Kadambari Srinivasarao

Inspirational

4.2  

Kadambari Srinivasarao

Inspirational

ఎవరు గొప్ప?(మినీ కథ)

ఎవరు గొప్ప?(మినీ కథ)

1 min
381


వీరేశం, తారకం ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ పక్కపక్కపొలాల్లో రైతులూనూ. ఒకరోజు వాళ్లిద్దరూ పొలానికి వెళ్లే దారిలో కలిసి మాట్లాడుకుంటూ సినిమా గురించి చర్చ వస్తుంది.


"ఒరేయ్! తారకం నువ్వు ఒకటి చెప్పు,వందచెప్పు. మునుపటి తరం నటులు చక్కగా నటించేవాళ్ళురా." అని వీరేశం అంటూండగా, తారకం "ఊరుకోరా, నువ్వు పెద్ద చెప్పొచ్చేవుగానీ. ఆ మహేష్ బాబు చూడు. రెండు బిల్డింగుల మధ్యనుంచీ గాల్లో ఎగిరేసి విలన్ ని ఒక్క తన్ను తన్నేస్తాడు. పాత సినిమాలలో డిష్యుం డిష్యుం సౌండ్లు తప్ప ఫైట్లు బాగోవురా." అనగానే వీరేశానికి చిర్రెత్తుకొచ్చి

"ఇప్పుడున్న నటులకు ఒక్క డైలాగన్న సవ్యంగా చెప్పడం వచ్చునేంట్రా?దాన వీర శూర కర్ణలో రామారావు గుక్కతిప్పుకోకుండా చెప్పిన డైలాగు చూడు. ఎంత బాగా చెప్పాడో!?"


ఇలా ఇద్దరిమధ్య వాదన కొనసాగుతూనే వుంటుంది. ఆదారిన పోతున్న శంకరం మాస్టారు వీరిద్దరూ వాడులాడుకోవడం గమనించి విషయం కనుక్కోవడానికి దగ్గరకు వెళ్లగానే 

"నమస్కారం రండి శంకరం మాస్టారు" అంటూ వీరేశం " ఏంలేదు మాస్టారు ఈ తారకం ఒకటే వాదన. ఇప్పుడున్న నటులు బాగా నటిస్తారని. నేనంటాను పాత తరం నటులు చక్కటి హావభావాలతో నటించేవారని. మీరే చెప్పండి మాస్టారు మా ఇద్దరిలో ఎవరివాదన కరెక్ట్?"


వెంటనే తారకం అందుకొని "నమస్కారం మాస్టారు, ఇప్పటి తరం నటులు వేసే స్టెప్పులు గానీ, ఫైట్లుగానీ అంతబాగా పాతతరం నటులకు చేతనయ్యేదా!"


అంతా శాంతంగా విన్న శంకరం మాస్టారు ఒక చిరునవ్వు నవ్వి,

" మీ ఇద్దరి వాదనల్లోనూ సత్యం లేకపోలేదు గానీ ఈ విషయంలో మీరిద్దరూ తగవులాడుకోవడం సరికాదు. అప్పటి నటులైనా, ఈ తరం నటులైనా వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ జీవన భృతి కోసం పాటు పడుతున్నారు. పైపెచ్చు మనం డబ్బుపెట్టి టిక్కెట్లు కొని సినిమాలు చూడడం మనకేంటి లాభం? వాళ్లే డబ్బు చేసుకుంటున్నారు. మీరలా తగవులాడుకోవడం వల్ల మీకేంటి లాభం? సినిమా మానసికోల్లాసం కోసమే చూడాలి గానీ ఇలా మీరిద్దరూ తగవులాడుకొని మంచి మిత్రులుగా ఉన్న మీరు శత్రువులుగా మారిపోతారా ఏంటి?" అని వాళ్ళిద్దరినీ మందలిస్తారు.


శంకరం మాస్టారు చెప్పింది ఏదో అర్ధమైనట్లుగా వాళ్లిద్దరూ తలాడించి పొలం వైపు దారి తీస్తారు

**********************************


Rate this content
Log in

Similar telugu story from Inspirational