Parvatheesam Guru

Inspirational

4.6  

Parvatheesam Guru

Inspirational

జీవనవేదం

జీవనవేదం

7 mins
321


సాయంకాలం 5 కావస్తుంది. పార్కంత అపుడపుడే మధ్యాహ్న నిద్ర లేచి మొహాలు కడుక్కుని గొంతులో వెచ్చగా టీనీళ్ళు పోసుకుని సరదాగా సాయంత్రపు బాతాఖానీ స్నేహితులను కలవడానికి కొంతమంది, ఆరొగ్యాన్ని పెంచుకొవడానికి నడవడానికి వచ్చేవారు కొంతమంది. చిన్నపిల్లల్ని ఆడించడానికి తల్లులు, సరదాగా ఏ పొద మాటునో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కొంత మంది నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. అప్పుడే హడావుడిగా అరవై ఐదుకి ఓ రెండు సంవత్సరాలు అటూ ఇటుగా వయసుండే ఓ పెద్దాయన పార్కులోకి హడావుడిగా అడుగు పెట్టి తనకు చాలా అలవాటైన బెంచ్ దగ్గరకు వెళ్ళి కూర్చోకుండా ఆ బెంచ్ ముందు కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఇప్పుడేం చెయాలి అన్నట్టు చెతులు నలుపుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ అస్తమాను పార్కు ఎంట్రన్స్ గేటు వైపు చూస్తూనే వున్నాడు.. అడుగు అడుగుకు నిరాశ, నిస్ప్రుహా, కోపం ఇలా అడుగు అడుగుకు మొహంలో భావాలు మారుతూనే వున్నాయి, ఇంక ఏం చేయాలో తెలియక సహనం కోల్పోయి పార్కుని వీడీ వెళ్ళిపోవడానికి సిద్ధపడి గేటు వైపు నడుస్తుండగా పగలబడి నవ్వుతూ వస్తున్న ఒక ముసలి గ్యాంగ్ ని చూసి మోహంలో వెలుగు వచ్చి, కొంచేం కోపంగా ఏంటయ్యా ఇంత లేట్ మీ కోసం ఎంత సేపటి నుండి ఎదురుచూస్తున్న అనుకున్నారు, కళ్ళుతో పాటు కాళ్ళు కూడ కాయలు కాచాయ్ అని అంటుండ గానే “ఏంటోయ్ ఆనందరావ్ ఈ రోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావ్ ఏంటి విశేషాలు”, ఏమయ్య నా మోహం చూస్తుంటే ఆనందంగా కనిపిస్తుంద నీకు, అంటూ పద్మనాభం పైన విరుచుకుపడతాడు. ఏదో సరదాకి అలా అన్నాడు లేవయ్యా వదిలేయ్ ఆనందం, ముందు ఇలా కూర్చుని అసలు ఏమయ్యింది చెప్పు అంటున్న భూషణం వైపు చూసి, ఇప్పుడు సరదాలూ ఆడే మూడ్లో లేనయ్యా నా పైన జోక్ లు వేయోద్దు. పోన్లే కాని ఇంతకీ ఏం కొంపలంటుకున్నాయ్ చెప్పవయ్యా ఇలా ఆవేశపడకుండా పడకుండా. ఇప్పటికి నువ్వొక్కడివే నా బాధ అర్ధంచేసుకున్నావ్ రఘుపతి. అని అప్పతి వరకు ఆవేశపడిన ఆనందం నిదానంగా అనేసరికి శాంతించాడని అర్ధమై, సర్లే ఇంతకీ ఏంటి కథ. “కథ కాదయ్యా వ్యధ”. సరే ఆ వ్యధేదో చెప్పు. “కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు, చెప్పుకుంటే తగ్గిపోయేది కాదయ్యా నా సమస్య”, సరే ముందు సమస్య చెప్పు తరువాత తగ్గుద్దో తగ్గదో చూద్దాం అనేసరికి.

