Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Abhilash Myadam

Inspirational

4.2  

Abhilash Myadam

Inspirational

కాగితం లో కాకి

కాగితం లో కాకి

2 mins
171


ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు.


 పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు..


 ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. 


కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి.


అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. 


కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు. ...


మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. 


దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది.


ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది.


 ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది.


 కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది.


ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా,


మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి.ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. 


మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 


'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'కాగితంలో కాకి చిత్రం' అనే ముక్క చేర్చలేదు. 


ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ ' అంటూ మరో మాట చేర్చింది. 


ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.


వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే ... పాపం! రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. 


మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను 'అంటూ వాపోయింది.


మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. 


అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. 


ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. 


అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి . 


కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది. 


*'"ఒక్కోసారి అంతే! మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. అలాంటి వందల మంది నీకేలా? " అంటూ ఓదార్చింది కొమ్మమీద కోయిలమ్మ.*


*సూక్తి:*

*ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా,అతనితో స్నేహం చేయకుండా,అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం,పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి సన్నిహితుణ్ణి కోల్పోవటమే కాదు,అదే సమాజం లో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి...*లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే వచ్చిందా మరి


Rate this content
Log in

More telugu story from Abhilash Myadam

Similar telugu story from Inspirational