గాయత్రీ పెండ్యాల

Inspirational

4.1  

గాయత్రీ పెండ్యాల

Inspirational

నాలుక లోపలి నరం

నాలుక లోపలి నరం

5 mins
484



"అమ్మాయ్..! శేషమ్మా..!"

"ఆ,ఆ! వస్తున్నా పిన్నామ్! అట్లా బయటే నిలబడ్డావే రా..లోపలికీ...!"

"నా మనవడికీ ఉద్యోగమొచ్చిందంటగా...!!! ఊళ్ళో అందరూ అనుకుంటున్నారులేమ్మా!"

"హా! అవునూ పిన్నామ్! ఇన్నాళ్ళకి మా కష్టాలు గట్టెక్కినయ్."

"నిజమే తల్లీ! పాపం ఇన్నాళ్ళూ అల్లుడికి బాగలేక, మనవడికేపనీ లేక మీరు నానా అవస్థలు పడ్డారులేమ్మ! మీ ఇబ్బందులూ పగోళ్ళకీ కూడా రాకూడదు తల్లీ!"

"ఏదోలే పిన్నామ్! నీబోటి పెద్దల దయవల్ల అన్ని దెబ్బలు తిన్నా తట్టుకొనీ నిలబడ్డాము. యట్టనో వేడినీళ్ళకు చన్నీళ్ళన్నట్టూ ఏదో చిన్నదో,పొన్నదో బిడ్డకొకబతుకూదెరువు దొరికింది."

"చిన్నదంటావేందమ్మాయ్! గవర్నమెంటుజ్జోగమంటగా...! జీతమేమాత్రమిస్తారంటనే!!!"

""మేము అందరిలాగా వాణ్ణి సాఫ్ట్ వేర్లు చదివిచ్చలేదుగా పిన్నామ్! ఏదో.. మామూలు డిగ్రీనేగా! వాడూ.. కష్టపడీ ఆ టైపూ,కంప్యూటరూ నేర్చుకొబట్టీ ఆ టైపిస్ట్ పోస్టొచ్చింది. మొదట్లో ఇరవై వేలిస్తారంట పిన్నామ్!"

"ఆ..! ఇరవై వేలంటే ఊరకుందంటమ్మా! ప్రవేటు పనులకు పోతే పదివేలకన్నా పెచ్చిస్తారా వాళ్ళూ! పైగా పొద్దుగూకులూ గొడ్డు చాకిరీ చేపిస్తారూ. గవర్నమెంటోళ్ళకాడ అంత కష్టమేమీ ఉండదంటా, పోయ్యేకొద్దీ జీతం పేరిగేదే కానీ తరిగేదికాదుగా!

"పని చేసేవోళ్ళకీ ఎక్కడైనా పనుంటది పిన్నామ్! ఇంక జీతమంటావా! అది పెరిగేకొద్దీ ఖర్చులు గూడా పెరిగేవేకదా! కాకపొతే ఒకటి కొన్నాళ్ళు జాగర్తగా ఉండి అప్పులు తీర్చుకున్నామంటే.. కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతాము."

"అంతేలే తల్లీ! ఎలాగొ తంటాలు పడి పిల్ల పెళ్ళిజేసావు.. దానిబతుకదిబతుకుతుంది. ఈ ఏడు పిల్లోడికిగూడా జేసేసావంటే నీకాబాధ్యతగూడా తీరిపోద్ది."

"హా! అవును పిన్నామ్! ఏదో ఆ దేవుడు చల్లగా చూస్తే ఈ సంవత్సరంలోనే అబ్బాయికి కూడా చేద్దామనుకుంటున్నా పిన్నామ్!"

"వినాయకచవితి వస్తందికదమ్మా! ఏటేటా మనపక్క ఎవురోఒకళ్ళు వినాయకుడి బొమ్మ పెట్టిస్తారుగా! పొయినేడూ నరసిమ్మగారి పిల్లోడికీ ఉజ్జోగమొచ్చిందనీ వాళ్ళే బొమ్మకీ డబ్బులిచ్చారు నీకుగూడా తెలుసుగా!"

"అవును వాళ్ళబ్బాయికి అమెరికాలో ఉద్యోగమొచ్చిందనీ, నెలకు రెండులక్షల జీతమనీ నరసిమ్మగారి పద్మ చెప్పిందిలే పిన్నామ్!"

"అందుకే తల్లి! ఈ సారి ఆ కార్యం మీరు జేపిచ్చారంటే ముందునాటికి మీ ఇంటికి మాలక్ష్మొచ్చుద్ది.."

"అంతేనంటావా పిన్నామ్!"

