Babu Koilada

Inspirational

5.0  

Babu Koilada

Inspirational

అడుగుల సవ్వడి

అడుగుల సవ్వడి

3 mins
536నిర్మాన్యుష్యమైన ప్రాంతం ..నిశ్శబ్దం


దట్టమైన పొదల చాటు నుండి ఏవేవో గుసగుసలు.


"మనకు ఈ పరిస్థితి వస్తుందని ఎన్నడూ నేను ఊహించలేదు. మన వలన ఎంతమంది ఉపయోగం పొందలేదు. అయినా మనల్నే అంతం చేయడానికి ఎందుకు వాళ్ళు ఇంత నీచానికి దిగాజారుతున్నారు" ఆమె కంఠం బొంగురుపోయింది.


గొంతులో నుండి మాట పెగలడమే కష్టంగా ఉంది.


"నీది అర్థం కాని ఆవేదన" అన్నాడు అతను.


"అవును! నీకు అన్ని అర్థం కాని ఆవేదనలే. ఆపసోపాలు పడుతూ, ఎండనకా వాననకా కష్టపడుతూ రక్తాన్ని చిందిస్తుంటే , కనీసం కృతజ్ఞత కూడా లేని వాళ్ళ కోసం బ్రతకడం నీకు కష్టంగా లేకపోవచ్చును గాని, నాకు నెత్తురు ఉడికిపోతుంది"


"ఇంతదాకా పరిస్థితి వస్తాదనుకోలేదు. అయినా ఎన్ని రోజులు. ఏ రోజుకైనా మన బ్రతుకులు రాలిపోవలసినదేగా. అయినా అయిన వాళ్ళ కోసం సర్వస్వాన్ని అర్పించుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అది వర్ణనాతీతం" అతను వేదాంతిలా మాట్లాడుతున్నాడు.


"అలాగని నిన్ను తోలుబొమ్మలా చేసి ఆడిస్తే నేను ఊరుకోలేను. అయినా నేనేమి చేయగలను.ఏమి చేయలేను అనేమో ఆ దేవుడు నన్ను నిస్సహాయురాలిని చేసాడు. ఎవరి కోసమో నువ్వు నెత్తురు ఎందుకు చిందించాలి? ఎన్నాళ్ళో కలిసున్నాము. సహజీవనం సాగించాము. కష్టాలు...నష్టాలూ పంచుకున్నాము. కాని ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకుంటే ..."


ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతను మౌనం వహించాడు.


"నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. ఎవరేమనుకున్నా సరే .ఇతరుల సంగతి నాకు అనవసరం. ఇది భావోద్వేగాలను పంచుకొనే సమయం కాదు"


"నీ భావోద్వేగాలు నీకు ఉండవచ్చు. కాని నాది నీ పై ఉన్న అవాజ్యమైన ప్రేమ. ఈ లోకం పూర్తిగా చెడిపోయింది. ఈ చెడిపోయిన లోకం కోసం నువ్వు నీ ప్రాణాలనే పణంగా పెడుతున్నావు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. చెడును ద్వేషించవలసినంతగా ద్వేషించక పొతే మంచిని ప్రేమించాల్సినంతగా ప్రేమించాలేము"


ఆమె మనోవ్యధకు గురి అయ్యిందన్న విషయాన్ని అతను గుర్తించాడు. "నా సృష్టి లోకహితం కోసం. మన ఆశయాలు సేవాభావం కలిగి ఉండాలి. అదే మనం నేర్చుకున్న నీతిశాస్త్రం. నీతి లేని నాడు జీవుడు బ్రతికినా చచ్చినట్లే కదా"


"తమ స్వార్ధం కోసం నీతిని పక్కదారులు పట్టిస్తున్న వారికి లేని నీతి నీకెందుకు ప్రియతమా! నువ్వు ఈ భూమాతకు అసలైన బిడ్డవి. నువ్వు ఎంత మందికి లోకోపకారం చేయలేదు? నువ్వు ఎంత మంది ఆపన్నులను ఆదుకోలేదు? ఎంత మందికి నువ్వు ఆధారమైనావు? అయినా నిన్నే మట్టుబెట్టడానికి పథకాలు రచిస్తున్న వారిని నువ్వు క్షమించవచ్చు గాని నేను క్షమించలేను"


ఆమె మాటలు అతన్ని కదిలించాయేమో, ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని వైపు జాలిగా చూసింది.


"నాలా ఎందఱో ఈ ప్రపంచం కోసం జీవితాలను అర్పించుకుంటూనే ఉన్నారు. వారందరూ ఈ పుడమి తల్లి ముద్దుబిడ్దలే. కాని ఇది చాలా బాధాకరమైన విషయం. నేను అనుకున్న నా వాళ్లకు నేను అవసరమనుకుంటే నా ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్దమే. కాని వారు నాటుతున్నవి విషబీజాలు. ఆ బీజాలు మనల్ని కృంగి కృశించేలా చేస్తున్నాయి. ఎన్నాళ్ళు దేవుడా ఈ నరకయాతన అని మౌనంగానే దుఃఖాన్ని దిగమింగుకొనేలా చేస్తున్నాయి. ఇది తీరని బాధ. ఈ యాతన దారుణమైనది. ఈ బాధకు నా హృదయం ఎప్పుడో బీటలు వారింది."


