సీమా,ప్రేమకి ప్రేమ
సీమా,ప్రేమకి ప్రేమ
రజ్జో తాత అంటే ఊరి మొత్తానికి ప్రాణం,అభిమానం...
కానీ రజ్జోకి మాత్రం తన అర ఎకరం పొలం అంటే ప్రేమ,ప్రాణం....అందరూ తమ పిల్లలకి పేర్లు పెట్టుకుంటే,సంతానం లేని రజ్జో, ప్రతిమ జంట తమ పొలాన్నే బిడ్డగా అనుకుని సీమ అని పేరు పెట్టుకున్నారు...
బెహ్రి గ్రామం యాభై గడపలున్న చిన్న ఊరు...సిటీ కి దూరంగా,అడవికి దగ్గరగా ఉంటుంది...ఊరు మొత్తానికి కాయగూరలు రజ్జో పొలం నుంచే వెళ్తాయి... మిగతావారు గోధుమ,జొన్నలు తమ ఇంటిముందు ఖాళీ స్థలాలనే పొలాలుగా మార్చుకు పండించుకుంటారు....
రజ్జో పొద్దున్నే 5 గంటలకి పొలం వెళ్తాడు...ఒకసారి మొత్తం అంతా తిరుగుతూ....వంకాయ,సొరకాయ,
బెండకాయ, మూలి,మటర్ ఇలా అన్నిటిని పేరుపేరునా పలకరిస్తూఉంటాడు.... ఏ ఒక్కమొక్క నీరసించి కనిపించినా,పక్కనే ఉన్న నదినుంచి బకెట్ తో నీళ్లు తెచ్చి పొయ్యడు, తాగించినంత గొప్పగా పెంచుతాడు....
కూరగాయలన్ని కోసాక ఈ రోజు నీ పిల్లలు ,ఇంకో ఇంటి బిడ్డల ఆకలి తీర్చడానికి పోతున్నాయి సీమ..అందరికి ఆరోగ్యం,బలం ఇవ్వమని చెప్పు అంటాడు..
ఇంకా తాను అమ్మే కూరగాయలకి బదులుగా జొన్నలు లేదా గోధుమలు తీసుకుంటాడు... డబ్బు వ్యవహారాలు తక్కువే అక్కడ...
పుష్యమాసం వచ్చిందంటే బెహ్రి సందడిగా మారిపోతుంది...ఎందుకంటే ,రజ్జో తన పొలం పుట్టినరోజు జరుపుతాడు ఆ మాసం, మొదటి సోమవారం లో తన తండ్రినుండి హక్కుగా ఆపొలం తన చేతికి వచ్చిందని చెప్తాడు రజ్జో.....
ఆ రోజు ఊళ్ళో ఏ ఇంట్లో పొయ్యి వెలగదు....ఆడవాళ్లు కట్టెలకి అడవికి పోరు....రోజు మొత్తం రజ్జో ఇంటిదగ్గరే.... సంబరంలా జరుపుతాడు సీమ పుట్టినరోజుని.... పొద్దున్నే కావాలిసినన్ని పూరీలు,ఆలూ కూర....మధ్యాహ్నం సమోసా,జిలేబి,టీ.....సాయంత్రం రొట్టెలు మాంసం కూర,రాత్రికి ఈతకల్లు అందరికి.....తొమ్మిది దాటాక పన్నెండు వరకు శివనామ భజన.....తర్వాత పిల్లల కోసం పట్నం నుంచి వచ్చిన డీజె..... తెల్లవారుతుండగా ఎవరింటికి వాళ్ళు పోతారు....
పొలాన్ని రజ్జో అలంకరించడం ...అసలు అలా ప్రపంచ చరిత్రలోనే జరగలేదేమో.....అడవికి పోయి నేరేడు,మారేడు ఆకులు తీసుకొచ్చి,గుప్పుగా కొసకేసి కట్టి.....వెదురు కర్రల్ని పొలం నాలుగువైపుల కట్టి...
చుట్టూ అలంకారం చేస్తాడు ముందు రోజే....ఆపైన మందారం,బంతి,కోడిజుట్టుపువ్వులతో ఒకటే సజాయిస్తాడు.....మళ్ళీ మళ్ళీ చూసుకుని మురిసిపోతాడు....
రజ్జోది విపరీతం అని కొన్ని గడపలంటే, అలా మనకి సాధ్యం కాదని కొందరు సంతోషపడతారు...
ఆరోజు అడవిలో జంతువులు కూడా ఈ సంబరంలో సరదాగా గడుపుతాయి...