"రొండేళ్ళనాడూ మన బాలయ్యగారు బొమ్మని పెట్టారు గుర్తుందా! అంతకముందూ వాళ్ళకన్నీ అప్పులేగదమ్మా! ఏమంటా బొమ్మబెట్టారో వాళ్ళ పొలానికీ మంచి రేటొచ్చిఃది. అంతటితో వాళ్ళ దరిద్రమొదిలిపొయింది."

"ఉన్న పొలమంతా అమ్ముకున్నారుగా పిన్నామ్!"

అయితేనేమి తల్లీ! అప్పులన్నీ బోయినయ్యీ ఇప్పుడు తలాఒక పని చేసుకుని బతుకుతున్నారు. అప్పు లేనోడే అసలైన ఆస్తిపరుడమ్మా!" 

నిజమేలే పిన్నామ్! ఒకరికాడ చెయిజాచకుండా బతకగలిగితే చాలు ఈ రోజుల్లో."

" తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తదనీ ఆ దేవుడు కూడా చల్లగా చూస్తేనే మనం ఇంత ముద్ద తినగలుగుతాము తల్లీ! ఏమంటావ్!"

"ఏమనేదేముంది పిన్నామ్! నువ్వు చెప్పిన మాటగూడా మంచిదేగా!"

"అందుకేనమ్మా! బొమ్మ పెట్టిచ్చుకోండి.. దోషాలేమైనా ఉంటే తొలిగిపోతాయి."

"అంతేలే పిన్నామ్! దేవుడికిస్తే మంచే జరూగూద్ది కదా!"

"దేవుడియ్యకపోతే మనకేడనుంచి వస్తది తల్లీ! వినాయకుడి కమిటీ పెద్ద మావోడే కదమ్మా! మళ్ళీ ఎవురికన్నా మాటిస్తాడేమోగానీ ఒకమాట చెప్పమ్మా!"

"అట్లే చేద్దాములే పిన్నామ్! సాయంత్రం అబ్బాయొచ్చినతరువాత వాడికొక మాట చెప్పీ మీ ఇంటికి పంపిస్తాలే పిన్నామ్!"

"అట్లాగే తల్లీ! మనవడు ఖర్చు గురించి ఆలోచించి వెనకడుగేస్తాడేమోదేవుడితో గూడిన విషయంగదా! నువ్వు చెప్పుకోని ఒప్పిచ్చుకోమ్మా!"

"అదేమిలేదులే పిన్నామ్? మా పిల్లలు పుట్టినప్పుటినుంచీ నీ కళ్ళముందే పేరిగారు కదా? నీకు తెలియందేముంది?"    

"నా మనవడి గురించి నాకు తెలీదా తల్లీ! వాడు బుధ్ధికి దేవుడంటోడమ్మా! ఆ దేవుడికి కొడవచేస్తాడా?పండగ దగ్గరకొస్తందిగదమ్మా! ఇల్లుబాగుజేయాల, మీ వొదిన పన్లో యేలుబెట్టదుగదా! నీకు తెలియందేముంది?"వస్తాను తల్లీ!"

"అబ్బాయిని సాయంత్రం పంపుతానని తమ్ముడితో చెప్పూ పిన్నామ్!"

"అంతకన్నానా తల్లీ! ఉంటానమ్మా! డబ్బులుకాడ ఇబ్బంది పడబాకండి తల్లీ! నీ తల్లెనక తల్లంటిదాన్ని. వడ్డీబొడ్డీగూడా చూసీ,చూడనట్టు పోనిస్తాగా నీకు దెలిసిందే!"

"ముందియ్యాల్సినది అట్లాగే ఉన్నా మళ్ళీ ఇస్తాననటం నీ మంచితనం పిన్నామ్!"

"నా మనవడు బాధ్యతగల్లోడు తల్లీ ఉంటానమ్మా!"

____________________

"అమ్మాయ్...శేషమ్మా! పనిలో ఉన్నావా?"

"ఆఆ! వస్తన్నా పిన్నామ్! కూర్చో.. గొడ్డుమేత తెచ్చీ కొట్టంకడేసొచ్చీ కాళ్ళు కడుక్కుంటున్నా.."

"కష్టజీవివమ్మా నువ్వూ!"

"హా! ఏంచేస్తాంపిన్నామ్? పని చేస్కోకపోతే కథగడవదుగదా!"

"ఏదో నీపై ఆపేక్ష పోగొట్టుకోలేకా ఆ వినాయకుడిద్వారానన్నా నువుపడే బాధలు తప్పిద్దామని చూస్తే అదీ ముడిబడేటట్టులేదు తల్లీ!"