ఆమె అతని కళ్ళలోని నీటిని తన వేళ్ళ తో తుడవాలనుకుంది. కాని అది అసాధ్యం!


ఆమె చేతికి ఆమెకు తెలియకుండానే ఎప్పుడో సంకెళ్ళు పడ్డాయి.


"భగవంతుడా! ఏమిటి ఈ ఘోరం" ఆమె ఆర్తిని వినేవారు ఎవ్వరూ లేరు. "నీ మాటలు ఎవరు వింటారు ప్రియతమా! ఎవ్వరూ వినరు. మనం ఆ పరిస్థితికి చాల దూరంగా వచ్చేసాము. ఇది ఊహకందని మార్గం. ఈ మార్గం లో మనకు 

అన్నీ బీటలు వారిన హృదయాలే కనిపిస్తాయి. అదిగదిగో చూసావా! ఆ కళేబరాల నగ్ననృత్యం. అదిగదిగో వినిపిస్తుందా...ఆ భయంకర సంగీతం. వద్దు! గట్టిగా చెవులు మూసుకో. నువ్వా ఘోష భరించలేవు. జీవరాశులను మట్టికరిపించే వినూత్న వారధిని అదిగో అక్కడే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు మనల్నే పునాదులుగా వాడాలని ఆ యోచన. ఆ పునాదులలో మన ఎముకలు విరిగిపోవచ్చు. అప్పుడు నన్నే తలుచుకో నా ప్రియా! నా పై నీకున్న అవాజ్యమైన ప్రేమ గుర్తుకు వస్తుంది. నా ప్రేమ గుర్తులు నీ యెదలో స్మరణకు వస్తే నీ గాయాల బాధలు కూడా నాకు ఆనందాన్నే కలిగిస్తాయి."


అతని మాటలు ఆమెకు లీలగా వినిపిస్తున్నాయి.మైకం కమ్మినట్లు ఆమె శరీరం అటు ఇటు జోగుతుంది.


"ప్రియ!..." అతను ఒక సారి ఆమెను పిలిచాడు.ఆమె పలుకలేదు.అతను తనకు తోచిన రాగాలాపన చేసుకుంటూ నిద్రలోకి జారుకోసాగాడు.అంతలో ఒక అలజడి. వాతావరణంలో భయంకర మార్పులు.ఒక విస్ఫోటనమే సంభవించిందేమో అన్నట్లుండేది ఆ పరిస్థితి.కొన్ని వందల కరవాలాలు ఆ ప్రదేశంలో కరాళ నృత్యం చేస్తున్నాయి.


మెరుపు మారుతంలా ఒక కరవాలం వచ్చి అతని కంఠమును ఖండించింది."ప్రియతమా!" అతను అరిచేంతలోనే ఆమె కంఠము కూడా ఖండించబడింది.కొన్ని వందల శిరశ్చేదనలు జరిగాయక్కడ.


ఆ శిరశ్చేదనలు ఎవరెవరివో...


కొన్ని సంవత్సరాలు గడిచాయి.


భూమి స్వేదాన్ని చిందించసాగింది. ఆ ప్రాంతమంతా దట్టంగా పొదలతో నిండి ఉంది. కలుపు మొక్కలు చిరునవ్వుతో దర్శనమివ్వసాగాయి.


రసాయనాస్వాదనకు ముక్కుపుటలు అదరసాగాయి. అంతటా దుమ్ము, ధూళి. ఏవో అడుగులు దూరంగా వినిపిస్తున్నాయి. కాని కొన్ని భీకర శబ్దాలకు ఆ అడుగుల సవ్వళ్ళు నీరుగారిపోతున్నాయి.


కానీ ఓ సవ్వడి ఆ ప్రాంతానికి ఆవలి వైపున ఉన్న చెరువులోని అప్పుడే విరిసిన ఒక ఎర్రని కలువకు వినిపించింది.


"ప్రియతమా! విన్నావా ఆ అడుగుల సవ్వడి" ఆ కలువ అప్పుడే విరిసిన మరో కలువకు ఆ మాటను చెవిలో చెప్పింది.


కాని ఆ కలువ కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారసాగాయి.


"ఏమైంది ప్రియా"


ఆ కలువ తన నేస్తం చూస్తున్న దిక్కు వైపు తేరిపారా చూసింది.


అక్కడ ఆధునిక హంగులతో తయారుచేయించిన ఒక కాగితపు గోడ కనిపించింది.


ఆ గోడ పై మూడు అక్షరాలు నిస్పష్టంగా కనిపించాయి.


ఆ పదాలను ఓ సారి పరికించి చూసి ఆ తరువాత చదివి తన నేస్తం వైపు జాలిగా చూసింది ఆ ఎర్ర కలువ.


ఆ మూడు పదాలు


"వృక్షో రక్షిత రక్షితః"


Rate this content
Log in

Similar telugu story from Inspirational