ఏముందయ్యా పేరులో తప్ప ఇప్పుడు నాకు అసలు ఆనందమే లేదు. ఒక్కగానొక్క కొడుకు కదా అని గారాభం చేసాను. చిన్నప్పుడు వాడు స్కేట్ బోర్డ్ అడిగితే సైకిల్ ఇచ్చాను, తరువాత బైక్ అడిగితే కారు. పక్క రాష్ట్రంలో చదువుకుంటానంటే నీకేం కర్మరా అని విదేశాలకి పంపించాను. కానీ ఇప్పుడు వాడికి నేను భరువైపోయానంటా ఏదైన ఓల్డేజ్ హోమ్ లో నా బరువుని దించేసుకుందాం అని చూస్తున్నాడు. అంటూ చిన్న పిల్లాడి లా కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఆనందాన్ని ఓదారుస్తూ... అవును నీ కోడుక్కి నువ్వంటే భయం కదా అతనే స్వయంగా ఈ విషయం చెప్పాడా అని అడిగిన భూషనం వైపు చూసి లేదు నా మనవడు చెప్పాడు, వాళ్ళు అనుకోకుండానే చిన్న పిల్లాడు చెప్తాడా.. అని చిన్న పిల్లాడిలా తిరిగి ప్రశ్నించిన ఆనందాన్ని చూసి ఏదో ఆలోచిస్తున్నట్లు రఘుపతి కొంచెం ముందుకు వచ్చి ఒక పని చెయ్య్ నాకు కాశీ చూడాలని ఉంది అలానే పనిలో పని కేథారుడు, సోమనాథుడు, ప్రహ్లాదులు లాంటి వార్లు ఎవరున్నా చూసి ఒక షికారు చేసి వస్తా అని చెప్పి ఒక నెల నాళ్ళు చక్కా తీర్ధయాత్రలు తిరిగిరా నీకు మనశ్శాంతిగా వుంటుంది, పెద్ద దిక్కు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసొస్తుంది. ఆఁ ఆఁ ఆ క్షవరం కూడా అయింది అనగానే మరి ఏం అన్నడు నీ కొడుకు అని మాట మధ్యలోనే అందుకున్న భూషణంని కోపంగా చూస్తూ, చలి ఎక్కువగా వుంది కాశీ ఏం వెళ్తారు, కాళహస్తి వెళ్ళి అడ్డ బొట్టు పెట్టుకుని వచ్చేయ్ అంది నా కోడలు. అని వాపోయిన ఆనందాన్ని చూసి నవ్వుతూ, సరి సరి మీ వాళ్ళు కాళహస్తి అయిన వెళ్ళమన్నారు నా కొడుకయితే “నువ్వెలాగూ పోతే అస్తికలు కాశీలోనే కలపాలి కదా ఇప్పుడెందుకు నాన్న అనవసర ఖర్చులు అన్నాడు. అని చెప్పిన పద్మనాభాన్ని చూసి అందరూ ఒక్క సారిగా నవ్వేస్తారు. ఇంతలో అక్కడికి వస్తూనే ఏంటయ్యా అప్పుడే మొదలెట్టేసారా అంటున్న సుందరాన్ని చూసి, మీకేంటండీ కొడుకులూ కోడల్ల బాదలూ, కష్టాలూ లేవు అంటున్న పద్మనాభం మాటల్ని మధ్యలోనే అందుకుంటూ, నిజమే నాకు బరువులూ బాధలూ లేవు కాని అంత కన్నా ప్రమాదకరమైన ఒంటిని కొరికే చక్కెర వ్యాధి, దానికన్నా ప్రమాదకరమైన నా భార్య వున్నారయ్యా అవి చాలు ప్రాణం తీయడానికి అనగానే అందరూ గొల్లున నవ్వేస్తారు.

ఆనందరావు నవ్వాలో ఏడవాలో తెలియక ఇక చాలుకానీ, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండయ్యా? అని అడగడంతో మన చలపతి నీకు గుర్తున్నాడు కదూ. ఎవరూ.. ఏప్పుడూ తన కొడుకు కోడలు తనని పట్టించుకోవట్లేదని బాధపడేవాడు అతడేనా..? ఆఁ అతడే కాని ఒకప్పటిలా బాధపడాల్సిన దౌర్భాగ్యం ఇప్పుడతనికి లేదు చాలా ఆనందంగా తన కొడుకు కోడలితో కలసి సరదాగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు, అని రఘుపతి అనగానే అక్కడున్న వారందరు ఏమిటి ఇది నిజమా.. వాడి కోడలు మరీ ఘటికురాలు కదటండోయ్, మాములుగానే వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేది అలాంటిది ఇప్పుడు బాగా చూసుకుంటుంది అంటే మొత్తం ఆస్థి కోడలి పేరు మీద రాసేశాడా ఏంటి ఆ చలపతి. అని పద్మనాభం తను విన్నది నమ్మలేనట్లు అడిగాడు. ఏమోనయ్య నాకు కూడా తెలియదు నాకూ నిన్ననే తెలిసింది. కాసేపు ఆగండి కొడుకు-కోడలితో కలసి ఈ పార్కుకే వస్తాడుగా వాడ్నే అడుగుదాం. అని రఘుపతి చెప్పగానే అందరూ ఆ అదృష్టవంతుడైన చలపతిని చూడటానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు.