"నువ్వనేదేమర్థంకావట్లేదు పిన్నామ్! ముడిబడక పోవటమేంది? రాత్రి పిల్లోడొచ్చినే...!"

"ఆఆ! వచ్చాడు తల్లీ! మీ తమ్ముడితో ఏమ్మాట్లాడేడో చేప్పాడా?"

"వాడు మీ ఇంటికాణ్ణించొచ్చేటప్పుటికి బాగా పొద్దు పోయిందిగా పిన్నామ్! నేనుపడుకున్నా.. పొద్దున్నే అడిగితే సాయంత్రం మాట్లాడదాములేమ్మా నాకాఫీసుకు టైమవుతుంది కదా! అన్నాడు."

"నిజమేలేమ్మా! మనపనుల తరవాతేకదమ్మా ఏపనైనా?"

ఆహా! అట్లేకాదు పిన్నామ్! నువ్వు చూస్తానే వున్నావుగదా! క్షణం తీరికలేనిపని.. ఏంచేసేది చెప్పు?

"అయ్యో..! నాకు తెలియందేముందితల్లీ! మనవడి మాట చాతుర్యం నీకు చెబ్దామని వచ్చాతల్లీ!"

"తమ్ముడితోగానీ, అన్నతో గానీ తప్పుగా ఏమన్నా మాట్లాడాడా ఏంది పిన్నామ్?"

"మనపక్కబజారోళ్ళ బొమ్మ ఇరవైవేలంటమ్మా! పెద్దింటోళ్ళంకదా.. వాళ్ళకన్నా పెద్దబొమ్మను తెస్తే కదమ్మా! మన పరువు నిలిచేది? మనోళ్ళతలగొట్టేసే పనులు మనమే చేసుకూంటే అవతలోళ్ళకీ మనమంటే లెక్కుంటదా చెప్పుతల్లీ?!"

"అంటే అచ్చం బొమ్మకే ఇరవైవేలు దాటుద్దా పిన్నామ్!?"

"శేషమ్మతల్లీ! ఇది దేవుడి కార్యం.. అట్లా లెక్కలేస్తే మనకొచ్చేదికూడా అట్లనే ఉంటది తల్లీ! ఈ సారి మీ అదృష్టమేందో తెలుసా!? ఇంతకముందు బొమ్మిచ్చినాగానీ.. అందరితోపాటూ కలిసి పూజ చేయించుకొవలసొచ్చేది.."

మరిప్పుడెట్లా పిన్నామ్!"

"బొమ్మిచ్చినవాళ్ళు మాత్రమే మొదటిపూజ,చివరిపూజ చేయించుకుంటారు.అంత భక్తితో బొమ్మిచ్చినోళ్ళని వొదిలేసి.. వట్టోళ్ళకి ఆపుణ్యం ఎందుకు పోగొట్టాలి? అని కమిటీ కొత్త నిర్ణయం తీసుకుందితల్లీ!"

"మరీ పుజ కమీటీ సేకరించిన చందాలతో జరిపిస్తారా పిన్నామ్?!"

"హయ్యో..! పిచ్చితల్లీ! అప్పుడూ పుణ్యమంతా పావలా,అర్దరూపాయి ఇచ్చిన వాళ్ళకెళ్ళిపోద్ది తల్లీ! కాసీకేళ్ళీవిశ్వనాధుడినిచూసినవాడికి.. పక్కనే ఉన్న విశాలాక్షిని చూడటం కష్టమవుతుందా చెప్పు?!"

"అంతేగా.. పిన్నామ్! నిండా మునిగినోడికి చలేంటి?,ఉన్నదంతా ఊడ్చేసుకున్నోడికి ఖర్చేంది???"

"అయ్యయ్యో..! తప్పు తల్లీ! తెలియక అన్నావుగానీ.. చెంపలేస్కోమ్మ! తధాస్తు దేవతలుంటారంటమ్మా! నా మనవడికి ఉజ్జోగం వచ్చిందంటే ఆ గణపయ్య కృప ఉండబట్టేకదా తల్లీ! "

"ఇంతకీ గనేషుని కృపతో ఉజ్జోగస్తుడైన నా కొడుకేమన్నడు పిన్నామ్?"

"మనవడిదేముంది తల్లీ! చిన్నబిడ్డ..దేవుడి పని ఏదైనా అనుకొకూడదు .. ఒకసారి అనుకున్నామా ప్రాణాలొడ్డైనా పూర్తిచేయ్యాలి తల్లీ! కాదంటే కీడు జరుగుద్ది." ఆ నిర్ణయమేదో మీ కుటుంబ క్షేమాన్ని తలచుకుని నువ్వే తీసుకోతల్లీ!"

