Vijaya Avadhanula

Inspirational

5.0  

Vijaya Avadhanula

Inspirational

ప్రతి రూపాలు..

ప్రతి రూపాలు..

2 mins
482


జ్ఞానం అంది నువ్వే నా ప్రతిరూపమని....

విజ్ఞానం అంది నువ్వే నా ప్రతిరూపమని....

సంస్కారం అంది నువ్వే నా ప్రతిరూపమని....

విజ్ఞత అంది నువ్వే నా ప్రతిరూపమని....

అన్నీ కలిసీ ఒకె గొంతుతో ఎలుగెత్తి పాతికేళ్ళ పల్లవి తో అన్నాయి.."నువ్వే మా ప్రతిరూపమం...నువ్వే మా ప్రతిరూపమం..."

పల్లవికప్పుడు ఏడేళ్ళు...

మొదటిసారిగా "ప్రతి రూపం" అన్న మాట వింది.

"అమ్మా, ఇవాళ మా స్కూలుకు భారతి టీచర్ అని ఒక కొత్త టీచర్ వచ్చారమ్మా, ఆవిడ ’ప్రతిరూపం’ అని తన మాటల్లో వాడారమ్మా ప్రతిరూపం అంటే ఏమిటమ్మా?" అమ్మనడిగింది పల్లవి..

"మీ టీచర్నే అడగలేక పోయావా?" చిరునవ్వుతో అంది కల్యాణి.

"అడుగుదామనుకొన్నానమ్మా...కానీ కొత్త టీచర్ కదా కోప్పడతారేమోనని భయమేసింది"

సందేహాలడిగినప్పుడు టీచర్లు "అనవసరమైన ప్రశ్నలెయ్యకు" అని కోప్పడి పిల్లల్ని కూర్చోపెట్టేయడం కళ్యాణికి కొత్త కాదు. అందుకే కూతురి భయాన్ని అర్ధం చేసుకొంది...

"ఐతే చెప్తా విను...అచ్చు మనలాగే ఉన్న పెయింటింగ్ వెయ్యడమో, విగ్రహం తయారు చెయ్యడమో, కర్రతో బొమ్మను తయారు చెయ్యడమో చేశామనుకో అప్పుడు దాన్ని మన ప్రతిరూపం అంటామన్నమాట!"

పల్లవి చాలాసేపు ఆలోచించింది....

"మరి మా భారతి టీచర్ ’మీరందరూ జ్ఞానానికీ విజ్ఞానానికీ ప్రతిరూపంగా తయరవాలి’ అని చెప్పారేమిటి? జ్ఞానం, విజ్ఞానం మనుషులు కాదుగా? వాటిని పెయింటింగ్ వెయ్యాలంటే ఎలా వేస్తాము?"

పల్లవి మాట వినగానే కల్యాణికి ఆ భారతి టీచర్ మీద గౌరవం పెరిగింది.

కానీ జ్ఞానానికీ విజ్ఞానానికి ప్రతిరూపాలు అన్న మాటని ఈ చిన్న పిల్లకి అర్ధమయ్యేటట్లు ఎలా చెప్పాలి?!

"ఇవాళ మీ భారతీ టీచర్ ఏం పాఠం చెప్పారమ్మా?" కూతుర్ని అడిగింది.

"ఇవాళ మా టీచరు వర్షం ఎందుకు పడుతుందో ఎలా మబ్బులు పుడతాయో చెప్పారమ్మా...అబ్బ! ఎంత బాగా చెప్పారో! అసలు నాకైతే పాఠం వింటున్నట్లు అనిపించలేదమ్మా...కధ వింటున్నట్లు అనిపించింది!! నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి మళ్ళా ఆ పాఠం చదివేసుకోవాలా అనిపించింది" కళ్ళు మెరుస్తుండగా అంది పల్లవి...

"అవునా? ఇప్పుడు అద్దంలో నువ్వు చూసుకో" అంటూ ఓ అద్దం కూతురి మొహం ముందు పెట్టింది కల్యాణి...

"అద్దంలో ఎలా కనపడుతున్నావ్?" కూతుర్ని అడీగింది...

