STORYMIRROR

Vijaya Lakshmi Manchem

Inspirational

4  

Vijaya Lakshmi Manchem

Inspirational

నిశి లో శశి

నిశి లో శశి

7 mins
291

“కలలు అనేవి నిద్రలో వచ్చేవి కాదు, మనకి నిద్ర పట్టకుండా చేసేవి” అన్నారు కలాం గారు. కలలు కనడం  ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఇంకెవరో కూడా అన్నారు. శశి సాయంత్రాలు వాకిట్లో మడత మంచం మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఎన్నో కలలు కనేది. కలల్లో మునిగి తేలిపోయేది. మబ్బులపై స్వారీ చేసి ప్రపంచం  మొత్తం చుట్టి వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచించేది.  అప్పుడప్పుడు కనిపించే విమానాల్ని చూసి ఎప్పటికయినా నేను విమానంలో ఎగిరితీరాలి అని అనుకునేది.


శశి వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. వాళ్లకి వచ్చే కొద్దిపాటి  సంపాదనతో ఎలాగో సరిపెట్టుకుని  బతుకుతున్నారు. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా నెల గడిస్తే అదే వాళ్లకి పెద్ద పండగ. 


శశి తన చెల్లెలితో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. స్వతహాగా తెలివైంది కావటం వల్ల చదువులో ఎప్పుడూ ముందే వుండేది. అది చూసి వాళ్ళమ్మ తెగ సంబరపడిపోయేది. తనకి సరిగ్గా చదువబ్బకపోవడం వల్లనే ఇలాంటి చాలీ చాలని బతుకు బతకాల్సి వస్తుంది అని, తన పిల్లలు బాగా చదువుకుని చాలా గొప్పవాళ్ళు కావాలని తను కూడా కలలు కనేది.


శశి కుటుంబ పరిస్థితిని బాగా అర్ధం చేసుకున్నది కావడం వల్ల, పెట్టినది తిని, ఉన్న బట్టలు కట్టుకుని తన కలల సామ్రాజ్యం లో మాత్రం మహారాణి లా తిరిగేది. 


శశికి పదహారేళ్ళ వయసులో ఒకరోజు వాళ్ళ అమ్మ, నాన్న మాటాడుకోవడం వింది. ఇంట్లో బియ్యం నిండుకుంటున్నాయి అని, అప్పు ఎవర్ని అడగాలో తెలీట్లేదు అని దాని సారాంశం. వెంటనే తన కుటుంబం కోసం ఏదయినా చేయాలని నిర్ణయించుకుని చుట్టుపక్కల పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పడం మొదలెట్టింది. తన సంపాదన వల్ల వాళ్లకి చాలా సాయం అయింది. తనకి కూడా తన మీద నమ్మకం బాగా పెరిగింది. 


శశికి పదిహేడేళ్ల వయసులో వాళ్ళ అమ్మకి చెప్పేసింది “అమ్మా నేను ఇంజనీరింగ్ చదివి యూకే వెళ్లి ఎంఎస్ చదువుతాను” అని.  

వాళ్ళమ్మకి ప్రపంచ పటం లో యూకే ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎమ్మెస్ అంటే ఏంటో అస్సలు తెలీదు. కూతురి మాటలు  విని చాలా గర్వంగా అనిపించినా తమకి అంత స్తోమత లేదు అని గుర్తుకు వచ్చి ఆ దేవుడి మీద భారం వేసేసింది నా పిల్లల్ని నువ్వే ఓ గట్టుకి చేర్చు తండ్రీ అని. 


ఆతృత కొద్దీ  తనకి తెల్సిన నలుగుర్నీ ఆడిగేది అమాయకంగా. “మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతానంటుంది, అది మంచిదేనంటారా? దానికి ఉద్యోగాలు వస్తాయంటారా” అని. 

“అబ్బో అది చాలా గొప్ప చదువు, ఉద్యోగానికి ఢోకా లేదు”  అని వాళ్ళు అంటే మనసులోనే ఎగిరి గంతులు వేసేసేది. 


మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలంటే ఏ ఎంట్రన్స్ రాయాలి అని తెలుసుకుని ఆ పుస్తకాలు కొనుక్కొని తానే చదవటం మొదలెట్టింది శశి. కోచింగ్ కి డబ్బులు కట్టి వెళ్ళడం వాళ్ళతో కాని పని కాబట్టి ఆ దిశలో తను  ఆలోచించలేదు కూడా. 