గత పదేళ్లుగా ఈ ముచ్చట సాగుతుంది....కానీ ఈ సంవత్సరం వాన సరైన సమయంలో పడక....పొలం నెర్రెలు తీసింది....
ఈ సారి పక్షం రోజులు పస్తుండేలా ఉంది పరిస్థితి అని కన్నీరు పెట్టుకున్నాడు సీమా దగ్గర...కన్నీటి చుక్కలతో తడిచింది అనుకున్నాడు ,కానీ వెంటనే ఆవిరి అయ్యేసరికి....బిడ్డకి ఎంత ఆకలేసిందో ,ఏంటో...
...అనుకుంటూ నదిలో నీటికని వెళ్ళేడు...కానీ తక్కువ నీరుతో నీరసంగా ఉంది ఏరు....
ఎలాగోలా పొలం తడిపెను అనుకున్నాడు,కానీ పోస్తూనే తాగేస్తోంది నేల... రేపు దీనికో పరిష్కారం ఆలోచిస్త...ఎం పర్వాలేదు....అని చెప్తూ ఇంటికి బయలుదేరేడు....
దారిలో దొర మనవరాలు కనిపించింది...రాజ్జోతాత... ఇది మా తాత నీకిమ్మనే అంటూ ఇత్తడి చెంబుతో పాలు అందించింది...తళతాళా మెరుస్తుంది చెంబు...
ఓ పిల్ల...చెంబు ఇంటికొచ్చి పట్టకపో అంటూండగానే, పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది...
ఈ పాలు కాచి కుండలో పోసి పెట్టు...పొద్దురాగానే పొలానికి పోయి తాపించాలి,మరువక చెంబు దొరకి పంపు.....అన్నాడుప్రతిమతో...
దొరా... యాడనుంచి వచ్చేడు...దొర ఊరికి పోయి ,పది రోజులయినియ్యి...నీకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది...
పొద్దున్నే అందరిళ్లా అడిగి,బిందెడుబర్రెపాలు
తీసుకుపోయేడు రజ్జో...ఎటి సంగతి అని కూడాపోతే ....పొలానికి పట్టిస్తుండు పాలన్ని...పిల్లలకి బలం ఎట్టా వస్తుండు...అలాంటి బలం నా పొలానికొద్దా అని సీమా తో అన్నాడు...
ఆనక ఇంటికి వచ్చిన రజ్జోతో అంది ప్రతిమ .....పొలానికి బిందెలు బిందెలు పాలు తాపిస్తే, మన సంసారం ముందుకెట్ల ఎళ్తుంది....ఇంతటితో ఈ పని ఆపు...ఊర్లో అందరూ, పిచ్చి అంటుండే నిన్ను.....
అనుకుంటే అనుకోని....నా బిడ్డ ఆవురావురుమని తాగుతుంది పాలు....బిడ్డకి బలం వస్తుంది....ఒక్క జడి వాన పడితే ,రెండూ కలిసి మళ్ళీ బంగారం పండుద్ది పొలంలో...అపుడేమంటవ్ చెప్పు ప్రతిమ...
ఇంకేం మాట్లాడటం...బువ్వ తిని పడుకోబోతుంటే పెద్దగా వర్షం మొదలైంది....పొలాన్ని చూడాలన్న కోరిక కదిలింది రజ్జోలో....
తెల్లార్లు మెలకువగా ఉన్నా,తెలవ్వారుతుండగా నిద్ర పట్టేసింది....తండా జనం ఇంటి మీద కొస్తే గానీ మత్తు దిగలేదు...
రజ్జో....నిన్ను పిచ్చి అన్నాం...మేమె పిచ్చోళ్ళమయినామ్...నీ పొలం చూసిరా పో...నీ సీమ బంగారంలా మెరుస్తుంది.... కలల ఉంది మాకే... కానీ ఆ తల్లి వల్ల కానిదేముంది....అంత బోలేనాధుడి కృప....ఒకటే పొగుడుతున్నారు రజ్జోని...
ఆత్రంగా పొలం చూడబోతే,చిన్ని చిన్ని మొలకలలో ఆ రాత్రి పాలు ఇచ్చిన చిన్నపిల్ల నవ్వుతూ కనిపిస్తోంది.....
సీమా...అప్రయత్నంగా బయటకి అన్నాడు...
అవును నా అమ్మ....నా నేలతల్లి... మనం ఏమి ఇస్తే అదే తిరిగి ఇస్తది....నా బంగారం ,నాకు దూరమౌతుందని భయపడ్డాను....కానీ నా సీమ ,నా ప్రేమకి,రెట్టింపు ప్రేమని తిరిగి ఇచ్చింది...
