శ్రీమద్రామాయణం
శ్రీమద్రామాయణం
రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి: బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు. 6 కాండల మీద ఒక కాండ – ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బ్రతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బ్రతికి చూపించాడు. మనం ఎలా బ్రతకాలో చూపించాడు. రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో – అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల వద్ద, సోదరుల వద్ద, గురువుల వద్ద, భార్య వద్ద ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి.
శ్లోకం: యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
కూజంతమ్ రామరామేతి
మధురమ్ మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకి కోకిలమ్ ||
రాముడి యొక్క ఆయనం (నడక, ప్రవర్తన) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి “సీతాయాశ్చరితమ్ మహత్:”, “పౌలస్త్య వధ” అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.
ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమై సత్యం నుంచి బాహరిల్లుతాయో,
ఎక్కడ విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
ఎక్కడ మనస్సు తలపులో, పనిలో నిత్య విశాల పధాలవైపు పయనిస్తుందో ........
అక్కడ రామాయణం పరిఢవిల్లుతూ ఉంటుంది.
ఈ రామాయణ గాధను మీకు సమర్పిస్తున్నప్పుడు మధ్య మధ్యలో సందర్భానుసారంగా నా భావ వ్యక్తీకరణ కూడా ఉంటుంది. పాఠకులు సహృదయంతో వాటిని స్వీకరించి తమతమ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
ఇక రామాయణ కథా స్రవంతి లోనికి ప్రవేశిద్దాము ......