సరిగ్గా అరగంట తరువాత రఘుపతి మాటల్ని నిజం చేస్తూ కొడుకు-కోడలితో చాలా సరదాగా వారి వయసు వారిలా నవ్వుకుంటూ పార్కు లోపలికి వస్తున్న చలపతిని చూసి అందరు కను రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తుంటారు. ఆ విషయం తనకి ముందే తెలుసు కాబట్టి అందరి కన్నా ముందు తేరుకున్న రఘుపతి “ఏమోయ్ చలపతి ఓక్కసారి ఇటు రావోయ్” అని చలపతి వైపు చూసి అరిచినట్టుగా పిలుస్తాడు. తనని పిలుస్తున్న రఘుపతిని చూసి వస్తున్నా అన్నట్టు సైగ చేసి, తన కొడుకు కోడలికి నేను మధ్యలో కలుస్తా అని చెప్పి రఘుపతి వాళ్ళ దగ్గరకి వస్తాడు. ఏదో ప్రపంచ వింత అక్కడ జరుగుతున్నట్లు మిగిలిన వాళ్ళందరు చలపతిని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఎగురులాంటి నడకతో అక్కడికి వస్తాడు చలపతి. 

చలపతి అక్కడికి రావడంతోనే ఏమయ్య ఏం మాయ చేసావ్ మీ వాళ్ళని ఆ మాయేదో మాకు కూడా చెప్పి కొంచేం పుణ్యం కట్టుకోకూడదు, అంటూ ఆనందరావు మొదలేట్టేసరికి నువ్వుండవయ్య పద్దతి పాడు లేకుండా వచ్చిరాగానే అలా అడిగేస్తే చలపతి ఏమైనా అనుకోడూ అంటూ , చలపతి ఏమైనా అనుకుని ఆ గండికోట రహస్యం చెప్పడేమో అని చిన్న భయంతో మధ్యలోనే అందుకుంటాడు పద్మనాభం. దానికి ఒక పెద్ద వికటట్టహాసం చేసి “పోనిలేవయ్యా చాలా బాధల్లో ఉన్నట్టున్నాడు ఆమాత్రం ఆత్రం ఉంటుందిలే అంటూ ఆనందరావు మాటలకి తనేమి ఇబ్బంది పడలేదన్నట్టు వాతావరణాన్ని తేలిక చేసాడు చలపతి. ఇవన్ని సరేగాని ఇంతకీ ఆ వశీకరణ విద్య ఏదో మాకు కూడా నేర్పవయ్య అని రఘుపతి ఏదో రహస్యం అడుగుతున్నట్లు లోగొంతుకతో నెమ్మదిగా అడుగేసరికి “అదేంలేదయ్యా ఆ వశీకరణం మనందరి చేతుల్లో ఉంది కాని మనమే దానిని గుర్తించలేక వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాం” అనగానే “అదేదో త్వరగా చెప్పవయ్యా బాబు” అని భూషణం మధ్యలో తగులుకుంటాడు. చిన్నగా నవ్వి “ఏం లేదయ్యా ఇంతకు ముందు నా కొడలికి నాకు అస్సలు పడేది కాదు, ఏప్పుడూ తనని నేను ఏదో ఒకటి అనడం తను నన్ను తిట్టుకోవడం. నా కన్నా పెళ్ళాంతోనే ఎక్కువ కాలం ఉండాలని తెలిసిన నా మేధావి కొడుకు నన్నే చాదస్తపు వాడ్ని అనే వాడు. “ఒక రోజు నేను పార్కు నుండి ఇంటికి వెళ్ళేసరికి కొడుకు-కోడలు గొడవ పడుతున్నారు, నేను ఏదో యథాలాపంగా “ఏంటి రా ఎప్పుడూ కోడల్ని ఏదోకటి అంటావ్ అని మా వాడ్ని తిట్టాను, ఇలాంటి గొడవల్లో ఎవరో ఒకరి మద్దతు కోసం చూడటం ఆడవాళ్ళకి బాగా అలవాటు కదా, వెంటనే మా కోడలు నా దగ్గరకి వచ్చి చూడండి మావయ్యా నేను మా పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైంది దానికి తోడు అమెరికా నుండి మా మేనత్త