అప్పుడు వాళ్ళు అద్దెకుండే ఇంట్లో బాగా పడిన వానలకి  కరెంటు పోయింది. తిరిగి కరెంటు వచ్చేలా చేయాలి అంటే చాలా ఖర్చు పెట్టాలి . ఆ ఇంటి ఓనర్ నిక్కచ్చిగా చెప్పేసింది మీరే  ఖర్చుపెట్టుకుని వేయించుకోండి అని. ఆ కరెంటు వేయించుకునే అంత డబ్బు లేక, పోనీ ఇల్లు ఖాళీ చేద్దాం అంటే బయట ఇంకా ఎక్కువ అద్దె కట్టాల్సివస్తుంది అని చేసేదేమీ లేక అదే ఇంట్లో కరెంటు లేకుండా కాలక్షేపం చేసేసారు ఆరు నెలల పాటు. 


సాయంత్రం ఆరుకల్లా వెలుగుండగానే అన్నం తినేసి, ఒక లాంతరు తీసుకుని డాబా మీదకి వెళ్లి రాత్రి వరకు చదువుకునేది. గొప్ప గొప్ప వాళ్లంతా వీధి దీపాల్లో చదువుకుని పైకొచ్చారు కదా నేను కూడా పైకొస్తాను అని తనలో తనే మురిసిపోయేది.


కష్టపడి ఎలాగైతేనేం ఎంట్రన్స్ లో మంచి రాంక్ తెచ్చుకుని తను వుండే ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీ లో సీటు తెచ్చుకుంది. ఫ్రీ సీటైతే తెచ్చుకుంది గానీ  ఇంజనీరింగ్ పుస్తకాలు కొనాలంటే చాలా  ఖర్చు కాబట్టి ఇంకేం చేయొచ్చు అని ఆలోచించి, ఉదయం ఇంటికివెళ్లి చెప్పే ట్యూషన్స్ (home tuitions) రెండు ఒప్పుకుని, సాయంత్రం తన ఇంటి దగ్గర ట్యూషన్స్, ఇంకా తన కాలేజీ ఇలా ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చాలా కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

 

శశికి చదువు కాగానే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. తన చెల్లెలి చదువుకు తను సాయం చేయాల్సిన అవసరం ఎంతో వుంది అని గ్రహించి వెంటనే ఉద్యోగం లో చేరిపోయింది. తన జీతం తనకి తన కుటుంబ ఖర్చులకు సరిగ్గా సరిపోయేది. ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకా పైకి ఎదగాలి  అని కలలు కనడం మాత్రం మానలేదు శశి.  


కాలం గడుస్తుంది.  శశికి ఇరవైనాలుగేళ్ళు. చెల్లెలి చదువు కూడా పూర్తి అయి ఉద్యోగం లో చేరిపోయింది. తన బాధ్యత కొంతవరకు తీరింది కాబట్టి ఇంక తన కల నెరవేర్చుకునే సమయం దగ్గర పడింది అని ఆ దిశ లో ప్రయత్నం చేయడం మొదలుపెట్టాలి అని నిర్ణయించుకుంది. 


వాళ్ళ అమ్మ కి తెల్సు తన కూతురికి విదేశాలకు వెళ్లాలని బలమైన కోరిక అని.  తను ఎన్నో సార్లు అనుకుంది తమ దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే కూతుర్ని పై చదువులకి పంపించి ఉండేవాళ్ళం కదా అని.

బ్యాంకు లో లోన్ తీసుకుని వెళ్లాలన్నా కూడా తనఖా పెట్టడానికి ఏదయినా ఉండాలి కదా. అయినా సరే తన ప్రయత్నం గా వాళ్ళ చుట్టాల్లో బ్యాంకు లో పనిచేసేవాళ్ళని అడిగింది వాళ్ళు ఏమైనా సాయం చేయగలరా అని. తనఖా  పెట్టడానికి ఏమీ  లేకపోతే మేము కూడా ఏమీ  చేయలేము అని తేల్చేశారు వాళ్లంతా. 


పైగా కొంతమంది చుట్టాలు ఆకాశానికి నిచ్చెన వేయడం మాని, గంతకి తగ్గ బొంతని చూసి పెళ్లి చేసేయండి అని ఉచిత సలహాలు కూడా ఇవ్వడం మొదలెట్టారు. వాళ్ళని మనసులో తిట్టుకుని, ఇంతకాలం కుటుంబం కోసం కష్టపడిన తన కూతురి కోరిక ఎలాగయినా తీరాలని తనకి  వున్నా, అది తీరే దారి లేక, చేసేదేమీ లేక బాధ పడేది వాళ్ళమ్మ. 


