్కడ ఉంది? కంచంలో అన్నం చూస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? తినాలి! ప్రేమను చూపించాలి, దాచుకుంటే సరిపోదు" అన్నాడు.
దేవా చాలా ఏడుస్తూ ఉన్నాడు. దేవాను సుధాకర్ ఓదార్చి, ఆ పిల్లాడికి కొంత నీళ్లు తాగించాడు. ఇప్పుడు దేవేంద్ర మాట్లాడడం మొదలుపెట్టాడు. "అమ్మా! నాన్నా! మొదటిగా నేను వ్యసనానికి బానిస అవ్వడం తప్పు! నన్ను క్షమించండి! నేను వ్యసనాన్ని మానుకుంటాను.
నాకు చిన్నప్పటి నుంచి ఆకలి అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే, ఆకలి వేయకముందే అన్నం నా ముందు ఉండేది. డబ్బుకు లోటు లేదు. నేను మిమ్మల్ని అవమానించాలని గానీ, మీకు పాఠం చెప్పాలని గానీ అనడం లేదు. నాలో ఉన్న బాధను చెప్పుకుంటున్నాను.
చిన్నప్పటి నుంచి ఎంత ఖరీదైన ఆటవస్తువులు ఉన్నా, బడిలో ఎంతమంది స్నేహితులు ఉన్నా... నేను మాత్రం ఒంటరిగానే ఉన్నాను. ఎందుకంటే మీ పని కారణం గా నన్ను సరిగ్గా చూసుకోలేకపోయారు. ఒకరోజు నా స్నేహితుడి ఇంటికి వెళ్లాను. అక్కడ వాడి తల్లిదండ్రులు వాడిని చూసుకునే తీరు చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.
ఎన్నోసార్లు మీకు తెలియకుండా నిద్రపోయినట్లు నటించి, కుమిలి కుమిలి ఏడ్చాను. అందుకే నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆటవస్తువులతో ఆడటం, వ్యసనానికి బానిస అవ్వడం, స్కూల్లో అల్లరి చేయడం... అలవాటు చేసుకున్నాను."
దేవా ఇంకా ఏడుస్తూ, "అమ్మా! నాకు ఇష్టమైన ఆహారం ఏంటో కనీసం తెలుసా? అమ్మా! ప్రేమగా నాకు ఎప్పుడైనా తినిపించావా?" అన్నాడు. సరస్వతి గుండె పగిలిపోయింది. నాన్నా! నన్ను ఎప్పుడైనా భుజంపై ఎత్తుకున్నావా? కనీసం నాతో ప్రేమగా కాకపోయినా మామూలుగా అయినా మాట్లాడావా?
నాతో కొన్ని నిమిషాలైనా గడిపావా?" అని ప్రశ్నించాడు దేవేంద్ర. రక్షిత్ ఏడుస్తూ తల వంచుకున్నాడు. అప్పుడు దేవేంద్ర కాసేపు తీవ్రమైన మౌనం తర్వాత
"అమ్మా! నాన్నా! మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను... నాకు డబ్బులు, సుఖాలు, ఈ ఆడంబరాలు ఇవేవీ వద్దు! నాకు కాస్త ప్రేమాభిమానాలను భిక్షగా వేయండి అవ నాన్నా! చిన్నప్పటి నుండి నాకు ఏ బొమ్మ కావాలో, ఎలాంటి జీవితం కావాలో మీరే నిర్ణయించారు....
కానీ నా మనసులో ఏముందో, అసలు నాకేం కావాలో ఒక్కసారైనా అడిగారా? నాకు కొంత సమయాన్ని, కాస్త ధైర్యాన్ని, ఆత్మీయమైన అనురాగాన్ని ఇవ్వండి. కొన్ని మంచి విషయాలను, నా సుఖదుఃఖాలను మీతో పంచుకునే ఆ అమూల్యమైన సమయాన్ని నాకు భిక్షగా ప్రసాదించండి అమ్మా! నాన్న!
మీ కాళ్ళు పట్టుకుంటాను... దయచేసి నా తప్పులను క్షమించి, మీ సమయాన్ని నాకు బహుమతిగా ఇవ్వండి" అని కన్నీళ్లతో వేడుకున్నాడు.
అప్పుడు రక్షిత్, సరస్వతి దేవేంద్రను ఆత్మీయంగా కౌగిలించుకుని, బిగ్గరగా ఏడుస్తూ "మమ్మల్ని క్షమించు రా నాన్నా! మేము చాలా పెద్ద తప్పు చేశాం. నీ మనసులోని బాధను, ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాం" అని రోదించారు.
ఇంతలో ఊహించని విధంగా సుధాకర్ కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు.
విధి ఆ కుటుంబాన్ని కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. హఠాత్తుగా వచ్చిన తీవ్రమైన గుండెపోటుతో ఆయన శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. ఆయన ఇక లేరు అన్న నిజం ఇప్పుడే చిగురిస్తున్న రక్షిత్, దేవేంద్రల ప్రపంచాన్ని ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేసింది.
రక్షిత్, సరస్వతి, దేవేంద్ర ముగ్గురు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే రక్షిత్ అతను బ్రతికి ఉన్నంత వరకు తన కొడుకుకు సమయాన్ని, ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నాడు. సరస్వతితో కూడా మన దేవేంద్రకు మనం తప్ప వేరే ఎవరు లేరు మనం తనను బాగా చూసుకోవాలి అని చెప్పాడు.
తల్లిదండ్రులకు ఎన్ని పనులు ఉన్నా పిల్లలకు కచ్చితంగా సమయం ఇవ్వాలి. అప్పుడే పిల్లలను మంచి మార్గంలో నడిపించవచ్చు మరియు సమాజం వృద్ధి చెందుతుంది. సంస్కారం మరియు ఉన్నత విలువలు అనేది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అప్పుడు సమాజంలో స్త్రీల పట్ల, సాధారణ మనుషుల పట్ల జరిగే అన్యాయం తగ్గుతుంది.
