*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 01
*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 01
రామాయణం భారతజాతి జీవనాడి. హిందువుల ఆరాధ్య గ్రంధం. హిందువులే కాదు హైందవేతరులు కూడా చాలా దేశాల్లో పఠించి రాముడి జీవన శైలిని పాటించిన వారు ఎందరో ఉన్నారు. రామాయణం లోని అంతరార్థం హిందువులకన్నా వారికే ఎక్కువ తెలుసేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను - "రామాయణాన్ని చదవండి, చదించండి, చదివి వినిపించండి".
స్కాంధ పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వాల్మీకి మహర్షి గురించి ఇలా వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి వేదాధ్యయనం సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు.
ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి 'మీవద్ద ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను' అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా" అని అత్రి మహర్షి అన్నారు.
ఇంటికి వెళ్ళి తనవారందరినీ అడిగాడు తన పాపంలో కొంతభాగాన్ని పంచుకొమ్మని. "మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కానీ, ఎలా తెచ్చావు అన్నదానికి కలిగే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి" అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమని అడిగాడు. 'ధ్యానం చెయ్యి' అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు.
13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు (వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామధేయమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశాడు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
*తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |* *నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||* వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏమిటంటే - తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే................
*కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |* *ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||*
*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |* *విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||*
*ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |*
*కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||*
ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