"సరే పిన్నామ్!మా కుటుంబ క్షేమం కన్నా మిన్న ఏముంది చెప్పు..! నువ్వు కోరినట్లుగానే గనేశ పూజకు ఏర్పాట్లు చేయిస్తా.. సాయంత్రం అబ్బాయి మీ ఇంటికి వచ్చి.. శుభవార్త చెపుతాడుసరేనా?"

"నాతల్లే! నాకు తెలుసమ్మా! అటుచూడు..! స్వామి నిన్ని

ఆసీర్వ

దిస్తూన్నాడు.. నువ్వామాటనడంతోనే ఎంతవాన కురుస్తోందో.! ఈ ఏదు పంటలన్నీ నీ పుణ్యానే పండుతాయీ తల్లీ! ఇహ నేను బయలుదేరతానమ్మా! పుల్లలు బయట ఎండేసి వచ్చ తడిసిపోతాయి."

"ఆఆ..! పోయిరా పిన్నామ్! పుల్లలు తడిచిపోతే ఎట్లా గ్యాస్ అయిపోద్ది...! గ్యాస్ అయిపోతే నీకు ఖర్చవుద్ది...!"

____________________

              .

"పిన్నామ్... పిన్నామ్.... ఓ సూరమ్మ పిన్నామ్....! పిలుస్తూంటే ఆంతున బడిపోతావున్నావు.. యాడకి?"

"సిరోమణిగారింటికి పోతన్నాలే! మళ్ళొస్తా.."

"ఏంది పిన్నామ్! అంత తొందరపనా ఏందీ? నిలబడకుండానేబోతన్నావ్..!"

"ఆ.. ఏంలేదూ... వాళ్ళకీ.. చేజారిపోయిందనుకున్న పొలం పోలీసు కేసులో తిరిగొచ్చిందంటలేమ్మ!"

"ఓహొ! ఆ సంగతి అప్పుడే నీదాకా వొచ్చేసిందా? పోదువు గానిలేగానీ ఓ ముచ్చట చెప్తా ఇటుకూర్చో!"

"ఊళ్ళో.. వినాయకుడి కమిటీ కొత్తదొచ్చిందంటనే..!!! ఆ నీకెప్పుడో తెలిసిపోయే ఉంటదిలే"" పిన్నామ్! ఊరందరిబాగొగులు చూసేదానివిగదా...!!!"

"పాపగాలం తల్లీ! పదేళ్ళనుంచి నాబిడ్డ చేత గొడ్డు చాకిరీ చపిచ్చుకొనీ.. కొత్త కొమ్ములొచ్చేలోకీ.. తప్పిచ్చేసారు. ఆ దేవుడు చూడకపోతాడా...??"

పాపం.. దేవుడు మాత్రం ఎంతమందిని చూస్తాడులే పిన్నామ్! ఆయనకున్నదిగూడా రొండుకళ్ళేగా???"  

"ఆ.. శేషమ్మా! అన్నట్టు మర్చిపోయా.. మాయటపూటా ఆయేభై వేల కాగితం తీస్కొస్తాగానీ డబ్బులు చూసిపెట్టుకోమ్మా! మూడేళ్ళవుతంది.. ముందు మనమనుకున్నట్టూ మూడురూపాయలు ఒడ్డీ తల్లీ..! మర్చిపోతావేమోననీ ముందే చెప్తన్నా..!"

"అదేందీ! మా తమ్ముడు రాత్రి నీకు చెప్పలా?"

"ఎందుకు చెప్పడుగాని.. నేనెవుర్నిపరామర్సించను బోయానో?"

"అదీ నిజమేలే పిన్నామ్! నీకసలే నాలుగు వేల కళ్ళుకదా!!!" 

"ఏందమ్మాయ్! నీ ఇంటికొచ్చాననాఏంది! అట్ట మాట్టాడుతున్నావ్?"

"ఊళ్ళో వోళ్ళందరూ నీవోళ్ళనుకుంటావుగద, నువ్వందరిమనిషివిగదాఅని నేనంటే అట్లా ఉడుక్కుంటావేంది పిన్నామ్.. చిన్నపిల్లలాగా..?!!"

"అదేమీ లేదులేమ్మాయ్! ఏదో పెద్దదాన్నిగదా కాస్త చాదస్తం లేమ్మా! అదేందో ముచ్చటన్నావూ.. ఏందమ్మా అదీ!"

"ఇయాల పొద్దున్నే చాటింపు విన్నావా!?"

"ఆ ఇఈరిగోడూ మా ఇంటి కల్లి రాలేదట్టుంది తల్లీ! దేని గురించేసాడో మరీ!?"