వచ్చింది చూసొద్దాం రమ్మంటే నా పైన కోపడుతున్నాడు మీ అబ్బాయి” అని నా దగ్గరకి వచ్చి చాడిలు చెప్పడం మొదలెట్టింది, వెంటనే మా వాడు కూడా “అసలే బోలెడన్ని ప్రాజెక్టులూ పెండింగ్లో ఉన్నాయ్ ఈ సమయంలో లీవ్ ఇవ్వరు అంటే వినిపించుకోవడం లేదు” అని వాడి బాధని కూడ నాకే చెప్పడంతో, “ఆఫిసు పని ఎప్పుడూ ఉండేదే కదరా ఒక ప్రాజెక్టు అయిపోగానే మరొకటి ఇస్తారు, వాటిని పూర్తిచేసిన తరువాతే ఇంట్లో పనులు అంటే నువ్వు రిటైర్ అయిపోవాలిగాని నీకు వీలు చిక్కదు కాబట్టి ఏదోక సెలవు పెట్టి రెండు రోజులు పిల్లని వాళ్ళింటికి తీసుకు వెళ్ళు అని ఏదో ఆ సమయానికి నాకు తోచిన సలహా ఒకటి పడేసాను దాంతో మా కోడలు “చూసారా మావయ్య కూడ చెప్పారు మీరింక నన్ను తీసుకెళ్ళాల్సిందే, మీరు కాలు కడుక్కుని రండి మావయ్య వేడిగా టీ పెట్టి ఇస్తాను అని లోపలికి వెళ్ళీపోయింది, ప్రతీ రోజు నేను ఇంట్లోకి అడుగు పెడితేనే చిరాకు పడే నా కోడలు అలా మట్లాడే సరికి నేను చాలా ఆశ్చార్యపోయాను, ఇంతలో మా వాడు నన్ను పక్కకి తీసుకుని పోయి ఏంటీ నాన్న మీరు కూడాను అదంటే అర్ధం చేసుకోకుండా మట్లాడుతుంది, మీరు కూడా దానికి వత్తాసు పలుకుతారు అని బాధపడుతుంటే “అది కాదురా పెళ్ళాలని ఏ విషయంలో అయినా గెలవ వచ్చు కానీ వాళ్ళ పుట్టింటి విషయాలలో మాత్రం గెలవ లేము అయిన “పెళ్ళాం అడిగినప్పుడు వాళ్ళ పుట్టింటికి తీసుకు వెళ్ళీ అక్కడికి వెళ్ళీ ఒక రోజైన తరువాత సడేన్ గా ఆడిటింగ్ జరుగుతుందంటా అర్జంటుగా వెళ్ళలి కావలంటే నువ్వు రెండు రోజులు ఉండి రా అని చెప్పు, అయ్యో మీరు ఒక్కరు ఇబ్బంది పడతారు అని తను కూడా తను అడిగిన వెంటనే వచ్చావన్న ఆనందంలో ఉంటుంది కాబట్టి నీతో పాటు వచ్చేస్తుంది, తను అడిగింది చేసినట్టు అవుతుంది నీ పని కూడా జరిగిపోతుంది, ఆఫీసులో పోరు కన్నా ఇంతి తోటి పోరు అస్సలు పడలేము, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని మావాడికి సంసారోపదేశం చేసాను, మా వాడు దానికి చాలా థాంక్స్ నాన్న నిజంగా ఒక అద్బుతమైన సలహా ఇచ్చావ్ అని చాలా ఆనందంగా లోపలికి వెళ్ళిపోయాడు. బాగా ఆలోచిస్తే నాకు అప్పుడు అర్ధం అయింది ఎప్పుడూ మీరు మీ ఛాదస్తంతో అంటూ నా పైన కొప్పడే కొడలు తనకి మద్దతు ఇచ్చినట్లు మాట్లాడటం, ఒక చిన్న సలహ ఇచ్చేసరికి ఎప్పుడూ విసుక్కునే నా కొడుకు నన్ను చాలా ఆనందంగా థాంక్స్ నాన్న అని ప్రేమగా పిలవడంతో, మనం చేస్తున్న తప్పేంటొ అప్పుడు అర్ధం అయింది, ఆ రోజు నుండి నేను మా కోడలికి వంత పాడుతూనే కొడుక్కి పెళ్ళాంతో ఎలా నడుచుకోవాలో సలహాలు ఇస్తూ వాళ్ళిద్దరితో ఆప్యాయంగా ఆనందంగా గడిపేస్తున్నాను”. అని గండికోట