శశి మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. తనకి తన మీద, తన కల మీద చాలా నమ్మకం. అది ఎలాగయినా జరిగి తీరుతుంది అని.


సరే, ఏదయినా కానీ మొదట యూనివర్సిటీ కి ఐతే అప్లికేషన్ పెడదాం అని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. IELTS రాసి పాస్ అయింది. మంచి యూనివర్సిటీ లో సీటు అయితే వచ్చింది కానీ వాళ్ళు స్కాలర్షిప్ ఆఫర్ చేయలేదు. సమయం దగ్గర పడుతుంది. ఇంకో రెండు నెలల్లో కోర్స్ మొదలవుతుంది. వెళ్లే దారి కనపడ్డం లేదు. తన ఫ్రెండ్స్  ఇంకా తెల్సిన వాళ్ళు, ఏంటి ఈ పిల్ల మొండి ధైర్యం? ఎలా వెళ్తుంది డబ్బు లేకుండా?? అని అనుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళమ్మకి కూడా నమ్మకం లేదు. 


ఒకరోజు శశి ఆఫీస్ లో పని చేస్తుండగా తన పర్సనల్ మెయిల్ ఐడికి ఒక ఇమెయిల్ వచ్చింది. పంపిన వాళ్ళ పేరు చూస్తే తనకి తెల్సిన వాళ్లలా లేదే, ఎవరై వుంటారు అని మెయిల్ తెరిచి చూసింది.

అందులో సారాంశం చదివి అది తనకి కాదు, తన పేరుతో వున్న ఇంకెవరికో వెళ్లాల్సింది తనకి వచ్చింది అని గమనించింది 

సరే పోనీ మనకెందుకులే అని వదిలేయలేక ఆ పంపిన వాళ్ళకి సమాధానం రాసింది,


“క్షమించండి మీరు ఎవరో అనుకుని నాకు తప్పుగా మెయిల్ పంపించారు” అని. 


“అయ్యో సారీ నా చెల్లెలి కూతురికి వెళ్లాల్సిన ఇమెయిల్ మీకు ఎలా వచ్చిందో తెలీదు, ఏమి అనుకోవద్దు” అని జవాబు.

“అయ్యో పర్వాలేదండి, మీరు మెయిల్ వెళ్ళింది అనుకుని,  రిప్లై కోసం ఎదురుచూస్తారేమో అని తెలియచేసానంతే” అని తిరిగి జవాబు ఇచ్చింది.


ఆ విధంగా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. శశికి చెప్పారు ఆయన తన పేరు శ్రీనివాస్ అని, వయసు యాభై, ఇంకా తను ఒక బ్యాంకు ఉద్యోగి అని, తెలుగు వారే అయినా  ఉద్యోగరీత్యా అహ్మదాబాద్ లో కుటుంబం తో సహా నివాసం అని. 

శశికి ఎక్కడో చిన్న ఆశ, బ్యాంకు ఉద్యోగి అంటే ఏదయినా సాయం చేస్తారేమో అని.  ఒక వారం రోజులు ఇద్దరికీ సంభాషణలు జరిగాక  శశికి పర్వాలేదనిపించి తన గురించి మొత్తం చెప్పింది ఆయనకి, తను ఎలా యూకే వెళ్లి చదవాలని అనుకుంటుందో అంతా చెప్పింది. 


ఆయనకీ ఎందుకో శశి కథ విని అందులో నిజాయితీ కనపడింది. తను ఏదయినా సాయం చేయగలనేమో అని బాగా అలోచించి శశితో తన స్నేహితురాలు ఒకామె శశి ఉండే ఊర్లోనే ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్ లో పని చేస్తుంది వెళ్లి ఆమెని కలవమన్నారు.


ఇంటికి వచ్చి వాళ్ళమ్మ కి జరిగిన విషయం చెప్తే  “ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తావా? ఇందులో ఏదయినా మోసం ఉందేమో వెళ్లొద్దు” అని మొత్తుకుంది. “ముక్కు మొహం తెల్సినవాళ్ళు మనకి సహాయం చేయలేదు కదా, అయినా నన్ను నేను రక్షించుకోలేనంత అమాయకురాల్ని కాదు. బ్యాంకుకే  కదా నేను వెళ్ళేది, వెళ్లనీ నన్ను, చూద్దాం ఏ పుట్టలో ఏ పాము  ఉందో”  అని వాళ్ళమ్మ ని ఒప్పించింది శశి. 