కొత్త కమిటీ వాళ్ళూ కొత్తకొత్త నిర్ణయాలు తీసుకున్నారంట పిన్నామ్! పదేళ్ళనుంచీ ఉన్న పాత కమిటీ జాగర్త చేసిన వినాయకుడి డబ్బంతా ఉపయోగించీ.. ఊరజెరువు పూడిక తీపిస్తారంటా, కమిటీ సభ్యులంతా ఒంగోలు పోయీ మునుస్పాలిటీ వాళ్ళతోటి మాట్లాడీ చెరువుకి నీళ్ళు పెట్టిస్తారంట, అంతేనా ఊళ్ళో కట్టొదిలేసిన టాంకీకీ మంచినీళ్ళుబెట్టిచ్చీ పంపులకి నీళ్ళొదులుతారంట, ఈ ఏడు వచ్చిన చందాలతోటీ పిల్లల భరతనాత్యం ప్రోగ్రాము పెట్టిస్తారంటా, పండగ నాడూ.. పూజైపోగానే కుర్రోళ్ళంతా కలిసీ , చెరువు చుట్టూ ఉన్న గట్టు పైనా మొక్కలు నాటుతారంటా, వచ్చే వినాయకచవితిలోపు యవరి మొక్కైనా చచ్చిపోతే.. వాళ్ళు కమిటీకి పదివేల జెరిమానా కట్టాలంటా...!"

 "పదిరకాల కూరలు చేసీ.. అలసిపోయీ... అన్నమొండటం మర్చిపోయిందంట వెనకటికి నాయంటిదొకటి.

అట్టనే ఎన్ని పనులు జేపిచ్చేంలాభం? ఒక్కడూ బొమ్మ తెచ్చేవాడు లేడూ, భక్తితో పూజచేసేవాడు లేడు.. అందుకేనేమో! మొన్నటినుంచీ యడతెరుపు లేని వాన కురుస్తుంది. చేటుగాలానికి నీటి బెడదంటే ఇదేనేమో!?"

"వానకోసం అందరూ ఓనమాలు జపిస్తుంటే.. నువ్వేంది పిన్నామ్! చేటుగాలం,పోటుగాలం అంటావు? నేను చెప్పెది పూర్తిగా చెప్పనియ్యవు?"

"నువ్వెన్నన్నా చెప్పమ్మాయ్! ఇవ్వన్నీ.. తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేవే! మనిషన్నాకా కాస్త పుణ్యం,పురుషార్థం ఉండాలీ..!!!"

"మనిషి నాలుకకు నరం లేదంటలే పిన్నామ్! ఏంచేస్తామ్? పండగ ఎల్లుండేగా! రేపు సాయంతర్ఆనికొచ్చీ వినాయకుడి బొమ్మ తీసుకెళ్ళు..!"

"ఏందమ్మాయ్! బొమ్మలు చేసి అమ్ముతున్నారా?

"పచ్చకామెర్ల సామెత చెప్పనులేగానీ.. చెరువులో పూడిక తీపిస్తున్నారని చెప్పాగా! ఆ మట్టితో గనేశ ప్రతిమలు చేయించీ, ఊరు మొత్తానికీ ఉచితంగా పంపిణీ చేయాలని,ఆ పనితనం ఉన్న పేద కళాకారులకు తన మొదటి జీతం ఇవ్వాలనీ, మన బజారులో ఈసారి రంగులేని వినాయకుడిని ప్రతిష్టించాలనీ, స్వఛ్ఛమైన ఈ మట్టి ప్రతిమలన్నింటినీ మన ఊరు చెరువులోనే నిమజ్ననం చేయాలని మా అబ్బాయీ కొత్త కమిటీకి సూచించాడు.. కమిటీ వాళ్ళంతా ఈ మంచి పనులకు ఆనందంగా ఆమోదం తెలిపారు. పని కూడా మొదలయ్యింది పిన్నామ్!" 

""ఆహా! నా మనవడా మజాకా?! బొమ్మతేవటానికి ఒంగోలెవురు బోతారా అనుకున్నాతల్లీ! ఇంకాదిగులు లేడూ.. అబ్బాయికీ పుణ్యమొచ్చిద్దమ్మా!"

"నీ నాలుక లోపల గాలం పెట్టి గాలించినా నరం దొరకదులేగానీ.. బొమ్మ కొనే ఖర్చు తగ్గిందిగా! కాస్తా ప్రశాంతంగా పూజ చేసుకునీ, పుణ్యమో, పురుషార్థమో సంపాయిచ్చుకో పో...!!


Rate this content
Log in

Similar telugu story from Inspirational