రహస్యం పూర్తి చేసినట్లు అందరి వైపు చూస్తాడు. అంటే మనం వాళ్ళ భజన చేస్తూ ఈ శేష జీవితం గడిపేయాలంటావా అని పద్మనాభం అడుగుతాడు, భజన కాదు సంసారమనే చదరంగంలో మనం వేసే ఎతుగడలు, మనం మాములుగా అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఆచారాలు, వ్యవహారాలు అంటే ఈ కాలపు పిల్లలు వాల్లు, మనం చెప్పేవన్ని చాదస్తాల్లా కనిపిస్తాయ్ అలా కాకుండా వాల్లు చేసే పనిని పొగుడుతూ, వాళ్ళ తరాన్ని మనం అర్ధం చేసుకుంటూ చిన్న చిన్న సలహాలు ఇస్తూ వాళ్ళతో కలిసిపోయి అప్పుడు మన ఆచారాలు వ్యవహారాలు వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పావంటె, సంతోషంగా చేస్తారు అని చలపతి చెప్తుండగా, అంటే ఇక మనం మనకి చిన్నప్పటి నుండి ఉన్న అలవాట్లని వదిలేసుకోవాలంటావ్ అని ఆనందరావు మధ్యలో అడ్డుపడి అడిగేసరికి “అవసరం లేదయ్యా ఇప్పుడు నీకు టీవిలో రాత్రి 9 గంటల వార్తలు చూడటం అలవాటు, కాని మీ కోడలికి ఆ టైంలో సీరియల్ చూడటం ఇష్టం, నువ్వు కూడ కొన్ని రోజులు తనతో పాటు ఆ సీరియల్ చూడు దాని గురించి ఆమెతో మాట్లాడు నెమ్మదిగా ఆ సీరియల్ చూసే కన్నా సరదాగా రేడియోలో పాత పాటలు వింటూ మేడ పైన అబ్బాయితో సరదాగా గడుపు అమ్మాయి అని ఒక సలహా ఇవ్వు ఒక్కసారి ఆ ఏకాంతానికి అలావాటు పడితే వాళ్ళు టీవి సీరియల్ చూడటానికన్న అలా గడపడానికే ఎక్కువ ఇష్టపడతారు” నీ పని అవుతుంది వాళ్ళ సంసారం కూడా బాగుంటుంది” అని ముక్తాయింపు ఇచ్చిన చలపతి వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు, మనం వాళ్ళ దారిలోకి వెల్లినా వాళ్ళు మనల్ని పట్టించుకోక పోతే అని ధర్మసందేహం అడిగిన ఆనందరావుకి, “ప్రతి ఒక్కరు ఏదొక చోట మెత్త పడతారు అదేంటొ తెలుసుకుని దానికి తగ్గట్టుగా కాలానుగునంగా ఎప్పటికప్పుడు మనం కూడా కంప్యూటర్స్ లా అప్-డేట్ అవ్వాల్సిందే అని ఆధునిక జీవిత సత్యాన్ని భోదించాడు చలపతి. “నాన్న రండి ఇంక వెళ్దాం అని కొడుకు పిలిచేసరికి “ఆ వస్తున్న” అని తన స్నేహితులందరికీ ఆనందంగా జీవించడానికి కావల్సిన “రహస్యాన్ని” చెప్పి కొత్తగా నడక నేర్చిన దూడలా చెంగు చెంగున గెంతుతూ వెల్లిపోతాడు. 

               స్నేహితుడు చెప్పిన మాటల్లో వాస్తవం గ్రహించి తక్షణం వాటిని అమలులో పెట్టే యోచనలో ఎవరి అలోచనలు వాళ్ళు చేసుకుంటూ ఆ వృద్ధ బృందం తమ తదుపరి ఆనందమయ జీవితానికి ఒక అద్భుతమైన రహస్యం దొరికిందన్న సంతోషంలో చక చకా ఆనందమయ శేష జీవితానికై కదులుతారు.

.... సర్వేజనాః సుఖినోభవంతు ...


Rate this content
Log in

More telugu story from Parvatheesam Guru

Similar telugu story from Inspirational