తన డాకుమెంట్స్ అన్నీ తీసుకుని బ్యాంకు కి వెళ్లి శ్రీనివాస్ గారు చెప్పిన మేడం ని కలిసింది.  ఆవిడ చాలా  మంచిది. శశి తెచ్చిన డాకుమెంట్స్ అన్నీ చూసి ఇలా అంది. 


“నీ సర్టిఫికెట్స్, నీకు వచ్చిన మంచి యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ని చూసి బ్యాంకు తప్పక లోన్ ఇస్తుంది కానీ 9 లక్షల లోన్ కావాలి అంటే ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు లాంటిది ఏదయినా తనఖా పెట్టాల్సిందే. కానీ  ఒక ఏడు లక్షల వరకు అయితే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి పర్సనల్ గా గారంటీ ఇస్తే చాలు”  అని చెప్పి శశి ముందే  శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని ఆయనకీ కూడా వివరించింది ఆ మేడం.


శశి కి తెలుసు అలా గారంటీ ఇచ్చేవాళ్ళు తనకి తెల్సిన వాళ్లలో ఎవ్వరూ లేరని. ఇన్నాళ్ళూ ఎంతో ఆశ తో పట్టుదలతో ఉన్నా ఎందుకో ఒక్కసారిగా శశికి నిజంగానే తను ఆకాశానికి నిచ్చెన వేస్తున్నానేమో అని అనిపించి దిగులు తో ఇంటికి వెళ్ళిపోయింది. 


శ్రీనివాస్ గారు బాగా ఆలోచించారు. ఆయనకి  మనసులో అనిపిస్తుంది  ఈ అమ్మాయి కి ఎలాగయినా సహాయం చేయాలని.   కానీ ఎవరో తెలీని అమ్మాయికి తాను పర్సనల్ గారంటీ ఎలా ఇవ్వాలి అని రెండు రోజులు తర్జన భర్జన పడ్డాక చివరికి ఆయన సాయం చెయ్యాల్సిందే  అని నిర్ణయానికి వచ్చారు. తన ప్రోవిడెంట్ ఫండ్ ని సూరిటీ గా పెట్టి శశికి ఏడు లక్షల లోన్ సాంక్షన్ చేయించి  మిగిలిన డబ్బు ఆయనే పర్సనల్ గా  అప్పుగా కూడా ఇచ్చారు


శశి ఆనందానికి హద్దులు లేవు. ఇదెలా సాధ్యం అని తన అమ్మ, నాన్న ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్స్ నోట మాట రాలేదు. ఆ దేవుడే శ్రీనివాస్ గారి రూపంలో  వచ్చినట్టున్నారు అనుకుంది  వాళ్ళమ్మ. 


నాకు ఉద్యోగం రాగానే మీ అప్పు, ఇంకా బ్యాంకు లోన్ అన్నీ తీర్చేస్తాను మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని శతవిధాల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి శశి వెంటనే వీసా కి అప్లై చేసింది. మూడు రోజుల్లో వీసా రావడం, యూకే కి బయల్దేరడం వెంట వెంటనే జరిగిపోయాయి.


మొట్టమొదటిసారిగా విమానం ఎక్కడం అనే ఆ అనుభవం చాలా కొత్తగా చాలా బాగుంది శశికి. ఆ విమానం అలా గాల్లోకి ఎగురుతుంటే కింద దూదిపింజల్లా తేలిపోతున్న మేఘాలని చూసి తనకి చిన్నపుడు మేఘాలపై స్వారీ చెయ్యాలనే తన కల గుర్తుకు వచ్చి ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయింది.  


శశి చదువు పూర్తి చేసుకుని యూకే లో నే ఉద్యోగంలో చేరి సంవత్సరం లోపే లోన్ మొత్తం తీర్చేసింది. 


ఎన్నో సార్లు అడిగింది శ్రీనివాస్ గారిని  “నన్ను ఎలా నమ్మారు? నేనెవరో తెలీకుండా కనీసం నన్ను ఒక్కసారి కూడా కలవకుండా” అని. 

“ఏమో నాకు తెలీదు ఎవరో నీకు సాయం చేయమని నాకు గట్టిగా  చెప్పినట్టు అనిపించి చేసాను అంతే” అని అంటారు ఆయన. 


ఇది నిజంగా జరిగిన కథ అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. 


నీ మనసు స్వచ్ఛమైనది, సంకల్పం బలమైనది అయితే నీ కలలన్నీ నిజమై నీ ముందు నిలబడతాయి అనడం లో సందేహం ఏమైనా ఉందా?


రచన: మంచెం విజయలక్ష్మి 


Rate this content
Log in

More telugu story from Vijaya Lakshmi Manchem

Similar telugu story from Inspirational