"రోజూ లాగే కానీ కొంచం వేరేగా....రోజూ స్కూలునించి వచ్చాక అద్దంలో మొహం చూసుకొంటాను కదా ఏంటొ డల్‍గా కనపడుతుంది...ఇవాళేమో బ్రైటు (bright) గా ఉంది"

"ఎందుకో తెలుసా ఆ అద్దం లోది కూడా నీ ప్రతిరూపమే...కానీ ఇవాళ ఆ ప్రతిరూపంలోకి ఆనందం వచ్చి చేరిందన్నమాట! అలాగే కొన్నాళ్ళకి జ్ఞానం కొన్నాళ్లకి విజ్ఞానం వచ్చిచేరతాయన్న మాట!" వివరించింది కల్యాణి...

పల్లవికి కొంచం అర్ధమయింది...కొంచం అర్ధం కాలేదు...అదిగాక ఆ మేఘాల పాఠం మరోసారి తనివితీరా చదివేసుకోవాలనుంది...అందుకే మరేం ప్రశ్నలడక్కుండా అక్కడి నుంచి తుర్రుమంది.....

ఒకరోజు...

"అమ్మా మా భారతి టీచరు ఏ డౌటు అడిగినా పూర్తిగా అర్ధం అయ్యేదాక ఒదలకుండా చెప్తారమ్మా...క్లాసులో టైమయిపోతే ఇంటికి రమ్మంటారు..

టీచర్ల ఓపిక పిల్లలకి ఎంత ఉత్సాహాన్నిస్తుందో కల్యాణికి అర్ధమయింది

మరో రోజు...

"అమ్మా ఈ రోజు భారతి టీచర్ సైమల్టేనియస్ ఈక్వేషన్‍ల గురించి చెప్పారమ్మా....క్లాసులో అందరికీ అర్ధమయి పోయింది...ఎక్సూ వై ఇద్దరు పిల్లలనుకోమని వాళ్ళు ఎలా ఆడుకొంటారో చెప్పారమ్మా...భలే ఉంది...నేను అర్జంటుగా వెళ్ళి కొన్ని లెక్కలు చేసేసుకోవాలి...."

పిల్లల లెవెల్‍కి దిగీ పాఠాలు చెప్తే పిల్లలకి ఎంత సులభంగా అర్ధమవతుందో తెలిసింది కల్యాణికి...

మరో రెండు మూడేళ్ళ తర్వాత...

"అమ్మా ఇవాళ ఒక జామెట్రీ థియరమ్‍ని పుస్తకంలో ఉన్నట్లు కాక నా స్వంత పధ్ధతిలో ప్రూవ్ చేశానమ్మా...భరతీ టీచర్ ఎంత మెచ్చుకొన్నారొ!...నన్నే బోర్డు మీద అందరికీ ఆ థియరమ్ ని వివరించమన్నారు"

పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని గుర్తిస్తే వాళ్ళు ఎంత బాగా ఎదుగుతారో అర్ధమయింది కల్యాణికి...

పదేళ్ళు గిర్రున తిరిగాయి...

"టీచర్ 12th లో నేను స్టేట్ ఫస్టు రావడం మీరు చదువు చెప్పిన విధానమే" అంటూ భారతి కాళ్ళకి దండం పెట్టింది పల్లవి...

పల్లవిని లేవనెత్తి నుదుట ముద్దుపెట్టుకొంది భారతి...

మరో ఎనిమిదేళ్ళు గిర్రున తిరిగాయి...

"టీచర్ ఇవాళ నేను ఐయ్యేయెస్ అయ్యానంటే అందంతా మీ చలవే" అంటూ భారతి కాళ్ళకి దండం పెట్టింది పల్లవి...

"జ్ఞానానికీ, విజ్ఞానానికీ, సంస్కారానికీ ప్రతి రూపంలా ఉన్నావమ్మా" అంటూ మళ్ళా పల్లవి నుదుటన ముద్దుపెట్టుకొంది భారతి.

నిజం....భారతి లాంటి టీచర్లు ఉన్నంత కాలం జ్ఞానానికీ, విజ్ఞానానికీ, సంస్కారానికీ ,విజ్ఞతకీ ప్రతి రూపాలు తయారవుతూనే ఉంటాయి....

(టీచర్స్ డే సందర్భంగా మంచి టీచర్లందరికీ ఈ కధ అంకితం)


Rate this content
Log in

Similar telugu story from Inspirational